రాగసౌరభాలు-7

(కళ్యాణి రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

సఖులూ! ఈ నెల మనం  అందరికీ  తెలిసిన, నలుగురి నోట్లో నానే పేరుకల  కళ్యాణి రాగం గురించి తెలుసుకుందామా? మన తెలుగు ఇళ్ళలో ప్రతి పదిమంది అమ్మాయిల పేర్లలో ఒకటి  కళ్యాణి. ఈ కళ్యాణి రాగం అత్యంత ప్రాచీనమైనదే కాక  శుభప్రదం, కల్యాణ దాయకం.

ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందాం. కళ్యాణిరాగం 65వ మేళకర్త.  కటపయాది సంఖ్యలో ఇమడటం కోసం గోవిందాచార్యులు గారు ఈ రాగ నామానికి ముందు  “మేచక”  అనే పదాన్ని ఇమిడించారు. ఈ విధంగా మేచక కళ్యాణి కాలక్రమేణ  మేచ కళ్యాణిగా, పలుకుబడిలో కళ్యాణిగా స్థిరపడింది. వెంకట మఖీ గారి కటపయాది  పద్ధతిలో ఈ రాగం పేరుని శాంత కళ్యాణిగా పేరు పెట్టినా, మేచ కళ్యాణి  ఎక్కువ  ప్రాచుర్యంలో  ఉంది. ముత్తుస్వామి  దీక్షితులు వారు  ఒక కృతిలో  రాగముద్రని,“శాంత కళ్యాణిగా”  పేర్కొన్నారు.  ఈ రాగం  72  మేళకర్తల  ప్రణాళిక కన్నా ముందే ఉన్న రాగం.  మొట్టమొదటి ప్రతి మధ్యమ రాగం. ఈ రాగం పూర్వం  శాస్త్ర కారులకు  శుభప్రదంగా  తోచటం వలన  కళ్యాణిగా  పిలిచేవారు.

ఇక ఈ రాగం  మేళకర్త  కాబట్టి  సంపూర్ణ  రాగం.  ఇందులో స్వరాలు  షడ్జమము,  చతుస్రుతిరిషభము,  అంతర గాంధారము,  ప్రతి మధ్యమము,  చతుశృతి  దైవతం,  కాకలి  నిషాదము.  అన్ని  తీవ్ర  స్వరాలు కలిగిన రాగం.  ప్రతి మధ్యమ  రాగాలలో  అత్యంత  ప్రాచీనమైనది,  ప్రధానమైనది,  ఎక్కువ ప్రాచుర్యం కలిగినది.  సర్వస్వర  గమక  వరీకరక్తి  రాగము. మూర్చనాకారక  మేళము. అన్నీరాగచ్చాయ స్వరములు. స, ప, లు వర్జం చేసి  పాడితే  అద్భుతమైన  శ్రావ్యతను  ఇస్తుంది. అనేక  జన్యసంతతి  కలిగిన  రాగం. గీతం నుండి,  వర్ణం,  కీర్తన,  జావలి పదం,  తిల్లానా,  వంటి  అన్ని రచనలకు  అనువైనది. రాగాలాపన, స్వర కల్పన  రాగం, తానం, పల్లవి,  వంటి మనోధర్మ సంగీతా నికి,  అత్యంత  విస్తృతి  కలిగిన రాగం.  కచేరి  ప్రారంభంలో  పాడదగిన రాగం.  జంట, దాటు  ప్రయోగాలకు  అనువైన  రాగం.

శంకరాభరణం  శివునికి  ప్రీతికరమైతే,  కళ్యాణి  జగజ్జనని  శక్తికి  ఆనందం ఇచ్చే రాగం.  రాగాలలో  రాణి వంటిది కళ్యాణి.  జగజ్జనని పేరుతో ఉన్న  ఈ రాగం,  అమ్మ  మృదువైన  స్పర్శను  అనుభూతింప జేస్తుంది.  భక్తి,  శృంగార,  వాత్సల్య భావాలను  ప్రేరేపిస్తుంది.  ఈ రాగాన్ని  భక్తి శ్రద్ధలతో  ఔపోసన పడితే,  కల్యాణ  కారకము అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది.  విన్నవారి మనసులోని భయాన్ని  చీకటిని  పారద్రోల గలదు. ఆత్మస్థైర్యాన్ని  కలిగిస్తుంది.

హిందుస్తానీ  సాంప్రదాయంలో  కళ్యాణి రాగాన్ని యమన్  అంటారు.  పాశ్చాత్య  సంగీతంలో  “లిడియన్  మోడ్”  గా  పిలుస్తారు.  అన్నివేళలా పాడదగినదే కానీ,  తీవ్ర స్వరాలు  ఉండటంవల్ల,  సాయంసమయం  శ్రేష్టమైనది.  పెళ్ళిళ్ళలో  ప్రముఖంగా  వినిపించే రాగం.

త్యాగరాజ  స్వామి వారి  సంగీత ప్రతిభను  విన్న తంజావూరు మహారాజు  శరభోజి,  తమ ఆస్థానానికి ఆహ్వానించారట.  అనేక  కానుకలు  సమర్పిస్తూ,  తనను  ప్రస్తుతిస్తూ  గానం చేయమని  అడిగారట.  శ్రీరాముని సేవే  పరమావధిగా ఉన్న  త్యాగయ్య  కళ్యాణి రాగంలో  “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి  సేవ సుఖమా” అనే కీర్తన  పాడారట.  చరణంలో “మమతాబంధన యుత  నరుస్తుతి  సుఖమా?”  అని ప్రశ్నిస్తారు.  త్యాగరాజ స్వామి వంటి  అనితర భక్తిపరులు ధన ధాన్యములను  తృణప్రాయముగా  భావిస్తారు  కదా!

ఇప్పుడు  కొన్ని  ప్రసిద్ధ రచనలు  పరికిద్దామా?

శాస్త్రీయ  సంగీతం
1 నిధి  చాలా  సుఖమా శ్రీ త్యాగరాజు
2 సుందరి  నీ దివ్య   రూపము శ్రీ త్యాగరాజు
3 శివే పాహిమాం శ్రీ త్యాగరాజు
4 ఏతావునరా శ్రీ త్యాగరాజు
5 కమలాంబాం భజరే ముత్తుస్వామి దీక్షితులు
6 హిమాద్రి సుతే శ్యామశాస్త్రి
7 అద్రి సుత వర స్వాతి తిరునాళ్ళు
8 నన్ను బ్రోవమని చెప్పవే రామదాసు
9 దయమాడో రంగా పురందరదాసు
10 త నోం నోం త దర తిల్లాన బాలమురళీకృష్ణ
లలిత సంగీతం
తల నిండా  పూదండ దాశరధి ఘంటసాల
ఆకాశమున  చిరుమబ్బుల  చాటున బాలమురళి
అదిగదిగో  అదిగో దేవులపల్లి పాలగుమ్మి
సినిమా సంగీతం
రావే నా చెలియా మంచి మనసుకు  మంచి రోజులు ఘంటసాల
మనసున మల్లెల మల్లీశ్వరి భానుమతి
జగమే మారినది దేశద్రోహులు ఘంటసాల
మనసులోని కోరిక భీష్మ సుశీల
సావిరహే  తవధీన విప్రనారాయణ భానుమతి
సలలిత రాగసుధారస నర్తనశాల బాలమురళి, లత

సావిరహే  తవధీన 

https://youtu.be/GnK3UgH0d54?si=aDhJotbULL-LIH5r

కళ్యాణి  రాగం  విశేషాలతో  కూడిన  ఈ  వ్యాసం  మీకు  నచ్చిందని  భావిస్తాను.  వచ్చేనెల  మరొక  అందమైన  రాగ  విశేషాలతో  మీ ముందు ఉంటాను.  అంతవరకు  సెలవా మరి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.