వెనుతిరగని వెన్నెల(భాగం-48)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

https://youtu.be/CuAgmng-aP0

వెనుతిరగని వెన్నెల(భాగం-48)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ” ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణంనించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒకపక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధించి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్లీ ఎదురవుతాడు.

***

          ఆ రోజు ఉదయం కాలేజీకి ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టుకి కొత్త లెక్చరర్ వస్తున్నారని చెప్పేరు ప్రిన్సిపాల్ యాదగిరి గారు.

ప్రొద్దుట మొదటి క్లాసు పూర్తి చేసుకుని స్టాఫ్ రూములోకి వచ్చిన తన్మయి తన కళ్ళ ని తనే నమ్మలేకపోయింది.

ఎదురుగా సిద్దార్థ! తనకీ ఉద్యోగం రాక ముందు ఇంటర్వ్యూకి టిప్స్ చెప్పిన ఇంగ్లీషు లెక్చరర్ సిద్దార్థ.

తన వైపే నవ్వుతూ చూస్తున్న అతని ఎదురుగా బల్లకటువైపు కూచుంటూ, “మీరేవిటి ఇక్కడ?” అని, ఆగండి నేను చెప్తాను. కాలేజీకి కొత్తగా వచ్చిన ఇంగ్లీషు లెక్చరరు మీరే కదూ! ” అంది సంతోషంగా.

అవునన్నట్టు తలూపి, “ఊ… మీకు ఉద్యోగం వస్తుందన్న సంగతి నాకప్పుడే తెలుసు. వెల్, నైస్ టూ మీట్ యూ అగైన్” అన్నాడు.

“విశాఖ పట్నం నించి ఇక్కడికి ఎలా?” అంది మళ్ళీ.

“జోనల్ ట్రాన్స్ఫర్. మా మిసెస్ కి సెక్రటేరియట్లో ఉద్యోగం వచ్చింది” అన్నాడు.

“వెల్కం”అంది తన్మయి అతని చేతిలోని పుస్తకం వైపు చూస్తూ.

“అరుంధతీ రాయ్ “ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్”. చదువుతారా?” అన్నాడు.

తన్మయికి ఇప్పటికీ అతన్ని చూసిన మొదటి రోజు గుర్తే.

అప్పుడూ ఇలాగే చేతిలో ఉన్న పుస్తకంలో మునిగిపోయి ఉన్నాడు.

ఇప్పటికీ అదే సాదాసీదాతనం. చేతిలో పుస్తకం, భుజాన వేళాడే సంచీ, కళ్ళల్లో భావుకత్వం.

స్టాఫ్ రూములో చుట్టూ అందరి పరిచయాలు అయ్యేక, “రండి సిద్దార్థా! కాలేజీ చూపిస్తాను” అంటూ దారి తీసింది తన్మయి.

“సిద్ధూ. సిద్ధూ అంటే చాలు” అన్నాడు ఆమెని అనుసరిస్తూ.

కంప్యూటరు లాబ్ లోకి  అడుగుపెట్టగానే “మేడం అచ్చిందే” అంటూ  పిల్లలు చుట్టూ మూగేరు.

“ఈయన కొత్త ఇంగ్లీషు సారు, ఇక మీదట ఈ సారు కూడా మీకు కంప్యూటరుపాఠాలు చెప్తారు” అంది.

“తెలుగు చదువుకున్న మీకు కంప్యూటర్సు ఎలా పరిచయం?” అన్నాడు సిద్దార్థ బయటకు వస్తూనే.

“ప్రభు” అని నోటి చివరి వరకూ వచ్చినా తమాయించుకుని, “ఈ మధ్యే స్నేహితుల ద్వారా కొద్దిగా నేర్చుకున్నాను” అంది.

తన్మయి మాటలో తడబాటు చూసి, “నేనూ పెద్దగా ప్రావీణ్యుణ్ణి కాదులెండి. ఇంత కు ముందు నేను పనిచేసిన కాలేజీ కోసం కంప్యూటర్సులో ఏదో చిన్న డిప్లొమా చేసేను” అన్నాడు పరధ్యానంగా బయటకు చూస్తూ.

సిద్ధార్థ అలా పరధ్యానంగా మాట్లాడుతూంటే అతని ముఖ కవళికల్లో వివేకానందా పాఠశాలలోని మురళి కనిపించాడు తన్మయికి.

యాదృచ్ఛికమే అయినా తన్మయి సంతోషంతో తనలో తను ఉప్పొంగుతూ “అజ్ఞాత మిత్రమా! మురళిని ఈ రూపంలో నా దగ్గరకు పంపేవా?” అని అనుకుంది.

ఆమె ముఖంలోని చిన్న దరహాసాన్ని గమనించనట్టే వరండాలోకి నడిచేడు సిద్దార్థ.

కాలేజీ ఆవరణలో నుంచి కనిపిస్తున్న పొద్దు తిరుగుడు తోట వైపు చూస్తూ,

“Ah! sunflower, weary of time,

Who countest the steps of the sun,

Seeking after that sweet golden clime

Where the traveller’s journey is done” అన్నాడు.

“విలియం బ్లేక్ కదూ!” అంటూ  తన్మయి ఒక పక్కగా ఎండిన పూల వైపు చూస్తూ

“What came for them? Not death. Just the end of living” అంది.

అవునన్నట్లు తలూపి, “గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్” కూడా చదివేసేరన్న మాట అన్నాడు నవ్వుతూ.

అతనితో మాట్లాడుతున్నంతసేపు ఏదో జన్మలో తను కోల్పోయిన స్నేహితుడు తిరిగి తనకి లభించినట్లయ్యి తన్మయికి జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయినట్లు హాయిగా అనిపించసాగింది.

“ధన్యవాదాలు అజ్ఞాతమిత్రమా!” పైకే అంది వెనక్కు వస్తూ.

కాలేజీ వాచ్ మేన్ తో మాట్లాడుతూన్న సిద్దార్థ గొంతు వెనక నించి వినిపిస్తూంది.  గంభీరమైన గొంతు కాకపోయినా, వినాలనిపించే గొంతు. ఇందాకా అతను విలియం బ్లేక్  కవిత  చెప్తున్నంత సేపూ ఆతని ముఖం వైపే చూస్తూ ఉండి పోయింది. ఏమనుకున్నాడో ఏమో!

ఆ రోజంతా ఎన్నో ఏళ్ళ తర్వాత తన జీవితంలోకి వసంతం వచ్చినట్లు  అత్యంత ఆనందంగా అనిపించసాగింది తన్మయికి.

జీవితం ఎంత విచిత్రమైనదో కదా! ఇక ఎప్పుడూ కలవలరనుకున్న వాళ్ళు మళ్ళీ అనుకోకుండా ఇలా కలవడం గొప్ప విషయంగా తోచింది తన్మయికి.

స్టాఫ్ లో అంతా చుట్టు పక్కల ఊళ్ళ వాళ్ళే.

వాళ్ళిద్దరూ ఒకే  ప్రాంతం  నించి వచ్చిన వాళ్ళు కావడం వల్లనూ, ముందే పరిచయం ఉండడం వల్లనూ అతి త్వరగా మిత్రులయ్యేరు తన్మయి, సిద్దార్థలు.

***

          మరుసటి వారంలో డిగ్రీ కాలేజీలో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకు ఇన్విజిలేషను ప్రారంభం అయ్యింది.

ఇప్పటికి తమ కాలేజీలో రెండు మూడు పరీక్షలకు ఇన్విజిలేషను చేసింది తన్మయి.

తన తోటి ఇన్విజిలేటర్లు ఎప్పుడూ కాపీ రాయుళ్లని చూసీ చూడకుండా వదిలెయ్య డం గమనించింది తన్మయి.

కానీ తన వరకూ తనకి అలా చూసీ చూడనట్లు ఊరుకోవడం ఒక విధంగా వాళ్ళని ఎంకరేజ్ చెయ్యడమే అని అనిపిస్తుంది.

ఒకట్రెండు సార్లు ఈ విషయమై తనకూ, తోటి లెక్చరర్లకూ వాగ్వివాదం కూడా జరిగింది.

ఇక ఈ రోజు పరీక్ష ప్రారంభమైన అరగంటలో చీటీలతో దొరికిన ఇద్దరు, ముగ్గుర్ని వెంటనే పేపరు లాక్కుని బయటకు పంపించేసింది తన్మయి.

ఇద్దరు పేపరు నిశ్శబ్దంగా ఇచ్చి తల వంచుకుని వెళ్ళిపోయేరు.

ఒకడు మాత్రం బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి తన వైపు కొరకొరా చూడడం గమనిం చింది తన్మయి.

పక్క గదిలో ఇన్విజిలేషను చేస్తున్న సిద్దార్థ మధ్యలో గుమ్మం దగ్గిరకి వచ్చి, తొంగి చూసి ప్రశంసా పూర్వకంగా నవ్వేడు.

“అలా ఒకరిద్దర్ని పంపిస్తే, మిగతా వాళ్ళకి కాస్త బుద్ధొస్తుంది” అంది తన్మయిమెల్లిగా.

“పోరగండ్లు పేసవుడే కస్టం, పోనీలే మేడం తియ్” అన్నాడు తన్మయితో బాటూ ఇన్విజిలేషను చేస్తున్న మరొక లెక్చరర్ దగ్గిరికి వచ్చి.

తన్మయి అతనికేమీ సమాధానమివ్వకుండా ముందుకు కదిలి, “స్వంతంగా మీకు ఎంత వస్తే అంతా రాయండి, నాకు చీటీలు కనిపిస్తే మాత్రం పరీక్ష రాయనివ్వను” అని అందరికీ వినబడేటట్టు గట్టిగా చెప్పింది.

పిల్లల్లో అసహనం కనబడినా, తన్మయి తీక్షణమైన చూపులకు తలలు వొంచుకుని రాయసాగేరు.

పరీక్షకాగానే బండి స్టాండు వైపు నడిచింది తన్మయి.

అప్పటికే సిద్దార్థ తన బండిని స్టార్టు చేయబోతున్నాడు. అతన్ని దాటుకుని మరో మూడు బళ్ళకవతల ఉన్న తన బండిని చూస్తూనే  అవాక్కయిపోయింది తన్మయి.

బండి సీట్లు బ్లేడుతో కోసేసి ఉన్నాయి. హెడ్ లైట్లు పగల గొట్టేసి, బల్బులు బయటికి వేలాడదీసి ఉన్నాయి.

సిద్దార్థ హెల్మెట్టు పెట్టుకోబోతూ “తన్మయీ, ఏమైంది?” అన్నాడు కొయ్యలా నిలబడి పోయిన తన్మయి దగ్గరకువస్తూ.

తన్మయికి గొంతు పిడచకట్టుకుపోయింది.

అతికష్టమ్మీద చీటీ పాడి కొనుక్కున్న బండి. ఎంతో ఇష్టంగా, ప్రేమగా చూసుకుంటు న్న బండి. సెకండ్ హాండ్ బండైనా కొత్త బండిలా అపురూపంగా, జాగ్రత్తగా చూసుకుంటూ వస్తూంది.

అదలా ఉంచితే, రిపేరు చేయించేందుకు ఎంత అవుతుందో కూడా తెలీదు.చేతిలో సరిపడా డబ్బుల్లేవు.

అలా చినాభిన్నంగా ఉన్న బండిని చూడగానే కాళ్ళల్లో సత్తువ అంతా పోయినట్ల య్యింది. నిలబడలేక పక్కనే ఉన్న చెట్టు మొదలుకి ఆనుకుంది.

బాధతోనూ, ఉక్రోషంతోనూ, అదిమి పట్టిన పెదవి మీంచి కళ్ళలోకి కన్నీరు ఉబికి రాసాగింది.

సిద్దార్థ చకచకా చుట్టూ నాలుగడుగులు వేసి పరిశీలనగా చూసేడు.

“మనం లోపల ఉన్నప్పుడు వర్షం పడింది కదూ. అందుకే ఇక్కడ అడుగుజాడలు న్నాయి. వీటిని బట్టి ఎవరో ఇద్దరు బండి మీద వచ్చి మరీ పగలగొట్టేరు. బహుశా: ఏ క్రికెట్ బాట్టో తెచ్చినట్టున్నారు. సీట్లు కత్తిరించడానికి షార్ప్ గా ఉన్న బ్లేడ్ ని ఉపయోగిం చేరు. లోపల ఉన్న స్పాంజితో సహా బయటికి వచ్చేసిందంటే ఎన్నిసార్లు కసిగా కోసేరో అర్థం అవుతూంది. భయపడకండి తన్మయీ. ఎవరు చేసేరో కనిపెడదాం. ఎందుకైనా మంచిది, ముందు లోపలికి వెళ్ళి కాలేజీలో చెప్పి వద్దాం” అని ముందుకి చకచకా కదిలేడు.

తన్మయి స్ఠాణువులా అలాగే ఉంది.

ఒకటే ఆలోచిస్తూంది, “ఎవరు చేసి ఉంటారు? తనకి ఈ ఊళ్లో ఎవరు శత్రువులు న్నారు?  పొద్దున్న తను చీటీ లాక్కుని బయటికి పంపిన కుర్రాళ్లా? సిద్దార్థ చెప్పినదాన్ని బట్టి బండి మీద వచ్చి పగలగొట్టే ధైర్యం ఆ కుర్రాళ్లకే ఉండి ఉండాలి”

ఆలోచన రావడమే తడవు. కళ్లు తుడుచుకుని వేగంగా కదిలింది ముందుకు.

“సిద్ధూ! పోలీస్ స్టేషన్ కి వెళ్దాం” అంది స్థిరంగా.

అప్పటికే అక్కడికి వచ్చిన మరో ఇద్దరు లెక్చరర్లలో ఒకాయన “ఎందుకులే మేడం పోనియ్యి. ఆళ్ళ పాపాన ఆళ్ళే పోతారు.” అన్నాడు.

మరొకాయన “నే చెప్పిన గదా మేడం, ‘పిలగాళ్ళని సూసీ సూడక ఊకో’ అని. ఇన్నావు గావు, సూడు గిప్పుడేవైనదో” అని నిట్టూర్చేడు.

తన్మయికి వాళ్ళ వరస మరింత చికాకు కలిగించసాగింది.

“అయితే ఇప్పుడేమంటారు? నేను స్ట్రిక్టుగా ఉన్నందు వల్లే ఇదంతా జరిగింది కాబట్టి దీనికి నేనే కారణమనా?” అంది తన్మయి.

ఆమె గొంతులోని దుఃఖంతో కూడిన వేదనని గమనించి వాళ్ళే  “అరే ఊకో మేడం, మీకేమన్న అయితే మేమంతా ఉన్నది ఏమిటికి? మీరన్నది నిజమే. నడుండ్రి పోలీసు స్టేషనులో కంప్లైంటు ఇద్దాం. గిట్లనే ఊరుకుంటే రేపు అందరి బళ్ళు ఇరగ గొడ్తరు” అని ముందుకి దారి తీసేరు.

డిగ్రీ కాలేజీ నుంచి తాయిబాకు ఫోను చేసి బాబుని చూడమని చెప్పింది తన్మయి.

తను ఇవేళ ఇంటికి వెళ్ళే సరికి ఎంత సమయం అవుతుందో ఏమో! తాయిబా లేకుంటే ఇలాంటి సమయాల్లో తన పరిస్థితి ఏవిటి? ఊరు కాని ఊరులో తనని ఆదుకు న్న ఆమె పట్ల కృతజ్ఞతతో నిండి పోయింది తన్మయి మనస్సు.

స్టేషను వరకూ సిద్దార్థ బండి మీద తీసుకుని వెళ్లాడు.

“సిద్ధూ! మీ వెనకాల ఇటు వంటి పరిస్థితుల్లో కూచోవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు” బాధగా అంది.

“అలా ఎప్పుడూ అనుకోవద్దు. జీవితంలో అనుకోకుండా కొన్ని కష్టాలు ఎదురవు తాయి. అంత మాత్రాన కృంగిపోకూడదు” అన్నాడు సిద్దార్థ అనునయంగా.

***

          నలుగురు లెక్చరర్లు కలిసి వెళ్ళడంతోనో, లేదా అంతా ఊర్లో తెలిసిన వాళ్ళు  కావడం వల్లనో ఎస్సై  టీలు, బిస్కెట్లు  తెప్పించి మర్యాద చేసేడు.

ఓపిగ్గా తన్మయి చెప్పినదంతా విని, “ఏం పర్లే మేడం, మీకు జరిగినది శానా దారునం. మీకు అనుమానం ఉన్న పేర్లు చెప్పండి, ఒక్కొక్కణ్ణీ గుంజుకొచ్చి, విషయం అరగంటలో తేలుస్తా. ఈడికి అచ్చి మంచి పని చేసిన్రు. గిసుంటివి ఊకుంటే, తర్వాత గీ పోరగాళ్లే రౌడీషీటర్లయితరు. గిప్పుడే బుద్ది చెప్పాల” అన్నాడు.

ఇంతలో కూడా ఉన్న లెక్చరర్లు  అందుకుని తన్మయి ఉదయం బయటకు పంపిన పిల్లల పేర్లు నాలుగూ ఇచ్చేరు.

ఎస్సై అన్నట్లే అరగంటలో నలుగుర్నీ తీసుకొచ్చి స్టేషనులో నిలబెట్టేరు.

అందులో ఒకడు పోలీస్ స్టేషనుకి రాగానే భయపడి “సా, నన్నేం జెయ్యకురి. అంతా జెప్త. మా నాయినికి జెప్పకురి” అని కాళ్ళావేళ్ళా పడసాగేడు. ఇద్దరు కళ్ళు దించుకుని నిలబడ్డారు. ఒకడు నిర్లక్ష్యంగా చూడసాగేడు. తన్మయి వెంటనే గుర్తు పట్టింది. పొద్దున్న అదే చూపు.

ఎస్సై కనుసైగతో నలుగుర్నీ ఎదురుగా ఉన్న సెల్లోవేసి, పెద్ద దుడ్డు కర్రతో దబ దబా నలుగురికీ నాలుగు తగిలించేడు కానిస్టేబుల్.

అప్పటిదాకా నిర్లక్ష్యం ప్రదర్శించిన వాడితో సహా నలుగురూ “బాబోయ్” అని అరుస్తూ ఏడవసాగేరు.

ఆ దృశ్యం చూడలేక తన్మయి కళ్ళు గట్టిగా మూసుకుంది.

మరో గంటలో ఆ పిల్లల తరఫున ఒక పెద్దమనిషి, అతని కూడా మరో నలుగురు అనుయాయులు వచ్చేరు. చూడ్డానికి గ్రామపెద్దలా ఉన్నాడతను.

తమ దగ్గిరికి వచ్చి చాలా మర్యాదగా నమస్కరించి, “మేడం, ఈ  పోరలంతా మా ఊరోల్లు. తెలిసో తేలికో తప్పు చేసిన్రు. మీ బండి కొత్త బండి లెక్క గిప్పుడే బాగు చేపిస్త. ఇంకో సారి గిట్ల కాకుండ హామీ ఇస్త. ఇంతడితొ వొదిలెయ్యి మేడం, కేసు గీసు పెట్టమాకు.” అన్నాడు.

అంతా తన్మయి వైపు చూసేరు. అప్పటికే ఆ పిల్లలకు తగిలిన దెబ్బలకు తన్మయి మనసులో బాగా బాధ కలగసాగింది. తన బండిని వాళ్ళు ఆవేశంలో పగలగొట్టి తప్పు చేసినా, అంత దుడ్డుకర్రతో కాళ్ళు విరగ్గొట్టినట్లు వాళ్ళని చితక్కొట్టడం చూడలేక పోయింది.

ఆ పెద్ద మనిషికి ప్రతి నమస్కరించి “చూడండి. మీ పిల్లల మీద నాకేమీ కక్షలేదు. పరీక్షల్లో కాపీ కొట్టడం నీతి, నిజాయితీ అయిన పనికాదు. అది అర్థమయ్యేటట్లు చెప్పండి.” అని

ఇన్స్పెక్టర్ వైపు తిరిగి “వాళ్లను వదిలెయ్యండి సర్ ”  అంది.

“మంచిది మేడం, బండి సాయంత్రంలోగా బాగు చేయించి ఇంటికి పంపిస్తా” అన్నాడు ఇన్స్పెక్టర్ తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ.

బయటకు వచ్చేసరికి చీకటి పడే వేళవుతుంది.

మిగతా లెక్చరర్లు , “మేడం, జర జాగ్రత్తగ ఉండుండ్రి. పోరగాల్లు మల్ల ఏమైన సేసిన సేస్తరు” అన్నారు.

సిద్దార్థ సెలవు తీసుకుంటూ, “ఐ రియల్లీ ఎప్రిషియేట్ యువర్ కరేజ్ అండ్ గుడ్ హార్ట్ ” అన్నాడు.

తన్మయి ఇంటికి వచ్చిపడిందే గానీ లెక్చరర్లు  చెప్పిన  చివరి మాటలే చెవుల్లో తిరుగుతున్నాయి. “జర జాగ్రత్త. మల్ల ఏమైన….”

బాబు అప్పటికే నిద్ర పోతున్నాడు. అప్పుడు వచ్చేయి నిశ్శబ్దంగా కన్నీళ్లు. ఒంటరి జీవితపు భయంతోనూ, బాధతోనూ.

ఇలాంటివి ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో, ఎలా ఎదుర్కోవాలో.

తలుపుకి ఎన్ని అడ్డం పెట్టినా రాత్రంతా కలత నిద్రతో భయపడుతూ ఉంది. తను ఇలా జీవితాంతం ఒంటరిగా బతగ్గలదా? తనకి తోడెవరైనా ఉంటే బావుణ్ణని తీవ్రంగా అనిపించసాగింది.

ఇది రెండోసారి తనకి ఇటు వంటి భావన కలగడం.

మొదటిసారి బాబుకి వొంట్లో బాలేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడనిపించింది.

చిత్రంగా ప్రభు మళ్లీ జ్ఞాపకం వచ్చేడు. అతన్ని దూరం పెట్టినప్పట్నుంచి ఎందుకో అతని మీద ప్రేమ కలగసాగింది.

శేఖర్ తనని ఇష్టపడ్డానని చెప్పినప్పుడు తను ఏమీ ఆలోచించలేదు. అంతటి అందగాడు తనని కోరుకుని రావడమే చాలన్నట్లు సంతోషపడి అతన్ని ఇష్టపడడం మొదలు పెట్టింది.

కాదుకాదు, అతన్ని ఇష్టపడ్డానని అనుకుంది. అతన్ని ఉన్నతంగా  ఊహించు కుంది. తను చిన్నప్పటి నించి చూసిన చుట్టూ  ఉన్న అందరి స్త్రీలలాగే భర్త ఏం చేసినా ఓపిక పట్టింది. బాబుకి తండ్రి కావాలనే బలహీనతతో అన్నీ సహించింది. కానీ అతను తన జీవితాన్ని సర్వ నాశనం చేసేడు. చేతిలో పిల్లాణ్ణి మిగిల్చి నిర్దయగా వెళ్లిపోయేడు.

ఇప్పుడు ప్రభు తనని ఇష్టపడుతున్నానని వచ్చేడు. తను నిర్దయగా పంపివేసింది.

అతన్ని దూరం పెట్టినప్పట్నుంచి తనకి ఇష్టం పెరగడానికి కారణం ఏవిటి? అసలు అతన్ని ఇష్టపడడానికి కారణం ఏవిటి?

అతను అంత అందమైన వాడేమీ కాదు, ఇక అతని ఉద్యోగం తనతో సమానమైనదే. అతని కుటుంబ పరిస్థితులు తన కంటే గొప్పవేమీ కాదు.

మరి?

“అతని మంచి మనసు”. అవును, తనని అపురూపంగా చూసే విధానం, అతని కళ్లల్లో కనిపించే నిజాయితీ అయిన ప్రేమ.

పైగా ఎటు వంటి దురలవాట్లు లేవు.

తన ప్రమేయం లేకుండా తనని కోరుకుని వచ్చిన వాడు. పెళ్లి చేసుకుని తనతో జీవించాలని ఇష్టం చూపిస్తున్నవాడు.

సరిగా ఆలోచిస్తే, అతనికి తనని పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు.

అయినా తనని వలచి రావడానికి తన దగ్గర ఏవుందని? అందమా అంతంత మాత్రం. ఒక సారి పెళ్లయ్యి, చేదు జీవితం బారిన పడి, కన్న బిడ్డ కోసమే కాలం వెళ్ళ బుచ్చుతున్న సన్యాసిని తను.

ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం తప్ప తన దగ్గర ఆకర్షింపదగినది ఏవుంది?

ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు తన్మయికి.

మర్నాడు లేవగానే కలగాపులగంగా ముందురోజు జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం వచ్చేయి.

“జర జాగ్రత్తగ ఉండుండ్రి” అన్న లెక్చరర్ల మాటలు చెవిలో గింగుర్లు తిరిగేయి.

కాలేజీకి వెళ్లే త్రోవలో మార్కెట్టులోకి వెళ్లి ఎందుకైనా మంచిదని ఒక చిన్న చాకు కొని పర్సులో వేసుకుంది.

***

          ఆ రోజు కాలేజీలో క్లాసులో నుంచి వచ్చే సరికి ఉత్తరం తన టేబుల్ మీద పెట్టి ఉంది.

అడ్రసు మీద చేతివ్రాత చూడగానే గుర్తు పట్టింది ప్రభు అని.

ఆతృతతగా కవరు చింపింది తన్మయి.

జలజలా రాలిపడ్డాయి గులాబీ రేకులు.

కాగితం మడత పైన కృష్ణశాస్త్రి గారి కవిత –

నా విరులతోట పెంచుకున్నాడనొక్క
పవ్వడపు గులాబి మొక్క 

నా ప్రణయజీవనమ్ము

వర్షమ్ముగా ననయమ్ము కురిసి” 

మడత విప్పగానే గులాబీ సువాసన గుప్పుమంది.

“తనూ!

బావున్నావు కదూ!

నీ షరతు ప్రకారం నేను ఏడాది వరకూ నిన్ను చూడడానికి రాను.

కానీ ఉత్తరం రాయడానికి షరతులేవీ లేవు కదూ! పూలు పంపడానికి షరతులు లేవు కదూ!

ఇవేళ ఆఫీసుకి వెళ్తూంతే రోడ్డు పక్కన పూల దుకాణంలో నీ నవ్వులా ఆహ్లాదంగా ఉన్న గులాబీ పూలు కనిపించాయి.

అన్నీ పంపలేను కాబట్టి ఇదిగో నా హృదయం లాంటి ఈ చిన్న గులాబీని పంపు తున్నాను, స్వీకరిస్తావు కదూ!

దారంట చిన్నపిల్లల్ని ఎవరిని చూసినా నువ్వు అక్కడ పసిపిల్లాడితో గడుపుతున్న ఒంటరి జీవనమే గుర్తుకు వస్తూంది.

అనుక్షణం నీ గురించిన ఆలోచనలు నన్ను నిలవనీయకుండా చేస్తున్నాయి.

ఒక్క ఉత్తరం వ్రాయవూ?

నీ కోసం సంవత్సరం ఏవిటి, ఒక జీవిత కాలమైనా ఇక్కడే వేచి ఉంటాను!

సదా

నీ

ప్రభు”

రోజల్లా మళ్ళీ మళ్ళీ ఉత్తరం చదువుకుంటూ అన్యమనస్కంగా ఉన్న తన్మయిని పట్టించుకున్నా, ఏమీ ఎరగనట్లు తన మానాన తను పుస్తకంలో తల దూర్చి కూచున్న సిద్ధార్థ దగ్గిరికి వచ్చి, “సిద్ధూ! మీతో మాట్లాడాలి” అంది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.