విజయవాటిక-21

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

అమరావతి

ఆ ఉదయం మహాదేవవర్మను మెత్తని మేనాలో పడుకోబెట్టి, ఆ మేనా రథం మీదకు చేర్చి, ఇంద్రపురిలోని ఘటికాపురి వైపు సాగిపోయారు. శ్రీకరుడు వారి ముందున్నాడు. కొంత సైన్యం, మరో రథంలో గురుదేవులు వస్తున్నారు.

వారు ఆ రోజు సాయంత్రానికి ఘటికాపురి చేరుకున్నారు.

గురుదేవుల పర్ణశాల ప్రక్కనే మరొక పర్ణశాలలో మహాదేవుని తుంగచాప పై పటుకోబెట్టారు. గురుదేవులు ప్రయాణ బడలికను సైతం లెక్కచెయ్యక, వెంటనే పసరు తీయించి, మహాదేవుని శరీరానికి పూతగా పూయించారు.

ఆ రాత్రి శ్రీకరునికి కంటి మీద నిద్రలేదు. అతను మహాదేవవర్మకు సేవ చేస్తూ గడిపాడు.

అతనికి గత కొద్దికాలంగా జరిగిన సంఘటనలు వరుసగా గుర్తుకు వచ్చాయి.

రాజమాత తన వద్ద తీసుకున్న ప్రమాణాలు… రాజగురువులు హెచ్చరించిన మాటలు.. అన్నీ!

‘గురుదేవులు పూర్వం తనతో.. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు… అని చెప్పారు.

రాజమాత ఎన్నోసార్లు మనము వంశంకోసము పని చెయ్యాలి… మనుషుల కోసము కాదు అని హెచ్చరించింది. రాజ్యం ముక్కలు కాకుడదని కోరింది. వారికి తెలుసా? ఇది జరగవలసినదని?

ఏమి రాజకీయము… ఎంత స్వార్థముతో ఉన్నది…’

‘మాధవవర్మకు రాజ్యము తన నుంచి తన పుత్రులకు వెళ్ళాలి. విక్రమేంద్రవర్మకు రాజ్యము తనదే కావాలి. అందుకు అడ్డు అనుకుంటే సొంత మనుష్యులను కూడా వధిస్తారు…’

హృదయంలో దిగులు మేఘాలు కమ్మినాయి.

ఆకాశంలో మబ్బులు పట్టి చీకటి మరింత దట్టంగా అనిపించింది శ్రీకరునికి ఆ రాత్రి.

***

          శ్రీకరునికి హృదయం బరువెక్కింది.

మహాదేవవర్మకు ఇంకా స్పృహ రాలేదు.

ఆ ఉదయం గురుదేవులు మళ్ళీ మరోపూత వేశారు.

దిగులుగా ఉన్న శ్రీకరునితో “కారా ఏమిటిది… నీవు కూడా ఇలా దిగాలు పడితే ఎలా? మన రాజ్యము ఎమవ్వాలి. ప్రజలేమవ్వాలి? లే! కర్తవ్యం నిర్వహించాలి నీవు…” అన్నాడు

“గురుదేవా! ఈ స్వార్థ రాజకీయాలలో నుంచి నే వైతొలుగుతాను…” అన్నాడతను.

నవ్వారు గురుదేవులు.

“నీవు దైవాంశ సంభూతునివి. నీవు ఎవరి పక్షాన నిలబడితే వారికి గెలుపు తథ్యము… చెప్పారు గురుదేవులు.

“గురుదేవా! నేను మహాదేవవర్మ వైపు నిలబడినాను. అతనిని బ్రతికించండి…” అన్నాడతను

“అది ఈశ్వరాజ్ఞ నాయనా…”

శ్రీకరుడు ఆశ్రమంలో మహాదేవవర్మకి జరుగుతున్న వైద్యం చూస్తూ కూర్చుంటు న్నాడు.

“మహారాజు యుద్ధానికి వెడుతున్నారని, వెంటనే రమ్మనమని…” కబురు వచ్చిం దతనికి.

శ్రీకరుడు పలకలేదు. కదలలేదు.

వార్తాహరుడు ఆ వార్త చెప్పి వెళ్ళాడు.

గురుదేవులూ పలకలేదు.

మహాదేవవర్మకు సేవచేస్తూనే గడిపాడు శ్రీకరుడు.

విజయవాటిక నుంచి కబురులు అందుతూనే ఉన్నాయి.

విక్రమేంద్రవర్మకు, మాధవవర్మకు మధ్య జరిగిన యుద్దంలో పాల్గొన్నవారు ఎక్కువ మందిలేరు. కేవలం కొద్ది సైన్యం ఇరు వైపులా కూడారని…

యుద్ధంలో మాధవవర్మ అసువులు బాసినాడని తెలిసింది.

శ్రీకరునికి కళ్ళు వర్షించాయి. ఆ నాడు గురుదేవులతో “గురుదేవా! రాజమాతకు కలిగిన దుశ్శకునముల సూచన ఇదేనా?” అని అడిగాడు.

ఆయన మౌనంగా ఉన్నారు.

ఔనన లేదు… కాదన లేదు…

రాజమాత ఎంత కరుణాహృది. ఆమె ఉన్నన్ని రోజులు అందరూ ఒక్క మాటగా నిలిచారు. ఆమె రాజాధికారానికన్నా, వంశ ప్రతిష్ట ముఖ్యమనుకున్నది. రాజ్యం అఖండంగా నిలబడాలని తలపోసింది. తన జీవితం దానికే అంకితమిచ్చినదా మహాతల్లి.

విజయవాటికను విక్రమేంద్రవర్మ ఆధీనంలోకి తీసుకున్నాడని తెలిసింది.

మహదేవవర్మకు ఏ మార్పు రావటంలేదు.

ఆ రోజు శ్రీకరుడు అడిగాడు…”గురుదేవా!  మహాదేవుని ఆరోగ్యములో మార్పు రావటము లేదేమి?”  యని.

“కారా అది కాలకూటము. నీకు తెలుసు దానికి విరుగుడు ఉండదని…”

“మహాదేవుడు ఇలా ఉండవలసినదేనా?”

“కాదులే చూద్దాము. నాడి దొరికితే బ్రతికించ వచ్చు…”

గురుదేవులు ప్రయత్నం ఆపటంలేదు.

మహాదేవుని తెచ్చి రెండు వారాలు దాటింది.

గురుదేవుల దర్శనార్థం విక్రమేంద్రవర్మ వస్తున్నారని కబురు వచ్చింది.

***

          ఆ రోజు విక్రమేంద్రవర్మ గురుదేవుల ఆశ్రమానికి వచ్చాడు.

గురుదేవులు ఆశీర్వదించాడు.

“గురుదేవా! మీ ఘటికాపురిని అమరావతి వద్దకు మారుద్దాము…”

“అలాగే మహారాజా…”

“మా మాతృశ్రీ అభిమతం ప్రకారము నేను యాగము చేసి దానము చెయ్యవలెను..”

“తప్పక చెయ్యండి. మీ వంశము ఆచంద్రార్కము నిలచియుండవలెను…”

“మహాదేవునికి ఆరోగ్యము కుదుటపడినదా?”

“లేదు మహారాజా! స్పృహలోకి రాలేదు…”

“బ్రతికించగలరా?”

“పరమేశ్వరాజ్ఞ ఎటుల ఉన్నదో?”

ఇంతలో అక్కడికి  శ్రీకరుడు వచ్చి “జయము జయము మహారాజా!” అన్నాడు.

“కారా! నీవు ఇంద్రపురికి రాజప్రతినిధిగా ఉండవలెను. మహాదేవుని వీరంతా చూసుకుంటారు. నీవు మా వెంట రావలెను…”

“మహారాజులకు జయము. .. నన్ను క్షమించండి! నేను శ్రీ పర్వతస్వామిని కొలుస్తూ నా శేష జీవితము గడపాలనుకుంటున్నాను…”

“అదేమి… ఇంత చిన్న వయస్సులోనే ఈ వైరాగ్యము…”

శ్రీకరుడు ఉలకలేదు… పలకలేదు. అతని హృదయం చిన్నబోయింది. మహాదేవ వర్మను ఈ స్థితికి తెచ్చినవారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడుకానీ ఏమీ చెయ్యలేడు. రాజమాతకు మాటిచ్చాడు. వీటికన్నిటికీ విరుగుడు ఆ స్వామి సేవలో శేషజీవితం గడపటం.

మహారాజు విక్రమేంద్రవర్మ విజయవాటికకు వెళ్ళిపోయాడు.

మహాదేవునికి స్పృహ రాలేదు. నాడీ దొరకలేదు…

శ్రీకరుడిని రాజపరివారం ఎంతగా ప్రాధేయపడినా అతను వినలేదు. తాను శ్రీపర్వతస్వామి సేవలో తరిస్తానని మల్లికావల్లితో కలిసి శ్రీపర్వత దిశగా సాగిపోయాడు.

ఉపసంహారము:

          అలా వాకాటకా మహారాణి పుత్రుడు విక్రమేంద్రవర్మ క్రీ.శ 522 లో రాజ్యాపాలనకు వచ్చాడు. ఆయన తను రాజ్యానికి వచ్చాక వేయించిన ధర్మ శాసనములో “రెండన మాధవవర్మ, మహారాణి మాహాదేవి ప్రియపుత్రుడు, మహాకవి, మహా సౌమ్యుడు విక్రమేంద్రవర్మ” అని రాయించాడు. రాజ్యానికి వచ్చేసరికే వృద్ధుడు, కాబట్టి ఎక్కువ కాలం పరిపాలన చెయ్యలేదు. ఏడు సంవత్సరాలలో మరణించాడు.

ఇతని తరువాత, ఇతని పుత్రుడు ఇంద్ర భట్టారకవర్మ రాజ్యానికి వచ్చాడు. వాకాటక మహారాణి సంతాన పరంపరలైన వీరు, మూడవ మాధవవర్మ తరువాత, వంద సంవత్సర ములు అప్రతిహాతంగా రాజ్యం చేశారు. విష్ణుకుండినులు పూర్తిగా మూడు వందల సంవత్సరాలు దక్షిణా పథమును ఏలారు. సుస్థిరంగా, శాంతివంతంగా పరిపాలించారు. న్యాయమైన ధర్మపాలన చేశారు. వైదికమతాన్నీ, శైవాన్ని పోషించారు.

కళలను పోషించారు. గుహాలయాలను నిర్మించారు. వీరిని పల్లవులు తరువాతకాలములో అనుసరించారు.

విష్ణుకుండినుల కాలములోనే సంస్కృతంలో అలంకార కావ్యమైన లక్షణ గ్రంధం “జనశ్రయఛందోవిచ్చిత్తి” రచించబడినది. సంస్కృతం రాజభాషగా వెలిగింది.

తెలుగుదేశం వీరి కాలంలో సర్వతోముఖంగా వృద్ధి చెందింది. శాతవానుల తదనంతరము దక్షిణ దేశాన్ని ఏకతాటి పై నిలబెట్టిన బలమైన వంశం వీరిదే.

తెలంగాణాను ఏలిన ప్రభువులు వీరు. తెలంగాణాలోని  ముఖ్యమైన కోటలన్నీ వీరి సమయానికి చెందినవే. భువనగిరికోట, కరీంనగరు… ఇలా ఎన్నో…చరిత్ర పుటలలో దాగి…కనుమరుగయ్యాయి.

నా మనవి:

చరిత్రను చదవటానికీ, రాయటానికీ ప్రజలకు కొంత తక్కువ మక్కువ… కొద్దిగా చులకన కూడా… కారణం జీవితంలో పనికిరాదని ఒక నిరసన. అది నిజం కాదు. ఎందు కంటే ఒక జాతి ధైర్యంగా ఉండాలన్నా, మునుముందుకు దూసుకుపోవాలన్నా ఆత్మ విశ్వాసం కావాలి. ఆ ఆత్మవిశ్వాసం చరిత్ర తెలుసుకుంటే కలుగుతుంది.

ఎందుకో మనం చదువుకునే చరిత్రలో దక్షిణదేశాన్ని అసలు పూర్తి భారతదేశాన్ని ఏలిన శాతవాహనులను నిర్లక్ష్యం చేశారు. మూడువందల సంవత్సరాలు ఏలిన విష్ణకుండినల మాటే తలవరు. ఎన్నో చరిత్ర పుస్తకాలలో వీరి గురించి ఒక చిన్న పేరా మాత్రమే ఉంటుంది.

కీ.శ. ఐదు, ఆరు శతాబ్దాలలో కళింగులతో సహా మొత్తం ఆంద్రదేశాన్ని ఏకచ్ఛత్రాధి పత్యం సాధించి చరిత్రలో సామ్రాజ్య పాలక పాత్ర పోషించిన గొప్ప రాజవంశం విష్ణు కుండినులు. ఈ శక్తివంతమైన రాజుల గురించి వివరాలు మనకు చాలా కొద్దిగానే దొరుకు తున్నాయి. ఎన్నో చరిత్ర పుస్తకాలలో వీరి విషయం కనీసం ఉండదు. ముందు ఎఫ్. కీల్ హార్న్, ఇ. హల్ష్, కె.వీ. లక్ష్మణరావు వంటి వారు వారి శాసనాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీరి మీద కొంత విస్తారమైన పరిశోధన చేసినది మాత్రం బి.ఎన్. శాస్త్రిగారనే చెప్పాలి. వీరి వంశ వృక్షం మీద తేడాలు చూపారు చరిత్రకారులు. వారి ఈ తేడాకు కారణం వారు శాసనాలను పరిష్కరించకపోవటమే. ఈ వంశంలో రాజుల కాలం విషయం లో కొంత తేడాలు చెప్పినా, చరిత్రాకారులు అందరూ ఈ వంశంలో జరిగిన కుతంత్రాన్ని పేర్కొన్నారు.

భావరాజు కృష్ణారావుగారు రచించిన ‘History of early dynasties of Andhradesa’ అన్న గంధ్రం 1938 నాటిది. బి.ఎన్ . శాస్త్రిగారి ‘బ్రాహ్మణ రాజ్య సర్వస్వము’ 2000 సంవత్సరములో ముద్రించబడింది. కాబట్టి వీరి వంశవృక్షము శాస్త్రి గారి రచనల నుంచి స్వీకరించాను.

వారి శాసనాలు రెండు రకాలు. శిలా శాసనాలు, తామ్రశాసనాలు. అవి:

మొదటి గోవిందవర్మ చైతన్యపురి శాసనము

గోవిందవర్మ ఇంద్రపాలనగర(ఇంద్రపురి) తామ్ర శాసనము

రెండవ మాధవవర్మ ఖానాపూర్ తామ్రశాసనము

రెండవ మాధవవర్మ వేల్పురు శాసనము

మూడవ మాధవవర్మ ఈవూరు శాసనము

విక్రమేంద్రవర్మ పాతగండిగూడేం తామ్రశాసనము

ఇంద్రవర్మ రామతీర్థశాసనము

విక్రమేంద్రభట్టారక వర్మ చిక్కుళ్ళ తామ్రశాసనము

విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాలనగర తామ్రశాసనము

విక్రమేంద్ర భట్టారక వర్మ తుండి తామ్ర శాసనము

నాల్గవ మాధవవర్మ ఈవూరి తామ్ర శాసనము

నాల్గవ మాధవవర్మ పాలమూరు తామ్ర శాసనము.

వీరి గురించి, శాసనాల గురించి ఉపయుక్తమైన గ్రంథాలు:

బ్రాహ్మణరాజ్య సర్వస్వము – బి.ఎన్. శాస్త్రి

శాసన సంపుటి 1 & 2 భాగాలు – బి.ఎన్ శాస్త్రి

తొలినాటి తెలుగు  రాజ వంశాలు. – భావరాజు వెంకట కృష్ణారావు.

South -Indian Inscriptions (Texts) volume x Telugu Inscriptions from Andhra pradesh

భారతి – April – 1952- “ఘటిక – ఘటికాస్థానం – వడ్డాది శ్రీరామచంద్రమూర్తి”
ఆంధ్ర గుహాలయాలు – దేవీరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
విష్ణుకుండినులు శాసనాలు – ఎన్. వెంకటరమణయ్య
Rock Inscriptions of Undavalli

ఈ చారిత్రాత్మిక కథను రాయటానికి నాకు ప్రేరణ నేను పూర్వం చదివిన చరిత్ర పుస్తకాలు. చరిత్రను కొంతైనా నేటి మిత్రులకు గుర్తు చెయ్యాలని, చరిత్రలోని ఆనందాన్ని పంచుకోవాలన్న ఆలోచనకు కలిగిన రూపమే ఈ విజయవాటిక.

రాసిన దానిని చదివి, సలహాలతో సూచనలతో కథను నడిపించటానికి సహాయం చేసిన గంగరాజు మాష్టారుగారికి వందనాలు. నేను రాసినది చదివే నా మొదట విమర్శకుడు కొండల్‌కు కృతజ్ఞతలు.

ఇది నేను రాసిన పూర్తి నిడివైన చరిత్రాత్మిక కథ. ఇది అందరికీ నచ్చుతుందని, చరిత్రను కొంతైనా ఆసక్తికరంగా చెబుతుందని ఆశతో ఉన్నాను.

కృతజ్ఞతలతో

సంధ్యా యల్లాప్రగడ

* * * * *

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.