నిష్కల – 14

– శాంతి ప్రబోధ

అమ్మా .. షాకింగ్ గా ఉందా ..

నాకు తెలుసు.  నువ్వు ఈ ఫోటో చూడగానే విస్తుపోతావని. నేను ఈ రాత్రికి నీ దగ్గరికి వస్తున్నా.  వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం.  అది సారా నుంచి వచ్చిన మెసేజ్ సారాంశం  అసలు చైయో  ఏం చెప్పాలని యోచిస్తున్నది ?  ఏ ఉద్దేశ్యంతో  ఈ ఫోటో నాకు పంపి ఉంటుంది? చిన్నప్పటి  నుండి  చాలా పద్దతిగా పెంచాను.  కుటుంబ విలువలకు ప్రాముఖ్యం ఇస్తూనే పెంచాను. కాకపోతే  కళ్ళముందు లేని తండ్రి కుటుంబం గురించి మాత్రం దాచిపెట్టాను. అందుకు బలమైన కారణం ఉండడం వల్లే అలా చేయాల్సి వచ్చింది.  తప్పలేదు అని మరోమారు తలపోసింది వాంగ్. తప్పు చేసిన భావన, ఒక తల్లికి ద్రోహం చేసిన భావన, ఒక భార్యకు అన్యాయం చేసిన భావన కలగలిపి ఆమెను అప్పుడప్పుడూ ప్రశ్నిస్తుంటాయి.  ఆ ప్రశ్నలకు జవాబు తను ఎవరికీ చెప్పనవసరం లేదు.  తనకు తానే చెప్పుకోవాలి. తనను తాను తృప్తి పరచుకోవాలి. గతంలో ఎప్పుడూ అలాగే చేసేది. ఈ మధ్య అలా సమాధానపడలేక పోతున్నది.  ఎదిగిన చైయో కి ఎప్పడైనా విషయం తెలిస్తే ఏ విధంగా తీసుకుంటుంది? తనను అర్థం చేసుకుంటుందా? లేక తన తండ్రి తరపు బంధు వర్గానికి దూరం చేశానని ద్వేషిస్తుందా? అనే ప్రశ్న మొలకెత్తినప్పటి నుండి ఆమెలో ఆందోళన.. కూతురు వేసే ప్రశ్నలను, చూసే చూపులను తట్టుకోగలదా..?వాటికి జవాబు చెప్పుకోలేనప్పుడల్లా  మానసికంగా తనలో తానే కుంగిపోతున్నది. కలత చెందుతున్నది వాంగ్. ఇప్పుడు కూడా బలమైన కారణం ఉండడం వల్లనే ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని తనలో తాను చెప్పుకుంది సారా తల్లి మిసెస్ వాంగ్.   ఎప్పడైనా జరుగుతుందేమో అని భయపడ్డ క్షణాలు వచ్చేశాయి. వచ్చి తన ముందు నిలిచి వికృతంగా చూస్తున్నాయి. రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి తన శక్తి సరిపోతుందా..  లేకపోతే ఏం చేయను?  లండన్ లో ఉన్న సుధాకర్ తమ్ముడిని పిలిపిస్తే..  ఆలోచిస్తూనే  హఠాత్ పరిణామానికి కారణాలు వెతుకుతున్నది ఆమె.  ఇప్పుడు ఈ ఫోటో  చైయో చేతికి వచ్చిందంటే … తనకు తెలియకుండా ఏదో జరుగుతున్నది. ఏమి జరుగుతూ ఉండి ఉండవచ్చు? సాయంత్రం వచ్చాక చైయో ఏమి చెబుతుంది?  అసలు ఏమని చెప్పాలని అనుకుంటున్నది? పరిపరివిధాల ఆలోచిస్తున్నది కలతచెందిన  మిసెస్ వాంగ్ . ఆలోచిస్తున్న కొద్దీ ఆ  తల్లిలో మరింత కంగారు.. చిన్న పాటి వణుకు..  కాళ్లు చేతులు ఆడటం లేదు . పరిపరిపోతున్న మనసుకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతో ఆమె లేచి కారు తాళాలు అందుకుంది మిసెస్ వాంగ్.  దిశ తెలియకుండా పోతోంది. ఆమె ఆలోచనలు కూడా అట్లాగే ఎటునుంచి ఎటో గమ్యం లేకుండా తెగిన గాలిపటంలా సాగిపోతున్నాయి.  ఎప్పుడూ ఇంతే . మనసు తీవ్ర సంచలనానికి గురయినప్పుడో, వ్యధకు లోనయినప్పుడో దారి తెన్నూ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది.  ఇప్పుడూ అంతే . అలా డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నది . తాను జీవితంలో ఫెయిల్ అయిందా ..?ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్  నాలో ప్రవేశించిందా .. ఏమో .. గతకాలపు జ్ఞాపకాలు  కళ్ళముందు కొచ్చి కదలాడి పోతున్నాయి.  వాటిని నిలువరించడం వాంగ్ కి చేతకావడం లేదు.  శక్తి చాలడంలేదు.  సుధాకర్ తో మనసులతోనే మాట్లాడుతున్నది. నీవు నాతోనే ఉన్నావన్న నమ్మకంతో ధైర్యంతో సాగుతున్నా సుధా.. ఇప్పుడు మన బిడ్డని నువ్వు గమనించావో లేదో.. దానికి అబద్దం చెప్పడం అస్సలు నచ్చదు.  నన్ను క్షమిస్తూందో లేదోనని నా గుండె దడదడలాడుతున్నది.ఏంచేయను సుధా.. అది మీ అమ్మ ఫొటో పంపింది.      సుధాకర్ తన కొలీగ్. సింగపూర్ లో ఉన్నన్నాళ్ళు  అంతే అనుకుంది. అతను ప్రొపోజ్ చేసినప్పుడు కూడా అతనికి కొలీగ్ గానే చూస్తున్నాను అని చెప్పింది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అంటే చాలా నవ్వు వస్తున్నది. మీ ఇండియన్స్ పెద్దలు పెళ్లి చేసుకుంటారుగా.. నువ్వెంటి నాకు ప్రపోస్ చేశావంటూ ఆట పట్టించింది. కానీ అతని ప్రేమను అంగీకరించలేదు. కానీ స్నేహంగా ఉంటూనే ఉంది.  అతను అమెరికా వెళ్ళాక కానీ తన మనసేంటో తనకు అర్ధం కాలేదు వాంగ్ కి. రెక్కలిప్పుకున్న సీతాకోకచిలుక లాగా సింగపూర్ వదిలి అమెరికా చేరింది.  అతని అడుగుల చప్పుడు ఎక్కడుందో తెలుసుకుంది. ఇద్దరూ ఉన్నది చెరో ప్రాంతంలో ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా .. ఆమె అమెరికా చేరే సమయానికి సుధాకర్ ఇండియా వెళ్ళాడు.  అతనికేం తెలుసు ఏం కోల్పోబోతున్నాడో ..తనను వెతుక్కుంటూ వచ్చేసిన ఆమె విషయం.. ఆమె హృదయంలో అతను నిలిచిన విషయం .. అతనికి తెలియనంత దూరంలో ఉన్నాడతను. షరా మామూలే .. తల్లి సుగుణమ్మ మొండితనం , అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే తత్త్వం చిన్నప్పటి చూస్తూనే పెరిగాడు.  ఆమె తీరు తెలియడం వల్లనే తండ్రి సైలెంట్ అయ్యాడని పెరుగుతున్న క్రమంలో అర్ధం చేసుకున్నాడు.   ప్రేమించిన యువతి నో  తర్వాత అతను తల్లి మాటకు తల వంచక తప్పలేదు. తన అన్న కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే తనకు చావు తప్ప మరోదారి లేదని తల్లి ఇచ్చిన అల్టిమేటం అతని మదిలో సుడులు తిరిగి కలవర పరిచింది. శూన్యమైన  మనసుతో శోభ మెడలో తాళి కట్టాడు.  మనసు పొరల్లో భద్రంగా దాచుకున్న వాంగ్ రూపాన్ని చెరిపేయాలని , తుడిచేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఒకే ఒకసారి శోభకు దగ్గరైనా ఆమెలో అతనికి వాంగ్ మాత్రమే కనిపించింది.  అది మోసం చేయడమే . ఖచ్చితంగా శోభను మోసం చేయడమే అని అతనికి తెలుసు.  అట్లాగని తన ప్రేమను మరచి ఆమెకు చేరువ కాలేక నరకయాతన పడ్డాడు సుధాకర్. ఇండియాలో మెయిల్ చేసుకోలేని ప్రాంతంలో ఉండడం వల్ల సుధాకర్ కి వాంగ్ పంపిన ఉత్తరాలు, మెయిల్స్ సంగతి తెలియదు.  అమెరికాలో ఉన్న వాంగ్  అతని నుండి సమాధానం రాక ఆందోళన పడుతున్నది. ఈ మగవాళ్ళు ఇంతేనా .. లేకపోతే తనను కాదన్నానని అతను బిగుసుకున్నాడా .. లేక తనని వద్దనుకుంటున్నాడా .. తెలియక సతమతమయింది వాంగ్  అప్పటికే వాంగ్ తన ఇంట్లో సుధాకర్ విషయం చెప్పింది. ఇండియన్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు మొదట వాంగ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎవరైనా సరే చైనీయులు అయితే మంచిది అని పెద్దలుగా  వాళ్ళ సలహా ఇచ్చారు.  పెళ్లంటే ఇద్దరు మనసులు కలయిక మాత్రమే కాదు. రెండు కుటుంబాల కలయిక కూడా. ఆ కుటుంబాల ఆశీస్సులు లేకపోతే అనేక సామజిక, ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి .  ఎప్పుడూ కుటుంబ సహకారం ఉండాలి . అది పెద్దలు కుదిర్చిన దైనా .. పిల్లలు కుదుర్చుకున్న  వివాహమైనా అంటూ చాలా సందేహాలు వెలిబుచ్చారు.  పెళ్లి తర్వాత తాను తిరిగి వెళ్లి శోభకు వీసా పేపర్లు పంపిస్తానని మేనమామకు తల్లికి చెప్పి బయలుదేరాడు సుధాకర్. తిరిగొచ్చిన సుధాకర్ కి  వాంగ్ లేఖలు పలకరించడంతో ఓ పక్క ఆనందం సరిగ్గా అదే సమయంలో గొంతులో వెలక్కాయ అడ్డం పడ్డ భావన.  జరిగిన దానికి కుమిలిపోయాడు. ఏమి చేయాలో అర్ధం కాని అయోమయంలో ..జరిగిన దాన్ని పీడకలగా భావించి జీవితాన్ని దిద్దుకొమ్మని మనసు చెబుతున్నది. మంచో చెడో సలుపుతున్న బాధని పళ్ళ బిగువున భరించాల్సిందే.. పొరపాటున కూడా మరో తప్పుకు అవకాశం ఇవ్వకు అని విచక్షణ హెచ్చరించింది.  చివరికి తన పెళ్లి విషయం వాంగ్ కి చెప్పాడు.ఆమె నమ్మలేదు. అతను కావాలని అలా చెబుతున్నాడని అనుకుంది.  అతను ఫోటో పంపించాడు.  అయినా నమ్మలేకపోయింది వాంగ్.  ఒక  వీకెండ్ వాంగ్ సుధాకర్ కోసం చెప్పాపెట్టకుండా వచ్చేసింది. విధ్వంసం అవుతున్న తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరూ .. ఆ క్రమంలో  ఒకరినొకరు మనసు విప్పుకున్నారు. గుండెల నిండా ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉందని ఇద్దరూ అర్థం చేసుకున్నారు.కానీ పరిస్థితి చేయి దాటిపోయింది.ఏమీ చేయలేమని అన్నాడతను.  సముద్రమంత ఓపికతో జీవితపు బండిని లాగడమే అనుకున్నాడతను. నిద్రపట్టకపోతే అతనితో కలగంటూ .. అనుకున్నదామె కానీ స్నేహితులుగా ఇద్దరూ కదిలే మబ్బుల్ని , మబ్బుల్లో దాక్కున్న చందమామని చూడాలని ఉబలాటపడేవారు. ఎగురుతున్న జంట పక్షుల్ని అబ్బురంగా చూసేవారు.  ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉండేవారు.  ఇక వారాంతాల సంగతి చెప్పనవసరం లేదు.  ప్రతి వారాంతం ఎక్కడో ఒకచోట కలవడం పరిపాటి అయిపోయింది.  శోభ గర్భవతి అయిందని అమెరికా చేరిన అతనికి తల్లిదండ్రుల ద్వారా తెల్సింది.  ఎప్పుడో ఒకసారి తల్లితో మాట్లేవాడు.శోభతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని తెలిసి మేనమామ కేకలేశాడు. పని వత్తిడిలో ఉండడం వల్ల అని ఏవేవో సాకులు చెప్పి  తప్పించుకునేవాడు. కొంత కాలానికి ఆడపిల్ల పుట్టిందని తెలిసింది. తండ్రి అయిన ఆనందం , ఆ ఉత్సాహం ఏమీ అతనిలో లేవు . ఓ నిర్లిప్తత ఆవరించి చాలా డిప్రెస్ అయ్యాడు.  కానీ అతను వెళ్ళలేదు. ఆ బిడ్డను చూడలేదు. ఆ అతని వ్యక్తిగత విషయాలు తెలియని వాంగ్కా తన కోసమే అతను అలా ఉంటున్నాడని భావించింది.  సుధాకర్ మనస్థితి అర్ధం చేసుకుంది వాంగ్.  అతని మనసు , శరీరం తనకోసం తపించడం ఆమె గమనించకపోలేదు. నిజానికి ఆమె స్థితి అతనికి ఏ మాత్రం భిన్నం కాదు. ఏ బలహీన క్షణమో తమని మోసం చేస్తే.. తమ హద్దుల్ని చెరిపేస్తే ..  తమను తాము కోల్పోతే .. ఒకసారి దగ్గరయ్యాక దూరం జరగడం మరింత కష్టం.  అది తప్పు కావచ్చు . ఒప్పు కావచ్చు.  రకరకాలుగా ఆలోచించిన వాంగ్ చెప్పా పెట్టకుండా ఎలా వచ్చిందో అలాగే సింగపూర్ వెళ్ళిపోయింది . వెళ్ళాక సుధాకర్ కి ఆ విషయం తెలియ చేసింది.  అతను ఇండియా వెళ్లి పెళ్లి చేసుకున్న విషయం  వాంగ్ తల్లిదండ్రులకు చెప్పలేదు.  అమెరికా నుండి వచ్చిన వాంగ్ కి  తల్లిదండ్రులు పెళ్ళిచేయాలనుకున్నారు. పెళ్లి సంబంధం కుదిర్చారు. . కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పింది. కొంతకాలం ఒంటరిగానే వదిలేయమని పట్టుపట్టింది.  సెలవు మీద రావడమైతే వచ్చేసింది. అక్కడ ఉండలేక పోతున్నది. మనిషైతే వచ్చేసింది కానీ మనసంతా అక్కడే అతని దగ్గరే ఉన్నదని ఆమెకు తెలుసు. అతన్ని చూడకుండా ఉండడం కష్టమైపోతున్న తరుణంలో  మళ్ళీ  అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలనే నిర్ణయం తీసుకుంది. స్నేహితులుగా అప్పటికే ఆమెకు సమీపంలోనే అతను ఉద్యోగంలో చేరడంతో ఇద్దరి మధ్య స్నేహ బంధం మరింత బలపడింది. ఆ సమయంలోనే వాంగ్ సుధాకర్ ల మధ్య శారీరక బంధం ఏర్పడింది. రోజులు మంచు ముద్దలా కరిగిపోతున్నాయి.  శోభకు పెళ్లయింది.  బిడ్డ పుట్టింది . అయినా అల్లుడు ఇటుకేసి చూడలేదని శోభ తండ్రి వ్యధ చెందుతున్నాడు.  రావడానికి వీసా సమస్యలు ఉంటే ఉన్నాయేమో కానీ ఫోను చేసి మాట్లాడడానికి ఏమైంది ? సుగుణమ్మ కోడల్ని తన ఇంటికి తీసుకెళ్లింది. ఘనంగా చీర సారెతో తల్లీ పిల్లను పంపాడు ఆ తండ్రి. అప్పటి నుండి శోభ అత్తింట్లోనే . సుధాకర్ కు శోభ  అంటే వ్యతిరేకత, విముఖత కోపం ఏమీ లేవు అతనికి. చిన్ననాడు ఎత్తుకు తిరిగిన పిల్ల అనిపిస్తుంది తప్ప భార్యగా అనిపించదు.  అందుకే భార్యను అమెరికా తీసుకుపోయే ఉద్దేశమే అతనికి లేదు.  ఏవేవో సాకులు చెప్పి కొంత కాలం వెళ్లదీశాడు. కానీ ఎంత కాలమని ఈ సాగతీత. ఎల్లా కాలం సాగదుగా .. ఓ ఫైన్ మార్కింగ్ మేనమామ నుండి ఫోన్ ,  నీ భార్య బిడ్డల్ని ఫ్లైట్ ఎక్కిస్తాను పేపర్స్ పంపించమని చెప్పి . తన ఎదుగుదలకి కారణమైన మేనమామకు ఎదురు చెప్పలేని బలహీనత సుధాకర్ ది . మనిషి ప్రియమైన/అప్రియమైన మాటలు కాలం గడిచేకొద్దీ మరిచిపోతారు కానీ ప్రేమను, రక్షణను, సౌకర్యాన్నో అనుభూతి చెందిన ఘడియలను, అప్రియంగా , అసౌకర్యంగా ఫీలయ్యేలా చేసిన సన్నివేశాలను మరిచిపోలేరు. సుధాకర్ కూడా అంతే .. వాంగ్ తో తన ప్రేమను వదులుకోలేడు. శోభతో పెళ్లి వల్ల తన మనసుకు కలిగే అసౌకర్యాన్ని మరచిపోలేదు. అసలు ఒక మనిషికి మరో మనిషి  కోసం ఎందుకు కావాలి ?! అని ప్రశ్నించుకునేవాడు. జీవితం మరింత సారవంతం కావడానికి , సాహచర్యం లో ఆనందం రెట్టింపు అవడానికి..అని చెప్పుకునే వాడు. అవి రెండు వాంగ్ దగ్గర తనకి పుష్కలంగా లభిస్తున్నప్పుడు ఎలా వదులుకోగలడు ?!శోభతో జీవితం కూలిపోయే భవంతికి కట్టిన తోరణం లాంటిదే. తోరణం అందంగా కనిపించినంత మాత్రాన పునాది లేని భవంతి నిలుస్తుందా .. నిలవదు అని తన చర్యల్ని తానే సమర్ధించుకునేవాడు.  మళ్ళీ అంతలోనే తల్లి , మేనమామ విషయంలో  మెతకదనం .  వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి గట్టిగా నో అని చెప్పలేకపోయేవాడు.  తన ఇష్టాన్ని , అయిష్టాన్ని స్పష్టంగా , సూటిగా , సున్నితంగా చెప్పాలని చాలా సార్లు ప్రయత్నించాడు . కానీ ఒక్కసారి కూడా సఫలం కాలేకపోయాడు.  పెద్దవాళ్ళు అనుకునే గమనంలో తాను లేనని స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తనదేనని సుధాకర్ కి తెలుసు .  పలచబడిన బంధం తాలూకు పర్యవసానాలు ఎదుటివారికి ఎలాగూ అనుభవంలోకి రాక మానవు .  కానీ ఆ ప్రయాణంలో చాలా నష్టాలు జరుగుతాయి అని మదన పడిపోయేవాడు సుధాకర్.  ఆ నష్టానికి తాను కారణం కాకుండా ఉండాలంటే .. దగ్గరకొచ్చి ఆగిపోయేవాడు. వారి ఆపేక్షకు తాను తగనని  కలత చెందేవాడు .   ఏదైతేనేం సుధాకర్ కి శోభను తెచ్చుకోక తప్పలేదు. బిడ్డను తల్లి దగ్గర ఉంచి విజిట్ వీసాపై వచ్చిన శోభతో సవ్యంగా ఉన్నదెన్నడు  ..?స్నేహితురాలిగా వాంగ్ ని పరిచయం చేశాడు.  అప్పుడు తను ఏమిటి? అనే ప్రశ్న వాంగ్ లో .. ఏమి చేయాలో అర్థంగాని సంఘర్షణలో వాంగ్.. చట్ట రీత్యా పెళ్లి చేసుకున్న భార్య ని వదిలి తనతో ఉండమని వత్తిడి చేయలేక  అతనికి దూరం కాలేక చాలా యాతన పడింది .  తమ బంధం ఎక్కడ ముక్కలవుతుందోనని వేదనకు గురైంది.  విషయం శోభకు తెలిస్తే ఎక్కడ రాద్ధాంతం అవుతుందోనని భయపడింది.  ఓ పక్క తల్లి దండ్రుల ఒత్తిడి .. సింగపూర్ వచ్చెయ్యమని .  లేదంటే అమెరికాలో స్థిరపడ్డ తమదేశీయుడి సంబంధం చూస్తామని .. వాళ్ళకి అసలు విషయం తెలిస్తే ఏమంటారనన్న జంకు  తన జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో.. ఈ పరిస్థితి కి కారణం ఎవరు?  తనను తాను ప్రశ్నించుకున్నది వాంగ్.  ఎవరు అని ఎవరిని నిందిస్తే ఏం లాభం? నిందలు , నిష్టూరాలు, అలకలు అల్లర్లు , అనవసరమైన మనస్తాపాలు. చిన్న జీవితానికి నిజంగా ఇవన్నీ అవసరమా ?!ప్రేమ ఉన్నచోట పలుచబడదు బంధం సుధాకర్ తో ఏర్పడ్డ కొద్ది ఎడబాటును సర్దిచెప్పుకుంది వాంగ్ .   వాంగ్ ని చూడగానే సుధాకర్ కళ్ళలో కనిపించే వెలుగుని శోభ పసిగట్టింది.  తన పట్ల ఉదాసీనంగా, జాలిగా చూసే అతని చూపుల్లో తేడాని బాగానే అర్ధం చేసుకుంది కానీ పన్నెత్తి మాట్లాడలేదు శోభ.  కూతురు మీద మాత్రం బెంగపడిపోయేది. తన కూతురు తనతో ఉంటే చాలని భావించేది     కొద్దికాలానికే సుధాకర్  భార్య మాతృ దేశం వెళ్లిపోవడంతో తాను భార్యగా అతనితో సంతృప్తికర జీవితం గడిపింది . ఒకటే అసంతృప్తి.  అత్తింటి వారెవరినీ చూడలేదు . కలవలేదు. వాళ్ళందరిలో  కలిసిపోవాలని తహతలాడింది.  శోభను కలిసి మాట్లాడాలని ఆమెను క్షమించమని అడగాలని చాలా అనుకుంది వాంగ్. ఎప్పటికప్పుడు అతనే పోస్టుపోన్ చేసేవాడు . అతనికే ధైర్యం చాలలేదు. తీరా వెళ్ళాక తల్లి , మేనమామ , శోభ ముందు తలవంచుకు నిలబడలేనని అనేవాడు . తల్లిని చూడాలని అతనిలో బెంగ . ఫోన్ చేసినప్పుడు మొదట్లో ముక్తసరిగా ఉన్నప్పటికీ తర్వాతర్వాత కొడుకుతో  బాగానే మాట్లాడేది. కానీ ఎదురుగా నిలబడే ధైర్యం అతనికి లేదు. కడుపు తీపితో కొడుకుని చేరదీసినా.. తీరా వెళ్ళాక వాంగ్ ని కోడలిగా ఇంట్లోకి రానివ్వక పోతే ..అని అతని జంకు.  మనవరాలి వంక కన్నెత్తయినా చూడకపోతే ..పసిదాని మనసు ఎంత క్షోభిస్తుందోనని  మరింత బాధపడాలని అతని భయం . ఎన్నాళ్లని ఇలా .. ఎన్నేళ్ళని ఇలా ఉండడం ? ఎప్పుడో ఒకసారి తప్పదు . అది ఇప్పుడే ఎందుకు కాకూడదు అని వాదించేది  వాంగ్ ..  అక్కడ ఎంతటి గడ్డు పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను .మీ అమ్మ ఓ తల్లిగా , ఒక అత్తగారిగా ఏం మాట్లాడినా  స్వీకరిస్తాను . మీ మొదటి భార్య మనసును మరో స్త్రీగా అర్ధం చేసుకోగలను . ఆవిడంటే నాకెంతో సానుభూతి.  ఆవిడ ఉండాల్సిన చోట నేను ఉన్నందుకు ఒక్కోసారి గిల్ట్ నాకు అని ఒప్పించడానికి ప్రయత్నం చేసేది వాంగ్.   సుధా చాలా సందర్భాల్లో చెప్పేవాడు తల్లి గురించి . అతను ఉన్నతంగా ఎదగడంలో తల్లి , మేనమామ లేకపోతే పరిస్థితి వేరే ఉండేదని .  శోభ పట్ల అతని జాలి, మేనమామ కూతురుగా అభిమానం ప్రేమ . కానీ జీవిత భాగస్వామిగా చూడలేకపోయానని అన్నాడతను  మిసెస్ వాంగ్  గా మారింది .  కానీ మిస్టర్ జలాల అంటుండేవారు కొందరు . కూతురు పుట్టినప్పుడు అతని తల్లి పేరులోని మొదటి అక్షరం , మా నాన్న పేరులోని మొదటి అక్షరం కలిపి సారా అని పెడదాం అన్నాను. కానీ అతని తల్లి పేరు ఉండాలని అందులోని గుణ కలిపాడు. వాంగ్ తల్లి చైయో కలిపింది. అలా కూతురు పేరు  సారా గుణ చైయో జలాల గా రికార్డ్ అయింది.  సారా పుట్టకముందే ఎవరైనా ఒక బిడ్డ చాలనుకున్నారు.  దానికి తోడు  వాంగ్ కి కాన్పు కష్టం కావడం తో ఆ నిర్ణయానికి కట్టుబడిపోయారు. సారాకి నాలుగేళ్లు వచ్చాక ఎదురింట్లో ముగ్గురు పిల్లలున్న కుటుంబాన్ని చూసి నాకు చెల్లి కానీ తమ్ముడు కానీ కావాలని గోల చేసేది .  వాంగ్ అతనితో జీవితం పంచుకోవడం మొదలు పెట్టినప్పటినుంచి తన తల్లితో పాటు అతని తల్లికి కూడా గిఫ్ట్ కొనేది. మదర్స్ డే గిఫ్ట్ తన చేతులతో తనే అతని పేరున పంపడం మొదలు పెట్టింది వాంగ్.  అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పద్ధతి మారలేదు . ప్రతి సంవత్సరం పంపిస్తూనే ఉంటుంది చివరికి ఇండియా వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాక కాలం గొంతు పులిమి అర్థాంతరంగా వెళ్లిపోయాడతను.అయినా నేటికీ ఆ పద్ధతి కొనసాగుతూనే ఉంది.     సెప్టెంబర్ 11  దారుణ వార్త గురించి యూరోప్ లో ఉంటున్న సుధాకర్  తమ్ముడికి మాత్రం తెలిపింది .  అతను వెంటనే అమెరికా వచ్చాడు. అన్న కుటుంబాన్ని ఓదార్చాడు. అప్పుడతను భర్త పోయిన దుఃఖం,  తల్లి పోయిన దుఃఖం నుండి అమ్మ ఇంకా కోలుకోలేదు . ఆమె ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.విషయం  చెప్పి ఏమి చేయగలం ?  ఏమీ చేయలేని పరిస్థితి . కాబట్టి ఈ దుఃఖాన్ని, విషాదాన్ని మనలోనే దాచుకుందాం కొన్నాళ్ళు .  నెమ్మదిగా సమయం చూసుకొని అమ్మకి నేను చెబుతాను . మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు .  ఆ తర్వాత అప్పుడప్పుడు మెయిల్స్ ద్వారా పలుకరించేవాడు కొంతకాలం . జీవితంలో పెరుగుతున్న వత్తిడి, శ్రమ కొత్త స్నేహాలు ఏమైనా కావచ్చు క్రమంగా అతని నుండి మెయిల్స్ ఆగిపోయాయి.  ఒకసారి సారా తండ్రి కుటుంబం గురించి అడిగినప్పుడు అతనికి ఆ విషయం తెలియజేస్తూ మెయిల్ చేసింది.  అది బౌన్స్ అయింది అంతే .. . మార్పంటే ఇదేనా .. చెల్లా చెదురైన జీవితానికి , కాలానికి , పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడింది.   ఒడ్డుకు చేరానని తృప్తిపడింది .  కూతురు భవిష్యతు కు  పునాదులేసింది. తనని తానుగా నిలబెట్టుకుంది వాంగ్. కొన్నాళ్ళు ఓపిక పడితే మళ్ళీ ప్రపంచం తనని వెనక్కి లాగేసుకుంటుందని భావించింది. తన కూతురే తన బలం , బలగం అనుకుంది ఇన్నాళ్లు .  అలాగే జరిగింది కూడా .. అదేంటి ఇప్పుడు ఇలా .. పిరికిగా ఆలోచిస్తున్నాను.  పాత సమస్యలను పోల్చి చూసుకుంటూ కూతురు దూరం అయిపోతుందేమోనన్న భయం తనలోకి దూరిందేమో.. అయినా చైయో చిన్న పిల్ల కాదు. పరిపూర్ణంగా ఎదిగిన వ్యక్తి.  ఆమె గురించి ఎందుకంత దౌర్భల్యంగా ఆలోచిస్తున్నాను.  గడ్డు పరిస్థితుల్ని ఒంటి చేత్తో ఈదాను.  ఈ చిన్న విషయాన్ని దాటలేనా .. నాలో ఏమిటీ ఈ అయోమయ పరిస్థితి సుధా..? ఇక ముందుకు పోలేక ఆ రహదారిపై ఓ పక్కన కారు ఆపింది. నాకు ఒకింత ఓదార్పు కావాలి సుధా.  నీ  భుజాలపై తల పెట్టిపెట్టి ఏడ్చి నా బరువంతా దించుకోవాలని ఉంది సుధా అంటూ మొబైల్ లో ఉన్న భర్త ఫోటో చూస్తూ బావురు మన్నది వాంగ్ .  కొద్ది సేపటి తర్వాత అర్ధమైంది సుధా.. నా ఆటిట్యూడ్ మార్చుకోవాలి . నా దృక్పథం మార్చుకోవాలి అంతేగా అంటూ కళ్ళు తుడుచుకుంది.  కొద్దిగా తేలికైన హృదయంతో ఆవిరైపోతున్న సమయం చూసి వెనుతిరిగింది  నాలో ఏర్పడ్డ గందరగోళాన్ని , అభద్రతను పసిగడితే చైయో నవ్వుకుంటుందా…ఎగతాళి చేస్తుందా..  ఊహూ .. అలా కాదు.. ధైర్యాన్ని నింపుకోజూస్తున్నది ఆమె. కారు విండో అద్దాలు తెరిచింది. చల్లటి గాలి మెత్తగా పలకరిస్తూ వెళ్ళింది.  ఎంత సర్ది చెప్పుకుందామని ప్రయత్నించినా ఆమె హృదయం మెలిపెడుతూ ఉంది . మౌనంగా తనలో తాను సంభాషిస్తూ ఉంది మృదువైన ఇంగ్లీషు సంగీతం ఆమెను తాకలేకపోతున్నది .  ఆ రాగాలను  ఆస్వాదించలేకపోతున్నది. కాలాలు , ఋతువులతో పాటు మనిషి ప్రవర్తన కూడా మారుతుందా .. పెద్ద సందేహం ఏమో .. .. ఒకవేళ చైయో కూడా నాలాగే ఆలోచించిందా .. ఏమో .. గతం గతించిపోలేదు .  తిరిగి రాని రోజుల తాలూకు తిరిగిరాని మనుషుల తాలూకు మనుషులకోసం, ఆ మనుషుల సావాసం కోసం  వేచి చూస్తున్నదా .. కొన్నాళ్లు ఓపిక పడితే తన రక్తసంబధీకులు తనకు దగ్గరవుతారు అనుకుందేమో ..ఎంత అమెరికన్ సమాజంలో ఇమిడిపోయారు అనుకున్నా మన మూలాల నుండి మనకు తెలియకుండానే కొన్ని అలవడతాయేమో .. ఏషియన్లు  కుటుంబాలకి, కుటుంబ బంధాలకి  ప్రాధాన్యత ఇస్తారని మరో సారి రుజువయింది అనుకుంది వాంగ్ .  ఇంటికొచ్చేసరికి ఎదురుగా చైయో ..

(మళ్ళీ కలుద్దాం )

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.