యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-3
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
వీసా:
ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ ప్యాకేజీని ఎంచుకుని, ఫ్లైట్లు, హోటలు టిక్కెట్లు కొన్నాకా వీసా అప్లికేషన్ల కుస్తీ మొదలు పెట్టాం.
మొదట ఇంగ్లాండు వెళ్లడానికి యూకే వీసాకి ఆన్ లైనులో అప్లికేషను పూర్తి చేసాం. అందులో ఉన్న రకరకాల ఆప్షన్లలో తక్కువలో తక్కువదైన “మల్టిపుల్ ఎంట్రీ – ఆరునెలల వీసా” కి అప్లై చేసాం. అందుకు ఫీజు ఒక్కొక్కరికి $130 డాలర్లు. ఇక రానూపోనూ కొరియర్ ఛార్జీలు, ఫోటోలు వగైరాల ఖర్చు మరో $70 కలుపుకుంటే మొత్తానికి ఒక్కొక్కళ్ళకి $200 డాలర్లు అయ్యింది.
అయితే ఇండియన్ సిటిజన్సుకి బయో మెట్రిక్స్ కూడా ఇవ్వాలి. అంటే మన ఆధార్ కార్డుకి లాగా వేలి ముద్రలు మిషన్ల మీద ఇవ్వడమన్నమాట. బయో మెట్రిక్స్ ఇవ్వడానికి యూకే కాన్సిలేటుకి వెళ్లనవసరం లేదు. దగ్గర్లోని అమెరికను ఇమ్మిగ్రేషను సెంటరులో ఇవ్వవచ్చు. అలా మా దగ్గర్లో శానోజే నగరంలోని అమెరికను ఇమ్మిగ్రేషను సెంటరులో అప్పాయింట్ మెంట్ తీసుకున్నాం. అదృష్టం కొద్దీ అప్పాయింట్ మెంట్ ఓ వారంలో దొరికింది. శానోజేలో అప్పాయింటుమెంటు సరిగ్గా గంటలో సజావుగా పూరయ్యింది. ఆన్ లైనులో పూర్తి చేసిన అప్లికేషన్లని అప్పటికే ప్రింటవుట్ తీసి వెంట తెచ్చుకున్నాం. ఆ పేపరు అప్లికేషన్లని, పాసుపోర్టులు, ఫోటోలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, పే స్లిప్లు, ఐటినరీ, టిక్కెట్లు, ఎకామడేషను వగైరాలన్నీ జత చేసి న్యూయార్కులోని ఆ పక్కనే ఉన్న కొరియర్ సెంటరు నించి యూకే కాన్సులేటుకి ఆలస్యం చెయ్యకుండా ఆ మధ్యాహ్నానికే పంపేసాం.
సాధారణంగా యూకే వీసా స్టాంపై పాసుపోర్టు ఇంటికి రావడానికి కనీసం రెండు వారాలు పడుతుంది అని ఆన్లైనులో చదివి ధీమాగా ఆ సాయంత్రమే ఫ్రాన్స్ వీసా అప్లికేషను పని మొదలెట్టాం.
ఇంచుమించుగా యూకే కాన్సులేటు నించి పాసుపోర్టు చేతికొచ్చే వారం అంటూ లెక్కలేసుకుని దానికి అటూ ఇటూ రెండు రోజుల్లో ఫ్రాన్స్ వీసాకి అప్పాయింటు కోసమని వెతికేం. యూరపులోని ఏదేశానికెళ్లాలన్నా షాంగైన్ వీసాకి అప్లై చెయ్యాలి. యూకే లాగా కాకుండా ఈ వీసాకి ఆయా దేశపు కాన్సులేటు లేదా అనుబంధ సంస్థలకి వెళ్లి అప్లికేషను, బయోమెట్రిక్స్ ఇవ్వాలి.
ముందు చెప్పినట్లుగా యూరపులో ఏ దేశంలో ఎక్కువ రోజులు ఉంటామో, ఆదేశపు కాన్సులేటులో అప్లికేషను పెట్టుకోవాలి. ఒకవేళ అన్నిదేశాల్లో సమానంగా వుండేమాటైతే ఎక్కడైనా అప్లికేషను పెట్టొచ్చు. మేం అలా ఫ్రాన్స్ కాన్సులేటుని ఎంచుకున్నామన్నమాట.
ఫ్రాన్స్ వీసా కోసం ముందుగా ఆ దేశపు ఇమ్మిగ్రేషను సైటులో ఆన్లైనులో అప్లికేషను పూర్తిచేసేం.
ఇక కావాల్సినది బయోమెట్రిక్స్, అప్లికేషను సబ్మిట్ చేసే కాన్సులేట్ అప్పాయింట్మెంటు.
అయితే అమెరికాలో ఫ్రాన్స్ వీసా కోసం ఆ దేశపు కాన్సులేట్ కి వెళ్లనవసరం లేదు. మధ్యవర్తిత్వం వహించే వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ సెంటర్ కి వెళితే చాలు. అయితే ఆ సెంటర్లు కూడా ఆయా కాన్సులేట్లకి కూతవేటు దూరంలోనే ఉంటాయి. మా దగ్గర్లో వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ సెంటరు శాన్ఫ్రాన్సిస్కోలో ఉంది.
అక్కడ అప్పాయింట్ మెంటుకి గాను వారి సైటులో ఫీజు కట్టి తేదీని బుక్ చేసుకోవాలి. ఫీజు ఒక్కొక్కళ్ళకి దాదాపు వంద డాలర్లు, ఆ పైన కొరియర్ , ఫోటో వగైరాలు మరో డెబ్బై, ఎనభై వరకు డాలర్లు వదులుతాయి. ఫీజు కట్టేముందు అడిగే వివరాలలో అప్పటికే పూర్తి చేసిన వీసా అప్లికేషను నంబరు వగైరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఫ్రాన్స్ వీసా అప్లికేషను పెట్టేటపుడు సైటులో మాకు తెలియక తొందరగా అయి పోతుంది కదా అని ఇద్దరం చెరో అకౌంటు క్రియేట్ చేసి సెపరేటుగా అప్లికేషన్లు పూర్తి చేసాం. తీరా అక్కణ్ణించి ఫీజు కట్టడానికి వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ సైట్ వరకు వచ్చాక అర్థమైన విషయం ఏవిటంటే మా ఇద్దరికీ కలిసి ఒక్కసారి అప్పాయింటు రావాలంటే రెండు అప్లికేషన్లు కలిపి ఒకే అకౌంటులో ఉండాలి. మొదట ఒక్కళ్లు అప్లికేషను పూర్తి చేసి, దానికే మరొకర్ని కూడా పార్టనర్ గా ఏడ్ చేసుకోవాలి. కాబట్టి అలా మా సమయం అక్కడ కాస్త వృథా అయ్యింది.
చివరికి ఇద్దరికీ కలిపి అప్లికేషన్లు పెట్టి అనుకున్నట్టుగా రెండు వారాల్లో కనబడ్డ మొదటి తారీఖుని సెలక్టు చేసుకుని క్రెడిట్ కార్డుతో వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ సైటులో ఫీజు కట్టేసి, చివరాఖరిగా మాకు సొమ్ము అందినట్టు చూపించాల్సిన స్టెప్పు దగ్గిరికి వచ్చేసరికి సైటు పనిచెయ్యడం మానేసింది.
కార్డులో రెండువందల డాలర్లు కట్టయ్యిపోయాయి కానీ అప్పాయింటుమెంటు తారీఖు ఖరారయినట్టుగానీ, సొమ్ము అందినట్టుగానీ మెసేజీ రాలేదు.
ఇక యూకే వీసా రెండువారాలు అనుకున్నది మూడు వారాల తర్వాత వచ్చింది. అప్పటివరకు ఫ్రాన్సు వీసా అప్లికేషను, అప్పాయింటుమెంటు మాట దేవుడెరుగు, వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ కస్టమరు సర్వీసుకి ఈ మెయిళ్లలో లావాదేవీలు చెయ్యడంతో సరిపోయింది. ఆ దిక్కుమాలిన సైటుకి ఫోను సర్వీసు ఉండదు. కేవలం ఈ మెయిలే శరణ్యం. యూకే వీసా వచ్చి పాసుపోర్టులు మా చేతికొచ్చినా ఈ రెండో వీసాకి పోయిన డబ్బులు వాపసు రాలేదు. రెండువందల డాలర్లు గోవిందా! ఇక ఆశలు వదులుకుని మళ్ళీ డబ్బులు కట్టి కొత్త అప్పాయింటుమెంటు తెచ్చుకోవాల్సి వచ్చింది.
తీరా చూద్దుము కదా! వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ అప్పాయింటుమెంట్లు మరో నెల్లాళ్ళ వరకూ అంటే మార్చి 15 వరకూ లేవు. మా ప్రయాణం ఏప్రిల్ 12 వ తారీఖున. అంటే 25 రోజుల్లో మాకు ఈ యూరపు వీసా స్టాంపింగయ్యి పాసుపోర్టులు మాచేతికందాలి.
అక్కడే మా టూరు ప్రహసనం మొదలైంది.
*****
(సశేషం)