వెనుతిరగని వెన్నెల(భాగం-6)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-6)

-డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

——-

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది.  ఇద్దరికీ పరిచయమవుతుంది. 

***

హాలులో అంతా పెద్ద విషయం చర్చిస్తున్నట్లు అందరి సీరియస్ నెస్ చూడగానే అర్థమైంది తన్మయికి.

భయమూ వేసింది.

“నీకు శేఖర్తో పెళ్లి ఇష్టమో, కాదో అడుగుతున్నారు నాన్నగారు” అంది జ్యోతి.

ఒక్క సారిగా గొప్ప రిలీఫ్ అనిపించింది తన్మయికి.

తండ్రి ముఖంలోకి చూస్తూ “మీ ఇష్టమే నా ఇష్టం నాన్నా” అంది లోపల్లోపల ఉబికే సంతోషంతో. 

“అబ్బాయి పెద్దగా చదువుకోలేదు, వ్యాపారాలన్నాక లాభ నష్టాలుంటాయి,  నాకైతే ఇలా వ్యాపారస్తులకి చెయ్యడం ఇష్టం లేదు” అంది జ్యోతి.

శేఖర్ జ్యోతికి ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు తన్మయికి.

“మొదట్నించీ ఇంతే,  ఏదో ఒకటి అంటూ అనుమానపడుతుంది” అనుకుంది మనసులో.

పైకి మాత్రం నిశ్శబ్దంగా తల్లి వైపు చూసింది.

“నాన్నగారు మాట్లాడేరు మిగతా వివరాలు, అబ్బాయికి వైజాగులో ఏదో ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారట. 

అవన్నీ అయ్యాక, పెళ్లి చూపులకి శాస్త్ర ప్రకారం రమ్మని కబురు చేద్దామని అనుకుంటున్నాం.” అంది జ్యోతి మళ్లీ.

ఇవన్నీ జరుగుతూండగానే తన్మయి డిగ్రీ రెండో సంవత్సరం లోకి అడుగు పెట్టింది. 

ఇక ఇంట్లోనూ పెళ్లి కబుర్లే ఎక్కువయ్యాయి. 

“నిశ్చితార్థాలు మాకు అచ్చి రావని మా అమ్మ చెప్పింది, అయినా “ఈ అమ్మాయి మాది” అనిపించుకోవడానికి రాక తప్పదుగా. లేకపోతే మీ వాళ్లు మళ్లీ సంబంధాలంటూ మరెవరి వెంటో పడతారు” అన్నాడు శేఖర్.

శేఖర్ని ఇప్పుడు రావొద్దని అడ్డుకునేవారెవరూ లేరు. జ్యోతి అప్పటి వరకూ తనకి నచ్చనిదేదీ లేదన్నట్లు  శేఖర్ వచ్చినప్పుడల్లా అతి మామూలుగా మాట్లాడడం చూసి తన్మయికి చాలా ఆనందం వేసింది.

మొదట్నించీ తల్లికి నచ్చకపోవడం పెద్ద సమస్య అవుతుందని భయపడేది తన్మయి.

ఈ సమస్య ఇంత మాములుగా పరిష్కారం అవుతుందని ఊహించలేదు.

కానీ ఆ రోజు భాను మూర్తి శేఖర్ తో “చూడు బాబూ! శాస్త్రోక్తంగా పెళ్లిచూపులు, నిశ్చితార్థం అవీ జరిగితే బావుంటుందని అనుకుంటున్నాం. అంత వరకూ ఇలా రావడం చుట్టూ చూసేవాళ్లకి…” అనేదో చెప్పబోయేడు.

శేఖర్ మధ్యలోనే అందుకుని “అలాగే మావయ్యా! కానీ నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నానని మీకు తెల్సుగా.  దొరకగానే మీ ఇష్టం, మీకెలా నచ్చితే అలా చేయండి. అంత వరకూ రావొద్దని అంటే మానేస్తాను.” అన్నాడు ముఖం చిన్న బుచ్చుకుని.

జ్యోతి కల్పించుకుని “వచ్చే ఏడాది తన్మయికి డిగ్రీ పూర్తయ్యిపోతుంది  కదా, అదే ఏడాది పెళ్లి చేద్దామని మేమూ అనుకుంటున్నాం. నీ ప్రయత్నాలన్నీ ఈ లోగా సక్రమంగా జరగాలని మేమూ కోరుకుంటున్నాం.” అంది.  

శేఖర్ వెళ్లడానికి లేచి “తన్మయికి చెప్పి వస్తానత్తమ్మా” అని లోపలికి వచ్చాడు.

ఇదంతా అప్పటి వరకూ లోపలి నించి విన్న తన్మయి పెరట్లోకి వచ్చి,  వెను తిరిగి పూల చెట్ల వైపు, పాదుల వైపు చూస్తూ నిల్చుంది.

కళ్లలోంచి బయటికి వెళ్లగక్కలేని బాధ మనస్సు నిండా పొంగి ప్రవహిస్తూంది 

శేఖర్ ని చూడకుండా ఉండడం పెద్ద పరీక్షే. కానీ తప్పని పరీక్ష.

సృష్టిలో వేటికీ లేని ఎడబాటు బాధ మనిషికే ఎందుకు?

హాయిగా పూల చెట్టులా ఉన్నన్నాళ్లూ అందరికీ ఆనందాన్ని పంచి, గతించే సాదా సీదా జీవితం మనిషికి ఉండొచ్చు కదా? 

సాయంత్రం పెరటి చెట్టు మీదికి చేరిన పక్షులు ఆనందంగా ఒకదానినొకటి పలకరించుకుంటూ వేటి  గూళ్లలోఅవి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. 

తనకీ, శేఖర్ కీ పెళ్లయ్యి తనదంటూ జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందో,  ఈ మధ్యలో కనీసం ఒకరినొకరు చూసుకోలేని ఈ అగ్ని పరీక్షలేవిటో?

వెనక నించి “తన్మయీ!” అన్న పిలుపు విని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా “శక్కూ! అంది. 

నిలబడడానికి ఓపిక లేనట్లు నూతి పళ్లెమ్మీద కూలబడింది.  

శేఖర్ ఎదురుగా వచ్చి నిలబడి “మళ్లీ వస్తానులే. ఇంట్లో బాగా చీకాకు గా ఉండి, ఇలా వస్తే మీ వాళ్లు ఇలా. ఏం చేస్తాం? నా టైము బాలేదు.” అన్నాడు.

ఎదురుగా వంటింట్లోంచి  తమనే గమనిస్తూ గమనించనట్లు పచార్లు చేస్తూంది  జ్యోతి.

శేఖర్ కు మాత్రమే వినిపించేటట్లు  “శక్కూ! ఉత్తరాలు తప్పకుండా రాయవూ” అంది తన్మయి.

అసలా మాటే వినిపించుకోనట్లు 

“అయినా నేనిలా వొస్తే మీ వాళ్లకొచ్చిన బాధేవిటీ, రేపు  వైజాగు వెళ్తే మళ్లీ ఎప్పుడొస్తానో నాకే తెలీదు.” అని 

“సర్లే, ఏవన్నావ్, ఉత్తరాలు. రాస్తానులే. అయినా మీ ఇంట్లో ఓ ఫోను పెట్టించమని మీ నాన్నకు చెప్పరాదూ. సంపాయించిందంతా ఏం చేస్తారు.” అన్నాడు వ్యంగ్యంగా.

తన్మయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన మనస్సులో మెలితిప్పే బాధ అసలు ఇతనికి అర్థం అవుతుందా? సమాధానం చెప్పాలనిపించడం లేదు. 

అయినా గొంతు పెగుల్చుకుని “మీరు టౌను లో ఉంటారు కాబట్టి మీకు ఫోను అవసరం. మాకీ పల్లెటూరులో అవసరమేవుందీ.” అంది అన్యమనస్కంగా. 

“పల్లెటూరులో ఉన్నారు కాబట్టే అవసరం.  చటుక్కున ఏదైనా పనిబడి ఏం చెప్పాలన్నా ఇంకా టెలీగ్రాములు, ఉత్తరాలు…” అని గొణిగాడు.  

అంతలోనే “అయినా ఇంట్లో మీ అమ్మ పెత్తనం కదా, నిజంగా ఆవిడకి అవసరం వస్తేనే మీ ఇంటికి ఫోను కనెక్షను వస్తుంది.” అని మీ ఖర్మ ఇంతే అన్నట్లు నెత్తి కొట్టుకుని, 

“మా ఇంటి ఫోను నంబరు నీకు తెలుసు కదా. సెంటర్లో STD బూత్ నించి నువ్వైనా ఫోను చెయ్యొచ్చుగా. నేను లేకపోతే అమ్మకి చెప్పు ఏ విషయమైనా. మా అమ్మ మీ అమ్మ అంత కఠినురాలు కాదులే.” అన్నాడు.

బొత్తిగా సరిగా సాగని ఆ సంభాషణ తన్మయికి అస్సలు నచ్చలేదు. అతనికి ఉన్న ఉక్రోషమంతా వెళ్లగక్కుతున్నాడు. 

తను ఇంతగా  ప్రేమిస్తున్న ఇతను తన తల్లిదండ్రుల్ని ఇలా ఈసడింపుగా మాట్లాడడం భరించలేదని తెలియదా. తెలిసీ చేస్తున్నాడా?  

“అసలు నీ మాటలకు అర్థం లేదు.  ఆలోచనలకూ అర్థం లేదు.” అంది.

“సరే, అలాగే అనుకో. మళ్లీ ఉద్యోగం వచ్చాకే కనిపిస్తా.” అని విసవిసా వెళ్లిపోయేడు.

తన్మయికి విపరీతమైన దు:ఖం వచ్చింది. కానీ పైకి ఏడవడానికి వీల్లేదు. 

తమ మధ్య సంభాషణ ఎవరికి తెలిసినా జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. 

ఒక్క పరుగున డాబా మీదికి వెళ్లింది.

అప్పటికే వీథి మలుపు తిరుగుతూన్న శేఖర్ కనిపించేడు.

కట్టలు తెంచుకున్న దు:ఖాన్ని ఆపుకోలేక డాబా మీద గుబురుగా పెరిగిన సన్నజాజి తీగె దాపున కూచుంది. 

“ఇటువంటి సంభాషణలు తమ మధ్య భవిష్యత్తులో చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో” అని చాలా సేపు ఆలోచించింది.

వనజతో ఇవన్నీ చెబ్దామంటే తనని  వాళ్ల పెద్దమ్మకి ఒంట్లో బాలేదని సాయంగా వాళ్ల ఊరు పంపించేరు వాళ్లింటి వాళ్లు.

తనెప్పుడు వస్తుందో తెలీదు.

వనజకి ఉత్తరం రాసి పోస్టు చేసింది. అడ్రసు తప్పో, ఏవిటో ఉత్తరం మరో వారంలో తిరిగి వచ్చింది.

తన్మయికి దు:ఖం వచ్చింది. సగం శేఖర్ కోసం, సగం వనజ కోసం.

రోజురోజుకీ ఎవరితో ఏమీ చెప్పలేని ఒంటరితనం వేధించసాగింది.

ఆ రోజు యథాలాపంగా ఇంగ్లీషు లిటరేచర్ పుస్తకం తీసి కనబడ్డ మొదటి కవితని తెలుగులోకి అనువాదం చేసింది.

అది సర్ థామస్ వ్యాట్ రాసిన “ఐ ఫిండ్ నో పీస్” కవిత. సరిగ్గా తన మన: స్థితికి సరిపోయేటట్లున్న  ఆ కవిత అనువాదం “నాకు శాంతి లేదు” పైకి చదువుకుంది.

“నా యుద్ధం ముగిసింది 

అయినప్పటికీ నాకు శాంతి లేదు

నేను భయపడుతాను, ఆశపడుతాను

నేను నిలువెల్లా దహించిపోతాను

మంచులా గడ్డకట్టుకుపోతాను

నేను గాలి వాటున అల్లల్లాడగలను

కానీ కాళ్లూనుకుని ఎగురలేను.

………నాకు శాంతి లేదు…”

అనువాదం చేసేక మనస్సు బాగా తేలిక పడినట్లు అనిపించింది తన్మయికి.  

అప్పటి నుంచీ  చదువుతున్న చదువే తనకు మంచి మిత్రుడూ, తోడూ అయ్యింది.

గంటల తరబడి ఆంగ్ల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, వాటిని తెలుగులోకి అర్థం చేసుకుంటూ అనువాదం చెయ్యడం మొదలు పెట్టింది.

వాటితో బాటూ తెలుగు సాహిత్యం లో నచ్చిన  రచనల్ని మళ్లీ మళ్లీ చదవడం హాబీగా మార్చుకుంది.

చూస్తుండగానే తన్మయి డిగ్రీ మూడో సంవత్సరం లోకి అడుగు పెట్టింది.

***

శేఖర్ నించి ఎటువంటి రిప్లై లేదు. కోపం వచ్చిందేమో అని మథన మొదలైంది తన్మయికి.

చివరికి తెగించి ఒకరోజు సెంటర్  నించి శేఖర్ ఇంటికి ఫోను చేసింది.

అవతలి నించి శేఖర్ తల్లి దేవి నవ్వుతూ పలకరించింది.

 “తన్మయీ! ఎలా ఉన్నావు?”అంటూ కుశల ప్రశ్నలయ్యాక

“అన్నట్టు నువ్వు ఫోను చేసేవా అని శేఖర్ అడిగేడు మొన్న. ఏమైనా చెప్పాలా శేఖర్ కి” అంది దేవి.

 “అత్తయ్యా! ఊరికే చేసేను. శేఖర్ని ఉత్తరం రాయమని చెప్పండి.” అంది బిడియంగా ఇవతలి నించి.

“నీకో శుభవార్త. శేఖర్ నిన్నే ఉద్యోగంలో చేరేడు.”అట్నించి నవ్వుతూ దేవి.

“థాంక్యూ అత్తయ్యా. మళ్లీ చేస్తానూ.” అంది తన్మయి ఫోను పెట్టేస్తూ.

హుషారుగా ఇంటికి వచ్చి అమ్మమ్మని కౌగిలించుకుంది.

ఆ రోజంతా గొప్ప ఆనందంగా కబుర్లు చెప్పింది.

ఆ మర్నాడు సాయంత్రం

“డిగ్రీ పూర్తి చేసేలోగా పెళ్లి చేసెయ్యాలి అమ్మాయికి. నేను వాకబు చేసేను. అబ్బాయి ఉద్యోగంలో కుదురుకున్నాడు. అతని తమ్ముడు పనిచేసే షిప్పింగు కంపెనీలో కుదురుకున్నాడట.”  అన్నాడు భానుమూర్తి జ్యోతితో.

“ఊ.. అలాగే చేద్దాం. ఒక పక్క మా అమ్మ ఆరోగ్యం ఏమీ బాగో లేదు, మనవరాలి పెళ్లి చూసే వరకూ ఉంటానో లేదో అని ఒకటే బాధ పడ్తుంది.” అంది జ్యోతి.

ఇక ఇంట్లో అబ్బాయి మీద నమ్మకం కుదిరేక అడ్డంకులు తొలగి పోయాయి తన్మయికి.

ఉద్యోగం లో చేరేక మొదటి సారి వచ్చేడు శేఖర్ ఆ రోజు.

“వైజాగు లో సముద్రం ఎలా ఉంటుంది?” అప్పటికి నాలుగు సార్లు అడిగింది తన్మయి.

అదే విషయాన్ని గుర్తు చేస్తూ “నీకు సముద్రం మీద ఉన్న ఇష్టం నా మీద ఉందా?” అన్నాడు శేఖర్.

ఇక ఈ సంభాషణ మరెక్కడికో దారి తీయడం ఇష్టం లేక “ఊ.. నీ ఉద్యోగం గురించి చెప్పు” అంది.

“ఏవుంది చెప్పడానికి. గుమస్తా ఉద్యోగం. మా ఓనర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ  డబ్బులు వసూలు చేయడం నా పని. అదేవిటో విచిత్రం డబ్బులు మన చేతిలో పొద్దుట్నించీ సాయంత్రం దాకా ఆడతాయి. కానీ ఒక్క పైసా మనది కాదు.” 

“మరి మా నాన్న నువ్వు అదేదో షిప్పింగు కంపెనీ లో పనొచేస్తున్నావని….” అని నీళ్లు నమిలింది తన్మయి.

“అదేలే, మా ఓనర్ కి ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. కొన్ని అద్దెకి ఇచ్చేడు. ఆ లావాదేవీలు చూసుకోవడం నా పని. మా తమ్ముడు వాళ్ల సొంత బోట్లకి మనుషుల్ని కుదర్చడం, వచ్చిన సరుకుని మార్కెట్ కి అమ్మి పెట్టడం చేస్తున్నాడు. మీ వాళ్లలాగే నువ్వూ షిప్పింగు కంపెనీ లోనే పని చేస్తున్నానని చెప్పు ఎవరికైనా. కొంచెం మర్యాదగా ఉంటుంది.” అన్నాడు శేఖర్.

“అన్నట్లు నేను వచ్చిన పని మర్చిపోయాను. మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని మా వాళ్లకి చెబ్దామనుకుంటున్నాను. లాంఛనాలు మాట్లాడుకోవడానికి మీ వాళ్లకి కబురు చేస్తామని చెప్పేరు మా నాన్నగారు” అన్నాడు.

మొదటి సారి  తల్లిదండ్రుల్ని తల్చుకుని తన్మయికి  తెలీని దిగులు వచ్చింది. 

అప్పటి వరకూ అమ్మా, నాన్నా, అమ్మమ్మ ల సంరక్షణ లో పెరిగింది. వీళ్లనిక్కడ వదిలేసి పెళ్ళయి కొత్త వాళ్లతో వెళ్లిపోవాలి అని బాధ పట్టుకుంది. 

అదే చెప్పింది శేఖర్ తో.

“చాలా బావుంది, నిన్నా మొన్నటి వరకూ మీ వాళ్లు, నువ్వూ ఉద్యోగముంటేనే పెళ్లని బుర్ర తిన్నారు. ఇవేళ నిజంగా పెళ్లి ప్రస్తావన చేస్తుంటే నువ్విపుడు కొత్త పాట మొదలెట్టకు.” అన్నాడు చికాగ్గా.

తన్మయికి ఇంకాస్త బాధ పెరిగింది.

***

వనజ వచ్చిందని తెలిసి ఎంతో హుషారుగా పరుగెత్తింది తన్మయి ఆ మర్నాడు.

ఇన్ని నెలలు మాయమైపోయినందుకు బాగా కోప్పడాలని నిశ్చయించుకుంది.

“నీకో గమ్మత్తు విషయం చెప్పనా, వచ్చే వైశాఖ మాసంలో పెళ్లి” ” అంది వనజ ఆనందంగా, కొత్తగా సిగ్గు పడుతూ.

తన్మయి వనజ చేతులు పట్టుకుని గాలిలో ఊపి సంతోషంగా అడిగింది. “అమ్మ దొంగా, ఇన్నాళ్లు పెద్దమ్మ ఇల్లని ఆ ఊర్లో నువ్వు చేసిందిదన్న మాట.” అంది.

“చాలా తమాషాగా మా పెద్దమ్మని చూట్టానికి వచ్చిన చుట్టాల్లో ఒకావిడకి నేను నచ్చడం, వాళ్ల అబ్బాయికి సంబంధం మాట్లాడుకోవడానికి రావడం, మా వాళ్లకీ నచ్చి ముహూర్తాలు పెట్టేయడం, చకచకా జరిగిపోయాయి తెలుసా.” వనజ గుక్క తిప్పుకోకుండా అని

“నీకీ వార్త చెప్పాలని మనసు ఎంత తహతహ లాడీందో చెప్పలేను. అన్నట్టు ఒక్క ఉత్తరం రాయలేవా అమ్మాయ్, అంది చిరు కోపం నటిస్తూ.”

“ఆహా, నువ్వు రాసేవా? అయినా నేను రాసిన ఉత్తరం తిరిగొచ్చిందిగా” అంది తన్మయి కూడా కోపంగా.

“అసలు తీరికేదీ, అక్కడ నిమిషం పని లేకుండా లేదు తెలుసా. హమ్మయ్య! మళ్లీ అమ్మా, నాన్నల దగ్గిరికి వచ్చేసేను మొత్తానికి” అంది ఊపిరి పీల్చుకుంటూ వనజ.

ఇద్దరూ సాయంత్రపు వెలుగుని చూస్తూ గంటల తరబడి  తనివితీరా కబుర్లు చెప్పుకున్నారు.

“నీ పెళ్లి కి ముందే నా డిగ్రీ పరీక్షలు అయిపోతే బావుణ్ణు. హాయిగా నీ పెళ్లి లో స్థిమితంగా ఉండొచ్చు.” అంది తన్మయి.

“ఊ.. నాతో బాటూ నీకూ పెళ్లయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అమ్మాయి గారి చదువు అటకెక్కినట్లే” అంది వనజ ఏడిపిస్తూ.

“అదేం కాదు. నాకు మిగతా విషయాలేవైనా నా చదువు తర్వాతే.” అంది దృఢంగా తన్మయి.

***

మరో వారంలో పెళ్ళి మాటలకు శేఖర్ ఇంటి నుంచి పెద్దవాళ్లు వచ్చారు. శేఖర్ తండ్రి బాలాజీ రాలేదు.

పెళ్లి మాటల్లో లాంఛనాలు, ఇచ్చిపుచుకొనే లావాదేవీలూ ఏవీ అతనికి సంబంధం లేనట్లే దూరంగా ఉన్నాడతను. తన్మయికీ అదే చెప్పేడు.

“అదేవిటీ, నీకు చెల్లెళ్లు లేరుగా, మీ అమ్మ గారి చెల్లెలి పిల్లలకు ఆడపడుచు లాంఛనాలు ఇవ్వమంటున్నారు మీ వాళ్ళు” అంది తన్మయి.

“ఇలా చూడు, మా పిన్ని పిల్లలకు అన్నయ్యలు మేమే. మాకు వాళ్లే చెల్లెళ్లు. మీ అమ్మా, నాన్నకీ నువ్వొక్కత్తెవే. వాళ్ళు మాత్రం ఈ ఆస్తి అంతా ఏం చేసుకుంటారు. మా పెద్ద వాళ్లేవో ముచ్చట పడుతున్నారు. నువ్వు మధ్యలో కల్పించుకోకు.” అన్నాడు అతి మామూలుగా నవ్వుతూ శేఖర్. 

తన తల్లిదండ్రులు ఏ విషయంలోనూ బాధ పడడం ఇష్టం లేదు తన్మయికి. ఇలా కట్నాలూ, లాంఛనాలూ అంటూ బేరసారాలు  నచ్చడం లేదు తన్మయికి. 

కానీ “నేనంటే ఇష్టమన్నావ్, ఇప్పుడీ కట్నాలూ అవీ అవసరమా?” అని అడగలేకపోయింది. 

“ఊ.. వీళ్లూ ఘనంగానే అడుగుతున్నారు” అని రాగం తీసింది వాళ్లు వెళ్లగానే జ్యోతి.

“ఇక కొన్ని తప్పవు, సర్లే ఇంతకు ముందు మాట్లాడిన సంబధాల కంటే నయమే. ఒక్కతే అమ్మాయి అనే సరికి ఆస్తి మొత్తం రాసివ్వాలని మాట్లాడడం లేదుగా వీళ్లు.” అన్నాడు భాను మూర్తి.

నరసమ్మ ఆనందానికి అంతు లేదు. “అన్నీ బాగా జరిగి నీకు ఈ సంవత్సరం పెళ్లయ్యిపోతే ఆ సూర్యనారాయణ స్వామికి బూర్లు నైవేద్యం పెడతానని మొక్కుకున్నాను.” అంది మనవరాలితో.

పెళ్లి మాటలకు వాళ్లొక విడత వచ్చి మాట్లాడుకున్న బేరాలు శేఖర్ తండ్రికి నచ్చలేదట. 

మళ్లీ ఇంకోసారి అన్నీ మాట్లాడుకోవాలి, ఈ సారి తన్మయి తరఫు వాళ్లని రమ్మని కబురు చేసేరు.

తన్మయికి తలపోటు పట్టుకుంది.

ఆ సాయంత్రం ఇంటికి వచ్చి “ఎంత నిష్టూరంగా మాట్లాడిందో మహాతల్లి! మొన్న మన ముందు అన్నీ ఒప్పుకుంది, ఇవేళ భర్త ఎదురుగా మనమింకా ఏదో తక్కువ చేస్తున్నట్లు మాట్లాడుతూంది. పోనీండి పనికిమాలిన సంబంధం. వీళ్లు కాకపోతే మరొకరు వస్తారు మనమ్మాయికి.” అంది జ్యోతి కోపంగా.

విషయం మళ్లీ మొదటికి వచ్చిందని అర్థమైంది తన్మయికి.

తన తల్లిదండ్రులు ఇంతగా బాధ పడ్తూ తనకి పెళ్ళి చేయడం అస్సలు ఇష్టం లేదు.

“విసురుగా వెళ్ళి నాకు అసలు పెళ్ళే వొద్దు” అంది.

“వాళ్లనంటే నీకెందుకంత పౌరుషం ముంచుకొచ్చింది” అని కొరకొరా చూసింది జ్యోతి.

“తన మనస్సులో బాధ అవతలి వాళ్ల గురించా? తల్లిగా ఇదేనా తనను అర్థం చేస్యుకున్నది?”

తన్మయి కంట్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి.

ఇంతలో భానుమూర్తి దీర్ఘంగా ఊపిరి పీల్చి, అక్కడన్నీ ఒప్పుకుని మనం కూడా వాళ్లలా మాటలు మార్చడం నాకిష్టంలేదు.

“సరేలే, వాళ్లవి ఎంత గొంతెమ్మ కోరికలైనా మనకి ఎంత సాధ్యమో స్పష్టంగా చెప్పేం కదా. ఇష్టమైతే వాళ్లే కబురు చేస్తారు.” అని

తన్మయి వైపు తిరిగి “అంత వరకూ ఆ అబ్బాయికి ఉత్తరాలవీ వేయకమ్మా” అన్నాడు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.