జగదానందతరంగాలు-3

కొడుకు పుట్టాలనీ…

-జగదీశ్ కొచ్చెర్లకోట

తనింకా ఆఫీసు నుంచి రాలేదు. సాయం సంధ్యను చూద్దామని ఎస్సెల్లార్ కెమెరా పట్టుకుని డాబా మీదకి బయల్దేరబోతోంటే మా క్లాస్‌మేట్ ఫోన్ చేసింది. ‘సీజరుంది వస్తావా?’ అని! 

తన నర్సింగ్ హోమ్ నడిచివెళ్ళేంత దూరమే. అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ దృశ్యం ఇదీ…

“అలాగంటే ఎలాగండీ అత్తయ్యా? నాచేతుల్లో ఏముంటాది? దేవుడెలాగిస్తే అలాగ!” సుమతి కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర అప్పుడే వేసిన లైటు వెలుగులో మెరుస్తూ కనబడుతోంది.

సుమతి మొగుడు అప్పుడే వచ్చాడు. ఏడుపు మొహఁవేసుకుని ఏణ్ణర్ధం పిల్లని ఎత్తుకు తిరుగుతున్నాడు. దాని రెండు బుగ్గల మీదా కన్నీటి చారికలు. వాళ్ళ నాన్నని చూసిన దానిమొహం మాత్రం వెలిగిపోతోంది. 

అసలుకథ ఇది…

మళ్ళీ ఆడపిల్లే పుడితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వద్దని అతడి వాదన. కొడుక్కోసం మూడోకాన్పు చూద్దాఁవంటాడు.

‘ఇక నావల్లకాదు. నే కనలేను!’ అంటూ సుమతి ఆవేదన. ఆ సందర్భానికి కావలసిన పక్కవాయిద్యం అత్తగారు అమరుస్తోంది. ‘మనవడు లేని బతుకూ ఓ బతుకేనా?’ అనే పాట కర్ణకఠోరంగా గంటనించి పాడుతోందిట.

చైనా చార్టులో చూస్తే పాప పుడుతుందని వచ్చిందిట. అప్పట్నుంచి సుమతికి సుఖం లేకండా పోయింది. దేశంలో ఏ బాంబు పేలినా అల్ ఖైదా వాళ్ళని అనుమానించినట్టు ప్రతిచిన్నదానికీ సుమతిని ఏడిపించడం మొదలెట్టారు. 

ఈకష్టాలన్నీ ఆపరేషన్ టేబుల్‌మీద పడుకుని సగం ఏడుపుతో కలిపి నాకు చెప్పింది. ఆపరేషనని చెప్తే రాలేదు పురుషుడు. ఇంటిదగ్గరే కూర్చుని గోళ్ళూవేళ్ళూ పీకేసుకుంటున్నాట్ట.

పెళ్ళయి, కరివేపాకు చెట్టంత కొడుకులున్న మాయింట్లోనే తనకి తలనొప్పొస్తే నేను జండూబామ్ రాసుకుంటాను. తన కాలికి దెబ్బతగిలితే నేను కుంటుతాను. అలాంటిది ‘పాతికేళ్ళన్నా నిండని ఈ సన్నాసిగాళ్ళకి పెళ్ళాఁవంటే ఇంత వైరాగ్యం ఎలావచ్చిందబ్బా?’ అని ఆశ్చర్యపోతూ మత్తిచ్చాను.

ఆపరేషన్ మొదలెట్టినప్పటినుంచీ ఆపిల్ల ఏడుస్తూనేవుంది. ‘అత్తయ్య బతకనివ్వద్సార్! మాయన కొంచెం మంచోడే. చెప్తే ఆలకిస్తాడు. ఆవిడే  డేంజరు. నసపెట్టేస్తాది. అసలికి ఆయన్ని ఆపరేషన్ కి రావద్దనీసింది. అంచేతే రాలేదు. అన్నీ మానాన్నే చూస్కోవాలంటే కష్టం కద్సార్? నాకన్నదమ్ములు కూడా లేరు!’

మళ్ళీ బీటెక్ చదివింది. వాళ్ళాయన కూడా మంచి వుద్యోగంలోనే వున్నాడు. హాస్పిటల్లో అడుగెట్టినప్పటినుంచీ కూతురు ఏడుపు మొదలెట్టిందిట. కిందపడిదొర్లుతూ రాగాలుట. అన్నీ విసిరేసిందిట…. వాళ్ళ నాన్నకోసం!

మరి లాభంలేదని అతగాడికి ఫోన్ చేసి ‘నువ్వొస్తేనే ఆపరేషన్ చేస్తాఁ’వంటూ పిలిపించింది మా డాక్టరమ్మ. అయిష్టంగానే ఏడ్చుకుంటూ వచ్చాడు. 

రాగానే రేడియోకట్టేసి వాడి చంకెక్కేసింది గుంటది. ఇక కిక్కురుమనకుండా చాక్లెట్లు బొక్కుతోంది. ఆఖరికి అదికూడా సుమతిని ఏడిపించుకు తినేదే!

మేం ఇలా మొదలెట్టాఁవో లేదో బయట రచ్చ మొదలైంది. తల్లీకొడుకుల సంవాదం. బాణాలొకటే తక్కువ. భీమాంజనేయ యుద్ధంలో ముందు కాసేపు పద్యాలవీ పాడుకుని, దెప్పిపొడుచుకుని, ఆనక యుద్ధం చేసుకుంటారు చూడండీ.. ఆటైపులో 

‘ఆరోజు నువ్వలా అన్లేదేటి?’ అని తల్లీ, ‘నువ్వు చెప్పబట్టేకదా నేనిలాగున్నానూ?’ అని కొడుకు.

‘చేసిందంతా చేసి చివరాఖరికి నామీద తోసేసి నీపెళ్ళం ముందు నన్ను చులకన చేసీసేవు. దానికి నేనంటే ఖాతరేలేదు…!’ అని ఏడుపుని బయటికి తీసింది. అతనికి ఇరిటేషనొచ్చి కిందకెళిపోయాడు.

పొట్టమీద అడ్డంగా కొయ్యడం, బిడ్డతల బయటికి కనిపించడం అంతా పదినిమిషాల్లో అయిపోయింది. సక్కర్ తో బేబీ నోట్లో ఉమ్మనీరు శుభ్రంచేస్తోంది తను.

‘చేసింది చాలుగానీ త్వరగా బయటికి లాగు. నాకు టెన్షన్ గా వుంది ఎవరు పుడతారా అని!’ అన్నాను నవ్వుతూనే!

మేం లాక్కుండానే కాలవలో ఈతకొడుతున్నట్టు ముందు భుజాలు, తరవాత నడుము, ఆనక కాళ్ళూ తోసుకుంటూ బుళక్ మని బయటికొచ్చేసాడు గులాబ్ జామ్ గాడు. 

కిందది అచ్చం అలానేవుంది మరి!

మాకు చచ్చేంత రిలీఫ్. అక్కడికి సుమతి కాపరాన్ని మేఁవిద్దరమే నిలబెట్టాఁవన్నంత రిలీఫ్!

తనకి చెప్పేటప్పటికి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఎక్కెక్కి ఏడ్చేసిందా పిల్ల. ఊరుకోబెట్టి, కళ్ళకి కట్టిన గంతలువిప్పి, పిల్లాణ్ణి తన గుండెలమీద కూర్చోబెట్టి చూపించాం.

వాడు కళ్ళు సన్నగా తెరిచి వాళ్ళమ్మని చూస్తున్నాడు. ‘డోంట్ వర్రీ! నేనొచ్చేసా!’ అన్నట్టుంది వాడి మొహం.

‘నాబంగారుకొండా! ఎంతేడిపించీసావురా! మీ నానమ్మ మొకం చూడాలిప్పుడు!’ అంటూ ముట్టుకోబోయింది‌.

వద్దని వారించి, బయటికి తీసుకెళిపోయారు థియేటర్ దేవదూతలు…అదేనండీ, నర్సుపిల్లలు.

ఒకనిమిషం నిశ్శబ్దం తరవాత బయటినుంచి పెద్దపెద్ద అరుపులు, నవ్వులు, కేరింతలు, గలగలలు వినబడ్డాయి. అదంతా మేం వూహించిందే!

అరగంటలో మొత్తం ముగించుకుని, డ్రెస్ ఛేంజింగ్ రూములోకొచ్చిపడ్డాను. 

‘మనిషికీ మనిషికీ ఆలోచనా విధానంలో ఇన్ని తేడాలెందుకో? ఆడపిల్లయితే వాడు చెయ్యాల్సిందేఁవిటి? మగపిల్లాడికి అక్కర్లేనిదేఁవిటి?’ అంటూ కాసేపు ఆవేశపడి, తరవాత బట్టలూ, మనసూ మార్చుకుని బయటపడ్డాను.

వార్డులో దృశ్యం చూసి అలానే వుండిపోయాను. అతగాడి వేళ్ళు పట్టుకుని మెల్లిగా ఎవరికీ వినబడనంత స్వరంలో ‘అచ్చం నీపోలికే! ఆ ముక్కూ అదీ!’ అంటోంది సుమతి. ఆ కళ్ళలో వెలుగంతా అరగంటనించే! పుడుతూనే స్విచ్చులేసేశాడు కొడుకు. వంద బల్బుల కాంతి ఆమొహంలో. 

‘కళ్ళుమాత్రం మా అమ్మవే!’ అన్నాడో లేదో మొహం తిప్పేసింది. 

‘సరదాకన్నాన్లే! నీలాగేవున్నాడు. తల్లి పోలికొస్తే మంచిదంటకదా?’ అంటూ సరసమాడాడు. వీడి మొహానికి అదొకటే తక్కువ!

బయట కుర్చీలో కూర్చున్న అత్తగారికి ఒళ్ళోవున్న మనవణ్ణి చూసుకోడఁవే లోకంలా వుంది. కళ్ళొక్కటే కనబడేంతలా గుడ్డల్లో చుట్టేసిన ఆ బుల్లిబాబుకి అరగంటక్రితం వున్న అనుబంధాల నిష్పత్తి ఇపుడెందుకిలా మారిపోయిందో తెలీదు. వాడికి తెలిసిందల్లా లేతపెదాలతో కమ్మగా పాలుతాగడం ఒక్కటే!

*****

Please follow and like us:

2 thoughts on “జగదానందతరంగాలు-3(ఆడియో) కొడుకు పుట్టాలనీ…”

    1. ధన్యవాదాలు మేడమ్. మీ ప్రశంస నాకు ప్రత్యేకం. మీ చిన్నమావయ్య కథ నేనెప్పటికీ మర్చిపోలేను.

Leave a Reply

Your email address will not be published.