వెనుతిరగని వెన్నెల(భాగం-39)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

https://youtu.be/avXmwtcTJZM

వెనుతిరగని వెన్నెల(భాగం-39)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టమ్మీద తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి కష్టపడి జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. ఎన్నో రోజులు పోరాడి, చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది.

 ***

          ఇంటర్యూ నాడు ఉదయం ఆరు గంటలకే తయారయ్యింది తన్మయి. తనకి అత్యంత ఇష్టమైన తెల్లని బెంగాల్ కాటన్ చీర కట్టుకుంది. చీర అంచుకి నప్పే ముదురు ఊదా రంగు బ్లౌజు వేసుకుంది.  అద్దంలో చూసుకుంటూ తిలకం బొట్టు దిద్దుకుంది. రాత్రి చదవగలిగినంతా చదివి పెందరాళే పడుకుందేమో అలసట తీరి ప్రశాంతంగా ఉన్నాయి కళ్లు.

అత్యంత నిరాడంబరంగా  ఉన్న తనను తాను లెక్చరర్ ఉద్యోగానికి వెళ్తున్నట్టు ఒకసారి ఊహించుకుంది. జీవితంలో మొదటి సారి లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తూంది.

సిద్దార్థ మాటలు గుర్తు తెచ్చుకుంది. “ఎదుటి వాళ్లు ప్రశ్నలు అడుగుతున్నపుడు అవతలి వారికి ఏమీ తెలియదన్నట్టు, చిన్న పిల్లలకు సమాధానం చెప్తున్నట్టు మీ మనస్సులో అనుకోవాలి. అప్పుడే ధీమాగా పాఠాలు చెప్పగలుగుతారు.” అతని హాస్య చతురత గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది.

ఇప్పుడీ ఉద్యోగం తనకు వస్తుందా? రాదా? అనేది అప్రస్తుతం. కేవలం ఒక ఇంటర్యూకి వెళ్తున్న అనుభవం కోసం వెళ్తూందంతే. తను అర్హురాలు కాకపోయినా తనకి ఉద్యోగం వచ్చిందంటే తన పాఠాలు వినబోయే పిల్లలకు అన్యాయం చేసినట్టే.  తను నిజంగా అర్హురాలే అయితే ఈ ఉద్యోగం రాకుండా ఎవరూ ఆపలేరు. అంతే.

కలగాపులగంగా కలుగుతున్న ఆలోచనలనించి తప్పించుకుని కాస్త ఊపిరి పీల్చుకునేందుకు వాటర్ ట్యాంకు ఉన్న చిన్న డాబా మీదికి వెళ్లింది.

తూర్పున సూర్యుడు ప్రపంచంలోని రాత్రుళ్ల కష్టాల్ని గట్టెక్కించడానికి కవాతు చేసుకుంటూ వస్తున్న వీర జవాన్ల లాంటి కిరణాలతో  వేగంగా ముందుకు కదలసాగేడు.

తమ ఊళ్లో కనిపించే పక్షుల కిలకిలా రావాలు లేవు. రేడియో నించి వినవచ్చే సుప్రభాతాలు లేవు. ఆరు బయట నిద్రిస్తున్న వారు లేరు.

దూరాన ఇళ్లలోకి పేపర్లు విసురుతూ వస్తున్న సైకిలు కుర్రాడు మధ్యలో ఒక్కో ఇంటి దగ్గిర ఆగి పాలపేకెట్లు బయట గేటుకి కట్టి ఉన్న సంచుల్లో వేస్తున్నాడు.

ఇళ్లలో అంతా అప్పటికే లేచి స్కూళ్లకి పిల్లల్ని తయారు చేస్తూనో, ఆఫీసులకు తయారవుతూనో ఉన్నట్టు కుక్కరు విజిల్సు వినవస్తున్నాయి.

కాఫీ కప్పులతో పేపరు తిరగేస్తూ  ఒకరో ఇద్దరో అక్కడక్కడా డాబాల మీద తిరుగుతున్నారు.

మహా నగరాల లక్షణమన్నట్లు  పెద్ద మేడలు, ఆ పక్కనే మధ్య తరగతి ఇరుకు గదులు, చిన్నపాటి ఖాళీ స్థలాల్లో డేరాల బతుకులు… అన్నీ అక్కడక్కడే కానవస్తూ ఉన్నాయి.

పనమ్మాయి కింది నించి కాఫీ కోసం పిలిచింది.

జ్యోతి ముఖం కడుక్కుంటూ “ఏమ్మా, అప్పుడే తయారయిపోయేవా?” అంది ఆశ్చర్యంగా.

“కాస్త ముందే వెళ్తానమ్మా. ఇవేళ బస్సుల్లో వెళ్తాను. ఎలాగూ ఒక్కదాన్నేగా డబ్బులు కలిసొస్తాయి.” అంది తన్మయి.

వదులుగా, పొడవుగా ఉన్న తన్మయి జడని అబ్బురంగా చూస్తూ పనమ్మాయి “ఏం పెడతావు యెంట్రుకలకి?” అంది.

జ్యోతి నవ్వుతూ, “ఇప్పుడేంటి, ఇంకా చిన్నపుడయితే మోకాళ్ల వరకూ ఉండేది మా అమ్మాయి జుట్టు” అంది.

బయటికి వెళ్తూ గేటు తీస్తున్న తన్మయికి వెనక నించి ఎవరో చూస్తున్నట్లు అనిపించింది.

యథాలాపంగా వెనక్కి తిరిగింది.

అద్దెకున్న పోర్షను నించి దాదాపు తన తండ్రి వయసున్న వ్యక్తి తనని అదే పనిగా చూస్తున్నాడు.

తన్మయి వెనక్కి తిరగడం చూసి చప్పున చేతిలో ఉన్న పేపర్లో తల దూర్చేడు.

తన్మయి పమిట చెంగుని చప్పున చుట్టూ కప్పుకుని, వడివడిగా నడిచింది.

అవకాశం కోసం చూసే మగ కళ్లని పసిగట్టలేని పసిపిల్లేం కాదు తను.

“ఛీ..ఛీ..” అని అసహ్యించుకుంది.

“నీ ఇంటర్యూ రేపు అయిపోతే ఎల్లుండి సాయంత్రం బండికి బయలుదేరాలి మనం” అంది ముందు రోజు రాత్రి తల్లి.

” రేపు సాయంత్రం కాదు, ఉదయానే పాసింజరు  రైలులోనైనా సరే వెంటనే బయలుదేరాలి ఇక్కణ్ణించి” దృఢంగా అనుకుంది తన్మయి.

రెండు బస్సులు మారి కాలేజ్ సర్వీస్ కమీషను ఆఫీసుకి చేరేసరికి ఇంకా గంట టైము మిగిలింది  తన్మయికి. గేటు బయట ఒక టీ కొనుక్కుని తాగింది. తనలాగే ఇంటర్యూకి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు తమలో తాము మాట్లాడుకుంటూ ఇంటర్యూలలో జరిగే అన్యాయాలు చెప్పుకుంటున్నారు.

“ఎంత బాగా సమాధానాలు చెప్పినా, ఇంటర్వ్యూ ఎంత బాగా చేసేమనిపించినా, నువ్వు మంత్రిగారికి చుట్టమైతేనో, లంచం సమర్పిస్తేనో  మాత్రమే ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి”

“మొన్నీ మధ్య  మా ఊరి వాడు గ్రేడు-4 ఉద్యోగం కోసం పొలం అమ్మేసేడు. లంచం ఇచ్చినా పని జరగలేదు. ఉద్యోగం రాలేదు సరికదా, పొట్టకి ఆధారమైన పొలం కూడా పోయింది.”

నడుస్తూ ఆలోచించసాగింది. “అంటే తనలాగా స్వశక్తి మీద ఆధార పడిన వాళ్లకి గవర్నమెంటు ఉద్యోగాలు రావా?”

కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం “లంచాల్ని నిర్మూలిస్తాం” అని ప్రకటన చేసింది.

ముఖ్యమంత్రికి అంతా భయపడి స్ట్రిక్టుగా నడచుకుంటున్నారని  వార్తలు వింది.

“అదే నిజమైతేనో! లేదా తను విన్న కథలు అబద్ధం అయితేనో!” మనసుకి సర్ది చెప్పుకుంటూ చుట్టూ చూసింది.

పొడవైన వరండాలో లైనులో కూచున్న వాళ్లలో టెన్షనుతో  కాళ్లూపుతున్న వాళ్లు కొందరు. కళ్లు మూసుకున్న వాళ్లు కొందరు. అనవసర పరిచయాలు చేసుకుంటూ, ఆరాలు తీస్తున్నవారు కొందరు.

మొత్తానికి అక్కడ కూచున్న వాళ్లందరూ ఆందోళనతో చెమటోడుతున్న వాళ్లే.

తన్మయి కళ్లు మూసుకుంది “అజ్ఞాత మిత్రమా! ఇంత కాలం నాకు నువ్వే మార్గదర్శివై  నడిపించావు. నువ్వు చెప్పు. నా జీవిత గమనం ఎటు మారనుందో. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను”.

“తన్మయీ” పరిచయమైన గొంతుకి కళ్లు విప్పి చూసింది.

ఎదురుగా ప్రభు.

“అరే, మీరేంటి ఇక్కడ?” అంది ఆశ్చర్యంగా.

ఆంధ్రా యూనివర్శిటీలో కిందటి సారి ప్రభుని చూసినప్పపుడు తను ఎం.సి.ఏ చేసి హైదరబాదులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం స్పష్టంగా  గుర్తుంది.

ప్రభు ఏదో చెప్పేలోగా, తనే మళ్లీ  “మీరూ ఇంటర్వ్యూకి వచ్చేరా?” అంది.

తల అడ్డంగా ఊపుతూ “అహహ, మనకంత సీను లేదు లెండి” అన్నాడు.

అతని భాష విని తన్మయికి చప్పున నవ్వొచ్చింది. అయినా అంతా ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నారు.

“అంత లేదు”, “అంత సీను లేదు” అంటూ సినిమాల భాషలో.

మాస్ మీడియాని బొత్తిగా ఇష్టపడని తనకి ఇదంతా కొత్తగానూ, వింతగానూ ఉంటుంది.

ఇంతలో “అడుగో” అంటూ తన మిత్రుడెవరో కూచున్న వైపు దూరంగా చూపించేడు అతనికోసం వచ్చేనన్నట్టు.

పక్కనే కూచుంటూ, “అయినా నాకు గవర్నమెంటు ఉద్యోగాలు పడవు తన్మయీ. ప్రయివేటు కాలేజీలో కంప్యూటరు ఇన్స్ట్రక్టర్ గా చేరేను.” అని నవ్వేడు.

తన్మయి అన్యమనస్కంగా  తలూపింది.

“మీ ఇంటర్యూ కానివ్వండి, కింద కాంటీనులో కలుద్దాం” అని లేచేడు.

ఇంటర్యూ ఉదయం బ్యాచ్ లోనే కావడం తనకు ఒక విధంగా మంచిదే. మిగతా రోజంతా స్థిమిత పడొచ్చు. అనుకుంటూ

“అలాగే. నా పేరు మరో ఇద్దరి తర్వాత ఉంది. కాగానే వస్తాను” అంది.

ఒక్కొక్కళ్లకి అరగంట సమయం పడుతూంది.

అన్ని సబ్జెక్టులకీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

ప్రత్యేకించి తెలుగుకి రెండు గదుల్లో జరుగుతున్నాయి.

ఎటైనా తనని మరో అరగంటలో పిలవొచ్చు.

తన పేరు వినబడే సరికి అప్పటి వరకూ ఉన్న ఏదో సన్నని ఆందోళన మాయ మయ్యి  చిత్రంగా ‘ఏదేమైనా సరే’ అనే తెగింపు కలిగింది.

గదిలోకి అడుగు పెడ్తూనే వినమ్రంగా నమస్కరించింది.

తనని చూస్తూనే మంచి అభిప్రాయం కలిగినట్లు తలలు ఊపేరు మధ్యలో కూర్చున్న ఇద్దరూ.

పొడవాటి గది, ఒక పక్కగా పెద్ద టేబుల్, ఆ వెనకగా కూర్చుని నలుగురు, వారికి కాస్త ఎడంగా మరొక టేబుల్ దగ్గిర  మరొకాయన.

అంతా రిటైర్మెంటు దగ్గర పడ్డట్టు తలలు నెరిసిన వారే.

గదికి మరొక వైపు గోడకి బ్లాక్ బోర్డు, రంగు చాక్ పీసులు ఉన్నాయి.

ముందుగా ఒకాయన “నీ పేరేంటమ్మా?” అని  అడిగేడు.

సమాధానం విని  “ఊ.. మంచి పేరు” అన్నాడు.

ఇంకొకరు ఊరు, మరొకరు విశ్వవిద్యాలయం వివరాలు.. చకచకా ప్రశ్నలు అడగ సాగేరు ఆలస్యం కాకూడదన్నట్టు.

తన్మయి ఒకరి వైపు తిరిగి సమాధానం చెప్తూండగనే రెండో ప్రశ్న వినిపించసాగింది.

వాళ్లు ప్రశ్నలడుగుతూంటే  ఎవరో కొత్త వారిని  పరిచయం చేసుకుంటున్నట్లు అనిపించి హుషారుగా మాట్లాడసాగింది తన్మయి.

ఎమ్మే లో చదివిన ప్రత్యేక సబ్జెక్టుల గురించి ప్రశ్నకు సమాధానం చెప్తూండగా దానిననుసరించి మరొకరు అడుగుతున్న విధానాన్ని బట్టి అన్నీ ముందుగా తయారు చేసుకున్న ప్రశ్నలు  కాదని ఇట్టే గ్రహించింది తన్మయి.

“అటు వైపు వారు మీకు విద్యార్థులనీ, వారికేమీ తెలియదని అనుకుని నిర్భయంగా సమాధానాలు చెప్పెయ్యండి” అన్న సిద్దార్థ మాటలు చప్పున స్పురణకు వచ్చేయి.

అయినా సరయిన సమాధానాలే చెప్పసాగింది. ఆలోచించుకోకుండా అడిగిన వెంటనే తడుముకోకుండా సమాధానాలు చెప్తున్న తన్మయిని అభినందిస్తూ , “భేష్” అన్నాడు అందరికీ ఎడంగా కూర్చున్న పెద్దాయన.

అంతా ఆయన వైపు చూసేరు.

లేచి పక్కనే ఉన్న ఫ్లాస్కు లోంచి కాఫీ ఒంపుకుంటూ “ఇక నేను విశ్లేషణాత్మకమైన  ప్రశ్న అడుగుతాను.” అన్నాడు.

తన్మయి అత్యంత శ్రద్ధగా ప్రశ్న విని, సమాధానం చకచకా చెప్పడం మొదలు పెట్టింది.

అరచేతుల్ని కదుపుతూ తన్మయి సమాధానం చెప్తున్న విధానాన్ని ఆసక్తిగా విన్న అంతా సంతృప్తిగా తలలాడించేరు.

వరసగా వ్యాకరణం, సంస్కృతం, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, భాషా శాస్త్రం, ప్రక్రియలు, ధోరణులు  ఒక్కో సమాధానం చెప్తున్న కొలదీ తన్మయికి తెలియని ఆనందం కలగసాగింది.

పద్యం దగ్గరికి వచ్చేరు చివరికి.

“పద్యాన్ని రాగ యుక్తంగా కాకుండా, భావ యుక్తంగా చెపుతాను” అని జంకూ గొంకూ లేకుండా చెప్పింది.

అనుమతి ఇవ్వంగానే లేచి నిలబడి, పద్యాన్ని వాక్యం చదువుతున్నట్టు చక్కగా విరిచి చెప్తున్న తన్మయి వైపు అబ్బురంగా చూసేరు.

తన్మయి చేత్తో తెచ్చిన ఫైలుని తిరిగి తన చేతికిస్తూ “మంచిదమ్మా, వెళ్ళిరా” అన్నారు.

అందరి ముఖాల్లో అభినందనాత్మక చిరునవ్వు స్పష్టంగా కనిపించింది.

ఇంటర్యూ బాగా చేసిన చక్కని సంతృప్తి కలిగింది తన్మయికి. అదే తనకి గెలుపుతో సమానం.

బయటకు రాగానే తన్మయికి మనస్సు హాయిగా తేలిగ్గా అనిపించింది.

అనుకున్నదాని కంటే వందరెట్లు ఎక్కువ బాగా జరిగినట్లనిపించింది ఇంటర్యూ.

“ఇక ఉద్యోగం వస్తుందా, రాదా అని ఆలోచించడం మానెయ్యొచ్చు, ఈ అనుభవమే చాలు.”

అదే చెప్పింది ప్రభుతో కేంటీన్లో.

“మీరు భలే అల్ప సంతోషులు, కానీ అనుకున్నది సాధించే పట్టుదల కలవారు. ఇలాంటి రెండు విభిన్నమైన లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం బహుశా: చాలా అరుదు” అన్నాడు మెచ్చుకోలుగా.

“నా సంగతి అలా ఉంచండి. మీ విషయాలు చెప్పండి”  అంది తన్మయి.

“నాదేముంది. చదువుకున్నన్నాళ్లూ సీట్లు వస్తాయో, లేదో అన్న బాధ,  చదువయ్యాక ఉద్యోగం గురించిన బాధ.  ఇక ఇప్పుడు…” అని తల అడ్డంగా ఊపి “వద్దులెండి. నా బాధలు చెప్పి మీకు బాధ తెప్పించడం నాకు ఇష్టం లేదు.” అన్నాడు నవ్వుతూ.

హాయిగా నవ్వుతూ, కులాసాగా మాట్లాడుతున్న అతని వైపు చూస్తూ, “మీరు ఏకరువు పెట్టినవేవీ గొప్ప బాధలేం కాదు” అంది.

తన్మయి ముఖంలో ఒక్క క్షణం కదలాడిన విషాదం గమనించి భృకుటి ముడేస్తూ, “మీరు… మీరు ఏదయినా సమస్యల్లో ఉన్నారా?” అన్నాడు ఆదుర్దాగా.

తన్మయి అవునూ, కాదన్నట్టు తలాడించింది.

“నేను మిమ్మల్ని యూనివర్సిటీ లో చూసినప్పుడే అనుకున్నాను. మీరేదో బాధల్లో ఉన్నారని. కానీ అక్కడే అడిగే ధైర్యం చాలలేదు. ఇప్పుడు చెప్పండి. నేను మీ సమస్యల్ని ఆర్చలేక పోయినా. తీర్చలేక పోయినా అర్థం చేసుకోగలను. కానీ మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి. లేకపోతే వద్దు” అన్నాడు.

“మీకు చెప్పకూడనిదేమీ కాదు. ఇప్పుడు అతనితో విడిపోయాక నా సమస్యలు తగ్గేయి.” అని,  చుట్టూ గందరగోళంగా ఉన్న ఆ చోట ఇక ఏమీ చెప్పాలనిపించక, “తర్వాతెప్పుడైనా వివరంగా చెపుతాను ప్రభూ!” అంది చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ.

“అయామ్ సారీ తన్మయీ” అన్నాడు.

“సారీ అవసరం లేదు. ఇప్పుడు హాయిగా ఉన్నాను” అంది.

బయటికి వచ్చేక వాతావరణాన్ని తేలిక చేస్తూ , “బిర్లా మందిర్ చూస్తారా?” అనడిగేడు.

ఆశ్చర్యంగా చూసింది తన్మయి. “బిర్లా మందిర్  తనెప్పటి నుంచో చూడాలని అనుకుంటున్నదని ఇతనికెలా తెలుసు?”

అదేమీ పట్టనట్లు ప్రభు చిన్నగా నవ్వి, “మీరు ఇంతకు ముందు చూసి ఉండక పోతే దగ్గర్లో చూడాల్సిన మంచి ప్రదేశం. మీకు సమయం ఉంటేనే..” అన్నాడు.

సిటీ బస్టాండు వైపు అడుగులేస్తూ హైదరాబాదు గురించి చెప్పడం మొదలు పెట్టేడు.

“ఈ నగరానికి మొదటగా వచ్చినపుడు ఎక్కడికెళ్ళాలన్నా, ఏ బస్సులు పట్టుకోవాలో తెలియక గందరగోళంగా ఉండేది. ఇప్పుడంతా కొట్టినపిండి లెండి. పట్టుబట్టి ఊరు చూడడమే పనిగా పెట్టుకుని ఆదివారాలు తిరుగుతూ అర్థం చేసుకోవడం మొదలు పెట్టేను. కాగితమ్మీద ప్రణాళిక రాసుకుంటే ఏదయినా చాలా సులభం.” అన్నాడు.

“చిత్రంగా నాక్కూడా ఇలా కాగితాల మీద ప్రణాళికలు రాసుకునే అలవాటుంది ప్రభూ” అంది.

తన్మయి వైపు ప్రశంసా పూర్వకంగా చూసి,”ఈ ఊళ్ళో చారిత్రాత్మకమైన ప్రదేశాలు, చూసి తీరవలసినవి చాలా ఉన్నాయి. మీరు ఎంత వరకూ ఉంటున్నారు?” అన్నాడు.

తన్మయి సమాధానం విని, “అయ్యో, రేపేనా? రెండ్రోజులుండొచ్చుగా” అన్నాడు.

అతని మాటలకి నవ్వొచ్చింది తన్మయికి.

“పొద్దున్న అతను కాకతాళీయంగా సర్వీస్ కమీషను ఆఫీసులో కలిసే వరకు తనిక్కడ ఉన్నట్లు కూడా అతనికి తెలీదు. ఇప్పుడేమో ఇలా.”

మాటల్లోనే బస్టాండుకి చేరుకున్నారు.

కిక్కిరిసిన హైదరాబాదు బస్సుల్లో ఎక్కడం, దిగడం కూడా కష్టమే.

చప్పున కదిలిపోతున్న సిటీ బస్సులో  ముందు వైపు ఎక్కలేక పోయింది తన్మయి. అప్పటికే వెనక ఎక్కిన ప్రభు చెయ్యి అందించేడు.

అదంతా చాలా మాములుగా జరిగినా, పట్టుకున్న చేతిని వదలడం ఇష్టం లేనట్లు  అతను మరొక్క క్షణం ఎక్కువ తీసుకున్నపుడు ఆ కళ్ళలో ఆరాధనా భావం స్పష్టంగా కనబడింది.

తన్మయి చప్పున కళ్లు దించుకుని ముందుకు కదిలి ఆడవాళ్ల సీట్ల వైపు నడిచింది.

బస్సు బిర్లా మందిర్ కు చేరే వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అయినా ప్రభు తనవైపు చూస్తున్నట్లు అనిపించసాగింది.

ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో ఎప్పుడూ ప్రభుతో సరిగా మాట్లాడిన జ్ఞాపకం కూడా లేదు. కానీ అతని ముఖంలో తనని చూసినప్పుడల్లా ఎందుకో అమితమైన ఆనందం గోచరిస్తూ ఉంది.

అసలు చిన్నప్పుడు తనతో చదివిన వాళ్లెవరితోనూ తానెన్నడూ స్నేహం చేసి ఎరగదు.

తన బాల్యం అంతా ఎందుకో ఒంటరిగా గడిచిపోయింది. వనజ తప్ప తనకు ఎవరూ స్నేహితులు ఉండేవారు కాదు.

ఇక యవ్వనం ఎప్పుడూ జీవితం పట్ల ఊహల్లోనూ, కలల్లోనూ.. శేఖర్ తప్ప మరొకరి గురించి ఆలోచన లేకుండా గడిచి పోయింది.

ప్రభు చాలా సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ లో కనబడినప్పుడు అతని ఆనందాన్ని తను చాలా మామూలుగా తీసుకుంది.

కానీ  ఇప్పుడు అర్థమవుతూ ఉంది అతను తనని  చదువుకున్నప్పటి నించీ ఆరాధిస్తున్నాడని.

అతను ఆ విషయాన్ని అప్పుడూ చెప్పలేదు, ఇప్పుడూ చెప్పలేదు. కానీ స్పష్టంగా అర్థం అవుతూ ఉంది.

చప్పున కరుణ జ్ఞాపకం వచ్చేడు. మనసంతా బాధ మెదిలింది.

“జరిగిన చేదు అనుభవాలు చాలు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపాలి. ఇలాంటివి తనకి ఇష్టం లేదని ఇతనితో గట్టిగా చెప్పాలి.” అనుకుంది తన్మయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.