మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం

పులకాయోలో నా బాల్యం

నేను సైగ్లో-20లో 1937 మే 7న పుట్టాను. నాకు మూడేళ్ళప్పుడు మా కుటుంబం పులకాయోకు వచ్చేసింది. అప్పట్నించి నాకు ఇరవై ఏళ్లిచ్చేవరకు నేను పులకాయోలోనే గడిపాను. ఆ ఊరికి నేనెంతో రుణపడి వున్నాను. ఆ ఊరిని నా జీవితంలో ఒక భాగంగా భావిస్తాను. నా హృదయంలో పులకాయోకు, సైగ్లో – 20కి ముఖ్యమైన స్థానాలున్నాయి. నా బాల్యమంతా అంటే నా సంతోషకరమైన జీవితమంతా పులకాయోలోనే గడిచింది. అప్పుడు కడుపు నింపుకోడానికో రొట్టె ముక్కా, చలి ఆపుకోవడానికి ఓ గుడ్డ పేలికా దొరికితే అదే బ్రహ్మానందం కాదూ?! ఆ మాత్రం దొరికినా శిశువుకు తన జీవన స్థితిగతులను గుర్తించాల్సిన అవసరమేమిటి?

పులకాయో క్విజారో రాష్ట్రంలోని పొటోసి జిల్లాలో ఉంటుంది. అది సముద్ర మట్టానికి నాలుగువేల గజాల ఎత్తున ఉంటుంది. వీరోచిత ప్రతిఘటనను చవిచూసిన పోరాట పటిమ కలిగిన గనుల జిల్లా అది. ఉయుని ప్రభుత్వ దళాలను నిరాయుధం చేసిన 1952 ఏప్రిల్ 9 విప్లవంలో ఈ జిల్లా చాలా చురుగ్గా పాల్గొంది. ఆ కార్మికవర్గ పోరాట శీలత వల్లనే అక్కడ గనిని మూసేశారు. అయినా, ఆ పల్లెటూరి కొడుకులూ కూతుళ్ళ ఆకాంక్షలతో ఆ ఊరు సజీవంగా నిలిచింది. వాళ్లా ఊరిని ఉన్ని, మేకులు, చువ్వలు తయారుచేసే పారిశ్రామిక నగరంగా మార్చేశారు. గతంలో రెండు వేలమంది కార్మికులుండిన ఊరిలో ప్రస్తుతం నాలుగువందల మందే ఉన్నప్పటికీ స్వశక్తితో పారిశ్రామిక నగరం కావడం గొప్పకాదూ?

మా అమ్మ ఒరురో నగరం నుంచి వచ్చింది. మా నాన్న ఇండియన్. ఆయన మాతృభాష కెచువానో, ఐమారానో నాకు కచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఆయన రెండు భాషలూ పొరబడకుండా అనర్గళంగా మాట్లాడేవాడు. ఆయన పల్లెసీమల్లోని టాలెడోలో పుట్టాడు.

మా అమ్మా నాన్నా అన్యోన్యంగా ఉండేవారు. మా నాన్న రాజకీయాల్లో పడి సంఘ నాయకుడు కూడా అయి, ఎన్నో బాధలనుభవించవలసి రావడంతో మేం కూడా ఆ కష్టాలన్నీ భరించవలసి వచ్చింది.

పెళ్ళికి ముందే ఆయన రాజకీయాలలో ఉన్నాడట. పెళ్ళికి ముందు ఆయన ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు. ఆయన మొదట పల్లెల్లోనూ, ఆ తర్వాత గనుల్లోనూ – చదువు నేర్చుకున్నాడు. ఆయన చాకోయుద్దంలో చేరి పోరాడుతూ కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఆ యుద్దంలో ఉన్నప్పుడే ఆయన బొలీవియాలో ఒక వామపక్ష పార్టీ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించాడు. కనుకనే ఎం.ఎన్.ఆర్. ఏర్పడగానేదాన్ని నమ్మి దాని పోరాటంలో పాల్గొన్నాడు.

మా నాన్న రాజకీయ నాయకుడూ, కార్మిక సంఘ నాయకుడూ కనుక ప్రభుత్వం మొదట ఆయన్ని టిటికాకా సరస్తీరంలో ఉన్న కోటీ దీవికి ప్రవాసం పంపింది. అక్కడ్నించి కురాహువారా డి కరంగాస్కు తరలించారు. ఆ తర్వాత ఆయన సైగ్లో-20కి తరలి వచ్చారు. వాళ్లాయన్ని మళ్ళీ అరెస్టుచేసి ఉద్యోగం ఊడబీకేసి, పులకాయోకి వెళ్ళగొట్టారు. పులకాయోలో చలి ఎక్కువ గనుక ఆయన ఇక్కడ చలికి చచ్చిపోతాడని వాళ్ళనుకున్నారు. ఇక్కడి కొచ్చాక ఆయన కెక్కడా ఉద్యోగం దొరకలేదు. అప్పటికే ఆయన పేరు ప్రమాదకర వ్యక్తుల జాబితాలో ఉండడంతో గనిలోగానీ, మరెక్కడగానీ ఆయనకెవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అది 1940. ఆ దుర్భర పరిస్థితుల్లోనే మా నాన్న, అమ్మ నేను, అప్పుడే పుట్టిన చెల్లీ బతుకు వెళ్ళదీశాం.

నాన్నకు కుట్టుపని రావడం గుడ్డిలో మెల్లయింది. కుట్టుపనైతే మొదలెట్టాడుగాని దాంట్లో చాలా తక్కువ ఆదాయం వచ్చేది. మంచి దర్జీ దుకాణం పెట్టుకోవాలంటే చాలా సామాన్లుకావాలి కదా? ఓ సారి ఆయన బట్టలు కుట్టి పెట్టడానికి ఓ అధికారి ఇంటికెళ్ళాడు. ఆ అధికారి ద్వారా ఆయనకు గనిపోలీసు శాఖలో కొలువు కుదిరింది. వాళ్లాయనకు యూనిఫారమ్ ఇచ్చారు, రిజిస్టర్లో పేరూ రాసుకున్నారు. కానీ దర్జీగానే ఉపయోగించుకున్నారు. కొన్నిసార్లు సూట్ మొత్తమూ మూడు రోజుల్లోగా పూర్తి కావాలని పట్టు పట్టేవాళ్ళట. చెప్పిన సమయానికి పూర్తి కావడానికని నాన్న రాత్రింబవళ్ళూ పనిచేసేవాడు. అంత కష్టపడ్డా ఆయనకు అదనంగా ఏమీ ఇచ్చేవారు కాదు. మామూలుగా పోలీసుకు వచ్చే జీతమే ఆయనకూ వచ్చేది. అదీ ఎక్కువేమీ కాదు. నిజంగా అది మాకు చాల కష్టకాలం. అమ్మ కూడా ఆయన పనిలో ఎంతో సాయపడుతూ ఉండేది. సూట్లు కుడుతూ ఉండేది. వాటిమీద అల్లిక పనులు చేసేది. ఆ రోజుల్లో మేమెంత అప్యాయంగా మెలిగామో, నేనెంత ఆనందంగా ఉన్నానో నాకింకా గుర్తుంది.

పులకాయోకి వెళ్ళాక మా నాన్న రాజకీయాల్లో పాల్గొన్నాడో లేదో నాకు తెలియదు. మా చిన్న చెల్లి పుట్టగానే నాన్న మాకు కనిపించకుండా పోయాడు. అది 1946. అప్పుడు అధ్యక్షుడు విల్లారోలను ఎవరో చంపేశారు. మేమా వార్త ఆదివారం నాడు విన్నాం. నాకింకా బాగాగుర్తు. మా అమ్మ అప్పటికింకా బాలింత. మంచంలోనే ఉండింది. ఓ అపరాత్రివేళ కొందరు సైనికులు మా ఇంట్లో జొరబడ్డారు. ప్రతి వస్తువూ గాలించారు. అమ్మను మంచంలోంచి లేవగొట్టారు. మా కున్నవన్నీ మట్టిపాలు చేశారు. కాసిని బియ్యం, కొంచెం సేమ్యా ఉంటే పారబోశారు. ఇంట్లో ఆయుధాలెక్కడ దాచి పెట్టారో చెబితే నాకు చాక్లెట్లూ, పిప్పరమెంట్లూ ఇస్తామన్నారు.

నాకప్పుడు పదేళ్ళయినా పేదరికం వల్ల బడికిపోవడం మొదలు పెట్టలేదు. నాన్న చాలకాలం కనబడకుండా పోయాడు. అమ్మేమో ఆయనకోసం వెతుకుతూ తిరుగుతూ ఉండేది. కొన్ని నెల్లతర్వాత నాన్న తిరిగొచ్చాడు. ఆయనను మిత్రులు ఎక్కడికో తీసుకెళ్ళారని చెప్పాడు.

మళ్ళీ పరిస్థితంతా చక్కబడింది. నాన్న తిరిగి పనికి వెళ్ళాడు. నేను బడికి పోగలిగాను. ఐతే మా అదృష్టమేమోగానీ మళ్ళీ మా అమ్మ జబ్బు పడడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ సమయంలో అమ్మ గర్బిణి. చివరికి అయిదుగురు కూతుళ్ళను అనాథల్ని చేసి అమ్మ వెళ్ళిపోయింది. నేనే అందరికన్నా పెద్దదాన్ని.

నేనిక చెల్లెళ్ళను చూసుకోవాల్సి ఉంది గనుక బడి మానేశాను. నా బతుకులో కడగండ్లిక మొదలయ్యాయి. అమ్మ చనిపోయాక నాన్న విపరీతంగా తాగడం మొదలెట్టాడు. ఆయనకు పియానో, గిటార్ వాయించడం బాగా వచ్చేది గనుక ఎక్కడ విందు జరిగినా ఆయన్ని పిలిచే వాళ్ళు. అట్లా ఆయన తాగుడు ఎక్కువైపోయింది. తాగి ఇంటికొచ్చి మమ్మల్ని విపరీతంగా కొడుతూ ఉండేవాడు.

మేం అనాథలుగా, ఒంటరిగా ఆ రోజులు ఈడ్చుకొచ్చాం. మాకు నేస్తాలు లేరు. బొమ్మలు లేవు. ఓ సారి ఒక చెత్తకుండీలో నాకో చిన్న ఎలుగుబంటి బొమ్మ దొరికింది. దానికి కాళ్ళులేవు. పాతగా మురికిగా ఉండింది. ఐనా దాన్ని ఇంటికి తీసుకుపోయి, కడిగి బాగుచేసుకున్నాం. అదొక్కటే మాకున్న బొమ్మ. మేమందరమూ దానితోనే ఆడుకునేవాళ్ళం. నా కింకా కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. అదెంత అసహ్యకరంగా ఉండేదో! కానీ మేం ప్రేమించవలసింది అదొక్కటే, ఆడుకోవలసింది దానితోటే.

క్రిస్మస్ రోజున ఆచారం ప్రకారం మేం మా బూట్లు కిటికీ తిన్నెల పైన పెట్టి వాట్లోకి ఏవైనా చిన్న కానుకలొస్తాయేమోనని ఆశగా కాచుకొని చూస్తూ ఉండే వాళ్ళం. కానీ మాకెప్పుడూ ఏ కానుకలూ అందనేలేదు. అప్పుడు మేం వీథిలోకి వెళ్ళి అందమైన బొమ్మలతో ఆడుకుంటూ వుండే చిన్న చిన్న అమ్మాయిల్ని ఎంతోమందిని చూసేవాళ్ళం. కనీసం వాళ్ళ బొమ్మల్ని చేత్తోనైనా తాకాలని మాకెంతో కోరికగా ఉండేది. కాని ఆ అమ్మాయిలు “దూరం దూరం, ముట్టుకోకండి, మురికి ముండల్లారా” అని తిట్టే వాళ్ళు. నాకు సరిగ్గా అర్థంకాకపోయేది గాని వాళ్ళకూ మాకూ ఏదో శత్రుత్వం ఉందని అనిపించేది. మేం బతికే ప్రపంచం వేరు. అందులో మేం తప్ప మరెవరూ వుండేవాళ్లు కారు. వంటింట్లోనే మేం ఆడుకునే వాళ్ళం. అక్కడనే మేం ఒకళ్ళకొకళ్ళం కథలు చెప్పుకునే వాళ్ళం. పాటలు పాడుకునే వాళ్ళం.

చనిపోయే రాత్రి అమ్మ నాన్నను పిలిచి మరెన్నడూ రాజకీయాల్లో దిగొద్దని ఒట్టు పెట్టించుకుంది. తాను చనిపోతే పిల్లల బాగోగులు చూసేవాళ్ళెవరూ ఉండరని ఆమె ఆయన్ని ఒప్పించింది. “మనకు కూతుళ్ళు మాత్రమే ఉన్నారని తెలుసుకో – కేవలం ఆడపిల్లలు – నాకేమన్నా అయితే వాళ్ళ క్షేమం చూసేవాళ్ళెవరు? ఇక ముందు దేంట్లోనూ వేలు పెట్టబోకు. మనం ఇప్పటికి పడ్డ కష్టాలు చాలు” అని చెప్పి మొత్తానికి అమ్మ నాన్నతో ఇకముందెన్నడూ దేంట్లోను జోక్యం చేసుకోనని ప్రమాణం చేయించుకుంది.

దాని తర్వాత నాన్న పాత సంబంధాలన్నీ వదులుకున్నాడు. ఐనా ఆయనకు గతం అంటే ఎంతో ప్రేమ ఉండేది. 1952 విప్లవం విజయవంతమైనప్పుడు ఆయనెంతో సంబరపడ్డాడు. అధ్యక్షుడు పాజ్ ఎస్టెన్ సొరోను కలవడానికి వెళ్ళే వీలులేకపోయిందే అని ఎంత విచారపడ్డాడో! మేం ఆడవాళ్ళం కావడంతో తన పనులకు అడ్డంకిగా తయారయ్యామని ఆయననుకుంటున్నాడేమోనని నాకనిపించింది. అయితే ఆయన బయటికి వెళ్ళడంగానీ, జనానికి పరిస్థితి అర్థం చేసుకోవడంలో తోడ్పడడంగానీ ఎన్నడూ మానలేదు. ఆయన ఇంట్లో సమావేశాలు ఏర్పాటు చేసేవాడు, రాజకీయాలు చర్చింపజేసేవాడు. ఏమైనా ఆయన పూర్వం పాల్గొన్నంత అభినివేశంతో మాత్రం పాల్గొనలేక పోయాడు.

బొలీవియా చరిత్రలో 1952 విప్లవం ఒక మహత్తర సంఘటన. అది నిజంగా జన విజయం. కాని చివరికి జరిగిందేమిటి? మన జనం కార్మికవర్గమూ, రైతాంగమూ అధికారం తీసుకోవడానికి సిద్ధంగాలేరు. మాకు చట్టం గురించీ, దేశాన్ని పాలించడం గురించీ తెలియదు. కనుక మా స్నేహితులమని చెప్పుకొని, మా అవగాహనను ఆమోదించిన పెటీ బూర్జువాల చేతుల్లో అధికారం పెట్టవలసి వచ్చింది. అధికారాన్ని ఒక విద్యావంతుడి చేతుల్లో, డాక్టర్ విక్టర్ పాజ్ ఎస్టెన్ సొరో చేతుల్లో, ఇలాంటి ఇతరుల చేతుల్లో పెట్టవలసి వచ్చింది. కాని వాళ్ళు వెంటనే ఓ కొత్త బూర్జువా వర్గంగా తయారై పోయి, ఓ కొత్త ధనిక వర్గం పుట్టుకురావడానికి తోడ్పడ్డారు. వాళ్ళు విప్లవాన్ని తిరగదోడ్డం మొదలు పెట్టారు. రైతుల పరిస్థితీ, కార్మికుల పరిస్థితీ ఇదివరకటికంటె కనా కష్టంగా మారిపోయింది.

ఇలా ఎందుకు జరిగింది? చదువుకున్న వాళ్ళే, డబ్బున్నవాళ్లే, యూనివర్సిటీలకు వెళ్ళగలిగిన వాళ్ళే దేశాన్ని పాలించగలరనే ఒక తప్పుడు భావం మాకు నేర్పారు. వాళ్ళు మాకు చదువు నేర్పరు. ప్రజల్ని ఛీత్కారంగా చూస్తారు. మేమే విప్లవం తెచ్చినప్పటికీ మా అంతట మేం అధికారం తీసుకునే స్థితిలో ఉండం. మేం గద్దెమీదికి పంపిన ఆ మధ్య తరగతి జనం, మేమెంతో విశ్వసించిన ఆ జనం మేం తల పెట్టిన ప్రతిదానికీ ద్రోహం చేశారు.

ఉదాహరణకు వాళ్ళు గనులు ప్రజలకు చెందాలనీ, భూమి రైతులకు దక్కాలనీ అన్నారు. వ్యవసాయ సంస్కరణలు జరిగిన మాట నిజమే, గనులు జాతీయం అయిన మాట నిజమే కాని వాస్తవానికి ఇవాల్టికి కూడా గనుల యజమానులం మేం కాదు, భూమి రైతాంగానిది కాదు. ప్రతి విషయంలోను మాకు ద్రోహం జరిగింది. మేం అధికారాన్ని అత్యాశాపరుల చేతుల్లో పెట్టినందుకే కాదూ ఇలా జరిగింది?!

దీంతో మేం ఒక నిర్ణయానికొచ్చాం. మా అంతట మేమే, ప్రజలమే, అధికారాన్నిహస్తగతం చేసుకోవడానికి సిద్దపడాలి. బొలీవియా వనరుల నుంచి వచ్చే లాభాల్ని కొందర్నే ఎందుకు అనుభవించనివ్వాలి? ఓ వైపు మేం గొడ్డుచాకిరీ చేస్తూ, ఏ ఆశలూ లేక, మా పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పరిచే శక్తిలేక వుండే పరిస్థితి ఎందుకుండాలి? దేశం మా త్యాగాలతో సంపన్నమవుతున్నప్పుడు మేమింకా మంచి జీవితాన్ని కోరడం తప్పా?

అందుకే నేనేమనుకుంటానంటే భవిష్యత్తులో మనం విప్లవం తర్వాత స్థాపించబోయే ప్రభుత్వం ప్రజానీకం నుంచి రావాల్సి వుంటుంది. అది కార్మికవర్గానిదై ఉండాలి. అప్పుడు మాత్రమే అధికారంలో ఉండేది ప్రజలేననే సంగతి మనం స్థిరపరచుకోగలం. ఎందుకంటే కొండలు పగలేయడమంటే ఏమిటో తెలిసినవాళ్ళు, ప్రతిరోజూ నెత్తుటిని చెమటచేసి రొట్టె సంపాయించుకోవడం తెలిసిన వాళ్ళు చట్టాలు చేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దొపిడీకి గురవుతున్న ఆశేష ప్రజానీకానికి ఆనందాన్ని సాధించి పెట్టగలరు, వాళ్ళ ఆనందాన్ని కాపాడగలరు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.