ఉచితం-అనుచితం

-ఆదూరి హైమావతి 

జ్యోతిష్మతి రాజ్యాన్నీ రజనీవర్మ అనే రాజు పాలించేవాడు.అతనికి కీర్తి కాంక్ష ఎక్కువ. ఎలాగైన తన తాతముత్తాతలను మరిపించేలా ప్రజలకు హితవు చేసి వారికంటే గొప్పపేరు తెచ్చుకోవాలనీ, తన తర్వాతి తరం వారంతా తన పేరే చెప్పుకోవాలనీ తెగ ఆశ పడుతూ ఏమి చేస్తే తన కోరిక తీరుతుందో అని రాత్రింబవళ్ళూ ఆలోచించేవాడు.

అతనిరాజ్యం సుభిక్షంగా ఉండేది. పంటలు బాగా పండుతూ అంతా సుఖ సంతోషాలతో జీవించేవారు. కష్టపడి పనిచేసే తత్వం ప్రజలదంతా. ఎవ్వరూ  ఊరికే కాలాక్షేపం చేసేవారే కాదు. అంతా చేరి రచ్చబండల మీద కూర్చున్నా నులకతాడు పేనుకోడమో , కొబ్బరి మట్టల నుంచీ  ఈనెలు ఒలుచుకోడమో , కొబ్బరి పీచు తీసుకోడమో చేసుకుంటూ కబుర్లు చెప్పుకునేవారు. మహిళలంతా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ కబుర్లాడుకునేవారు.

రాజు కాంక్ష కనిపెట్టిన కొందరు  స్వార్థపరులైన ఆస్థాన ఉద్యోగులు  ఆయన మెప్పు పొందను ఆయనతో దగ్గరగా మసలుతూ కొన్ని సూచనలు చేయసాగారు. వారు మహామంత్రి దగ్గరలేని సమయం చూసి తమ పధకం కొనసాగించసాగారు. కొద్ది రోజులకే మహారాజుకు వారి మాటలు రుచించి, అవి అమలు చేయనిశ్చయించుకున్నాడు. ఆ పనులు చేయు వారిని నియమించాడు కూడా.

మొదటగా రాజ్యంలోని వృధ్ధుల పేర్లు  సేకరించి వారికి ఉచితంగా కొంత ధనం పంచసాగాడు. ఇది వారికి కొత్తగా ఉంది. ఇలా పనిచేయకుండా ధనం తీసుకోను కొత్తల్లో వారు సుముఖత చూపలేదు. క్రమక్రమేణా అంతా ఉచితంగా  అదీ రాజు పంపుతున్న ధనం తీసుకోను అలవాటు పడ్డారు. ఆతర్వాత కొందరు యువకులకు కూడా ఉచిత ధనం అందసాగింది  దాంతో పని చేసి ధనం సంపాదించడం  అనే అలవాటు కొరవడి క్రమేపీ పనులు చేయను ఇష్టపడక సోమరులుగా మారసాగారు.

అలా రాజ్యంలో పేదలకూ, రైతులకూ, చేతిపని వారికీ ఉచితంగా వచ్చే ధనం వలన కష్టపడి ధనం సంపాదించడం అనే అలవాటు పోయింది.

సమయానికి పొలం పనులు చేయక సాగుసాగక పంటలు చేతికి అందక, తిండి గింజలు తగ్గిపోయాయి. మహారాజు తన గొప్పదనం చాటుకోను, తనవారను కుంటున్న ఆ ఇచ్చకందారుల సలహాలతో తమ ధాన్యా గారంలో  కష్టకాలానికి దాచి ఉంచిన ధాన్యాన్ని ఉచితంగా బళ్ళమీద వేసుకుని ఇంటింటికీ పంచే ఏర్పాటు చేశాడు. దీంతో పనులు చేసే వారంతా  పనులకు పోక పూర్తిగా సోమరులైపోయారు.

ఎప్పటికప్పుడు విషయాలన్నీ  గ్రహిస్తున్న మహా మంత్రి ఆ ఇచ్చకందారుల కుట్ర గ్రహించి రాజును అపమార్గం పట్టిస్తున్న వారికి తగిన బుధ్ధి చెప్పాలని సమయం కోసం కాచుకున్నాడు.

కొద్దికాలానికి ధాన్యాగారం, ధనాగారం రెండూ నిండుకున్నాయి. పథకాలు కొనసాగించను మార్గంలేక దిక్కుతోచక, తెలివి తక్కువ మహారాజు  మహా మంత్రిని అడిగాడు.

ఆయన సమయం దగ్గర పడిందని గ్రహించి ఆ ఇచ్చకం దారులనే సలహాలు అడిగితే వారు తనకంటే బాగాచెప్పగల మేధావులని చెప్పాడు. మహారాజు వారిని అడగ్గా వారు ప్రజల వద్ద అధిక పన్ను వసూలు చేసి   దాంతో పథకాలు కొనసాగించ వచ్చని చెప్పారు.

అలా పన్ను వసూలు చేయనూ వారినే నియమించాడు మహారాజు. ప్రజలు పన్ను అడగ్గానే తిరగబడి వారిని పట్టుకుని కొట్టి గుంపులు గుంపులుగా రాజభవనం ఎదుట చేరి మహారాజును న్యాయం చేయమని తమను రాజ్యాధికారులు పన్నుకట్టమని వేధిస్తున్నారనీ పెద్దగా అరవసాగారు.  మహారాజు ఆ కేకలు విని వచ్చి అక్కడ చేరిన ప్రజలందరి మాటలూ విని పక్కనే ఉన్న మహామంత్రి  సలహా అడిగాడు.

ప్రజలంతా ఉచితంగా అన్నీ అందటాన ఏపనులూ చేయక సోమరులై సంపాదనలేక, పనులే లేనందున పన్నులు కట్టే స్థోమత లేక బాధ పడుతున్నారని చెప్పాడు.

“మహారాజా!  ప్రజలు పనులు చేయడం మరచి పోయారు. ముందు వారికి పనికి ఆహారం పధకం పెట్టి వారు పనిచేసే విధంగా చేయండి. పూర్వంలా ఒళ్ళు వంచి పనులు చేస్తుంటేనే  సంపద, ధాన్యము  లభిస్తాయి. అప్పుడే ప్రజలు దారినపడి పూర్వంలా కష్టం చేసి తింటారు. ఉచితంగా ఏమిచ్చినా ఇలా రాజ్యం దరిద్రం పాలవుతుంది. ప్రజలకు పని కల్పించడమే మహారాజు చేయవలసినది. మీ పూర్వులంతా అలా చేయటాన రాజ్యం సుభిక్షంగా కొనసాగింది.  ఉచిత పంపకాలు మంచివి కావు.” అని మహామంత్రి  చెప్పిన మాటలు యదార్థమని నమ్మి వాటిని పాటించి కీర్తికాంక్ష వదిలేసి , తిరిగి రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్నాడు. ఇచ్చకందారులు చిరునామా లేకుండాపోయారు.

               ఉచితం అనుచితమని  మహారాజుకు బాగా తెలిసివచ్చింది.

         *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.