
యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
చూడాల్సిన ప్రదేశాల దగ్గర్నించి, ఎప్పుడు వెళ్లాలి అనేదాకా తర్జన భర్జనలు తప్పలేదు.
అయితే ఒక్క విషయానికి మాత్రం ఇద్దరం ఏకనిర్ణయానికి వచ్చాం. అదేవిటంటే-
మేం ప్రపంచ దేశాలు చుట్టి రావాలంటే అతి ముఖ్యమైనవి వనరులు. మొన్న ఆస్ట్రేలియా ట్రిప్పులాగా ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టి ఒక్కో ట్రిప్పుకి వెళ్లాలంటే సంవత్సరంలో ఒక్క ట్రిప్పు కూడా చెయ్యలేం.
కాబట్టి మధ్యే మార్గంగా మేం ఆస్ట్రేలియా ట్రిప్పు బుక్ చేసుకున్న ట్రిప్ మాస్టర్స్ లో ఎప్పుడు చవకగా టిక్కెట్లు వస్తే అప్పుడు వెళ్లొద్దాం అని నిర్ణయించుకున్నాం. అలాగని మంచు వణికించే చలిలో అడుగు తీసి అడుగు వెయ్యలేం కాబట్టి, అలాగని మంచి డిమాండు ఉండే వేసవిలోనూ కాకుండా ఏప్రిల్, మే నెలల్లో అంటే వసంత కాలంలో ఇంకా అమెరికాలోని బడులకి సెలవులు ఇవ్వకముందే వెళ్లొద్దామని అనుకున్నాం. ఏప్రిల్ లో అయితే మా సిరికి స్ప్రింగ్ బ్రేకు సెలవులు ఒక వారం కలిసొస్తాయి కూడా. మొత్తానికి ఎప్పుడైనా కనీసం పది, పదకొండు రోజులు కావాలి. వెళ్లడానికి, రావడానికి చెరో రోజు ప్రయాణంలో పోతే అక్కడ చూసేందుకు మూడు ఊళ్లలో మూడేసి రోజులన్నమాట.
ఇక మేం చూడాలనుకున్న దేశాలు కనీసం ఒకట్రెండు కలిసే చవకైన ట్రిప్పు వెతికే బాధ్యత నేను తీసుకున్నాను. ట్రిప్ మాస్టర్స్ లో ఏవేవో ప్యాకేజీ టూర్లు ఉన్నప్పటికీ నాక్కావాల్సిన లండన్, పారిస్ లతో మాకు కావల్సిన పది, పదకొండు రోజుల వ్యవధిలో రెండు, మూడు ప్యాకేజీలు ఉన్నాయి.
అయితే వాటిలో తక్కువ రోజుల్లో ఎక్కువ ప్రదేశాలు చూడాలన్నది నా అభిమత మైతే, సత్యకేమో ఎక్కువ రోజులైనా తక్కువ ప్రదేశాలు చూడాలన్నది ఆకాంక్ష.
మొత్తానికి ఇద్దరికీ నచ్చినట్లు తొమ్మిది రోజుల్లో లండన్, పారిస్, రోమ్ అనే పాప్యులర్ టూరు దొరికింది. ఒక్కొక్క ఊళ్లో మూడేసి రోజులన్నమాట.
ట్రిప్ మాస్టర్స్ సైటులో ఫ్లైటు, హోటళ్లతో కలిపిన బేసిక్ ప్యాకేజీలుంటాయి. వాటి మీద అదనంగా లోకల్ టూర్లు, టాక్సీలు వంటివి కావాలంటే ఎన్నిక చేసుకుని బుక్ చేసుకోవచ్చు.
మేమైతే ఇంటర్నెషనల్ ఫ్లైట్లు, అక్కడ దేశాల మధ్య లోకల్ ఫ్లైట్లు, రైళ్లు, హోటళ్లు కలిపిన బేసిక్ ప్యాకేజీల్లో తక్కువ రేటుకి వస్తున్న ప్యాకేజీతో బుకింగు మొదలుపెట్టాం.
ఏప్రిల్ నెలలో ఈస్టర్ తర్వాతి వారంలో బేసిక్ ప్యాకేజీ అమెరికను డాలర్లలో ఒకొక్కళ్ళకి 2300 డాలర్లకి వచ్చింది. అంటే శాన్ ఫ్రాన్సిస్కో నించి లండనుకి ఫ్లైటు, లండను నించి పారిస్ కి రైలు, పారిస్ నించి రోముకి ఫ్లైటు, రోము నించి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కో కి ఫ్లైటు, మొత్తం మూడు నగరాల్లో హోటళ్లు కలిపి ఆ రేటన్నమాట. ఇండియను రూపాయల్లో దాదాపుగా మనిషికి లక్షా ఎనభై వేలన్నమాట.
అలవాటుగా ఇతర సైటుల్లో ప్యాకేజీ టూర్లు, ఫ్లైట్లు విడిగా, హోటళ్లకి విడిగా రేట్లు కూడా చూసాను. అయితే కొన్నిచోట్ల కేవలం రానూ పోనూ ఫ్లైటుకే రెండేసి వేల డాలర్లు పెట్టాల్సి వస్తూంది. ఇక ఇదే బెస్టని నిర్ణయించుకున్నాం.
అయితే తీరా డబ్బులు కట్టాక వీసాలు రిజక్టు అయితేనో! అందుకని ఆ సైటులోనే ఏదైనా కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు పూర్తిగా వాపసు ఇచ్చే ఇన్సూరెన్సు ముగ్గురికీ కలిపి మరో ఆరు వందల డాలర్లు పెట్టి తీసుకున్నాం.
వెరసి ముగ్గురికీ ఏడు వేలా అయిదు వందల డాలర్లు అయ్యింది అప్పటికి.
ఇదంతా ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి చేసి ఇక వీసాల పని వెంటనే మొదలు పెట్టాం.
*****
(సశేషం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
