అతిథి వచ్చి ఆకలంటే

-వసంతలక్ష్మి అయ్యగారి

మాపక్కగుమ్మమే  ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటరు..నూతనంగా వెలసిన వైద్యపరీక్షాలయం…మనకి గుడి తోసమానం.. గుడ్డిలో మెల్లన్నట్టు …అదో ఆనందం…ముఖ్యంగా తెల్లారుతూనే పరకడుపున చేయించుకోవలసినరక్తపరీక్షలువంటివాటికి   చెప్పలేనిదాహాయి!

రక్తహీనత,ఎముకసాంద్రత,సంపూర్ణ రుధిర చిత్రం..ఇలా ఓనాలుగు పరీక్షలకి, నాలుగువేలు వారికిచ్చి…స్కూల్ లో లాగా  క్యూ క్రమశిక్షణ పాటించి రక్తనమూనా స్వీకర్త వద్దకూర్చుని వారడిగిన హస్తాన్ని వారికే చాచి ఇవ్వడం..పిడికిలిబిగించి,కనులు గట్టిగా మూసుకొని బలిసిన చేయిలో నరందొరకక ఆవిడ నొక్కులకు,సన్నాయినొక్కులకు అసహనంఅసంపూర్ణంగా వ్యక్త పరచడం..పరిపాటి.ఇన్ని పరీక్షలుకనుక  హోల్సేల్ గా కాస్త యెక్కువగానే గుంజివుంటారునారక్తం..పైకంలాగే..

ఏం శిక్షణ తీసుకుంటారోగానీ..రక్త సేకరణ ఘడియల్లో మనలను ఏమార్చడం కోసం..ఒక్కొక్కరిదీ  ఒక్కోవైనం.

నాకు దొరికిన మహిళామణి, ముసుగులో మునిగి పోయి నేత్రద్వయాన్ని మాత్రం   ప్రదర్శించుకుంటున్నముసలమానుభామ!

ఈ ఘట్టం నాకు త్రైమాసిక  పండగే !

నాక్రితం విజిట్ లో కూడా ఆవిడే లాగినట్టు గుర్తు.అందుకనేమో  నన్ను హలో..కైసేహై? అని పలకరించింది.నేనూ ఆబీబీ కినా సలాము చెప్పాను.

చెయ్యి..ఇయ్యి…మడుచు..ముడుచు..మామూలే..సిరంజి గుచ్చుతూ…మాటల్లో పెట్టింది,అదీ మామూలే..

“జరా వెయిట్ జ్యాదా పుటాన్ కియే క్యా…? అంది.

“ హాఁ..బిల్కుల్ .. థేరాయిడ్ ఠీక్ నహీ హై షాయద్”అనేశా.

ఇంతలో ఈ నారీ మణి నాడీని నరాలను వెతికి పట్టింది.ఇంకేముంది…మాటలు పెంచి..లోతుగా దించుటే..దృష్టిమరలుస్తూ ఆవిడన్నమాటలు ఉభయతారకంగా తెలుగులోరాస్తానేం..జరిగినది ఉర్దూలోనైనా.

నేను మిమ్మల్ని రోజూ మీ బాల్కనీలో వాకింగ్ చేసే టపుడు చూస్తుంటా. చానా సార్లు చెయ్యిఊపి హాయ్ చెప్పినా. మీరు భీనవ్వినార్ . కానీ నేను మీకు తెల్వ కుండచ్చు..బుర్ఖా ఉందికదా. మీ ఇంటి ముంగల రోజూ మామిడి పళ్ళ బండిఉంటదికదా. అక్కడ కొన్కోని మీదగ్రా వచ్చీ తిందామనుకున్నా. అంటూ తలతోక లేకుండా  అర్థంపర్థం కాకుండాపరభాషలో పలుకుతూ పోయింది.

నాకు సగంఎక్కలేదు..ఒక పక్క పీకేస్తున్నందుకేమో తెలియదు. అయినా నా సహజ శైలిలో  పక్కనే కదా,ఎటువంటిఅవసరముదన్నా రండి మాయింటికి. లంచ్కి కూడారావచ్చునన్నానను కుంట..రెండోసారి చూపులు కలసినందుకే. అదీకేవలం చూపులేఅని చెప్పాగా 

బురఖా బీబీ కనక  రూపురేఖలు  రూల్డౌట్!వెనక బోలెడుమంది క్యూలో వెయిటింగూ.

ఐనా యీవిడ ఓచక్కని scribble pad తీసుకుని  friends are always better than relatives అనే అర్థమొచ్చేలా ఏదోగొణుగుతూ నా సెల్ నంబర్ తీసుకుంది. 

నిరభ్యంతరంగా యిచ్చా! 

రాత్రి తొమ్మిదికి మావారే వెళ్ళి తెచ్చిన రిపోర్టులను ఎంసెట్ రిజల్ట్ లెవెల్లో కిందాపైనా చూసేశాం.

సరిగ్గా నోరుతిరగని పేరుగల ఆ బీబీగారు, ఒకేఒక్క రోజు gap లోపదకొండింటివేళ

నాకు ఫోను. 

“నాకు మీ దీ ఫేవర్ కావాలి,మీయింటికి లంచ్కీ వస్తాన్, ఒకటిగంట కొట్టినంకా.

నాకు డబల్ డ్యూటీ పడిందిజీ, నాకోసం యిస్పేషల్ యేదీ భీ వండొద్దు, మీరు చేసినదేది ఉంటే అదేసాల్…ఐదు మినట్కూడా కూసోనూ” అన్నది.

దానిదేముందీ  నావంట పదింటికే పూర్తవుతుంది కనక ఫ్రెష్ గా కాస్త అన్నం వండి పిలవచ్చులే అనుకుంటూనేఉన్నా..మనసు దానిపని అది చేస్తూ పోతోంది.

కాస్త అజీబ్ గా,వింతగా,కొద్దిగా భయంగా…పిసరంత ఫన్నీగా ఎవరబ్బా ఈ అజ్నబీ అంటూ ఏంటేంటో మిశ్రమభయాలు,భావాలమధ్య అన్నం వండడమేకాక అలంకరణలుకూడా ఆరంభించా.

ఇంతలో వచ్చేసా  మీ గేటులోకంటూ కాల్ రానే వచ్చింది. తలుపు తెరచి మెట్లెక్క మని చెప్పి లోపలికొచ్చా. అమ్మగారువేంచేశారు.”ఆయియేఆయియే..” అంటూ సాదరంగా నేను ఆహ్వానించాను.

 “ముందు నీ పేరు స్పెల్లింగుతో పాటూ చెప్పుమహాతల్లీ”అన్నాను.అమ్తుల్ హజీజ్ అన్నట్టనిపించింది.  వస్తూనే  “సారీ!  నేన్ లోపల్ రాను. నాకు ఈ డబ్బాలో ఏమేస్తావో వేసెయ్,టైమ్లేదు,పేషంట్ వెయిటింగ్,యేమనుకోవద్దూ ….ప్లీజ్అంటుంటే, వడ్డనకు సిద్ధంచేస్తూ నేను పడిన శ్రమకి  నాకు  చిరాకు కలిగింది.

అయ్యో ..అదేమిటీ,,తినడానికికూడా తీరిక లేదా   అదెక్కడి ఆఫీసూ?  లోపలికైతే రాతల్లీ అన్నాను. చాలాసంకోచిస్తూ  డైనింగ్టేబుల్ దగ్గరకొచ్చింది.  కంచంలో కప్పులవారీగా అమర్చడమూ చూసింది.   

వసంతాజీ,  మీతో చాలాచాలా చెప్పుకోవాలీ.కానీ యిపుడుకాదూ అని రక్షించింది.  ఒక మాదిరి పెద్దసైజు ప్లాస్టిక్ డబ్బాతెరిచి కలగూరగంపలా అన్నీ  యిందులోపడేయండి అంటే నేను ఆపనే చేశాను. అన్నమూ,దానిమీదమామిడికాయపప్పు,వంకాయకారంపెట్టినకూర,టమాటా పచ్చడి…వేసి, వేడిచేసిరెడీగా పెట్టిన రసంమాటేమిటీ    పాపం వాళ్ళు రసంఅనబడే ఈ చారు చేసుకుంటారో లేదోకదా  అని గాబరా పడుతూ కాలూచేయీఆడనంత కంగారుపెట్టేస్తుండడంతో   నాకు ఏమీ తోచని పరిస్థితి! 

ఇంకా కొత్తావకాయబద్ద వెయ్యాలని ఆరాటం.

కుచ్ డిస్పోసబుల్ హైతో ఉస్మే దాల్దో మేడమ్.  (నేనలాగే నీళ్ళసీసాలో పోసిచ్చాను రసం).

ఫిర్భీ మీరు అన్ని రకాలు ఇస్తున్నారుమేడమ్..అంత వద్దు,ఇంటి తిండి తిని పదిదినాలైంది  అంటూ..దుఃఖాన్నిదిగమింగుతూ   బురఖా ముసుగు పైకెత్తి కన్నీరు తుడుచుకున్న పుణ్యఘడియల్లో వారిముఖారవిందం నామదిలో ముద్రించేసుకున్నాను..అంతకుమించి..పెద్దగా పర్సనాలిటీ…[మిడిలేజ్అనితప్ప] మరేమీతెలియలేదు. 

అదేమిటీజీ   లంచ్ అవర్ కూడా యివ్వరా  మీ దగ్గరా..యెంతిస్తారసలుజీతం..ఇస్తారా అదీ ఎగవేతేనా..అయినాసెక్యూరిటీకి చెప్పి హోటల్నుండీ తెప్పించుకుంటే..తప్పా…టూమచ్..అంటూ చిటపటలాడాను.

“ఏంచెప్పమంటారు  మేడమ్, మీతో బహుత్కుచ్బోల్నాహై” అంది

అమ్మో..గుండెగుటుక్కుమందినాకు..ఉన్నకతలకే తలలో చోటుసరిపోవడంలేదని సిగ్నల్స్ వస్తుంటే  ఇదేంగోల..వద్దుతల్లీ..అని అచ్చతెలుగులోకచ్చితంగా నాతోనేననుకున్నాను.

“ఎనిమిదివేలిస్తారు..నాకు ఇద్దరుపిల్లలు.మా సిస్టర్కిచ్చేసినా.  నాది  పూరా  పైసల్వారికొరకే.

సబ్కుచ్ యిచ్చేస్తాన్, నేను ఫారిన్ రిటన్వుందీ”అంది.

“మరింకేం..మీఆయనెక్కడా..?”

ఆమెదుఃఖం ద్విగుణీకృతమైంది.  కన్నీరు కాల్వలుకట్టకుండా తమాయించుకుంది.

యింతలో నేను నా ఉర్దూ హిందీమిశ్రమ్ భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ. 

“క్యా ఆప్కే పతీజీ గుజర్గయే..? “అని నోరు జారేశా..ఏడుపుచూసనుకుంట..

“నైనై,  కళ్ళు తుడుచుకుంటూ..హైహైఉనోహై,  లేకిన్,  క్యా బతావూఁ..చాలా చెప్పేదివుందీజీ..”అంది..

చాలా వద్దులేతల్లీ..అని స్వగతంలోనేనుమళ్ళీ..

మీరు టీవీలలో చూసేదీ చాలా తక్వ వుందీ.  నాదీ కష్టాల్ ఎవర్కీ భీ వద్దు అంది.  

ఓ.అలాంటివా…అనుకుంటూతలూపాను,

బాహర్నుండి తెప్పియ్యాలంటే పైసాలేదు…పుట్టింట్లో మరదలు నరకం చూపిస్తోంది. నా టైమ్ కి వంటచెయ్యదు..ఇంకపదిదినాలైతే “ రోజా”మతలబ్ .. fasting  షురూ..రంజాన్ వస్తుందీకదా!

“thanq  ji !మరలావస్తా. ఎవరికీ చెప్పకుండా వచ్చా.పేషంట్ వెయిటింగ్.” అంటూ బుద్ధిగా బురఖా సర్దుకునిపారిపోయినంత పనిచేసింది.

ఒకపూట తిండితో జీవితం తెల్లారుతుందా చెప్పండి.నాకైతే రెండుగంటలపాటు అగమ్యగోచరంగాఅనిపించింది.అయోమయంగా,ఆందోళనగా,అస్తవ్యస్థంగా ,గాబరాగా నేనేదో నేరపూరిత క్రియసలిపినదానిలాకొట్టుమిట్టాడాను.

రాత్రి ఎనిమిదింటికనుకుంట, ఇంగ్లీష్లో..”thanq for the excellent lunch u have provided to a hungry woman”అంటూSMS వచ్చి నా గుబులు ని  తిరగతోడింది.

మఆయనకి చెప్పుకున్నాను. వారికీ ఏమీ అంతుపట్టలేదు.

నిద్ర పోవాలంటే నన్నునేను సమా ధాన పరచుకోవాలి.

అందుకే ఒక్కటే అనుకున్నా..మంచి అపరాహ్ణవేళ అంత ఆకలి తో దేహి అన్న వారికి అన్నంపెట్టగలగడం నా అదృష్టంగామనసారా నమ్మినోరుమూసుకుని,మున్ముందుజాగ్రత్త గా ఉండాలంటూ హెచ్చరించుకున్నాను.

ఇంతలో  భద్రాచల రామదాసు కీర్తనొకటి సావేరి రాగంలో గుర్తురాగా పాడుకునిపడుకున్నాను..

“శ్రీరాముని దివ్యనామ స్మరణచేయుచున్నచాలూ

ఘోరమైన తపములనూసేయనేటికే….

అతిథి వచ్చి ఆకలన్నా..అన్నమింత యిడినాచాలూ

క్రతువుసేయవలెననీ కాంక్షయేటికే..

సతతము శ్రీ భద్రాగిరి స్వామిరామదాసు డైన

ఇతరమతములనియేటి…వెతలవేటికే మనసా…”

మళ్ళా ఆ బీబీ   జాడేమీలేదు.వద్దుకూడా. 

ఎవరికతలేంటో..

ఎవరి వెతలేమిటో..

ఎవరి జీతాలేమిటో…

ఎవరి జీవితాలెటో…  కదా !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.