నిష్కల – 1 

– శాంతి ప్రబోధ

‘మనకున్నది ఒకటే పుట్టుక .
ఒక్కటే మరణం.
ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం .

ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో..

మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు..

మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ..

ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం?

మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ ..

ఎంత జాగ్రత్తగా ఉన్నా .. ఆ సెగ తాకుతూనే..

ఎన్ని ఏరి పారేసినా..  ముళ్ళు హృదయంలో గుచ్చుకుంటూనే ..

కొత్త దారులు వేసుకుంటూ పోతున్నా ఆ బాటలో చొరబడిన మంటలు  మనసుని మండిస్తూనే ..  మసి చేస్తూనే ఉన్నాయి

ముళ్ళు రూపాలు , మార్గాలు మార్చుకుని దూసుకొస్తూనే ఉన్నాయ్ . దారికడ్డం పడి గుచ్చుకుంటూనే ఉన్నాయి.

రక్తమోడుతూ  ముందుకు సాగడమెలా అని ప్రశ్నలు రేపుతూనే ఉన్నాయ్ .

ఏమిటమ్మా .. ఈ జీవితం ?

అస్సలు అంతు చిక్కడం లేదు .

కుటుంబం , కులం , మతం , ప్రాంతం , దేశం దాటివచ్చి  విశాలప్రపంచంలో విహరిస్తున్నామని విర్రవీగే మనుషులలో విశాలత్వం ఏదమ్మా ..?

తన లోపలి సంకుచితత్వం , స్వార్ధం , ఈర్ష్య , అసూయ , హింస , ఆధిపత్యం పోకపోతే విశాలత్వంలోకి వెళ్లినట్లు ఎట్లా అవుతుంది ..?

కొత్త ప్రపంచపు పోకడలు పోతే సరిపోతుందా ..

నూతనత్వంతో  ఆలోచనలను, భావనలను పండించుకోవాలి గదా ..

మనిషిలోని సున్నితత్వం మిగుల్చుకోవాలికదా ..

రూపాయల్ని డాలర్లుగా మార్చి తెచ్చుకున్న గొప్ప గొప్ప డిగ్రీలు,  జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం .. అంతస్తూ .. హోదా .. ఓహ్ .. ఎంత ఉంటే ఏం లాభం.. ?

హూ .. మనిషితనం పోయాక , వ్యక్తిగా చచ్చిపోయాక ..

అమ్మా .. ఇదేంటి ఇట్లా మాట్లాడుతోందని ఆశ్చర్యపోతున్నావా ..

ఏంటో .. ఈ వేళ నాలో అగ్ని పర్వతం బద్దలైనట్లుంది. లావా పొంగుతూన్నట్లుంది.

ఆ క్రమంలో..  నీ ముందుకు దొర్లుకొస్తున్న  మాటలివి .

కంగారు పడకు…

నేను బానే ఉన్నాలే ..’

చిన్నగా నవ్వు .. కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్ళీ మొదలుపెట్టింది .

‘నువ్వు చెప్పమ్మా .., విజ్ఞానంతో ఎదిగిన వ్యక్తి ఉన్నతంగా నిలబడాలి కదా .. నిటారుగా కనబడాలికదా ..

కానీ అలా జరగడం లేదే ..

అంతెందుకు .. అతను మనిషిగా వంగిపోవడం నువ్వు చూడనిదా..మీ తరానికి  ఎరుకలేనిదా .. చెప్పు

పక్కనున్న వారి హృదయం ముక్కలు ముక్కలుగా చీల్చేయడం నీవు చూడనిదా.. నీకు అర్ధంకానిదా.. కాదు కదా ..!

అందుకే అన్నానమ్మా ..

మానవత్వం మరచిన మనిషి చచ్చిపోయాడని .

మీ తరం ఏమో కానీ, నా తరం వాళ్ళకి తాను తప్ప మిగతా అందరూ వస్తువులే..

అవసరమైనప్పుడు వాడుకుని ఆ తర్వాత చెత్త కుప్పలోకి తోసెయ్యడమే .. జస్ట్ లైక్ పెన్

అవును, అచ్చం  రీఫిల్ అయిపోయిన పెన్ను విసిరేసినట్లుగానే ..

అలాగే ఉంటున్నారు అధిక శాతం .

మనదేశంలోనే అలాంటి మనస్తత్వాలు ఎక్కువేమో అనుకున్నానొకప్పుడు  .

వేలమైళ్ల దూరం వచ్చినా అదే మనుషులు అవే ముసుగులు .  అవే మనస్తత్వాలు ..

ప్రాంతాలు మారినా , మాట్లాడే భాష మారినా , వేషం మారినా, తినే తిండి అలవాట్లు మారినా లోపలున్న మలినం మాత్రం వదలట్లేదు చాలా మందిలో.

పైపెచ్చు ఫెవికాల్ కంటే గట్టిగా అతుక్కుపోయి ఉంటుంది లోపల్లోపల.

అదంతా తమతో పాటే మూటకట్టుకు తెచ్చుకున్నారు కదా ..!

తరతరాల ఆస్తిలాగా కాపాడుకోవలసిందిగా భద్రంగా దాచుకుంటారు తప్ప,  కడుక్కునే ప్రయత్నం చేయరు .

శుభ్రమైన రోడ్లలో తిరుగుతూ , అందాల భవనాల్లో నివసిస్తూ లోపలి మలినాల్ని  రకరకాల ముసుగులతో  చాలా గొప్ప గొప్ప పేర్లతో సమయోచితంగానో , అసందర్బంగానో నలుగురిలోకి వదులుతుంటారు . ఆ ప్రవాహాల్లో పడి కొందరు  ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు . తామేమిటో తేల్చుకోలేక , తమక్కావలసిందేమిటో అర్ధంకాక తన వైఫల్యాలన్నిటికీ కారణం ఎదుటివారేనని వాళ్ళమీదకు నెపం తోసేస్తుంటారు .

అదెంత వరకు సమంజసం అమ్మా ..

ఇప్పుడు నా మాటలు వింటుంటే , అనవసర విషయాల్లో జోక్యం చేసుకోక, ని బుర్ర ఆరోగ్యం పాడుచేసుకోక నీ పనేంటో నువ్వు చూసుకో అని నాకు క్లాసు పీకాలనిపిస్తుందా ..

హ్హా .. హ్హా .. నాకు  తెలుసులేమ్మా ..  నువ్విక్షణాన అట్లాగే ఆలోచిస్తుంటావని ..

కానీ , ఎలా అమ్మా..

యూజ్ అండ్ త్రో లను భరించడం?  ఎదుటి వారిని దోషిగా నిలబెట్టే వారిని సహించడం ?

నువ్వేమో .. భూదేవికున్నంత ఓపిక తెచ్చుకోమంటావ్ ..

తనని అస్తిత్వానికే ప్రశ్నగా మారుతున్న చెత్త చెదారాన్నంతా భూమి మోస్తున్నదేమో కానీ నాకంత ఓపిక లేదమ్మా .. ఇదంతా భరించడం నా వల్ల కావడం లేదు..

పరమపద సోపానం చేరాలంటే ఏమైనా చేయొచ్చు.  తప్పు కాదు అనుకునే తీరుని తట్టుకోలేక పోతున్నానమ్మా ..

తన వాళ్ళ కంటే , తన వ్యక్తిగత లాభానికే, వ్యక్తిగత ఎదుగుదలకే విలువ ఇచ్చే మనుషుల మధ్య మెసలడం చాలా కష్టంగా ఉంది .

నమ్మి వచ్చిన వాళ్ళను నడి సముద్రంలో తోసేసో , పీక నులిమేసో ఘన కార్యం చేసినట్టు కాలర్ ఎగరేసుకు తిరిగే వాళ్లను చూస్తుంటే పరమ రోతగా ఉంది .  చంపి పాతరేయ్యాలన్నంత కోపంగానూ ఉంది .

అలాంటి వాళ్ళ మధ్య ఇమడలేక నాలో చెలరేగే తుఫాను ఆటుపోట్ల నుండి ఉపశమనం కోసం నీతో ఈ మాటలు .

మరెవరితో పంచుకోను .. నీతో తప్ప .

నీవేగా , నా బెస్ట్ ఫ్రెండ్ .

అవునమ్మా .. ఇప్పుడేకాదు , ఎప్పుడూ.. ఎప్పటికీ  నీవే నా బెస్ట్ ఫ్రెండ్ .

అమ్మా .. స్నేహం పట్ల , ప్రేమ పట్ల , పెళ్లి పట్ల నీతి నిజాయితీ లోపిస్తే … అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడుతుంటే వాడినేం చెయ్యాలమ్మా ..?

నీకూ అనుభవమేగా .. ఏం చెయ్యాలో చెప్పు ..

ఆఫ్ కోర్స్ , నువ్వు ఆనాడున్న పరిస్థితులకి , నేటి పరిస్థితులకీ చాలా వ్యత్యాసం ఉండొచ్చనుకో ..

దాదాపు పాతికేళ్ళు , జీవితపు లోతుపాతులు తెలియకుండా అంతులేని ఆనందం ఒప్పచెప్పావు.

గత నాలుగేళ్లుగా  నా చిన్ని ప్రపంచంలోంచి బయటి కొచ్చి కళ్ళు విప్పార్చుకుని లోకాన్ని చూస్తున్నానా .. ఇంత కాలం నాకు తెలియని, నేను చూడని  మనిషి విశ్వరూపం అగుపిస్తున్నది .  అది చూస్తుంటే దిగులు ముంచుకొస్తున్నది .

ఒక్కోసారి ఈ మనుషులనుంచి దూరంగా పారిపోవాలని కూడా అనిపిస్తున్నది ..

అమ్మా నాకు తెలియక అడుగుతున్నాను .. మనుషులందరూ ఇట్లాగే ఉంటారా .. ?

లేకపోతే నా ఎరుకలో ఉన్నవాళ్లే , నా ముందున్న వాళ్లే అలా ఉన్నారా .. అలా తయారయ్యారా ..?

లేకపోతే నేనే వేరుగా ఆలోచిస్తున్నానా ..?

లోపం వాళ్లలో ఉందో, వాళ్ళని, లోకాన్ని అర్ధం చేసుకోవడంలో నేనే  పొరబడుతున్నానా .. వెనుకబడిపోయానా .. తికమకపడిపోతున్నాను .

నా ఆలోచన , వివేచన సరైన దారిలోనే నడుస్తున్నదని నా మనసు చెబుతున్నది .

మళ్లీ అంతలోనే సుడిగాడ్పులేవో .. చిందరవందరగా మార్చేస్తూ .. అలసట కలిగిస్తూ ..

నేనేం చేయనూ ..

ఈ క్షణంలో నీ ఒడిలో తల వాల్చాలని ఉంది. నన్ను దగ్గరకు పొదువుకున్న నీవు తల నిమురుతూ నిషి తల్లీ అలా కాదురా .. అంటూ అనునయిస్తూ చెప్పే మాటలు నాలో ఇముడ్చుకోవాలని  ఉంది ..

నీ కంఠంలోని మార్దవం , నీ స్పర్శలోని వెచ్చదనం నాకెంత శక్తినిస్తాయో నీకు తెలీదమ్మా ..

నవ్వకమ్మా .. అది నిజం . నాకు మాత్రమే తెల్సిన నిజం . ‘

చేతిలో ఉన్న మొబైల్ లోంచి బేలగా వినిపిస్తున్న కూతురు నిష్కల మాటలు శోభకి ఏమీ అర్ధం కావడంలేదు .

గలగల పారే సెలయేరులాంటి నిష్కల తనతో ఎప్పుడూ ఇంత దిగులుగా , ఏదో కోల్పోయిన దానిలాగా మాట్లాడలేదు.

ఇంత బేలతనం ఆమె నోటినుండి ఎప్పుడూ వినలేదు .

సమస్య ఏదైనా దూకుడుగా  ముందుకు ఉరకడమే తెలుసు.

అటువంటిది ఇప్పుడు … దాని పసి మనసుకు ఏదో పెద్ద గాయమే అయి ఉంటుంది.  ఏమై ఉంటుంది ?

ఆలోచనలు దారీ తెన్నులేకుండా సాగుతున్నాయి శోభలో .

విశాలంగా పరుచుకున్న చల్లని వెన్నెల, పొలాలమీదుగా వచ్చే పైర గాలులు  ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఆమెకు ఏమీ ఆనందం కలిగించడం లేదు . అసలు ఆ వాతావరణాన్ని ఆస్వాదించే స్థితిలో లేదు శోభ .

కూతురు నిష్కల మాటలే ఆ తల్లి మనసులో చీకటి తుఫాను సృష్టిస్తున్నాయి .

వీచే పెనుగాలులు , ఎగిసిపడుతున్న అలలతో అల్లకల్లోలమయిన సముద్రంలా ఉన్నదామె .

విషయమేమిటో ఊహకు అందక తల్లడిల్లుతున్న ఒంటరి రైతు మహిళలతో, గ్రామీణ బాల్యంతో పనిచేస్తుంది శోభ .  గత పదేళ్లుగా తాను చేస్తున్న పనిలో సాంత్వన పొందుతున్నది .

ఈ రోజు మధ్యాహ్నం తన హోండా యాక్టీవా వేసుకుని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపల్లెకు వెళ్లి పిల్లల సంఘం వారితో కాసేపు గడిపి  వెనుదిరిగి వస్తున్నది,

మార్గమధ్యలో ఆగి పడమటెండలో కనిపిస్తున్న పల్లె పడుచుల శ్రమ జీవన చిత్రాలను తన మొబైల్ లో బంధిస్తూ నిషి ఇవ్వాళ ఫోన్ చేయలేదేమిటో .. అనుకుంది .

తాను బంధించే ప్రకృతిని చాలా సార్లు కూతురికి బట్వాడా చేస్తుంది.

తల్లి పంపిన ఫొటోలు చూసి, ఓ.. నీ మూడో కన్ను చాలా మెరుగైందే..  ఆ దృశ్యం చాలా బాగుంది.  నేనూ నీతో మన ఊళ్లలో తిరుగుతున్నట్లుంది అంటూ రకరకాల కామెంట్స్ పెడుతుంటుంది నిష్కల.

సాధారణంగా తాను పనికి బయలుదేరుతూ డ్రైవింగులో తల్లితో  మాట్లాడుతూ ఉంటుంది నిష్కల .

ఆ రోజింకా ఫోన్ రాలేదు.  ఫోన్ చేసే సమయం కూడా దాటిపోయింది.

బిడ్డతో ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో వెలితిగా అనిపిస్తుంది శోభకి.

కారణమేమిటో ఆలోచిస్తూ టూ వీలర్ ఆన్ చేయబోతుంటే ఏదో మెస్సేజ్ వచ్చిన బీప్ చప్పుడు బాగ్ లో ఉన్న ఫోన్ లోంచి వచ్చింది

తర్వాత చూద్దాంలేమనుకొని బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలింది శోభ.

ఇంటికి వచ్చాక వంట చేసుకుంటూ ఆ విషయమే మరచిపోయింది.

మధ్యలో కాసేపు చెల్లెలుతో ఫోన్ మాట్లాడింది.   రైతు మహిళతో మాట్లాడింది.

మంచంలో ఉన్న అత్తకి అన్నం పెట్టింది.

ఆవిడ తిని చేయి కడుక్కుంటూ నీ ఉసురే తగిలింది అన్నది. ఆ వెంటనే నీళ్లు రాని కళ్ళను చీర చెంగుతో వత్తుకున్నది.

ఆ అత్తాకోడళ్ళకి అది రోజు అలవాటైన దృశ్యమే.

అన్నం ప్లేటులో పెట్టుకుంటుంటే చార్జింగ్ పెట్టిన ఫోన్ బీప్ శబ్దం వినపడింది.

అదిగో అప్పుడు గుర్తొచ్చింది.  అంతకు ముందు వచ్చిన మెసేజ్.

వెంటనే ఫోన్ తీసుకు చూసింది.

అది కూతురు నుండి వాట్సాప్ లో వచ్చిన మెసేజ్.

ఆశ్చర్యంగా ఉందే..

మాట్లాడడానికి ఇష్టపడే కూతురు మెసేజ్ పెట్టిందేవిటబ్బా ..  ఒక వేళ బిజీగా ఉందేమో .. అనుకుంది .

సాధారణంగా అయితే , ఎంత బిజీగా ఉన్నప్పటికీ  రెండు ముక్కలయినా తల్లితో మాట్లాడి పెట్టేస్తుంది నిష్కల .

నీ గొంతు వినకపోతే , నీతో మాట్లాడకపోతే ఆ పూట నేనేదో కోల్పోయినట్లుగా ఉంటుందమ్మా  అంటుంది.

రెండు మూడురోజులకయినా వీడియో కాల్ చేస్తుంటుంది  నిష్కల.

అలాంటిది..   ఇదేంటి .. కొత్తగా ..

బహుశా మాట్లాడలేని వాతావరణంలో ఉండడం వల్ల ఫోన్ చేయలేకపోతున్నానని వాయిస్ మెసేజి పెట్టి ఉంటుందని తలపోసిన శోభ ఆనందంగానే వాయస్ మెస్సేజ్ తీసుకుంది .

పిచ్చి పిల్ల .. అమ్మ ఎదురుచూస్తుంటుంది తన ఫోన్ కోసం అని ఈ మెస్సేజ్ ద్వారా తన గొంతు వినిపిస్తున్నది  ఆడియో మెస్సేజ్ చూసి అనుకుంది శోభ.

చిత్రంగా  ఆ మెస్సేజ్ కేసి చూస్తూ ,   ఆడియో మెస్సేజ్ ఆన్ చేసి అన్నం తినడం మొదలు పెట్టింది శోభ.

వింటున్న శోభ గొంతులోకి ముద్ద దిగడంలేదు .

ఉరుములేని పిడుగుల్లా వచ్చి కురిసే కొండపోత వర్షం భీభత్సం సృష్టిస్తున్నది  ఆమె హృదయంలో

ఆమె జవసత్వాలను బొక్కెనేసి తోడేస్తున్నట్లుగా ఉంది .  ఊపిరి స్తంభించి పోతున్నట్లుగా అయింది .

ఆమె చుట్టూ ఆవరించిన శూన్యం నుండి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నది .

స్థంభించిన శ్వాస తిరిగి తన పని తాను చేసుకుపోతున్నప్పటికీ కూతురి మాటలు ఆమెను చిగురుటాకులా వణికిస్తూనే ఉన్నాయి.

ఏమైంది .. ? నా బంగారు తల్లికి  ఏమైంది ?

ఏదో పెద్ద కష్టంలో ఉన్నట్లుగా చాలా బరువుగా మాట్లాడుతున్నది .

ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ నలుగురిలో సులభంగా కలిసిపోయే నిష్కలకి ఏమైంది .. ?

వేల మైళ్ళ దూరంలోని నిష్కల ముఖమే శోభ కళ్ళముందు కదలాడుతున్నది.

పూర్ణబింబంలా వెలిగిపోయే ఆ మొహంలో ఉన్న అగాధాలు ఏమిటో అర్ధం కాలేదు ఆమెకు.

ప్రతి రోజూ ఏదో ఒకసమయంలో తనతో  మాట్లాడే  నిష్కల  వాయిస్ మెసేజ్ పెట్టడమే ఆశ్చర్యం అనుకుంటే వినవస్తున్న మాటలు ఆ తల్లి హృదయాన్ని భారంగా మార్చేశాయి.

తన చేతులతో బిడ్డని దగ్గరకు తీసుకుని , గుండెలకు హత్తుకుకుని  విషయం ఏదైనా బిడ్డకు భరోసా ఇవ్వాలని తల్లి మనసు తహతహ లాడింది .

అసలేం జరుగుతున్నది .. ?

హృదయంలోంచి సూదుల్లా మొలుచుకొస్తున్న ప్రశ్నలవర్షాన్ని అలాగే అదిమిపట్టింది.  ఇంకా ఏమి వినాల్సి వస్తుందేమోనని గుండెను అదిమి పట్టుకుని శక్తిని కూడదీసుకుంటూ వింటున్నది .

ఆ మాటలతో శోభ మొహం పాలిపోయింది .   తల గిర్రున తిరుగుతున్నట్టుంది.

ఆ మాటలు అర్ధమయ్యి అవనట్లుగా ..

‘ ఎంత దగ్గర మనుషులకయినా అభిప్రాయాల్లో అనంతమైన దూరాలుండొచ్చు. అది సహజమే కదా ..

ఏ ఇద్దరూ ఒకే తీరుగా ఆలోచించలేరుగా …

భిన్నాభిప్రాయాలు ఉన్న చోట అవతలివారి అభిప్రాయాలను గౌరవిస్తూ పరస్పర మర్యాదలు కాపాడుతూ ముందుకు పోవచ్చు..

పక్కపక్కనే ఉంటూ ఆ ఇద్దరి మధ్య ఆలోచనల  దూరాన్ని ప్రేమించవచ్చు.  అలా

మనసులు విశాలమవుతూంటే స్వేచ్ఛ సమానతలుల్లోంచి వచ్చే నమ్మకం బంధాలను బలీయంగా  మారుస్తుందేమో …

కానీ ..  కానీ.. చేరగాల్సిన హద్దులు పెరిగితే ..  ప్చ్.  ప్చ్ ..

హూ .. …

నీ దగ్గరకి రావాలని అనుకున్నానమ్మా …

వచ్చి నీ పక్కన కూర్చునో..  నీ ఒడిలో తల పెట్టుకునో.. సేద తీరాలనుకున్నా ..

నా ఎదలోతుల్లో కప్పెట్టిన విషయాలెన్నో నీ ముందు విప్పుకోవాలనుకున్నా..
ప్చ్ .. ఏం చేద్దామమ్మా .. అనుకోని  అతిథిలా వచ్చిన కోవిడ్ 19 తిష్ట వేసుక్కూర్చుంది. కదలనని మొండికేస్తున్నది .
ఇంకెక్కడా..
ఎక్కడివారక్కడే .. గప్ చిప్

చూద్దాం .. కాలం ఎటు మోసుకుపోతుందో .. ‘

కొన్ని క్షణాల మౌనం తర్వాత

‘అమ్మా ..

తనకు లొంగకపోతే , వంగకపోతే , చిత్తం ప్రభూ అనకపోతే ..నిర్ధాక్షిణ్యంగా  కాళ్ళకిందేసి తొక్కుకుంటూ పోవాలనుకుంటుంది కదమ్మా ఈ లోకం .

అఫ్ కోర్స్ ..  విషయం నాకంటే నీకు బాగా తెలుసు
అయినా నువ్వు లొంగావా .. వంగావా .. లేదే .. ఎదురొడ్డి నిలిచావు .

ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా .. బీయింగ్ యువర్ చైల్డ్ .

మ్మ్..  మ్మ్.. ‘

చిన్నగా ముద్దు ఇచ్చిన చప్పుడు

ఇదో వెర్రి మాలోకం . అమ్మంటే వెర్రి ప్రేమ .  ఇంకా అమ్మ అంటే ఎట్లా తన సంసారం తనకయ్యాక, ఒకవేళ అతనితో ఏమన్నా సమస్యా .. ? మనసులో చిన్న అనుమానం మొదలైంది శోభలో .

‘ఈ జీవితాన్ని గెలవడానికి నీవెంత పోరాటం చేశావో నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నదమ్మా.. .

నీ చుట్టూ కొండచిలువలా చుట్టచుట్టుకుపోయిన బంధనాల కట్లు తెంపడంలో నీతో నువ్వు , కుటుంబంతో నువ్వు, కులంతో నువ్వు , మతంతో నువ్వు , సమాజంతో నువ్వు ఎంత సంఘర్షించి ఉంటావో , ఎంత సంవేదన అనుభవించి ఉంటావో ఊహించగలను .

నువ్వు నువ్వుగా బతకడం కోసం నీవెన్ని బంధనాలు చేధించావో , మరెన్ని ముందడుగులేశావో నిన్ను అనుక్షణం గమనించే నాకు అప్పట్లో సరిగా అర్ధం కాలేదు కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నదమ్మా ..

నీ నడకే నీకు తెలియని నీలోని శక్తి అని ఎదుగుతున్న క్రమంలో అర్ధం చేసుకోలేకపోయినా నేటికి నిన్ను పూర్తిగా అర్ధంచేసుకునే పరిణతి వచ్చిందమ్మా..

వలకు చిక్కిన గాయాలే , హృదయం మీద పడే సమ్మెట దెబ్బలే వాస్తవంలోకి తొంగిచూసి జీవితానికి సానపెట్టుకునే పరిస్థితులు కల్పిస్తాయేమో కదమ్మా ..

బహుశా కొన్ని సంఘటనలు  జీవితంలోకి తొంగి చూడకపోతే , అడుగుపెట్టకపోతే భ్రమల్లోనే .. ఒట్టి భ్రమల్లోనే ఉంటూ, వాటినే వాస్తవాలని పొరపడుతూ బతికేస్తుంటామేమో.. !

అమ్మా ..  నిజాలను బట్టీ , వాస్తవాలను బట్టీ మనోభావాలు మారిపోతాయి కదా.. కానీ ఎదుటివారి మనోభావాలను బట్టి నిజాలు మారిపోవు కదా ..

నిజాన్ని పదిమంది ముందు అబద్దంగా మార్చేసి అందరూ అబద్దాన్నే నిజంగా ప్రచారం చేస్తే , నిజం ఒంటరిదై పొతే ..

నిజం నిజం కాకుండా పోతుందా .. అబద్దం అబద్ధం కాకుండా పోతుందా .. ? !

ప్రతి మాటలో , ప్రతి చేతలో రంధ్రాన్వేషణ చేసి  తప్పులు వెతికే పని తప్ప ఎదుటివారి మంచిని, తెలివిని, సంస్కారాన్ని, విలువల్ని  ఏమాత్రం అంగీకరించలేని స్థితిలోని మనుషులున్నచోట,  ప్రేమపూర్వకమైన చూపు, మాట లేని చోట ,   చిన్న చిన్న ప్రశంసలు, అభినందనలు కూడా కరువైన చోట    నిస్సార మైన జీవితంలో ఎవరైనా ఎంతకాలం సర్దుకుపోగలరు ?  ఆ ఎడారిలో ఎంతకాలమని బానిసలాగా బతకగలరు ?

అసలు ఒకరి బతుకు మరొకరికి బానిసగా ఎందుకు మారాలి ..?

కొందరిని చూస్తే జీవితం దెబ్బతీయడానికి ముచ్చటపడుతుందేమో ..?!
ఏ ఆహ్వానం లేకుండా వచ్చి ముందు వాలుతుంది .  వేలుపట్టుకుని నడిపిస్తుంది . ఒక్కోసారి గాయాలపాలు చేస్తుంది .  నెత్తినెక్కి తైతక్కలాడుతుంది .
అంతవరకూ అయితే ఫర్వాలేదమ్మా ..

గుండెల్లో కూర్చోబెట్టుకున్నవాళ్లకే కత్తినిస్తుంది . గొంతు మీద కత్తి నాట్యం చేస్తుంటే వికటాట్టహాసం చేస్తుంది .

అట్లాటప్పుడు సంయమనంతో ఎలా వ్యవహరించడం ?  వేటగాడి వలలలో చిక్కిన పక్షి సంయమనంతో ఎలా ఉండగలదు ? విలవిలలాడిపోతూనే వేటగాడి ఉచ్చులోంచి తప్పించుకునే మార్గాలు యోచిస్తుంది కదా ..

నువ్వు చెప్పమ్మా ..

నాకెన్ని ఊహల రెక్కల నిచ్చావు .
వచ్చిన ప్రతి రెక్కకీ నీదైన పోషణ చేశావు. ఎంత భద్రంగా చూసుకున్నావు . ఇన్నాళ్లూ  ఆకాశంలో ఎగిరే విహంగంలా స్వేచ్ఛగా ఎగరగలిగానంటే అది నీ చలువే కదమ్మా …

అలా స్వేచ్ఛగా ఎగిరే రెక్కల్ని ఆడపిల్ల కత్తిరించేయ్యాలట .

తనకు తాను కత్తిరించేసుకోవాలట . ఎలా ..?

అలా కత్తిరించుకోవడం ఎంత కష్టం .. అలా చేయాలంటే ఆమెతో ఆమె ఎంత యుద్ధం చెయ్యాలి .. ఊ .. చెప్పు .

కాదు .. కూడదు అంటే తానే గొంతు కత్తిరిస్తాడట

రెక్కలను కత్తిరించుకుంటూ .. దేహంలో దొర్లుతున్న గాయాలకు లేపనం పూసుకుంటూ  ఎన్నాళ్ళు సాగుతుంది ..

రెక్కలిరిగి గాయాల బాధతో భారంగా కదులుతున్న కాలానికి నువ్వు మాట్లు వేసుకున్నావ్ .  నీదైన రూపాన్ని ఇచ్చుకున్నావ్ .

ఇప్పుడు నాకూ ఆ శక్తినిచ్చావ్ .. నీవే ఇచ్చావమ్మా ..

ఏమిటీ .. ఎలా అని ఆశ్చర్యపోకు .

అది నిజం .

అలవి కాని ఆలోచనలతో అలసిపోయిన క్షణాన .

ఒక్క ప్రశ్న , ఒకే ఒక్క ప్రశ్న నన్ను తట్టిలేపి నిలబెట్టిందమ్మా ..

ఇదేనా .. పాతికేళ్లలో నువ్వు నీ తల్లి నుంచి నేర్చుకున్నదని నువ్వేసిన ఆ ప్రశ్నే వంగిపోయిన నన్ను లేపి నిలబెట్టిందమ్మా  ..

మెత్తగా ఉంటే మొట్టేస్తారు . బుసకొట్టాల్సినప్పుడు బుసకొట్టాలని అనుభవంతో చెప్పే నీ మాటల్లోని అంతరార్ధం ఇప్పుడు అర్ధమైందమ్మా.

విరిగిన రెక్కల్ని అతికించలేనేమో కానీ రెక్కలు లేకుండానే ఎగరడమో కొత్త రెక్కలు మొలిపించడమో చేయగలననే నమ్మకం వచ్చిందమ్మా ..

థాంక్ యూ సో మచ్ అమ్మా ..  థాంక్ యూ సో మచ్

ఐ లవ్ యూ అమ్మా ..

ఎంత గాయాల మయమైనా .. ఎంత కష్టమైనా నువ్వు మళ్ళీ పుట్టలేదూ .. మళ్ళీ మొదలు పెట్టలేదూ ..

మై బ్రేవ్ అమ్మా

ఐ  లవ్ యూ అమ్మా ..

ఐ మిస్ యూ అమ్మా  ‘ చిన్నగా ముద్దు ఇచ్చిన శబ్దం తర్వాత ఆడియో ఆగిపోయింది .

ఆఖరి మాటలు విన్నాక శోభలో  కొద్దిగా చైతన్యం వచ్చింది కానీ లోపల గుబులు పోలేదు .  భయం వీడలేదు .

అంటే .. ఇన్నాళ్లూ నిష్కల  ..కష్టాల కొలిమిలో ఉన్నదా ..

భారమవుతున్న గుండెనదిమిపెట్టుకుని మళ్ళీ మళ్ళీ విన్నది శోభ  .

నిష్ఫల మాటల్లో ఒక క్రమం లేదు . చాలా కన్ ఫ్యూజన్ కనిపిస్తున్నది .  ఏదో ఒక నిర్ణయానికి వచ్చే ముందటి తికమకలా ఉంది .

ఆ గొంతులోని భావోద్వేగాల్లో తేడాను బట్టి ఆ ఆడియో పాజ్ ఇస్తూ చేసినట్టుగా అనిపించింది శోభకి.

విషయం ఏమిటో స్పష్టంగా చెప్పకుండా మర్మ గర్భంగా  మాట్లాడింది.  స్వేచ్ఛగా మనసులోని భావాలను వెలిబుచ్చే బిడ్డ ఎంత మానసిక ఘర్షణ అనుభవిస్తే ఈ మాటలు వచ్చివుంటాయో ఆలోచిస్తున్నది  శోభ  .

నిష్కల చెప్పినంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నది ఆమె .

తల్లి నుండి స్ఫూర్తి పొందుతున్న బిడ్డని చూసి సంతోషించాలో , బాధపడాలో తెలియని అయోమయం కమ్మేసింది శోభని .

కళ్ళు మూసుకు కూర్చుంది .  అంతా చీకటిగా ఉంది .

ఆ తల్లి కంటి బావుల్లోంచి నీరు ఊటలు ఊరిపోతున్నది .

గత జీవితకాలంలో బట్టబయలయిన కన్నీటి బావులను మూసేసాననుకుంది ఇన్నాళ్లూ ..

కానీ,కనురెప్పల కింద నుంచి జారే జలపాతాల్ని ఆపగల, కట్టడి చేయగల శక్తి ఆ క్షణంలో ఆమెకు లేకపోయింది .

గుండెల్లో గునపాలు దిగినంత బాధగా ఉన్నది .

మోడువారిన ఆమె హృదయం ఆలోచనలు చిగురింపచేసే ప్రయత్నంలో..

ఇటునించి అటు అటునించి ఇటు పరుగులు పెడుతూ సుడిగాలిలా సుడులు తిరిగుతూ సాగుతున్నాయి ఊహలు  .

మూడేళ్ళ క్రితం తనను తానుగా అభిమానించే వ్యక్తి , అర్ధం చేసుకునే వ్యక్తి గురించి చెప్పినప్పుడు అలాటి వ్యక్తిని దూరం చేసుకోవద్దని తల్లిగా సలహా ఇచ్చింది .  అతనితో బంధం ఏర్పరచుకుంది .  అసలతను ఎలాంటి వాడో .. తానింత వరకు చూడలేదు .  వీసా కారణాల వల్ల రాలేకపోతున్నాడని చెప్పింది నిషి .

అతనేమైనా.. ఇంకా ముందుకు ఊహించలేకపోతున్నది శోభ .

నేనే ఇట్లాయితే అవతల బిడ్డ ఎట్లా ఉందో .. దూరతీరాల్లో ఎంత వేదన అనుభవిస్తున్నదో ..

నేను ధైర్యం తెచ్చుకోవాలి .  పరిస్థితులు ఎలా వున్నా నిష్కలకు నేనున్నానని భరోసా ఇవ్వాలి .

మోడువారిన చెట్లు చిగురిస్తాయని , పచ్చగా పలుకరిస్తాయని , రంగురంగుల పూలతో , పళ్లతో అలరిస్తాయని చెప్పాలి . ఆ చెట్లపై అనేకానేక జీవరాశులు ఆశ్రయం పొందుతాయని అదే జీవితం అని బిడ్డకి చెప్పాలని ఆత్రుత పడింది ఆ తల్లి .

తుఫాను వచ్చి వెళ్ళాక తీరం స్తిమితపడడానికి చాలా సమయం పడుతుంది . శోభ  స్థితీ అంతే ..

ఊటలూరుతున్న కంటిని వత్తుకుంటూ కూతురికి  వాట్సాప్ కాల్ చేసింది .

అవతల నుండి కాల్ తీసుకోలేదు .

సమయం చూసింది . తనకి రాత్రి తొమ్మిది .

అంటే నిషికి ఉదయం పదిన్నర.

ఆఫీసుపనిలో ఉండి ఉంటుంది  . తనతో మాట్లాడడానికి ఇది సరైన  సమయం కాదని తన ప్రయత్నం మానుకొన్నది శోభ.

‘నా చిట్టి తల్లీ ..

నువ్వన్నట్టు జీవితం  చాలా చిన్నది . ఆనందం ఎంతో అరుదుగా దొరికేది.

దాన్ని అందంగా , ఆనందంగా మలుచుకునే శక్తి నీకుంది. నీకే ఉంది.

నీ మనసుకు సంతోషాన్నిచ్చే దేన్నైనా దక్కించుకునే ఏ చిన్న అవకాశమున్నా దానికోసం రిస్కు తీసుకో.

ఫ్రీ అవగానే ఫోన్ చేయి ‘  మెస్సేజ్ పెట్టింది

అన్నం ముద్ద లోపలికి దిగడం లేదు .  కంచం తీసేసి వంటగదిలోకి వెళ్లి

గది సర్ది హల్ లోకి వచ్చి టీవీ పెట్టింది .

ఏ ఛానల్ మార్చినా వచ్చే వార్తలు .. చూడాలనిపించలేదు ..

సీరియల్స్ చూసే అలవాటు లేదు . టీవీ కట్టేసింది .

చేతిలోకి  మొబైల్ తీసుకుంది.

మిత్రురాలు ఫార్వార్డ్ చేసిన  వీడియో మెస్సేజ్ ఓపెన్ చేసింది .

అది ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం గురించి.

ప్రభుత్వ నిర్బంధాన్ని , ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా లక్షలాదిమంది రైతులు దేశ రాజధానిని ముట్టడించి కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలని రద్దుచేయమంటూ రోజుల తరబడిగా గొంతెత్తి నినదిస్తున్నారు .

దాని తర్వాత వచ్చిన మరో వీడియో తెరిచింది.

రైతు ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ కు చెందిన డెబ్భై ఐదేళ్ల రైతు మహిళ, మరి కొంత మంది రైతు మహిళలతో కలసి జీప్ నడుపుకుంటూ దేశరాజధాని రావడం శోభను విపరీతంగా ఆకర్షించింది .  తమ డిమాండ్స్ సాధించడం కోసం ప్రభుత్వంతో తలపడడానికి సిద్ధపడిన వారి తీరు అందుకు కారణం.

అది మహిళల సామర్ధ్యాన్ని చాటి చెబుతున్నట్లుగా తోచింది . ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నట్టు అనిపించింది . ఆ వెంటనే రోజూ తాను చూసే ఒంటరి రైతు మహిళలు కళ్ళముందు మెదిలారు .   పంజాబీ రైతు మహిళకున్నంత ఆర్ధిక స్థోమత వీళ్లకు లేకపోవచ్చు . కానీ బతుకును ముందుకు నడిపించే స్థైర్యం , ధైర్యం వీళ్లకీ ఉన్నాయి . లేకపోతే జీవితకాలం తోడుంటానన్నవాడు కష్టాల కడలిని ఈదలేక తనదారి తాను చూసుకుంటే ఆమె అదే పని చేయడంలేదే ..

నడిసముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నదంటే అదేమీ సామాన్య విషయం కాదు.

వాళ్ళ కష్టాల ముందు తమ ముందు నిలిచిన సమస్యలు, కష్టాలు  ఏవైనా చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. సులభంగా పరిష్కరించుకో దగినవిగా అనిపిస్తున్నాయి.

సామాజికంగా, ఆర్ధికంగా , విద్యాపరంగా , ఆరోగ్యపరంగా అన్నివిధాలా ఆ గ్రామీణ ఒంటరి రైతు మహిళలు తమ కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నారు.

కానీ వాళ్ళు జీవితాన్ని చూసే తీరు చాలా గొప్పగా ఉంది . తమ ముందు నిలబడిన జీవితాన్ని ఎలా ఉంటే అలా స్వీకరిస్తూ  నిత్యం పరిస్థితులతో పోరాడే మహిళల్ని చూస్తున్నప్పుడు, ఎప్పటికప్పుడు శోభకు బతుకుపై భరోసా పెరుగుతుంది.

మదిలో పల్టీలు కొడుతున్న రకరకాల ఆలోచనల్లోనే  వెళ్లి పక్క దులుపుతుంటే ఎదుటి గోడ మీద  నిష్కల ఫోటో నవ్వుతూ పలకరించింది .

ఎలా ఉన్నదో నా బంగారు తల్లి.  ఏం చేస్తున్నదో ..

తన ఆవేదన ఏమిటో.. ఎందుకో.. ఎవరు గాయపరచి ఉంటారు నా చిట్టితల్లి హృదయాన్ని..  ఆలోచిస్తూ పడక మీద వాలింది.

నిద్ర పట్టడం లేదు.

ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా   కూతురి గొంతు ఎప్పుడు వింటుందా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్న శోభకి ఆ గడియలు నిండుచూలాలిలా నడకలా ఎంతకీ ముందుకు కదులుతున్నట్లు లేదు.

మాటి మాటికీ సమయం చూసుకుంటునే ఉంది. అది తరగడం లేదు.

లేచి ఎదురుగా ఉన్న నిష్కల ఫోటో తీసి చిన్ననాటి బిడ్డనే మురిపెంగా చూసుకుంది.

భళ్ళున పగిలి ముక్కలై పోయిన కలల కాపురం వెక్కిరిస్తుంటే, మారుతున్న పరిస్థితులకనుగుణంగా తనను తాను నిర్మించుకుంటూ ఒంటి చేత్తో కూతుర్ని పెంచి పెద్దచేసింది. కూతురే లోకంగా బతికింది శోభ.

నిష్కల పెళ్ళయిపోతే నిశ్చింత అనుకుంది.

అమ్మా నీ పెళ్లి, నీ తోడు నీకొక ఛాన్స్. కానీ నాకట్లా కాదమ్మా.. అది నా ఛాయిస్ అని చెప్పే నిష్కల అనుకున్నట్టుగానే తన సహచరుడిని ఎంపిక చేసుకుంది.

కూతురి ఎంపికను మనస్ఫూర్తిగా అంగీకరించింది శోభ.

ఇప్పుడేమయిందో .. బరువెక్కిన గుండెతో ఎంత బాధ మోస్తున్నదో  బిడ్డ ఫోటో గుండెలకు ఆన్చుకుని అనుకున్నదామె .

జీవితమంటే ఒక సమస్యలోంచి మరో సమస్యలోకి ప్రవహించడమేనా..పలువిధాల ఆలోచిస్తూ కూతురి తలపులతో ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది శోభ.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.