ఊరి గేపకం (పాట)

డా||కె.గీత

రేతిరంతా  కునుకుసాటున

నక్కినక్కి మనసు దాపున

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది 

 

సెరువు బురద సెమ్మ దారుల

కలవ తూడు సప్పదనము

గట్టు ఎంట కొబ్బరాకు

గాలిరాలిన పూల రుసి

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

కందిసేల పచ్చకణుపుల

పాలుగారె గింజలేవో

మొక్కజొన్న పొత్తుగిల్లి

దొంగసాటున బుక్కినట్టు

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

 

కన్ను తెరవని పసిరి కాయ

పుల్లసిప్పల నారింజ

జివ్వ సాటున గువ్వ పిట్టై

పొడిసి పొడిసి సంపుతాది

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

ముల్ల తుప్పల రేగి పండు

రాలిపడ్డ పిందె మావిడి

జేబు దాసిన ఉప్పు కారం 

సేతి పొంటి యేలు సీకిన

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

తెల్లవారి శివుని వాకిట 

దండగట్టే సుక్కలోలె 

పారిజాతం పూలతేరు

గప్పునెక్కడ ముక్కు దాకిన 

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

అరటిసెట్టు దువ్వమీన

పేర్లుసెక్కి కంట నీరై

సెంపసివర ఎర్రబడ్డ

సెరిగిపోని ముద్దు మరకై

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

 

సెరుకు తోట పేమ జంట

ఓడిపోయి సెదిరిపోతే

సెరుకు గెడన పాలవెన్ను

సురుకుసురుకున సలిపినట్టై

ఊరి గేపకమేదో 

ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి||

*****

 

 ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

6 thoughts on “ఊరి గేపకం (పాట)”

  1. చాలా చక్కటి సాహిత్యం, ఎన్ని ఉపమానాలో మీ ఊరిగ్యాపకంలో మా ఆమ్మ కనపడింది గీతగారు అభినందనలు. ఒకే సమయంలో ఎన్నో జీవితాలను కలిపి జీవిస్తూన్నారు. అద్భుతమైన మహిళ మీరు

    1. పాట మీకు నచ్చడమే కాకుండా, చక్కని కామెంట్ ని అందించినందుకు అనేక నెనర్లు జ్వలిత గారూ!

  2. కవిత్వం రాయలని కోరికతో..పాటలు రాసి స్వరం కట్టాలని తపనతో ఈ ఊరు గాపకం రాలేదు..ఊరికి వేల మైళ్ళ దూరంలో ఉండి.. ఋతు రాగాలు వినలేని ఋతువులు తీసుకువచ్చే రంగులు చూడలేని ఒక మనసు లోతుల్లో ఎక్కడో మిగిలిపోయిన తడి చిమ్మిన అక్షర ముత్యాలు..గీత మాలగా మారి..అమృత ఝరిలా. తీయగా…వెన్నెల శబ్దంలా మెత్తగా తాకింది….పరుగులు తీసే బయటి ప్రపంచంతో అడుగు కలప లేక .. గడపలో తిరగలి పట్టో…ముంగిట్లో రోకలి పట్టో…దూడను కట్టి పాలు పితుకు తూనో…కేవలం అసంకల్పిత ప్రతీకారంగా బయటకు వచ్చినట్టు ఉన్న అద్భుతమైన మాటలు..కాదు కాదు..పాఠం. .ఈ పాట వినటానికి ఎంత నిండుగా ఉందో వినిపించిన వాళ్ళ మనసు అంత వెలితిగా ఉండి ఉంటుంది…చదవటానికి ఎంత తేలికగా ఉందో…ఎదను తాకినప్పుడు అంత బరువుగా ఉంటుంది… అన్నిటినీ మించి..మనం కేవలం వింటున్నామని తెలిసినా…పాడుతున్నట్టు అనిపిస్తుంది…మన పాటే అనిపిస్తుంది…ఇంత గొప్పగా..కాలం కప్పిన పొరలను ఒక్కొక్కటి తీసేస్తూ లోలోపలికి వెళ్లి అత్యంత సుందరమైన పల్లె కాండ ను ఆవిష్కరించి నందుకు గీత గారికి ధన్యవాదాలు…మరిన్ని
    పాటలకు ముందస్తు అభినందనలు…

    1. సింహాచలం నాయుడు గారూ! మీ ప్రతిస్పందనకు నెనర్లు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. బహుశా: మరిన్ని వెలికితీయడమేనేమో!!

  3. యీనెల నెచ్చెలిలో వచ్చిన డా. గీత గారి ‘ఊరిగేపకం’ పాట చాలాబావుంది. రచన, బాణి, పాడడం అన్నీ సమతూకంలో ఉన్నాయి. పాట దానికి తగిన మూడ్ ని అదే సృష్టించుకుంది. చాలారోజుల తరువాత ఒక కొత్త పల్లెపదం విన్నాను.
    మనకు కవిత్వం పెరిగిందిగాని పాటలు తగ్గిపోయాయి. సినిమాపాటల్లో సాహిత్యం ఉండడంలేదు. ప్రజల గుండెల్లోంచి వచ్చిన జానపదగీతాలు, ప్రజాకవుల పాటలూ అరుదయాయి. గురజాడ పూర్ణమ్మ కథలాంటి అనేక చరణాలున్న పెద్దపాటలు, పాటరూపంలోవున్న జానపదకథాసాహిత్యం రావడంలేదు.
    డా. గీతగారి ‘ఊరిగేపకం’ పాట వేసవిలో వీచిన ఒక చల్లనిగాలి.
    వారు ఇంకా ఇలాంటి మంచిపాటలు రాసి, పాడి వినిపించాలని అభ్యర్థన.

    1. రమణ గారూ! పాట రచన, బాణి, పాడడం అన్నీ మీకు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిజమే మీరన్నట్టు జానపదగీతాలు అరుదైపోయేయి. తప్పకుండా మీ కోరిక మేరకు రాయడానికి ప్రయత్నిస్తాను. పల్లె పాటలు రాసేందుకు ఒక్క కామెంట్ తో వెయ్యేనుగుల బలాన్నిచ్చిన మీకు అనేక నెనర్లు.

Leave a Reply to Kotnana Simhachalam Naidu Cancel reply

Your email address will not be published.