
“నెచ్చెలి”మాట
“స్వేచ్ఛ”
-డా|| కె.గీత
“స్వేచ్ఛ” అంటే ఏవిటి?
“స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. మనకు మనమే సంపాదించుకునేది”
లాంటి గంభీరమైన నిర్వచనం కాకుండా మామూలు భాషలో చెప్పగలరా?
అదేనండీ
ఇళ్లలో ఇన్నేసి వారాలు కాళ్లు కట్టిపడేసినట్లు ఉన్న మనందరికీ లాక్ డౌన్ ఎత్తెయ్యంగానే కలిగిన అద్వితీయమైన ఆనందాన్ని నిర్వచించుకునే మాటలన్నమాట-
అబ్బా మళ్లీ భాషా గంభీరత!
ఓకే-
సింపుల్ మాటల్లోకి వద్దాం-
జనరల్ రైలు కంపార్టుమెంటులో ఒకళ్ల మీద ఒకళ్లు నిలబడడం –
కిక్కిరిసిన సిటీబస్సులో ఒంటి కాలు మీద వేళ్ళాడడం –
సంతలో మనుషుల్ని తొక్కుకుంటూ తోసుకుంటూ కూరగాయల కోసం ఎగబడడం-
“అదేవిటి? ఇవన్నీ ఇబ్బందులు కదా”
అదే మరి!
“ఇబ్బందులు” అనేది పాతమాట!
“తీపిజ్ఞాపకాలు” అనేది కొత్తమాట!!
“స్వేచ్ఛ” అంటే గుర్తుకొచ్చింది
ఇటీవల “స్వేచ్ఛ” కి కొత్త నిర్వచనాలు ఏవిటంటే
స్నేహితులో, చుట్టాలో ఇంటికొస్తే గేటు దగ్గిరికే ఎదురు పరుగెత్తుకెళ్లి చుట్టుకోవడం-
పెళ్ళిళ్లని, పేరంటాలని గుంపులు గుంపులుగా ఒక్కచోట చేరి కబుర్లాడుకోవడం-
రద్దీ క్యూల్లో తోసుకుంటూనైనా టికెట్ సంపాదించి మొదటి రోజే హాల్లో సినిమా చూడ్డం-
వంటివి కాకపోయినా
కనీసం ఆరడుగుల దూరాల్ని అడుగుకి కుదించడం-
వీథి చివరి వరకూ మాస్కు లేకుండా నడవ గలగడం-
గుర్తొచ్చినా చేతులు కడక్కుండా అన్నీ హాయిగా ముట్టుకోవడం-
అసలు
ఎవరింటికైనా, ఎప్పుడైనా వెళ్లి తలుపు కొట్టడం-
పనున్నా లేకపోయినా పక్కింటికెళ్లి బాతాఖానీ వెయ్యడం-
పొద్దస్తమానూ స్నేహితులిళ్లకే అతుక్కుపోవడం…..
అబ్బ! ఇంత స్వేచ్ఛ ఉంటే ఎంత బాగుణ్ణో కదా!
మొత్తానికి
కరోనా పుణ్యమా అని “స్వేచ్ఛ” ఎంత విలువైందో నాకు బాగా బోధపడింది!
మరి మీకు?
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
