
“నెచ్చెలి”మాట
“విలువైనదేది?”
-డా|| కె.గీత
ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికన్నా విలువైనదేది?
కొత్తగా కొనుక్కున్న రవ్వల నెక్లెసు..
మాంఛి బిజీ సెంటర్లో మూడంతస్తుల బంగాళా..
ఎన్నాళ్లుగానో కలలుగన్న లగ్జరీ కారు..
కాకుండా మరో మాట చెప్పండి-
అయినా విలువైనదేదంటే ఠకీమని చెప్పెయ్యడానికి అందరికీ ఒక్కటే ఉండదు కదా!
మనిషిని బట్టి, దక్కని లిస్టుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోటి మారుతూ ఉంటుంది.
కడుపుకి పట్టెడన్నం లేక మట్టి తిని మరణించిన చిన్నారులున్న దౌర్భాగ్యపు ప్రపంచం మనది!
ఆ చిన్ని ప్రాణం కంటే విలువైనదేదైనా ఉందా?
యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు, కోట్లకి పడలెత్తిన స్టీవ్ జాబ్స్ అంతటి వాడే “ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగం తో బాధపడుతూ పడుకున్న మంచం” అని చివరి రోజుల్లో బాధ పడ్డాడు.
ఆరోగ్యం కంటే విలువైనదేదైనా ఉందా?
అసలు రాజధానంటూ ఎక్కడో చోట ఎప్పటికైనా ఏర్పడుతుందని ఎదురుచూసే సగటు మనిషి గుండె చప్పుడు కంటే విలువైనదేదైనా ఉందా?
ప్చ్… ఏవిటో లెండి… ఇన్నున్నా ఇంకా విలువైదేవిటో-
మరదే మరి!
ఇలా మనిషి మనిషికి మారనిదేదో ఒకటి ఉండే ఉంటుంది కదా!
కలకానిది విలువైనది బ్రతుకు… అని శ్రీశ్రీ ఏనాడో చెప్పేరండీ!
తరలిపోతే తిరిగిరానిది కాలం అని నిత్య గంభీరంగా అన్నారు కదా!
ఇంకా ఏదయి ఉంటుంది చెప్మా!!
అమ్మ చేతి వంట!
చేతికొచ్చిన పంట!?
అదే మరి తంటా!
బోల్డు విలువైనవున్నాయి కదూ-
అవును మరి జీవితమే ఒక గొప్ప బహుమతి!
జీవించడమే ఆనందానుభూతి!!
మరి ఇన్నుండగా ఒక్కటెలా ఎంచుకోవడం?!
ఎంచుకోవాలి మరి!
అదే కదా వచ్చిన చిక్కు, గమ్మతైన ట్రిక్కు!!
సర్లెండి ఇక చెప్పక తప్పేటట్లు లేదు నాకు-
అదేనండీ.. పదారేళ్ల ప్రాయంలో తొలకరి వాన చినుకై మురిసిపోయినదేదో గుర్తుందా!
ప్రేమ-
అయితే అలాంటిలాంటి ప్రేమ కాదు!
దయార్ద్ర హృదయం నుండి పుట్టుకొచ్చే ప్రేమ!
మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన నిజమైన ప్రేమ!!
ఇంతకంటే విలువైనదేదైనా ఉందా?
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
