
నూజిళ్ల గీతాలు-1(ఆడియో)
మా ఊరి మీదుగా నే సాగుతుంటే….
(జ్ఞాపకాల పాట)
-నూజిళ్ల శ్రీనివాస్
*పల్లవి:*
మా ఊరి మీదుగా నే సాగుతుంటే…
గుండెలో ఏదొ కలవరమాయెగా..!
మా అమ్మ నవ్వులే, మా నాన్న ఊసులే…
గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా….
గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా….!
*అనుపల్లవి:*
ఏడకెళ్ళిన గాని…ఏడున్న గానీ…
నా ఊరు నను వీడిపోని అనుబంధం…
నా బాల్యమే నన్ను విడని సుమగంధం…!
*చరణం-1:*
ఏ ఆవు చూసినా మా ఆవు గురుతులే…
పచ్చిపాలను పితికి తాగిన గురుతులే…
గడ్డిమేటూనెక్కి ఆడుకున్నట్టి ఆ
గురుతులకు నా గుండె నీటి చెలమాయెలే…. //ఏడకెళ్ళిన గాని….//
*చరణం-2:*
ఏ మనిషి చూసినా నేస్తాల గురుతులే..
మామిడీ తోటల్లొ ఆటల గురుతులే…
బురగుంజు తవ్వుకొని పంచుకున్నట్టి
ఆ ప్రేమలే గురుతొచ్చి గొంతు పొలమారెలే… //ఏడకెళ్ళిన గాని….//
*చరణం-3:*
పండగొస్తే చాలు పల్లె గురుతొస్తాది..
తలస్నానమాడించు తల్లి గురుతొస్తాది…
జలజలా రాలేవి కన్నీళ్ళు కాదులే…
మాయమ్మ కుంకుళ్ళ స్నానాల గురుతులే.. //ఏడకెళ్ళిన గాని….//
*****

వృత్తి ఇంగ్లీష్ లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలమూరు, తూర్పు గోదావరి జిల్లా. ఇంతకు ముందు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో హైదరాబాద్ లో పని చేశాను. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జన్మస్థలం. తండ్రి గారు కీ.శే. నూజిళ్ళ లక్ష్మి నరసింహ గారు ప్రముఖ గేయ రచయిత. వారే స్ఫూర్తి. తల్లి గారు కీ.శే. శ్రీమతి సత్యవతి గారు. ఈ రంగంలో నా అభిరుచిని ప్రోత్సహించిన వ్యక్తీ. ప్రవృత్తి గేయాలు, కవితలు తెలుగు, ఇంగ్లీష్ లో రాయటం, పాడటం. ముఖ్యంగా గోదావరి యాసలో,జానపద శైలిలో పాటలు రాయడం. “ఆయ్..మేం గోదారోళ్ళమండి.. “ ప్రాచుర్యం పొందిన గేయం. గత రెండు దశాబ్దాలకు పైగా రాస్తున్నాను. 1500 కి పైగా గేయాలు రచించాను.

ధన్యవాదాలు సంతోష్ గారూ…
చాలా బావుంది మాస్టారు.
ప్రతీ ఒక్కరూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు మీ పాట వింటూ