
https://www.youtube.com/watch?v=P8SzxdqbYAk
దగ్ధగీతం
-ఘంటశాల నిర్మల
తల్లీ!
నిలువెల్లా కాలి ముద్దమాంసమై నడిరోడ్డున కుప్పపడింది
నువ్వు కాదు –
కణకణలాడే కన్నీళ్ళలో ఉడికి కనలిన వేలూలక్షల
అమ్మానాన్నల గుండెలు!
అనేకానేక సామాజిక రుగ్మతల కూడలిలో
ఒక ఉన్మత్త మగదేహం నీ మీద విసిరిపోసిన పెట్రోల్ –
పెట్రోలా –
నిండా ఇరవయ్యేళ్ళు లేని పిచ్చివాడు బాహాటంగా స్ఖలించిన విషమది!
ప్రేమముసుగులోనో – కుదరనప్పుడు కాంక్షగానో –
దారికి రాకుంటే ద్వేషంగానో నిన్ను ముంచెత్తే నిప్పులనది!!
బడిమిత్రుడితో బాంధవ్యమనుకున్నావేమో కానీ
నీ చల్లని మాటా చక్కని నవ్వూ
వగలు వలకబోయడంగానే చూసే
పాముప్రపంచపు కోరమీసమని కానుకోలేకపోయావా బంగారం?
తెలివితో మెరిసే నీ కళ్ళు మగకంటికి కాంక్షను రాపాడించే చెకుముకిరాళ్ళనీ
స్నేహంతోనో – ఆప్యాయంగానో – పోనీ ప్రేమతోనే నువు ముద్దిచ్చినా –
మిత్రుడని నువు భ్రమసినవాడు
దానిని ఉరకలెత్తే హార్మోన్ల వురవడిగానే చూసే
సర్పసమాజపు సాధురూపమని గ్రహింపుకు రాలేదా
పగలూ రాత్రులు అరచేతిలో బట్టలు విప్పుకు తిరుగుతున్న అశ్లీలత వుంది
ఎదుటివాడిని నరకడంలో కాల్చడంలో పేల్చడంలో
మజా వున్నదనే వెండితెర
మొండికత్తిగా మనముందే వుంది
శరీరాల్ని హింసని భీభత్ససుఖాల్ని కలగలిపి నీలినీలిగా వడ్డించే అంతర్జాలం అందుబాటులోనే వుంది
ప్రతి ఆడపదార్థపు ఉనికీ కేవల సుఖకేంద్రమని బోధించే
వాణిజ్యప్రపంచపు వంకరతనమూ వుంది
అనుక్షణం అందరికీ ఒదిగి ఒరిగి వుండాలని ఘోషించే మతాలున్నాయి
ఇరవయ్యొకటో శతాబ్దంలోనూ అమ్మాయిని
దేహమాత్రపు జీవిగా
బొత్తిగా అనవసరపుప్రాణిగా చూసే ఆధునికానంతర సమాజమున్నది
ఇన్ని రాక్షససౌకర్యాలు అసహజవనరులు అబ్బిన మగవాడు
నిరంతరం వెదజల్లే కామపుకమురుకంపును కనిపెట్టలేకపోయావా పదిహేడేళ్ళ పసితనమా?
అమ్మాయి తలఎత్తి చూడడం తప్పంటుంది సమాజం
మాటాడటమే మహానేరం అంటుంది కుతర్క సమూహం
ఇక నవ్వడమంటే మన ఘన సంస్కృతికే ద్రోహమని ఉద్ఘాటిస్తారు
ఏ విషయం మీదైనా సహాధ్యాయులతో సహోద్యోగులతో
చర్చించటం చరిత్రహీనతగా చూసే కాలాలే యింకా!
తలఎత్తకుండా నోరు విప్పకుండా ఎవరితో ఏమీ చర్చించకనే
అత్యుత్తమ మేధావిగా ఎదగాలని తీర్పులిస్తారందరూ
నరంలేని నాలుక ఘోషించే ఇన్ని తప్పులు చేసీ
బతికి బట్టకట్టాలనుకున్నావా చిన్నారీ!
శ్రీలక్ష్మి నుంచి నిర్భయదాకా – అన్నపూర్ణ నుంచి అభయవరకూఎందరెందరిదో మండే నెత్తురు
నిరంతరం వరదలెత్తుతున్న నేల యిది!
ప్రేమపేరిట వేటలో చివికిన యువతీహృదయాల్ని
నిలవేసి సెలవేసి తొక్కుకుంటూనే
యీ క్రూర నేరప్రపంచం పరుగెడుతున్నది!!
లక్షలుగా చితుకుతున్న మీ కనుగుడ్ల కలలసొన
ఏ గుండెను తాకుతుంది?
ఏ తప్పూ లేకుండానే దగ్ధమవుతున్న
మీ జీవనహరితాల చావుకేక ఏ మగచెవికి సోకుతుంది??
మృత్యువు ముంగిట మీరు
నిస్సహాయంగా కొట్టుమిట్టాడే వేళనే
మీ ప్రవర్తననీ – మీమీ దేహాల పవిత్రతలనీ
తూకం వేసే లోకం కదా యిది!
పంచనామా ముద్ర కొడుతుండగానే
మీ నేపథ్యాల్ని వడబోసి – స్వభావాల్ని కడచూసి తీర్పులిచ్చే మనుషుల కొట్టం సుమా!!
ఇక్కడ
నీ చదువు నువ్వు ఎంచుకోలేవు
నీ స్నేహితుడ్ని నిర్ణయించుకోలేవు
ప్రియుడినంటూ చొచ్చుకువచ్చినవాడ్ని చచ్చినా నమ్మలేవు
మొగుడై మరి జీవితంలోకి వచ్చాక
నీకు పొగబెట్టినా పొమ్మనలేవు
శవాలగదిలోంచి అసలే కిమ్మనలేవు
నీ జీవితం ప్రతిక్షణం కత్తులవంతెన నడక !
నీ మరణమూ – అనుమానాల అవమానాల పల్లేర్లపై
ఆఖరి పడక!!
మిత్రుడిగా చెప్పుకునేవాడ్ని మగవాడిగానే చూడాలి
మాటల మరుగున మసలే పురుగుల్ని పసికట్టాలి
స్నేహమో మోహమో శరీరదాహమో కనిపెట్టి పనిపట్టాలి
చెలిమీప్రేమలు గజిబిజిపోగులుగా చిక్కుపడిన
దారపువుండ జీవితాన్ని
సాఫీగా సవరించుకునే మెళకువ పడాలి
అనుక్షణం రెపరెపలాడే బతుకుదీపాన్ని
అప్రమత్తంగా కాచుకునే తీరాలి
పేగుతెగిన మా ముఖాల మీద పేలిన నీ కనుగుడ్లు
మట్టిదుప్పటికింద శాశ్వత కలతనిద్రకు ఒరిగేవేళ
యిచ్చే చివరి చిరసందేశమిదే కావచ్చు!
******

పేరు ఘంటశాల నిర్మల. స్వస్థలం విజయవాడ. పెరిగిందీ , ఆంగ్లసాహిత్యంలో గ్రాడ్యుయేషన్ చేసిందీ అక్కడే. ఎమే చదువుతూండగానే ఆంధ్రజ్యోతి సంస్థలో ఉపసంపాదకురాలిగా చేరాను. ఇరవయ్యేళ్లపాటు (ఆం . జ్యో. స. వారపత్రికలోనే ) నాకు ఇష్టమైన జర్నలిజంలో కొనసాగి , అసోసియేట్ ఎడిటర్ గా సంస్థనుంచి వైదొలగాను.
