
“నెచ్చెలి”మాట
“స్వీయ క్రమశిక్షణ” అను “సెల్ఫ్ డిసిప్లిన్”
-డా|| కె.గీత
“క్రమశిక్షణ” అనగా నేమి?
“డిసిప్లిన్”
“డిసిప్లిన్” అనగానేమి?
“క్రమశిక్షణ” ….
ఇదేదో పిల్లి అనగా మార్జాలం కథ లాగో; కన్యాశుల్కం లో గిరీశం, వెంకటేశాల సంభాషణ లాగో ఉందా?
సరిగ్గా అదే నాకూ అలాగే అనిపించింది సుమండీ!
ఎప్పట్నుంచో “క్రమశిక్షణ” అనగానేమో వెతుక్కుంటూ వెళ్లగా వెళ్లగా తెలిసిందేమంటే
చిన్నప్పట్నుంచి “క్రమశిక్షణ” గా పెరిగి పెద్దవ్వడం అన్నమాట!
హమ్మయ్య “క్రమశిక్షణ” అంటే ఏవిటో తెలిసిపోయింది కదా!
ఇక “స్వీయ క్రమశిక్షణ” అనగానేమి?
ఇది క్రమశిక్షణంత వీజీ కాదు అర్థం అయి ‘పోవడానికి’-
“స్వీయ క్రమశిక్షణ” అనగా “సెల్ఫ్ డిసిప్లిన్” అన్నమాట!
“సెల్ఫ్ డిసిప్లిన్” అనగానేమి?
ఒస్తున్నా, ఒస్తున్నా…అక్కడికే ఒస్తున్నా కాస్త ఓపిక పడుదురూ!
మన చుట్టూ మనమే గిరి గీసుకుని, మధ్యలో కూచుని గెడ్డం కింద చెయ్యేసుకుని ఆలోచించుకోవడం అన్నమాట!
హమ్మయ్య “స్వీయ క్రమశిక్షణ” అంటే ఏవిటో కూడా తెలిసిపోయింది కదా!!
అదే మరి!
అంత వీజీ అయితే ఇంకేం!!
“స్వీయ క్రమశిక్షణ” లో మొదటిది
“పరిధి”ని నిర్ణయించుకోవడం-
అసలు “పరిధి”ని నిర్ణయించుకోవడం ఒక చిన్న చిక్కయితే,
ఎక్కడిక్కడ భౌతిక పరిధుల్ని సరిచూసుకుంటూ, మానసిక పరిధిని చక్కదిద్దు కోవడం పెద్ద చిక్కు-
మరి ఇన్ని చిక్కుల్లో అసలు “స్వీయ క్రమశిక్షణ” అవసరమా? అని మీరడగొచ్చు.
అదే కదండీ మనిషిగా బతకడమంటే మరి!
ఇక కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకోవడం రెండోది
అవి మీ ఇష్టం-
పరిమితమైనదేదైనా నియమమే!
ఇక అన్నిటికంటే ముఖ్యమూ, శ్రేష్టమూ అయినదేవిటంటే-
“స్వీయ క్రమశిక్షణ” లేదా “సెల్ఫ్ డిసిప్లిన్” పాటిస్తూ
ఏ ప్రపంచంలో ఉన్నా “మన చుట్టూ ఏ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాం” అన్నది ముఖ్యం-
హమ్మయ్య నాకు మొత్తం తెలిసిపోయింది. మీకూ తెలిసి ‘పోయింది’ కదా!!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

తెలుగు భాషలో నాకు తెలియని పదం క్రమశిక్షణ .అది నెచ్చెలి కి వచ్చాక మీ సంపాదకీయం లో నేర్చుకున్నాను గీత గారు.నెచ్చెలి ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు,శుభాకాంక్షలు.
నెచ్చెలి విజయంలో భాగస్వామ్యులైన మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు వసుధ గారూ!