
నూజిళ్ల గీతాలు-5(ఆడియో)
మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!
రచన &గానం:నూజిళ్ల శ్రీనివాస్
పల్లవి:
మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!
మమతలను కురిపించు మా కల్పవల్లి!
అణువణువు పులకించు అందాల లోగిలి!
అనురాగమొలికించు ఆనంద రవళి!
చరణం-1:
వేదనాదము చేయు కోనసీమను చూడు..!
వేల వనరులందించు.. మన్యసీమను చూడు..!
ప్రగతిలో పయనించు…మెట్టసీమను చూడు..!
మూడు సీమల కూడి, మురిపించు సీమ…!
చరణం-2:
విఘ్నేశ్వరుని కొలువు – ‘అయినవిల్లి’ని చూడు..!
సత్యదేవుని నెలవు – ‘అన్నవరము’ను చూడు..!
నారసింహుని చూడు, భీమేశ్వరుని చూడు..!
ముక్కోటి దేవతలు ముద్దాడు సీమ..!
చరణం-3:
నన్నయార్యుని చూడు… రాజరాజుని చూడు…
నవ్యాంధ్ర యుగకర్త.. కందుకూరిని చూడు…
ఆంధ్ర కేసరి చూడు… అల్లూరినిదె చూడు…
మహానీయులెందరికో.. మనసైన సీమ…!
చరణం-4:
పాపికొండలు చూడు… పూల కడియము చూడు..!
సాగరమ్మును చూడు…కోరింగ చూడు..!
కాటను కరుణ చూడు… గోదావరిని చూడు..!
అన్నపూర్ణగా మెలగు నవధాన్య సీమ..!
చరణం-5:
రాష్ఠ్రమే కీర్తించు రమ్య చరితను చూడు..!
దేశమే గర్వించు నవ్య ఘనతను చూడు..!
విశ్వమే హర్షించు విజ్ఞానమును చూడు..!
వేయేల? మా సీమ ఇల స్వర్గసీమ..!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

వృత్తి ఇంగ్లీష్ లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలమూరు, తూర్పు గోదావరి జిల్లా. ఇంతకు ముందు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో హైదరాబాద్ లో పని చేశాను. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జన్మస్థలం. తండ్రి గారు కీ.శే. నూజిళ్ళ లక్ష్మి నరసింహ గారు ప్రముఖ గేయ రచయిత. వారే స్ఫూర్తి. తల్లి గారు కీ.శే. శ్రీమతి సత్యవతి గారు. ఈ రంగంలో నా అభిరుచిని ప్రోత్సహించిన వ్యక్తీ. ప్రవృత్తి గేయాలు, కవితలు తెలుగు, ఇంగ్లీష్ లో రాయటం, పాడటం. ముఖ్యంగా గోదావరి యాసలో,జానపద శైలిలో పాటలు రాయడం. “ఆయ్..మేం గోదారోళ్ళమండి.. “ ప్రాచుర్యం పొందిన గేయం. గత రెండు దశాబ్దాలకు పైగా రాస్తున్నాను. 1500 కి పైగా గేయాలు రచించాను.
