వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు (సాయిపద్మ కథల సంపుటికి ముందుమాట)

-వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

 
          సాయిపద్మ కథల పుస్తకానికి నన్ను ముందుమాట రాయమన్నారు ఆమె భర్త ప్రజ్ఞానంద్. అది నా భాగ్యంగా భావించి రాసేను. ఇవాళ సాయంత్రం విశాఖ దసపల్లా హోటల్ లో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సందర్భంగా సాయిపద్మ మిత్రులు అభిమానులు అందరితోనూ ఈ ముందుమాట పంచుకుంటున్నాను.
***
వ్యధార్త జీవిత యదార్థ చిత్రాలు
సాయి పద్మ కొన్ని కథలు రాసిందని ఆ కథలకు ముందుమాట రాయాలని మిత్రురాలు, అభిమాన రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మిగారు నాతో చెప్పినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యమే పడ్డాను.
 
          ఎందుకంటే సాయిపద్మకి నాకంటే సన్నిహితులైన వ్యక్తులు, రచయితలు చాలా మంది ఉన్నారు. నాకు ఆమె పరిచయమే కానీ మరీ అంత దగ్గరతనం లేదు. ఎక్కువ కలిసే సందర్భాలు రాకపోవడం కారణం. కానీ ఆమె అంటే నాకు ప్రేమే కాక గౌరవం కూడానూ. ఆమె కూడా నన్ను అక్కా అని సంబోధించేది.
 
          అందుకే తన కథల మీద ఒక అభిప్రాయం చెప్పడానికి నన్నే ఎంచుకోవటం నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగించింది. తిరిగి మళ్ళీ సాయి పద్మ భర్త ప్రజ్ఞానంద్ గారు ఫోన్ చేసి అదే విషయం చెప్పినప్పుడు నాకు కలిగిన ఆనందం వెనుక దుఃఖపు నీడ వచ్చి చేరింది.
 
          ఇప్పుడు నేను సాయిపద్మ కథల మీద అభిప్రాయం చెప్తే సాయిపద్మకు ఎలా తెలుస్తుంది. అసలు తను ఉండగా ఇలా కథలు పుస్తకం వేసుకోవాలనే ఆలోచన తను ఎందుకు చేయలేదు. అని ఏవేవో ఆలోచనలు విషాదంలోకి తీసుకెళ్లిపోయాయి.
సాయి పద్మ గుర్తొస్తే ఆమె లేదు అనే మాట ఇంకా అలవాటు అవలేదు. బహుశా అవదేమో కూడా. ఆమె పేరు వెనక చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ ఆమె సామర్ధ్యాలూ, సహనాలతో నిండినవి. అతి తక్కువ మందికి మాత్రమే ఉండేవి. అవన్నీ కలిపిన ఒక అలౌకిక స్ఫురణ ఆ పేరు వెనక ఉంది. అది ఇప్పుడు అలౌకిక స్మరణగా మారింది.
 
          సాయి పద్మ తాను జీవించిన అర్థ శతాబ్ది కాలంలో అసాధారణమైన పనులు చేసింది. తన శరీరం మీద 18 సార్లు కోతలు పెట్టించుకుని కుట్లు వేయించుకోవలసి వస్తే నిబ్బరం చేయించుకుంది. మరెన్నోసార్లు షాక్ ట్రీట్మెంట్లు తీసుకుంది. ఇలాంటి కఠినమైన శారీరక కష్టాల, బాధల తాలూకు అనుభవాలు ఒక మనిషిని రాటు తేరుస్తాయి. కానీ సాయి పద్మ ఎంత రాటుదేరిందో తెలియదు గానీ చాలా చాలా సున్నితంగా మారింది. అందుకే భవభూతి ఉత్తర రామ చరిత్రలో శ్లోకంగా రాసిన మాట గుర్తుకు వస్తుంది.
“వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమానిచ లోకోత్తరాంణాహి చేతాంసి కోహి విజ్ఞాతు మర్హసి”
 
          తన బాధలను అనుభవించడంలో కఠినంగానూ, ఇతరుల కష్టాలు పంచుకోవడం లో శిరీషకుసుమమంత సున్నితంగానూ ఉండే లోత్తరమైన హృదయం కల వ్యక్తి సాయి పద్మ అని అనిపిస్తుంది ఆమె జీవించిన విధానం చూసినప్పుడు.
 
          ఆ సున్నితం నుంచి వేలమంది పేద పిల్లలకు సహాయం చేసే పథకాలను నడిపింది. వేల కుటుంబాలను నిలబెట్టింది. ఇంకా ఎన్నో, మరెన్నో. కానీ అవన్నీ ఆమెకు సరిపోలేదు. కవిత్వం రాయాలి, కథలు రాయాలి, కాలమ్ రాయాలి. చాలా ముందుగానే ఇంగ్లీషులో కవిత్వం రాసి పుస్తకంగా తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలా ఈ పదకొండు కథలతో మరో పుస్తకం. నిజానికి కథలు కవిత్వాలతో చాలా పుస్తకాలు వేసే వాళ్ళు ఎవరూ కూడా సాయి పద్మ చేసిన ఎన్నో పనులు చేసి ఉండరు. కాబట్టి పద్మ ఇలా కొత్తగా తన భావాలను కథల్లోకి తేకపోయినా అదేమీ లోటు కాదు. అవన్నీ ఆమె తాలూకు పనుల్లో, సామర్థ్యాల్లో కనబడుతూనే ఉన్నాయి. అయినా సరే తన భావాలను, తన అనుభవాలను, తన అవగాహనను కథలుగా మార్చాలనే ఈ చర్యకు ఆమెలో జ్వలించే సృజనాత్మకతే కారణమని నాకు అనిపించింది.
 
          ఈ కథల పుస్తకంలో సాయిపద్మ పదకొండు కథలు రాసింది. ఈ పదకొండు కథలు స్త్రీ పురుష సంబంధాలలోని అసమానతలను, పైకి కనపడని హింసను చెప్పే కథలు. ఇటువంటి కథలు రాయటానికి కారణం ఆమె ఒక కథలో ఇలా చెప్పింది.
” ఎందుకు రాసావీ కథని అని అలా అదాటున అడిగితే చెప్పడం కష్టం. ఒక సోషల్ వర్కర్ గా సమాజంతో దగ్గర సంబంధాలు ఉన్నదాన్ని. ఒక మహిళగా కొంచెం వాళ్ళ పట్ల ప్రేమతో కూడిన పక్షపాతం ఉన్నదాన్ని. అందుకే వాళ్ళ గాథలు, వృత్తాంతాలు కదిలిస్తాయి నన్ను.”
 
          ఆమె రాసిన ఈ కథలన్నింటిలోనూ ఇదే అంశం కనిపించింది. ఆమె చాలా దగ్గరగా అనేక వర్గాల స్త్రీలను చూసి వారి సమస్యలను గ్రహించి అందులోంచి కొన్ని మాత్రమే ఎంపిక చేసి రాయడం ఈ కథలో కనిపిస్తుంది. ఇలా రాయటానికి కారణం బహుశా ఇవి ఎంతోమందికి ప్రాతినిధ్యం వహించే కథలు కావచ్చు.
 
          ఈ కథలలో స్త్రీలు చదువులేని వాళ్ళూ, చదువుకున్న వాళ్ళూ, బాగా చదువుకున్న వాళ్ళూ, ప్రత్యేక అంశాలలో గొప్పగా పరిశోధనలు చేసిన వాళ్ళూనూ. అయినా అందరూ తమకు తమ జీవితంలో సహచరులుగా వచ్చిన పురుషుల వల్ల అణచబడ్డవాళ్ళు, మోసగించబడ్డవాళ్ళు, అవమానించబడ్డవాళ్ళు. ఈ కథల్లో పురుషులు తెలివైన వాళ్ళు. బాగా చదువుకున్న వాళ్ళు. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు, విదేశాల్లో ఉన్నవాళ్లు. కానీ కొందరు పురుషాహంకారాన్ని, కొందరు పురుషాధిక్యతను తమ హక్కుగా భావించిన వాళ్ళు. అంతకన్నా కూడా మితిమీరిన స్వార్థపరులైన వాళ్ళు. భర్త అనే బంధాన్ని అవకాశంగా తీసుకుని తమకు నచ్చినట్టు ప్రవర్తించిన వాళ్ళు.
 
          ఇందులో మంచి వాళ్ళు అయిన మగవాళ్ళు కూడా ఉన్నారు. ఉద్యోగంలో, ధన సంపాదనలో ముందుండాలని పెట్టే పరుగులలో అనుబంధాలను, ప్రేమలను మరిచి పోయామని అంతశ్చేతన గుర్తు చేస్తే బాధపడిన మగవాళ్ళు, మగవాళ్ళ దుర్మార్గాలను గుర్తించి ఆడవాళ్లకు అండగా నిలిచిన మగవాళ్ళు కూడా ఈ కథలో లేకపోలేదు. అది కథా రచయిత్రిగా సాయిపద్మతాలూకు నిష్పక్షపాత దృష్టికి తార్కాణం.
 
          ఈ పదకొండు కథలూ పదునలుగురు స్త్రీల సమస్యల గురించి చర్చించాయి. ఒక్కొక్క కథా ప్రస్తుత సమాజంలో మండుతున్న సమస్యలను చెప్పి వాటి పూర్వాపరాలు చర్చించి పాఠకులను ఆలోచనలోకి తీసుకువెడుతుంది .
 
          సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న స్త్రీపురుషుల సమస్యల కొత్త రూపాలు ఇందులో ఉన్నాయి. భర్తలతోపాటు అమెరికాకు వెళ్లి అక్కడ ఆ భర్తల స్వార్థానికి బలైన స్త్రీల సమస్యల కథలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇవాళ అందరూ ప్రధానంగా చర్చిస్తున్న ‘గే’ సమాజం మీద రెండు విభిన్న కోణాల్లో రాసిన కథలున్నాయి. ఒక కథలో ‘గే’ అయిన పురుషుడు భర్తగా ఎంతటి మానవత్వంతో ఉంటాడో చెప్తే మరొక కథలో ‘గే’ అయిన భర్త తననూ, వివాహ సంప్రదాయాన్నినమ్మి అమెరికాకు వచ్చిన భార్యను నిస్సహాయను చేసి రోడ్డు మీదకు తరిమెయ్యడం గురించి ఉంటుంది.
 

          ఒకే విషయాన్ని రెండు కోణాల్లో చూస్తూ గే అయిన పురుషుల పట్ల సాయి పద్మ ఒక రచయిత్రిగా నిష్పాక్షికమైన దృష్టిని చూపించింది. ప్రైవేటు రంగంలో స్త్రీలు ఉద్యోగాలు నిలుపుకోవడం కోసం, కనీస సౌకర్యాల కోసం తెలివిగా మర్యాదను అభినయిస్తూ తమను కోరే పురుషులకు లొంగవలసి రావటం గురించి రాస్తుంది. పాయకరావుపేటలో, హైదరాబాద్ లో, అమెరికాలో అంతటా ఒకే నీతి. ఇందులో స్త్రీ ల విధిలేని లొంగుబాటును చాలా తెలివిగా సతీ సుమతి పాత్రను ప్రవేశపెట్టి ఆమెతో అవుననిపిస్తుంది. నిత్యమూ త్రిలోకాలలో తిరుగుతూ త్రికాలజ్ఞుడైన నారదుని ప్రవేశపెట్టి ఆయనకు తెలియని స్త్రీల జీవితాలలోని సమస్యలను సతీ సుమతి ఆయనకు చెప్తుంది. ఇదొక ప్రయోగం. ఇవాళ యువత ఎక్కువ శాతం (ఊబకాయం) తో ఒబెసిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశాన్ని తీసుకుని అవసరమైన కోణంలో సాయిపద్మ కథ రాసింది.
మగవారి కాముకత ఎలాంటి పరాకాష్టకు వెళ్లగలదో కూడా ఒక కథగా మలచింది.

          సాయి పద్మకు విశిష్టమైన పఠనానుభవం ఉందని ఈ కథలు చదివితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె ఎన్నో గొప్ప కథలు చదివి ఉంటుందని ఈ కథల నిర్మాణం తెలుపుతోంది. ఆమె తీసుకున్న సమస్యలలో ఒక్కొక్క సమస్యను దానికి అనువైన రీతిలో కథగా నిర్మించుకుంటూ వెళ్ళడంలో ఆ అనుభవ శీలత కనిపిస్తోంది.
ప్రతి కథ ఒక ప్రత్యేక నిర్మాణంతో ఉంటూ రచయిత్రిగా ఆమె ప్రతిభ తెలియజేస్తాయి. ఉదాహరణగా” అసమయాల అమావాస్య” అనే కథ జీవితం తాలూకు పరుగు పందెంలో ప్రేమలను, మమతలను మరిచిపోయిన అంశాన్ని చెప్పే కథ. ఇదే అంశం మీద చాలా మంది కథలు రాశారు. ఎంత మంది రాసినా ఇది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయవలసిన అంశమే. కానీ మంచి కథా రచయిత ఆ అంశాన్ని చెప్పేటప్పుడు పాత పద్ధతిలో కాక ఒక కొత్త పద్ధతిని ఎంచుకుంటాడు. అతను లేదా ఆమె ఎంచుకున్న పద్ధతిని బట్టి ఆ కథ లోని అంశం మరింత బలంగా పాఠకులను తాకుతుంది. కథలు రాయటంలోని ఈ మెళకువ ను సాయి పద్మ బాగా ఒంటపట్టించుకుని తన కథా నిర్మాణంలో భాగంగా చేసుకుంది. అందుకే ఇది ఆమెకు తన ప్రత్యేకమైన పఠనా అనుభవం వల్ల లభించిన ప్రజ్ఞ అని అన్నాను .

 
          పై కథలో ఆమె కథను మాంత్రిక వాస్తవిక పద్ధతిలో చెప్తుంది. కథలో పేర్లు కూడా యశోధర, గౌతం, కొడుకు రాహుల్ అంటూ. గౌతమ్ జీవితం పరుగు పందెంలో తప్పి పోయింది. దాన్ని అతను సబ్ కాన్షియస్ చేతనలో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కథలో చివరి వాక్యం ఇలా ఉంటుంది.
 
          “కాఫీ డికాషన్ వాసన, నానిన సుద్ద ముక్కల వాసన ఒకేసారి గౌతమ్ ని పలకరిం చాయి.” డికాషన్ వాసనలో వర్తమానం ఉంటే, సుద్దముక్కల వాసనలో బాల్యం ఉంది. ఈ చివరి వాక్యంలోనే కథ తాలూకు విషయం అంతా దాగి ఉంది.
 
          పద్మ ప్రతి కథకు ఆ అంశానికి తగిన టెక్నిక్ ను ఎంచుకుని కథలు రాసుకుంటూ వచ్చింది. ఇవి ప్రత్యేకమైన పాఠకులకు, కథా విమర్శకులకు ఆనందం కలిగించే అంశాలు.
 
          ఒక కథంతా కూడా మావయ్య వచ్చాడంట అనే సినిమా పాట చరణాల మధ్య నడుస్తుంది. ఆ పాటకు పూర్తి వ్యతిరేకమైన కథ. ఆ కథలోని విషాదం చెప్పడానికి ఈ పాటను కేంద్రంగా తీసుకొని కథ చెప్పటం ఇందులోని టెక్నిక్.
 
          మరో కథలో ఒక పురుషుడికి అతని భార్య ఉండగా, అదంతా తెలిసి అతనితో సహజీవనం చేసిన మరొక స్త్రీ ఇద్దరూ అతన్ని తమ జీవితాల నుంచి వెలివేస్తూ రాసిన ఉత్తరాలే కథ. అందులో ఆ స్త్రీల ఇద్దరి పేర్లు వైదేహి, మైధిలి. సీతాదేవికి ఉన్న పర్యాయ నామాలు.
 
          “చినుకులన్నీ కలిసి చిత్రకావేరి” అనే మరొక కథలో ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య సంభాషణ ద్వారా స్త్రీల వ్యక్తిత్వాలు, స్వాతంత్య్రాయాలు, వారి ప్రేమలు, ఆకర్షణలు ఇలాంటి విషయాలు మీద ఆరోగ్యకరమైన చర్చలు జరుపుతుంది.
 
          స్త్రీవాదం చెప్పిన వ్యక్తి స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ అన్న అంశాలకు చాలా స్పష్టమైన వివరణ ఈ కథలో ఉంటుంది. కథలో పూర్ణిమ తన స్నేహితురాలు సంధ్యతో ఈ విషయాల మీద తన అనుభవం ద్వారా చిక్కటి వివరణ ఇస్తుంది. ఇందులో పూర్ణిమ, సంధ్య పేర్లు రెండు కూడా ప్రతీకలే. పూర్ణిమను నిజమైన అర్థంలో మానసిక స్వేచ్ఛను పొందిన స్త్రీగా రచయిత్రి మన ముందు నిలబెడుతుంది. ఇటువంటి కథ చెప్పడానికి సంభాషణ తగినది కాబట్టి ఆ కథను సంభాషణల రూపంలోనే చెప్పింది. “చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, చివరికా కావేరి కడలి దేవేరి” అన్న పాటను నేపథ్యంలో వినిపించి కథకు సొగసును అద్దుతుంది.
 
          ఇలా తను తీసుకున్న కథాంశానికి తగిన కథా నిర్మాణాన్ని చేస్తూ రాసిన ఈ కథలన్నీ ప్రత్యేకమైన కథలే.
 
          సాయి పద్మ తెలుగు వాక్యం స్పష్టంగా సరళంగా ఉంటుంది. చాలా చోట్ల అవసరాన్ని బట్టి కవితాత్మకంగా కూడా ఉంటుంది. ఉదాహరణకి “రోజులో మారే రంగు లాంటి సముద్రపు అలల్లా సంధ్య గొంతులోని ధ్వని తరంగాలు గమనిస్తోంది పూర్ణిమ. కొన్ని పైకి తేలే రంగులు. కొన్ని గాఢతతో చుట్టేసి అల్లేసి వదలలేని రంగులు. వెలిసినా వదలని రంగు లాంటి ఉద్వేగాలు కొన్ని అనుకుంటోంది పూర్ణిమ” ఈ వర్ణన పూర్ణిమ తాలూకు మనస్తత్వాన్ని, వ్యక్తీకరణ విధానాన్ని తెలియజేస్తుంది. పూర్ణిమ మాటలన్నీ విన్నాక పూర్ణిమ గురించి సంధ్య ఇలా అంటుంది.
 
          ” వెళ్తారా పూర్ణీ ! నాకు నువ్వు అర్ధమయ్యావ్. బంధంలో ముడి కన్నా స్వేచ్ఛ ఎంత అర్థవంతమైనది అని, ఇవాళ మళ్లీ నీతో కొత్త స్నేహం కలవడం బాగుంది”. ఎన్నేళ్లుగానో ఉన్న స్నేహితురాలితో మళ్లీ ఆమె అంతరంగాన్ని, అందులోని ఆమె స్వేచ్ఛను పంచుకున్నాక తిరిగి’ కొత్త స్నేహం’ అనటం కొత్త ఆలోచన. వ్యక్తులు మానసికంగా ఎదిగిన కొద్దీ వారి మధ్య స్నేహాలు కూడా ఎప్పటికీ కొత్తగా ఉంటూ ఉంటాయి. స్నేహాలు అలాగే ఉండాలి. నాకు ఈ కొత్త స్నేహం అన్నమాట ఎంతో నచ్చింది.
 
          కథలకు పెట్టిన పేర్లు కూడా ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. దళిత యువతి అమృత కథ చెప్తూ ఆ కథకు “గాలికీ కులం ఉంది” అని పేరు పెడుతుంది. “గాలికీ కులమేది” అనే సినిమా పాటను గుర్తుచేస్తూ.
 
          రాదే చెలి నమ్మరాదే చెలి( అనబడు) త్రిబుల్ స్టాండర్డ్ కథ మరో కథ పేరు. డబల్ స్టాండర్డ్ అంటాం కదా. ఈ కథ చెప్పడానికి సాయి పద్మ ప్రత్యేకమైన పురాణ కాలానికి వెళ్లి ఆ పాత్రల్ని ఆధునిక యుగంలోకి లాక్కొచ్చి వాళ్ల ద్వారా కథ చెప్పించడం ఎప్పటికీ గొప్ప టెక్నిక్. ఏ ఊరైనా ఏ దేశమైనా స్త్రీలు కాస్త వెసులుబాటుతో బతకాలంటే ఎక్కడో చోట కాచుకుని ఉన్న మగవాళ్ళని ఒప్పుకొని సర్దుబాటు చేసుకోక తప్పదనే పచ్చి నిజాన్ని సుమతి చేత త్రికాలజ్ఞుడైన నారదుడికి చెప్పించిన కథ ఇది.
 
          ఈ ఒప్పుకోలు వెనక దుర్భరమైన జీవితం ఉంది. దాన్ని దాటడానికి మరో దారి లేదు. మగవాళ్ళు, భర్తలు సవ్యమైన రీతిలో ఉంటే స్త్రీలు ఇలా బతుకుదెరువు కోసం వెతుకులాడరు. అని ఇప్పటి సమాజంలో మారని మగవాడి గురించి సతీ సుమతి నోట నారదుడికి చెప్పించడంలో గడుసుదనం ఉంది. ఈ కథను ఇలా తప్ప మరొకలా చెప్పి ఒప్పించడం కష్టం.
 
          చివరిగా పద్మ చెప్పిన ఈ పదకొండు కథల్లోనూ ఆమె పరిశీలన ఉంది. అవగాహన ఉంది. హృదయం ఉంది. దయ ఉంది. అంతేకాక పరిష్కారాల వైపు ఆలోచింపచేసే విశ్లేషణ కూడా ఉంది. స్త్రీవాదం చెప్పిన కొన్ని అంశాలు అతివాదాలు అనిపిస్తే ఆ అతివాదాలకు కొన్నింటికి సరి అయిన వివరణ ఈ కథల్లో ఉంది. అది ఈ కథల ప్రత్యేకత.
 
          సాయిపద్మ మన ముందు లేదు అన్నది పూరించలేని లోటే కానీ ఈ కథలు చదువుతుంటే ఒక రకంగా ఆమె మన ముందు ఉండి మన సమస్యలు మాట్లాడుతున్నట్టే ఉంది. ధైర్యం చెబుతున్నట్టే ఉంది. ముందుకు దారి చూపిస్తున్నట్టే ఉంది. భయపడ వలసింది ఏమీ లేదు, నిర్భయంగా ముందుకు సాగుదాం అని వెనకపడిన ఆధునిక మహిళలకు అభయం ఇస్తున్నట్టే ఉంది. సాయి పద్మ మనతోనే ఉంది. ఈ కథల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటుంది. 
 
          ఈ కథలు మనకు అందిస్తున్న ఆమె భర్త ప్రజ్ఞానంద్ కు అభినందనలు
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.