
నిష్కల – 8
– శాంతి ప్రబోధ
నిష్కల నడుం వాల్చింది గానీ నిద్రపట్టడం లేదు. అంకిత్ గుర్తొచ్చాడు. అతను వెళ్లి అప్పుడే రెండు నెలలు అవుతున్నది. పదేపదే మెసేజ్ లు పెడుతున్నాడు. వచ్చేస్తానంటున్నాడు.నేను పొమ్మంటే కదా రమ్మనడానికి, అతను రావడానికి. తనకు తానుగా నోటికి వచ్చినట్టు దూషించి వెళ్ళిపోయాడు. అతను దూషించినందుకంటే ఎక్కువగా ఆమెను బాధించింది అతనిలోని హిపోక్రసీ. మాటకి చేతకి ఉన్న వ్యత్యాసం. అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత అతని నీడ భరించలేక పోతున్నది నిష్కల. భావోద్వేగాల నుంచి విడదీసి అతని గుణ దోషాలను ఎంచడానికి ప్రయత్నిస్తున్నది. సహజ ప్రకృతి నుంచి దూరంగా జరిగిపోతున్న అతన్ని అర్ధం చేసుకోవడానికి బుద్దితో, హృదయంతో ప్రయత్నం చేస్తున్నది. అతన్ని రమ్మనడానికి ఆమె మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అట్లాగని అతని మీద ప్రేమ, అతనితో గడిపిన జీవితంలో తృప్తి లేవని కాదు. తను మనుషులకు దూరంగా సంచరిస్తున్నదా.. తెలియని దారుల్లో సంచారం తనకు సమంజసంగానే కనిపిస్తున్నది. అందులో ఎటువంటి ఆక్షేపణ లేదు. అతను తనతో చెప్పిన విశ్వాసాలకి దూరంగా జరగడమే తనలో సంఘర్షణకు, అశాంతికి కారణం అవుతున్నది. అపసవ్య ఆలోచనలు అతనివో లేక తనవో .. ఏదైనా కానీ , తన ప్రేమను, అతనిపై ఉంచిన విశ్వాసాన్ని అపహాస్యం చేసాడు. తమ సహజీవనంలో ఏవైతే ఉండకూడదని అనుకున్నారో అవన్నీ ఒక్కటొక్కటిగా అతనిలో బయటపడుతున్నాయి. దాంతో ఆ ప్రేమ, నమ్మకం బీటలు వారి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందరికీ ఏమో గానీ కరోనా లాక్ డౌన్ తనకు మంచి చేసింది అనుకున్నది నిష్కల. లేకపోతే ఇప్పట్లో అతని అసలు స్వరూపం బయటపడేది కాదేమో.. ఏడాది పైన ఇరవై నాలుగు గంటలూ ఒకే కప్పు కింద కలిసి ఉండడం వల్లనే కదా అతను ఏమిటో పూర్తిగా అర్ధమయింది. మేడిపండు లాంటి అతని స్వభావం బయటపడింది. లేకపోతే ఇద్దరి మధ్య రిలేషన్ ఇంకెంత కాలం కొనసాగేదో.. మనకు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా నిషీ.. అని అప్పటికే రెండు మూడు సార్లు ప్రస్తావించాడు. బోసినవ్వుల పాపాయిలంటే ఎవరిష్టం ఉండదు. నాకూ ఇష్టమే అంకిత్. నీకు తెలుసు నా ప్రాధాన్యత ఏమిటో.. తెలిసి తెలిసీ ఎందుకు ఆ ప్రస్తావన తెస్తావ్. ఇక ముందు తేవద్దు అని సున్నితంగా చెప్పేది నిష్కల. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించిన నిష్కలకు కెరీర్ లో నిలదొక్కుకునే వరకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. అందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేదు. పిల్లలు కావాలని బలంగా కోరిక కలిగినప్పుడు ఆ విషయం ఆలోచిస్తానని సహచరుడితో చెప్పింది నిష్కల. అది కాదు నిషీ… ఇరవై నాలుగు గంటలు మన మొఖాలు మనమే చూసుకుని బోర్ రావడం లేదూ… మనకిప్పుడు ఒకరో ఇద్దరో ఉంటే. ఎంత బాగుంటుంది. జీవితం ఎంత ఉత్సాహంగా ఉంటుంది ..!ఎంచక్కా వాళ్ళ ముద్దు మురిపాలతో సమయం తెలియకుండా గడిపేయవచ్చు కదా .. అంటుంటాడు అంకిత్. ఎన్నిసార్లు ఆమె కాదని చెప్పినా పదేపదే ఆ ప్రస్తావన తేవడం అంకిత్ కి ఆనవాయితీ గా మారింది. ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనడానికి నేను సిద్ధంగా లేనని చెప్పాను కదా.. మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు తెస్తావ్ అని ఓ రోజు విసుక్కుంది నిష్కల. అది కాదు నిషీ.. మా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు నచ్చచెప్పే ధోరణిలో నెమ్మదిగా నసిగాడు. అసలు విషయం అర్ధమయింది నిష్కలకి. అయినా విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అంకిత్ తల్లిదండ్రులు అంకిత్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మాతృదేశం వదిలి అమెరికా వచ్చి స్థిరపడ్డారు. మెరుగైన జీవనోపాధి కోసం, ఆర్ధికంగా ఎదగడం కోసమో, ఊడలేసుకున్న కుటుంబ వ్యవస్థ వదిలి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు వదిలి ఖండాంతరాలు దాటి వస్తూ వస్తూ అక్కడి సామాజిక అలవాట్లను కూడా మోసుకొచ్చారా .. అని నవ్వేసింది నిష్కల. మారిన పరిసరాలు , వాతావరణం అలవాటు పడుతూ తన మూలాల్ని మరచి పోవద్దని తన తాత ముత్తాతల సంస్కృతిని కొనసాగించడానికి తపన పడడం, సామాజిక అవసరాలు ఆ పద్దతిలోనే కొనసాగించడం ఎక్కువైపోతున్నాయి అమెరికన్ ఇండియన్స్ లో అన్నది నిష్కల. ముడుచుకు పోయిన సహచరుడిని చూస్తూ , హలో మై డియర్… వాళ్ళ ఆశలో, నీ బుర్రలో తొలుస్తున్న కోరికలో నాకు తెలియదు. వాళ్ళు కోరుకున్నట్లుగానో, నువ్వు కోరుకున్నట్లుగానో నేను ఉండను. నేను కోరుకున్నట్లుగానే నేను నేనుగానే ఉంటాను. నా చుట్టూ మొలుచుకొస్తున్న గోడలని లెక్కచేయను. బద్దలు కొట్టుకుంటూ పోతూనే ఉంటాను అని నవ్వుతూనే స్పష్టంగా చెప్పింది. అది కాదు .. నసుగుతున్న అతని ఉద్దేశం ఆమెకు స్పష్టంగానే తెలుస్తున్నది. ఈ చర్చ ఇక్కడితో ఆగిపోవాలంటే తను కూడా తన నిర్ణయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలి అనుకున్నది నిష్కల. అయినా నువ్వెంటోయ్.. మన మధ్య ఎలాంటి లెక్కలు, గోడలు ఉండవని ఢంకా కొట్టి చెప్పావ్ .. మళ్ళి ఈ గొళ్ళాలు, ఫిట్టింగ్లు ఏంటి? అన్ని రకాల లెక్కలను, ఆడవాళ్ళ చుట్టూ కట్టే ఎత్తైన గోడలను బద్దలు కొడుతూ ముందుకు పోతా అని మరోసారి స్పష్టం చేసింది నిష్కల. అలా చెప్పినప్పుడు అతని మొహం చిన్నబోయేది. నెమ్మదిగా అతనిలో అసంతృప్తి మొదలయింది. ఆమె తనకు నచ్చినట్లుగా నడుచుకోవడం లేదని. మరో వైపు తల్లి దండ్రుల నుండి ఒత్తిడి ..ఒకరి అభిప్రాయాలూ ఒకరు గౌరవించుకుంటూ , ఎటువంటి అధిపత్యాలు లేకుండా ఒకరికి ఒకరుగా, ఎవరికి వారుగా ఉండాలని అనుకున్నాం నిజమే నిషీ.. మా వాళ్ళు కోరుకున్నట్టు పెళ్లి చేసుకోలేదు. సింపుల్ గా సహజీవనంలోకి అడుగుపెట్టా. ఎంత అమెరికాలో ఉంటే మాత్రం సగటు భారతీయ అమ్మానాన్నలు తమ పిల్లల పెళ్లి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారు ? అనేవాడు. నా తల్లి ఇండియాలోనే ఉంది. ఆమె కూడా మీ అమ్మానాన్నల లాగే ఆలోచిస్తూ ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళున్న సంస్కృతిలో అది సబబే. అయితే మా అమ్మ మనసులో ఏమున్నా నా అభిప్రాయాలకు గౌరవం ఇచ్చింది. నాపై ఒత్తిడి తేవడం లేదు అని చెప్పేది. అంకిత్ లోని ఆదర్శం పొరలు పొరలుగా విడిపోతున్న సమయంలో అతనికి అమ్మానాన్నల ప్రేమ గుర్తొచ్చింది. స్వేచ్ఛగా తాను తీసుకున్న నిర్ణయం వల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించారో అన్న బాధ మొదలైంది. తన కుటుంబ సంస్కృతి ఆచారాలు, తన వంశ అభివృద్ధి గుర్తొచ్చాయి. అంకిత్ తల్లి తనతో స్నేహంగానే మాట్లాడుతుంది. ఎప్పుడు పిల్లల ప్రస్తావన తేలేదు. కానీ పదేపదే అంకిత్ అదే ప్రస్తావన తెస్తున్నాడు. అక్కడి నుండి కుటుంబ జీవనంలో మాధుర్యం అంటూ ఏవేవో వల్లెవేస్తున్నాడు. వాటిలో ఏ మాత్రం ఇమడలేని తత్వం నిష్కలది. ఆమె స్వేచ్ఛకి ఆకాశమే హద్దు అనుకుంటుంది. అటువంటి అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా ఆచార వ్యవహారాలు నేర్చుకోవాలంటున్నాడు. బిడ్డలు కనివ్వాలన్న అతని మాటల్లో మగవాడినన్న అహంభావం ఎక్కువగా కనిపిస్తుంది నిష్కలకు. సహచరుడుగా కాకుండా అహంబావి లా సాధారణ భర్తలా , మగవాడిలా ప్రవర్తిస్తున్నాడు. ఆడవాళ్లు ఎలా ఉండాలో పాఠం చెప్పడం మొదలు పెట్టాడు . స్త్రీత్వం గురించి మాట్లాడుతున్నాడు. అతని అధిపత్యం పెరిగిపోతున్నది . అది సహించలేకపోతున్నది ఆమె . ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే జీవితం కాదు ఆమె కోరుకున్నది . సహజీవనంలో అది ఉండదని అనుకున్నది . కానీ ఇప్పుడు ఇదేంటి ,.. సహజీవన బంధాలు మహిళకు స్వేచ్ఛ ఇవ్వడం లేదా .. లైంగిక చర్య కోసమే వాడుకుంటున్నారా .. పని మనుషుల్లా చూస్తున్నారా నన్ను నన్నుగా చూడటం మానేసి భారతీయ మహిళగా అతని చెప్పు చేతల్లో ఉండాలంటున్నాడు. అతని బందీగా చూస్తున్నాడు. అక్కడే వస్తున్నది అసలు చిక్కంతా.. అక్కడే ప్రశాంతత పోతున్నది. ఘర్షణ మొదలవుతున్నది. ఇద్దరి మధ్య చర్చలు పోయి వాదనలు పెరిగిపోతున్నాయి. ఇద్దరిలో అంతర్యుద్ధం జరుగుతున్నది. అతన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించలేదు. అతను మారమన్నట్టు మారడానికి సిద్ధంగా లేదు. అది సహజీవన సూత్రాలకు వ్యతిరేకం. ఇద్దరూ కలసి నడవాల్సిన చోట, సామరస్యంగా బతకాల్సిన వాళ్ళు ఒకరినొకరు నియంత్రించుకోవడం, బందించుకోవడం ఏంటి ? అట్లాగని స్త్రీత్వం కాపాడుకునే పేరుతో తన జీవన విధానాన్ని వదులుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. అతనితో రాజీపడిపోయి సర్దుబాటు చేసుకోవడం ఆమెకు నచ్చడం లేదు. అది ఆమె స్వభావానికి విరుద్ధం. ఎన్ని ఆటుపోట్లయినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటుంది కానీ అతన్ని ఆకర్షించడం కోసం , అతని కోరికలు తీర్చడం కోసం, అతని సంరక్షణలో ఉండడం కోసం, అతనిచ్చే సౌకర్యాలు పొందడం కోసం , జీవిత శ్రేయస్సుకోసం తనను తాను చంపుకోలేదు. మనసును చంపుకుని మొహంపై నవ్వు పులుముకుని యాంత్రికంగా బతకలేదు. నటించడం చేతకాదు. తన సంరక్షణలో తానుంటుంది. తన ఆత్మగౌరవం తాను నిలుపుకుంటుంది. తాను స్ఫూర్తి నింపుకుంటుంది. సమాజం నుండి , కుటుంబం నుండి ఒత్తిడి ఉంటే ఉండొచ్చుగాక . ఆందోళన పడదు. చింత పడదు. అన్నిటిని అధిగమిస్తూ దృఢమైన చిత్తంతో లక్ష్యం కేసి సాగుతుంది. అతని ప్రేమ లేకపోయినా బతక గలదు. నాకు నేను ఏర్పరచుకున్న నియమాలకు లోబడి ఉంటాను కానీ అతను ఏర్పరచే నిబంధనలు అమలుచేయను మరోసారి తనకు తాను చెప్పుకుంటూ పక్కకు ఒత్తిగిల్లింది నిష్కల. వాక్సిన్ వేసిన చెయ్యి కొద్దిగా నొప్పిగా ఉండడంతో మరో వైపుకు తిరిగింది. ఒడ్డు దరి లేని గడచిన కాలపు ఆలోచనల ప్రవాహంలో ఆమె కొట్టుకుపోతున్నది. ఎన్నిసార్లు చెప్పినా అంకిత్ లో మార్పు రాలేదు. పదే పదే పిల్లల ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు. పిల్లలు వద్దనే నువ్వేం ఆడదానివి అంటూ పరుషంగా మాట్లాడి చెప్పా పెట్టకుండా ఆమెను వదిలి వెళ్ళిపోయాడో రోజు. అతని మాటలు, ప్రవర్తన నిష్కలను చాలా బాధించాయి. బాగా హార్ట్ అయింది. సహజీవనం కోసం చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని బాధపడింది. పెళ్లి, సహజీవనం ఏ బంధంలో ఉన్న మగవాడు మగవాడేగా .. అతని హృదయ లోతుల్లో ఉన్న ఆలోచనలు బయటికి వస్తూ ఆమెను భయపెడుతున్నాయి. ముందుకు వెళ్లనీకుండా అడ్డుపడుతున్నాయి.
* * * * *

నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..
