ఆడదానికే ఎందుకు?

  హిందీ మూలం – అంజనా వర్మ 

                                                         అనుసృజన – ఆర్.శాంతసుందరి 

ఆ వీధులే కదా ఇవి

ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు?

గోల గోలగా అల్లరి చేస్తూ

తుళ్ళుతూ తూలుతూ

కబుర్లు చెప్పుకుంటూ?

ఆ వీధుల్లోనే ఆడపిల్లలూ వెళ్తున్నారు

అసలు మాటా మంతీ లేకుండా

ఎవరి కళ్ళైనా తమ మీద పడేలోపున

అక్కణ్ణించి చల్లగా జారుకోవాలని.

ఈ ఇళ్ళు కూడా అవే కదా

ఒకప్పుడు చిన్నారి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు?

శిల్ప,గుంజన్,మీతా

ఆడుకుంటూ ఉండేవాళ్ళు

నవ్వుతూ ఆ పేటలోని ఒక్కొక్కరినీ నవ్విస్తూ

కానీ వాళ్ళందరినీ పంపివేశారు పరాయి ఇళ్ళకి

ఈ ఇళ్ళు వాళ్ళవి కాదు మరి

వాళ్ళందరివీ వేర్వేరు ఇళ్ళు

అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడికి

ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములుంటారు

మరి వాళ్ళ ఇళ్ళుగా ఇవి !

ఈ ప్రసూతి గృహాలు కూడా అవే

కొడుకు పుట్టాడనగానే

బంధువర్గం నవ్వులు మార్మోగుతాయి

గర్భంలో ఉన్నది అమ్మాయయితే

చీకటి కారాగృహమౌతుంది ఇదే గది!

అందరినీ తమ గమ్యం దాకా దింపుతుంది

ఈ బస్సు అదే కదా?

అందరి దృష్టిలో ఎంత మంచిదో ఇది

అది రావటం చూసి విప్పారతాయి అందరి ముఖాలూ

కానీ ఇందులోనే జరిగింది అత్యాచారం

ఆ యువతి మీద

ఎందుకు లోకంలో ఉన్న వస్తువులన్నీ

మారిపోతాయి ఒక స్త్రీ విషయంలో మాత్రం?

మరి స్త్రీ మాత్రం ఎవరి కోసమూ మారదే ?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.