సస్య-9

– రావుల కిరణ్మయి

ప్రతిఘటన

(జరిగిన కథ : శ్రావణ్ , సస్యతో గతంను చెప్పగా సస్య ఆలోచనలో పడింది. ఆ తర్వాత..)

***

          సస్యలో ఘనీభవించిన  ఆవేదనామేఘం కన్నీటి జల్లై కురిసింది. ఎంతలా అంటే  తుఫాను వరదకు పొంగి గట్టు తెగిన జలప్రవాహంగా మారిన ఆమెను ఓదార్చడాని కన్నట్టుగా తలపై చేయి వేశాడు శ్రావణ్.

          సస్య  భరింపరాని దుఃఖంతో శ్రావణ్ ను గట్టిగా హత్తుకొని ఎదపై తలవాల్చి  ఏడ్వసాగింది. అప్పటి వరకు ఎండతో వేడిగా ఉన్న వాతావరణం క్రమంగా చల్లబడ సాగింది. అచ్చంగా వారిరువురికి మళ్లే.

“నిదురించు జహాపనా…

ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో….

నిదురించూ….జహాపనా…

నిదురించూ….జహాపనా…

          అనే పాట శ్రావణ్ అందుకొని పాడుతూ.. ఆమెను అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి పాడుతూ ఊపుతుండగా సస్య సంభ్రమాశ్చర్యాలతో అతడినే చూస్తూ శాంతించింది.

          నేను సంగీతం నేర్చుకోలేదండీ. నాకు చాలా చాలా ఇష్టమైన పాటలను ఇలా నాకు నేనే పాడుకుంట ఉంటాను. అమ్మను నిద్రపుచ్చడానికి అప్పుడప్పుడు రామదాసు కీర్తనలూ పాడుతాను.

          మీరు అదృష్టవంతులు. చక్కని గళం మీకుండడం, ఒక వరం. హాయిగా అన్నిటినీ మరుస్తారు. కానీ, నాకు ఇంతకు ముందయితే విదుషీ ఉండేది. ఇప్పుడు తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అన్ని సం॥ల అనుబంధాన్ని ఆమె ఎలా మరిచిపోయిందీ? నాకే అర్థం కావడం లేదు. నాకిప్పుడు ఎవ్వరూ లేరు. అని స్కూళ్లో భార్గవ్ సార్ తో తనకు ఎదురవుతున్న సమస్యలు చెప్పుకుంది.

          శ్రావణ్ సస్యతో ఇటువంటి వారి పట్ల వారి మానాన వారిని వదిలేస్తే ఇంకా రెచ్చి పోతారు. మనకు అపాయం, అవమానం జరుగుతున్నప్పుడు కూడా ప్రతిఘటించకుండా ఉంటే అది సహనం అనిపించుకోదు. చేతగాని తనం అవుతుంది. అందువల్ల కర్ర విరగకూడదు, పాము చావకూడదు. అన్నట్టుగా మీరు బయటపడకుండా మీ గౌరవాన్ని కాపాడుకుంటూ అతనికి బుద్ధి చెప్పండి.

          మీకు నా నుండి విదుషి తరుపు నుండి క్షమాపణలు. ఇక మీదట మీరు మా కొరకు ఆలోచించకండి. శ్రమ తీసుకొని ఇంటికి రాకండి. అన్నాడు. ఇలా మాట్లాడుకుంటుండగా ఆ సేవాసదన్ అటెండర్ వచ్చి,

          బాబూ ! అమ్మ గారి పని అయిపోయింది. అని చెప్పడంతో, పదండి ఇంటికి వెళ్దాం అని కారులో ముగ్గురూ ఇంటిదారి పట్టారు.

***

          సస్య రాత్రంతా విదుషికి ఫోన్ చేస్తూనే గడిపింది.

          “ఈ రోజు జరిగిన విషయం తనతో పంచుకోవాలని తపన పడింది. కానీ ఒకసారి రింగయినా ఎత్తకపోవడం, మరోసారి రాంగ్ నెంబర్ అని ఆన్సర్ రావడంతో మానుకుంది.

          పాఠశాలలో మధ్యాహ్న భోజనం పిల్లలకు పెట్టించే డ్యూటి ఆ రోజు తనది, భార్గవ్ సర్ ది కావడంతో అక్కడ నిలబడ్డారు ఇద్దరు.

          పిల్లలందరికీ వడ్డించడం పూర్తయింది. అందరూ ప్లేట్ల ముందు కూర్చుని చేతులు జోడించి భోజన మంత్రం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వారినే గమనిస్తున్నది.

          తన పక్కనే నిలబడి ఉన్న భార్గవ్ సర్ సస్య కుడి భుజంపై చేయి వేశాడు. బలంగా మారుతుండగా కోపంగా అతడి వైపు తిరిగి చూసింది. పిల్లలు “సహనావవతు…..అని భోజనమంత్రం మొదలుపెట్టారు.

          సస్య  మంత్రం తనకే  అన్నట్టుగా భావించుకుంది.

          అతడి  నడుముకు చేయిచేసి గట్టిగా పట్టుకొని అలాగే పక్కనే ఉన్న క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్ళింది. అతడిని అక్కడ కూర్చొపెట్టి హడావుడిగా పొయ్యిలో ఉన్న నిప్పులు ప్లేటులోకి తీసుకొని అందులో ఎండు మిరపకాయలు వంటగది పోపు డబ్బాలో నుండి తీసి అందులో  వేసి ఘాటు వచ్చేలా చేసి భార్గవ్ సర్ ఉన్న రూములో ఆ ప్లేట్లు పెట్టి తలుపు దగ్గరగా వేసింది..

          ఏం చేస్తుందో తెలియని వంట మనిషి

          మేడమ్ !.. అంటూ సస్యను అనుసరించింది. తలుపు వేయడంతో కిటికీలో నుండి చూసింది. భార్గవ్ సర్ బెంచీమీద పడుకొని ఉన్నాడు.

          సస్య నిప్పులు తన మూతికి కొంగును గట్టిగా కట్టుకొని ఘాటు భార్గవ్ కి తగిలేలా మరో మూల పెట్టింది. అతను దగ్గుతుండడం మొదలు పెట్టాడు. ఛాతిపై చేయి వేసి చూస్తున్నది.

          కిటికీ దగ్గర వంటావిడ  ఇదంతా చూసి ఆఫీస్ రూంకు పరుగెత్తి మిగతా సార్లందరినీ తీసుకువచ్చింది. HM గారు తలుపు తీసుకువచ్చారు. సస్య అతడిని తానే చేయి. పట్టి బయటకు తీసుకువచ్చింది.

          సర్ కి గుండెపోటు వచ్చింది. నీరసంగా ఉన్నారు. వారి గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటున్నది. అతను స్పృహ కోల్పోకుండా దగ్గుతూనే ఉండడానికి అలా ఘాటు వేశాను. అంబులెన్స్ కు ఫోన్ చెయ్యండి అంది. తొందరపెడుతూ.

          పోన్ చేస్తే వారు, తామ రావడానికి గంటకు పైగానే పడుతుందని  వచ్చేంతవరకు మీరే వీలయితే పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చెయ్యండి. ఆలా వీలుకాదంటే ఇలా ఇలా చేయండి అని చెప్తుండడంతో, సస్య పరిస్థితి తెలుసుకొని ఆ రోజు కారులో వచ్చే శుక్ల సార్ సెలవులో ఉండడం, భార్గవ్ సార్ ను ఎలా తీసుకువెళ్ళడం అని మరో ఆలోచనలేకుండా నేరుగా శ్రావణ్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది.

          శ్రావణ్ 20 ని॥లో చేరుకున్నాడు.

          భార్గవ్ సర్ పదే పదే బాగా గట్టిగా దగ్గుతున్నాడు. గట్టిగా ఊపిర తీసుకుంటూ  దగ్గుతున్న అతడిని కారులో ఎక్కించి సస్యను తోడుగా వెళ్ళమన్నారు. మిగతా ఉపాధ్యాయులు.

          శ్రావణ్, సస్యల శ్రమ వృధా కాలేదు.

          హాస్పిటల్ లో డాక్టర్ అందుబాటులో ఉండడంతో సమయానికి తగిన వైద్యం అంది ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.

          సస్యను డాక్టర్లు అభినందించారు.

          మీరు సమయానికి చాలా స్పూర్తిగా వ్యవహరించడం వల్లే ప్రమాదం నుండి గట్టెక్కాడు. ఏ మాత్రం ఆలస్యమయినా అతడి ప్రాణాలు కాపాడలేక పోయేవాళ్ళం. ఇటువంటి సహాయం దొరక కనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అని ఒక నిండు ప్రాణాన్ని కాపాడామన్న ఆత్మతృప్తి కళ్ళలో కనిపిస్తుండగా మనస్పూర్తిగా మరోమారు అభినందించారు.

          సస్య రిలాక్సయింది.

          ఇంతలో మిగతా ఉపాధ్యాయులు ప్రమాదం తప్పిందని తెలుసుకొని సంతోషించి, అంతా మీ చాకచక్యమేనని మెచ్చుకున్నారు.

          మీరు వెళ్ళండి. భోజనం కూడా చేయిలేదు కదా! మేముంటాం అని శ్రావణ్ కు కూడా ఆ ఫోన్ చేయగానే వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

          సస్య శ్రావణ్ కు చేతులు  జోడించింది. ప్రతి గా శ్రావణ్  కూడా నమస్కరించి  వెళ్లిపోయాడు.

అంతర్మధనం

భార్గవ్ సార్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సస్య మరసటి రోజు కూడా వెళ్ళింది. 

          భార్గవ్ సార్ భార్య  సహన చాలా కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుంది. తను చేసిన సహాయమే ఈనాడు తమ కుటుంబాన్ని వీధిన పడకుండా చేసిందని.

          సస్య ఏమి మాట్లాడకుండా ముభావంగానే ఉండి డిస్చార్జ్  అవుతున్న రోజు మళ్ళీ వెళ్ళింది.

          భార్గవ్ సర్ కళ్ళలో నీళ్ళు నిండగా చేతులు జోడించాడు.

          సహన కూడా ఏడ్చేసింది.

          సస్యకు ఏమనాలో తెలియక అలాగే చూస్తుండిపోయింది.

***

          శ్రావణ శుక్రవారం గౌరీ పూజకు రమ్మని సహన చెప్పిందని సార్ స్కూల్లో సస్యకు చెప్పాడు.

          నేనా ? మీ ఇంటికా ? రాలేను అంది. కొంచెం కటువుగానే.

          పసుపు బొట్టుకు పిలిస్తే పది ఆమడలైనా వెళ్ళాలంటారు అందుకని…

          అది పెళ్లయిన స్త్రీల కేమో ? నాకు వర్తించదు లెండి మధ్యలోనే అడ్డుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ అన్నది.

          సాయంత్రం భార్గవ్ సర్ నుండి ఫోన్. ఈసారి సహన. మేడమ్ ! రేపు వీలు చేసుకొని రండి గౌరీ పూజకి. అమ్మను తీసుకురావడం మరిచిపోకండి అని మరీ మరీ చెప్పింది.

          ఇదేమిటి ? ఈవిడ అమ్మను మరీ మరీ  పిలుస్తున్నదేమిటి? అమ్మను ఇటువంటి వాటికి ఎవరూ పిలవరు కదా ! అయోమయంగా అనిపించి , తన ద్వారా అమ్మకు అందిన ఆహ్వానాన్ని మన్నించి తెల్లవారి భార్గవ్ సార్ ఇంటికి వెళ్ళింది.

          అమ్మ చిన్న పిల్లలా సంబరపడి పోయింది.

          సహన అందరికి తమ ఇద్దరినీ, అందరినీ తమకు పరిచయం చేసింది. ఆదరంగా అమ్మ పెద్ద ముత్తయిదువ అని పూలు, పండ్లు, గాజులు, పట్టుచీర అభిమానంగా పెట్టింది. రాత్రి భోజనం చేసేంత వరకు ఊరుకోలేదు.

          సహన, భార్గవ్ సార్ ఇద్దరూ చూపిస్తున్న ఆత్మీయత సస్యను కొంత ఇబ్బంది పెట్టింది.

          అది గమనించిన సహన, మేడమ్! మీతో సర్ తప్పుగా ప్రవర్తించి ఉంటే నేను క్షమాపణ అడుగుతున్నాను. నిన్న వారికి గుండెపోటు రావడానికి కారణం కూడా మీ గురించి ఆలోచనే.

          ఈసారి చాలా ఆశ్చర్య పోయింది సస్య.

          సహన ఒక ఫోటో చూపించింది. అందమైన అమ్మాయిది. ఈమె మా ఆడపడుచు. ఈమె కూడా మీలా సున్నిత మనస్కురాలు, మంచి మనిషి. ఆ మనస్తత్వమే ఆమె , వేరొకరితో జీవితాన్ని పంచుకోవాలని ఉందన్న వారిని నమ్మి ఆశించి మోసపోయి ఆత్మహత్య చేసుకునేలా చేసింది. చెల్లెలు మరణాన్ని తట్టుకోలేని సర్ మళ్ళీ అలాంటి మనస్తత్వం మీలో చూసి కాస్త ఊరట చెందినా, మీరు శ్రావణ్ గారితో ఆ సాయంత్రం కలవడం చూసి ఆయనలో కలవరం. మీరు కూడా తప్పటడుగు వేస్తున్నారేమోనని అంతర్మధనం మొదలయింది. నేను కూడా ఈ విషయం మీతో మాట్లాడాలి  అనుకుం టుండగానే ఇలా జరిగింది. ఇక ముందు వారు మీ పట్ల అల్గా ప్రవర్తించకుండా నేను చూసుకుంటాను. అపార్ధం చేసుకోకండి ప్లీజ్  ! అని ప్రాధేయపూర్వకంగా అడిగింది.

          సస్య  చలించిపోయింది. “మేకవన్నె పులి” అని అనుకున్న మనిషి మంచితనం అతని సాధుస్వరూపం తెలిసి రావడంతో.

          ఈ విషయాలేవి అమ్మకు తెలియనీయక అక్కడి నుండి వచ్చేసింది.

          పట్టుచీర కట్టుకొని మెరిసిపోతున్న అమ్మను చూసి అమ్మ ను కూడా పిలిచి నందుకు సహనకు మనసులోనే  కృతజ్ఞతలు చెప్పింది.

***

          శ్రావణ్ తో ఈ సంగతులను చర్చించింది. భార్గవ్ సర్ ను తప్పుగా అర్థం చేసు కున్నది. చెప్పి మొన్నటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అపార్థం చేసుకున్నాను, నిన్నటి వరకు భార్గవ్ సర్ ని. నా మీద నాకే ఇదేమన్నా మానసిక జబ్బా ? అని కూడా అనుమానం కలుగుతున్నది.

          సస్య గారూ ! మీరు ఆ ఎదుర్కోన్న పరిస్థితులు ఎవరినైన అలాగే ఆలోచింప చేస్తాయి. కాని మామూలుగా అందరికి ఎప్పుడో ఒకటో రెండో ఎదురవుతాయి. కాని మీకు అలాంటివే వరుసగా ఎదురు కావడం వల్ల మీకు ఆ అనుమానం రావడం సహజం. అయితే ఇటువంటివి కలిగినపుడు అంతగా అలోచించక మరోవైపు ‘దృష్టిని మరల్చడం వివేకవంతుల లక్షణం.

          భూతద్దంపై కిరణాలన్నిటిని ఒకే కేంద్రంగా కేంద్రీకరింపచేస్తే  ఎలాగైతే మంట పుడుతుందో మన మనస్సును ఒకే విషయం పై లగ్నం చేస్తే మనల్ని దహించివేస్తుంది అందుకని ఇకనైనా, ఈ అంతర్మధనంను ఆపివేసి మరో లక్ష్యాన్ని ఎంచుకోండి.

          మీరు ఆ మధ్య డిగ్రీ లెక్చరర్ పోస్టుకు అప్లై చేశారని విదుషి చెప్పింది. ఆ ప్రయత్నం చెయ్యవచ్చు కదా! అన్నాడు.

          నా మొహం ! గెజిటెడ్ పోస్టు అంటే మాటలా?  విదుషి తనే స్వయంగా అన్నీ అప్లై చేసింది. గుంపులో గోవిందా అన్నట్టు వెళ్ళి రాసి రావడం తప్ప మనకచ్చేత సీన్ లేదు.

          ఎందుకలా ? ఒక్కసారి తలచుకోండి. కలలను కనండి వాటిని సాధించండి అన్న  కలాం మాటలని, అవకాశ ఎప్పుడూ రావు. డబ్బులు ఊరికే రావు అనే  ఆ బంగారు లాంటి మాటలను ఎప్పుడూ మననం చేసుకోండి. గ్రీన్ పెన్ మీ స్వంతమవుతుంది. అప్పుడు నాలాంటి వారు మీ చేయి అందుకోవాలని క్యూ కడతారు.

          ఏ..? ఇప్పుడైతే కుదరదా? అంది ఆశగా,

          సవాలే లేదు. ఖచ్చితంగా నేను గెజిటెడ్ పోస్టునే పెళ్ళి చేసుకుంటా. మీకా ఉద్దే శాలు లేనప్పుడు ఎలా కుదురుతుంది? నవ్వాడు. సడన్ గా సంభాషణ పెళ్లి వైపు తిరగడం సస్య. . కంగారుపడింది.

          ఎందుకండీ ఆ కంగారు ? సరదాగా అన్నాను. మీకు ఆసక్తి ఉంటే చెప్పండి నేను మీకు ఆన్ లైన్ కోచింగ్ ఇస్తాను. “కృషితో నాస్తి దుర్భిక్షమ్” రోజా ఒక గంట చాలు, అడిగాడు. ఏమంటారు?

          అనేదేముంది ? కాస్త విషయ జ్ఞానమన్న పెరుగుతుంది. సబ్జెక్ట్ పై మంచి పట్టు అన్నా వస్తుంది.

          అదీ ! అలా అన్నారు బాగుంది. “జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా ! అంటూ శ్రావణ్ పాడుతుంటే  హాయిగా నవ్వింది. సస్య.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.