
వెనుతిరగని వెన్నెల(భాగం-56)
-డా|| కె.గీత
(ఆడియో ఇక్కడ వినండి)
https://youtu.be/Dq_nHZByc2g?feature=shared
వెనుతిరగని వెన్నెల(భాగం-56)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీలో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా ఎదురయ్యి పెళ్ళి చేసుకుంటాడు.
***
పెళ్ళయిన మొదటి రాత్రి ప్రభు దు:ఖంతో భారమై దిగులుగా గడిచింది తన్మయికి.
ఉదయం లేస్తూనే తన్మయి కళ్ళలోకి చూడలేనట్లు కళ్ళు దించుకుని “నిన్ను నిరాశ పరిస్తే నన్ను క్షమించు” అన్నాడు.
పెళ్ళయితే చేసుకున్నాడు గానీ అతని మనస్సులో అపరాధభావన వెంటాడుతోం దని అర్థమైంది తన్మయికి.
చిన్నగా అతని తల నిమిరి “ఫర్వాలేదు, ముందు మన సమస్యలన్నీ చక్కబడనీ” అని బాబుని తీసుకురావడం కోసం తాయిబా దగ్గిరికి వెళ్ళింది.
తాయిబా ఏదో నవ్వులాటగా అనబోయి, అతి సాదాసీదాగా నైటీలో ఉన్న తన్మయిని చూసి ఆగిపోయింది.
“థాంక్స్ తాయిబా, రేపట్నుంచి వీణ్ణి మా దగ్గిరే పడుకోబెట్టుకుంటాను” అంది తన్మయి.
బాబుని స్కూలుకి పంపించి తనూ త్వరగా కాలేజీకి తయారయ్యింది.
ప్రభుకి పెట్టిన బాక్సు వంటింటి గట్టు మీదే ఉండడం చూసి నిట్టూర్చింది.
కాలేజీకి బండి మీద వెళ్తున్నంత సేఫూ “అతను ఈ పరిస్థితుల నుంచి త్వరగా తేరుకోవాలంటే ఏం చెయ్యాలా అని” ఆలోచించసాగింది.
బస్టాండు దాటుతూండగా పరిచయమైన ముఖమేదో తననే చూస్తున్నట్టనిపించి వెనక్కి చూసింది.
పెదనాన్న. హైదరాబాదులో ఉండే పెద్దమ్మ భర్త. ఇక్కడెందుకున్నాడు?
వెనక్కి వెళ్దామా అని ఒక్కసారి ఆలోచించి విరమించుకుంది.
ఎప్పుడెళ్ళినా ఒక్క మాట కూడా మాట్లాడడం ఇష్టం లేనట్లు మొహం పెట్టుకుని ఉంటాడు.
బండి అనుకోకుండా ఆగిపోవడంతో పక్కకు తీసి కిక్కు కొడుతూ అద్దంలో చూసు కుంది.
బయలుదేరే హడావిడిలో చూసుకోలేదు. పసుపుతాడు, మంగళ సూత్రాలు బయటికి వేళ్ళాడుతున్నాయి.
ఆయన చూసి ఉంటాడా? అందుకేనా అలా చూస్తున్నాడు తన వైపు? ఇప్పుడు ఇంటికెళ్ళి పెద్దమ్మకు చెపితే ఆవిడ అమ్మకు ఫోను చేసి చెప్పక మానదు.
తనంతట తనుగా చెప్పకుండా ఇలా ఎవరి ద్వారానో తెలిస్తే తల్లిదండ్రులకి కోపం రాకమానదు.
అసలే ఒక పక్క ప్రభు వాళ్ళ వాళ్ళకు తెలిస్తే ఏం గొడవ అవుతుందోనని భయపడు తున్నాడు. ఈ సమయంలో తన వాళ్ళకు తెలిసి వీళ్ళు ప్రభు మీదికి గొడవకు వస్తే!
కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా తెగని ఆలోచనలతో చెమటలు పట్టసాగేయి.
సమయానికి సిద్దార్థ కూడా రాలేదు ఆవేళ కాలేజీకి.
ఎవరో చెప్పేలోగా తల్లిదండ్రులకి తనే ఫోను చేసి చెప్పాలని నిర్ణయించుకుంది.
***
ఫోను ఎత్తి అట్నించి నిశ్శబ్దంగా వింటూంది జ్యోతి.
తల్లిదండ్రులకి వార్త తన ఫోను కంటే ముందే తెలిసిందని గ్రహించింది తన్మయి.
ఆశ్చర్యకరంగా తన్మయి చెప్పింది శాంతంగా విని ” సర్లే, మీ ఇద్దరికీ పెళ్ళి జరగాల ని రాసి పెట్టి ఉంది. ఇక అంతా మంచికే జరగాలని కోరుకుందాం, కానీ ఏమోనమ్మా ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో, జాగ్రత్తమ్మా” అంది జ్యోతి.
తండ్రి మాట్లాడనే లేదు.
“ఇంకా ఆయన తేరుకోలేదు. తర్వాత మాట్లాడతారులే” అంది గుసగుసగా.
ఇంటికి రాగానే “హమ్మయ్య ఒక భారం తీరింది” అనిపించింది తన్మయికి.
ఇంత సులభంగా తల్లిదండ్రులకి తను చెప్పగలుగుతుందని, వాళ్ళు ఒప్పుకుంటా రని అనుకోలేదు. తనని చూడడానికి వచ్చినపుడు ప్రభుని చూసి మరి అంత రాద్ధాంతం ఎందుకు చేసేరో.
ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఓ పట్టాన అర్థం కారు. ఈ విషయం ప్రభుకి తెలిస్తే ఎంతో సంతోషిస్తాడు.
ఇక ప్రభు కూడా తన వాళ్ళని ఒప్పించగలిగితే చాలు.
మొహం కడుక్కుని కాటుక, బొట్టు పెట్టుకుని కొత్త పెళ్ళికూతురిగా తళుక్కున మెరిసిపోతున్న తల్లిని అదే పనిగా చూస్తున్న బాబుని అడిగింది.
“ఏంటమ్మా అలా చూస్తున్నావు?”
“ఉహూ” అని తలాడించి మంగళ సూత్రాల్ని చేత్తో ముట్టుకుని గలగలా మోగించి కిలకిలా నవ్వేడు.
దగ్గిరికి తీసుకుని ఒళ్ళో కూచో బెట్టుకుని “ఇక మీదట ప్రభు అంకుల్ ని నువ్వు “డాడీ” అని పిలవాలి” అంది.
తలాడించేడు కానీ అర్థం కానట్టు చూసేడు.
“ఎందుకంటే ఇప్పుడు అమ్మా, అంకుల్ పెళ్ళి చేసుకున్నారు. ఇక మీదట మనం ముగ్గురం ఎప్పుడూ కలిసే ఉంటాం. సరేనా?” అంది.
“ఊ..” అని “మరి నాన్న?” అన్నాడు.
“మీ నాన్న మన దగ్గిర నుంచి ఎప్పుడో వెళ్ళి పోయాడు కదా. పైగా వేరే ఎవర్నో పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఎప్పుడూ మన దగ్గిరికి రాడు, రాకూడదు. ఇప్పుడు మనం ముగ్గురం ఒకటి. ఇక ప్రభుయే నీకు డాడీ” అంది.
వాడి చిన్ని మనసుకి ఏం అర్థమయ్యిందో, ఎంత అర్థమయ్యిందో తెలీలేదు కానీ ఆ సాయంత్రం ప్రభు రాగానే “డాడీ” అని దగ్గిరికి వెళ్ళేడు.
ప్రభు నవ్వుతూ “ఏవిటి వీడు పిలుపు మార్చేసేడు?” అని వాడి వైపు తిరిగి “అయినా ఇదే బావుందిలే. అలానే పిలువు” అన్నాడు.
వాకిట్లో బాబు “సైకిలు చూసి, ఏవిటీ నవతా ట్రాన్స్ పోర్ట్ లో సామాన్లు వచ్చేసేయా?” అన్నాడు.
“ఊ” అంది టీ కప్పు చేతికిస్తూ.
తల్లిదండ్రుల దగ్గిరే వదిలేసిన డబల్ కాట్, డ్రస్సింగ్ టేబుల్, టీ.వీ, వంట సామగ్రి వంటి సామాన్లు ఇప్పటికి తెప్పించుకోవలసిన అవసరం పడింది.
ఇక పరుపు, బాబుకి వేరే వైరు మంచం, చిన్న కూలర్ కూడా జీతాలు రాగానే ఆ వారంలోనే అమరాయి.
బాబుతో పరుగులు తీసి ఆడుతున్న ప్రభుని, కిల కిలా నవ్వుతూ పరుగెడుతున్న బాబుని చూస్తూ సంతోషంగా అరుగు మీద జేరబడింది తన్మయి.
ఇటు వంటి ఆనందదాయకమైన రోజొకటి వస్తుందని తను కల్లో కూడా అనుకో లేదు.
తనకు ఆపరేషను అయినప్పుడు చూడడానికి వచ్చినప్పుడు తండ్రి చేసిన రాద్ధాంతం గుర్తుకొచ్చింది.
“ఇతను నీకు భర్త కాగలడేమో గానీ, పిల్లాడికి తండ్రి కాగలడా?”
ఎక్కడో తన మనస్సులో ఆ మాట భయం భయంగా ఇప్పటి వరకూ తనని తొంగి చూస్తూనే ఉంది. ఇక ఇప్పుడు తనకా బెంగ తీరింది.
ప్రభు ఇంటికి వచ్చిన దగ్గర్నుంచీ నిమిషం వదలకుండా వెంట వెంటే తిరుగుతూ కబుర్లు చెప్తూన్న బాబుని ఓపిగ్గా చూసుకుంటున్న ప్రభు మీద మనసంతా కృతజ్ఞత నిండి పోసాగింది.
“ఇది చాలు మిత్రమా!” అనుకుంది మనస్సులో.
***
ప్రభుని వాళ్ళ వాళ్ళకు ఉత్తరం రాయమని చెప్పడం, ప్రభు అక్కకు ఉత్తరం రాయడం. వెంటనే తనకు ఫోను రావడం. తను భయపడినట్లు కాక వాళ్ళంతా మాములు గా రియాక్ట్ అవ్వడం. ప్రభు సంతోషంగా ఇంటికి రావడం. ఫస్ట్ నైట్. తన్మయికి ప్రభు చాలా నచ్చడం. కబుర్లతో అందమైన రాత్రి గడవడం.
***
మర్నాడు ప్రభుని కన్న తల్లిదండ్రులు వస్తున్నారన్న వార్త.
***
“పెళ్ళికాగానే ఇల్లు మారదాం నాకు ఆఫీసు నుంచి చాలా దూరం అయిపోతుంది” అన్నాడు.
“బాబుతో తమకు మరొక గదైనా ఉండే ఇల్లు కావాలి నిజమే, కానీ ఇక్కడి నుంచి మరొక ఏరియాకి మారితే తను కూడా రోజూ బస్సులెక్కి తిరగాల్సి వస్తుంది. అయినా ప్రభు కోసం తనా మాత్రం శ్రమ పడక తప్పదు” సరేనంది తన్మయి.
నాకు మా ఆఫీసు నుంచి వచ్చే దారిలో అదుగో ఆ డబుల్ బెడ్రూము ఫ్లాటు నచ్చింది అన్నాడు.
తన్మయికీ బానే ఉందనిపించినా బడ్జెట్టు ఎక్కువ అనిపించింది.
అదే చెప్పింది.
“బడ్జెట్టు ఎక్కువ అయినా తప్పదు. మా వాళ్ళు మనతో ఉండిపోవడానికి ఒప్పు కున్నారు.” అన్నాడు ప్రభు సంతోషంగా.
*****
(ఇంకా ఉంది)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
