గజల్ సౌందర్య – 5

-డా||పి.విజయలక్ష్మిపండిట్

 

          గజల్స్ అందం వాటి సాహిత్య లోతులో ఉంటుంది. గజల్ నిర్మాణాత్మక కవితా రూపంలో ప్రేమ, విరహం, నిరీక్షణ , అస్తిత్వ ఆందోళన అనే సామాజిక ఇతివృత్తాలపై గజల్ కవుల యొక్క భావోద్వేగాల భావ రూప చిత్రాలు ,శబ్దాలంకారాల శ్రావ్యమైన లయ లో గజల్ అందం కనిపిస్తుంది,

“ఆత్మలను పలికించేదే అసలైన భాష
ఆవిలువ కరువైతే అది కంట శోష “
అన్నారు సి. నా. రే. ఒక గజల్ లో.

          తెలుగు గజల్ కవులు కవయిత్రులు తమ భావోద్వేగాలకు రూప శబ్ద లావణ్యాన్ని చేర్చి కూర్చి పాఠకుల / శ్రోతల మనస్సులను రంజింపచేసే గజళ్ళు రాస్తున్నారు. వీరి గజళ్ళలో వీరి వైవిధ్యమైన భావోద్వేగాల వస్తువును, నిర్మాణ శైలి చాతుర్యాన్ని ,  గజలియత్ ను గమనించండి.

          చాల మంది గజల్ కవులు తమ గజళ్ళను గాయకులతో పాడించి వీడియోలు You Tube లో పెట్టడం స్వాగతించాల్సిన మంచి మార్పు. తెలుగు గజళ్ళను గాన రూపంలో అంతర్జాలంలో You Tube లో వివిద సాంఘిక మాధ్యమాల్లో పెట్టడం వల్ల ఆ గజల్ కవుల గజళ్ళు పాఠకులను చేరుతాయి. మా “విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ “ ఆశయం, లక్ష్యం; తెలుగు గజళ్ళు ప్రపంచ వ్యాప్తిచెందుతాయి.

          గజల్ కవయిత్రులు ఉత్సాహంగా తమ గజళ్ళను సోషియల్ మీడియాల్లో పోస్టు చేయడం ముదావహం. గజల్ కవయిత్రులు రాసిన గజళ్ళను “రేక్తీ “ అని , పురుషులు రాసిన గజల్ ను “రేక్తా” అంటారు.

ఈ 5 వ వ్యాసం లోని గజల్ కవులు :

సర్వ శ్రీ ..అరుణ చయనం, సీతా సోంపాక, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ , వసంత ఇంజపురి హంసగీతి, విజయలక్ష్మి కందిబండ।

          గజల్ రచయిత్రుల సంఖ్య ఎక్కువ ఉండటం గమనించండి. వీరి గజళ్ళను చదివి వీడియోలు విని ఆస్వాదించండి.

గజల్ కవయిత్రి అరుణ చయనం

“ హేమంత రాగాలు “ అన్న గజల్ సంపుటిని ప్రచురించారు. వారి గజళ్ళను ఆస్వాదించండి.

జీవితమే పాఠశాల చదువుకోర ఓమనిషీ
జీవులెల్ల పాఠకులే తెలుసుకోర ఓమనిషీ*

కాలమెపుడు పరుగుతీయు ఆగదుకద ఎవరికొరకు
ఆనుభవాలు పోగుచేసి మసలుకోర ఓమనిషీ*

చెలిమివిలువ తెలుసుకొని సాగవలెను కడవరకు
సేవలోనె ఆనందం గెలుచుకోర ఓమనిషీ

మనమంతా ఒకేకులం మనుషులంత ఒక్కటేగ
మనిషైతే మనసువిలువ నిలుపుకోర ఓమనిషీ

అరుణరాగ భావనలే అందముగా అలరెనంట
అందరినీ ఆదరించి కలుపుకోర ఓమనిషీ

*చయనం అరుణాశర్మ 2 వ గజల్

మంచి అన్నది కానరాదే మమతలన్నీ వాడిపోయెను
ఆశలెన్నో విహంగాలై ఆకసానికి ఎగిరిపోయెను

నాది నాదను భేదభావం నాటుకొనగా మనుషులందున
ప్రేమ కరుణలు దగ్ధమవగా వావి వరుసలు వీడిపోయెను

ఏది సత్యం ఏది స్వప్నంస్వార్ధపూరిత లోకమందున
ఈర్ష్య పెరిగెను ద్వేషమేగా మానవత్వం ఓడిపోయెను

కాలచక్రం కదులుతోంది బ్రతుకు నావగ మునుగుతున్నది
ఆశ చావని ఆకలారని మెతుకు ఆత్రం మిగిలిపోయెను

భారమాయెను బ్రతుకు చిత్రం స్నేహ సౌధం శిథిల శకలం
రావణాసుర కాష్ఠమల్లే రాక్షసత్వం రగిలిపోయెను

          గజల్ రచయిత్రి సోంపాక సీత “గజల్ కౌస్తుభం” అన్న శీర్షికతో గజల్ సంపుటాన్ని 2025 లో ప్రచురించారు . వీరు వైవిధ్య భరితమైన అనేక సామాజిక అంశాలపై కూడా గజళ్ళు రాశారు. చదివి విని ఆస్వాదించండి.

ఆమె “మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ ప్రేమ పై రాసిన గజల్ ఇది..,

అమ్మపంచే ప్రేమకన్నా..మధరమేదీ లోకమందున!
ఆమె కన్నా ఘనత కలిగిన.. క్షమత ఏదీ లోకమందున!

ప్రసవ వేదన మరచిపోవును..కన్నపేగును చూచినంతనె
తల్లిప్రేమను తూచగలిగే..తూకమేదీ లోకమందున?

రుధిరధారను క్షీరధారగ.. మార్చు శక్తియె
అమ్మ అంటే

ఆమె ఋణమును తీర్చగలిగే..సూత్ర మేదీ లోకమందున?

గోరుముద్దలు ,ఉప్పుమూటలు .. మరువరానివి మనోవీథిన
తప్పులెంచక మోసిమురిసే..మనసుఏదీ లోకమందున?

ధరణి’సీత’యెఓర్పుమంత్రము..మరువలేమే మానసంబున
వెలుగు నీడలు కన్న మించిన.. సాక్షి ఏదీ లోకమందున?

9 షేర్ల రెండవ గజల్ శ్రీ రాముని నిపై రాసిన గజల్ ను ఆస్వాదించండి.

రామపథమె నమ్మికగా నడుస్తాము మేమంతా
ధర్మ నిరతి తరువులనే నాటుతాము మేమంతా

సత్యపాశ బంధితులై దుఃఖములను దిగమ్రింగిరి
పాడియావు దూడలగుచు చరిస్తాము మేమంతా

అమ్మ తల్లి సీతమ్మయె జగజ్జనని మాకెపుడూ
సప్తపదికి పవిత్రంగ మొక్కు తాము మేమంతా

భాతృప్రేమి లక్ష్మణుడిని మరువబోము కలనైనా
వేరు పురుగు భావాలను పెరుకుతాము మేమంతా

కాంక్ష లేని భరతునిలో బాధ్యతెంతొ చూశామే
పాదుకున్న వేర్లులాగ నిలుస్తాము మేమంతా

హనుమబలమె సాక్ష్యంగాస్వామిభక్తి సేవిస్తూ
హృది లోయలో జీవనదై వెలుగు తాము మేమంతా

అధర్మాన్ని ఎదిరించే నిక్కమైన వాయువులం
గజసాహ్యపు గుర్తులాగ ఒప్పుతాము మేమంతా

ప్రాచేతస సన్నిధియే లవకుశులకు ఒడియైనది
రామగాథశ్రవణంలో తరిస్తాము మేమంతా

రామాయణ పథములోమేలుబంతి బిందువులం
ఆదికావ్య యజ్ఞఫలము పొందుతాము మేమంతా

కవి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గజళ్ళను ఆస్వాదించండి.

(సల్లాపము(గజల్))

పూలుతెచ్చి చెలియమీద చల్లాలని నాకున్నది
చెలిమోమున చిరునవ్వులు చూడాలని నాకున్నది

అందాలను అన్నింటిని తేరపార కనులజూచి
ముద్దూమురిపాలతోడ మురియాలని నాకున్నది

చెలినిపిలిచి చేతిలోకి తీసుకోని చంపనిమిరి
సరససల్లాపములలో ముంచాలని నాకున్నది

మల్లెపూల తోటలోన ముచ్చటలను చెప్పుకొనుచు
చందమామ వెన్నెలలో తిరగాలని నాకున్నది

నింగిలోన తేలియాడు మేఘాలను పారజూచి
తళతళమను తారకలను ఎంచాలని నాకున్నది

మల్లెపూలు కోసకొచ్చి ముచ్చటగా మాలనల్లి
సుందరాంగి కొప్పులోన తురమాలని నాకున్నది

అచ్చతెనుగు పదములందు కవిరాజుగ కవితవ్రాసి
శ్రావ్యమయిన పాటనొకటి పాడాలని నాకున్నది

రెండవ గజల్ – ఖండ గతి)

కాంతినై వదనమును చేరనా ఓసఖీ
నవ్వునై చెంపలా వెలగనా ఓసఖీ

చూపునై కాంచనా రూపాన్ని ప్రేయసీ
అందమై దేహాన్ని అంటనా ఓసఖీ

పలుకునై తట్టనా పెదవులా సకియా
తేనెనై చుక్కలా చిందనా ఓసఖీ

గానమై దూరనా గొంతులో నేస్తమా
శ్రావ్యమై చెవ్వులా తట్టనా ఓసఖీ

తోడునై ఉండనా అండగా ప్రణయనీ
జంటనై ప్రక్కనా నిలవనా ఓసఖీ

సుమమునై కూర్చోనా కొప్పులో నెచ్చెలీ
పరమళమై చుట్టునూ వీచనా ఓసఖీ

జాబిలై లేపనా విరహాన్ని ప్రేమికా
వెన్నెలై విహరింప జేయనా ఓసఖీ

గజల్ కవయిత్రి హంసగీతి “ గజల్ గులాబీలు” అన్న శీర్షికతో గజల్ సంపుటి వెలువరిం చారు. వీరు దాదాపు వేయి గజళ్ళు రాశానని అంటారు . వీరి గజళ్ళ వీడియోలు వందకు పైన You Tube లో ఉన్నాయన్నారు. చదివి విని ఆస్వాదించండి.

గజల్-1

ఏనిమిషం ఏమౌనో దైవానికి వదిలేసేయ్
ఏ భారం మోయాలో కాలానికి వదిలేసేయ్

తప్పులేవి చేయనట్టి మనిషుండడు లోకంలో
ఏ పాపం చేసావో కర్మానికి వదిలేసేయ్

ఎంత నీవు శ్రమించినా కలిసి రావటం లేదా
ఏ ఫలితం ఇస్తుందో భాగ్యానికి వదిలేసేయ్

లక్ష్యాలను చేరేందుకు ఆటంకం కలగవచ్చు
ఏ గమ్యం చేరాలో పయనానికి వదిలేసేయ్

ప్రతిరోజూ వినిపించే పుకార్లనే నమ్మవద్దు
ఏది జరిగి ఉంటుందో సత్యానికి వదిలేసేయ్

ఎంత ఘనత నీకున్నా నీవెపుడూ చెప్పరాదు
ఏ గొప్పలు చెబుతుందో సంఘానికి వదిలేసేయ్

ప్రాణంపై తీపి ఎంత నీకున్నా ఓ ‘హంసా’
ఏక్షణాన వస్తుందో మరణానికి వదిలేసేయ

హంసగీతి రెండవ గజల్

వలపు పిలుపు వినిపిస్తే మనసు తెలిసి రాలేవా
మూసి ఉన్న రాతి గుండె తలుపు తెరిచి రాలేవా

కాలం తెచ్చిన మార్పుల వలయంలో నేనున్నా
తడుస్తున్న నా కన్నుల దిగులు చూసి రాలేవా

రాలుతున్న ప్రతిక్షణం గేలి చేసి పోతున్నది
ఏకాంతపు తిమిరంలో వెలుగునింపి రాలేవా

ఈ దారిని నీ రాకను తెలియచేయమని అడిగా
వసంతుడే వచ్చినట్టు నీవు నడిచి రాలేవా

కలహంతో ముసుగు పడిన నీ మనసును అడిగిచూడు
మనమధ్యన ఉన్న అడ్డు తెరలు తీసి రాలేవా

ఏ మాయల వలయంలో బందీవై ఉన్నావో
నిన్ను చుట్టుకున్న చిక్కుముళ్ళు విప్పి రాలేవా

అనిమిషగా నీ కోసం చూస్తున్నది ‘హంసగీతి’
నే చూపిన మమకారం గురుతు వచ్చి రాలేవా

గజల్ కవయిత్రి వసంత ఇంజపురి గజళ్ళు చదివి , విని ఆస్వాదించండి.

రాసిన లేఖలు రివ్వురివ్వుమని విభుని చేరితే ఎంత ఇష్టమో
నా మది మాటలు అన్నీ చెవిలో తనకే చెబితే ఎంత ఇష్టమో

కురిసే చినుకులు మెరిసే మెరుపులు ఎదవీణియనే మీటుతున్నాయి
వీనులవిందగు స్వరగీతులనే కలిసి పాడితే ఎంత ఇష్టమో

తపములు జపములు చేసే వేళల తపోభంగమే ఎటుల జరిగెనో
కాచే దైవము ప్రియమగు వరములు కోరి ఒసగితే ఎంత ఇష్టమో

నీలో నాలో అలజడి రేపిన విరహపు దాహం తీరేదెటులో
వెన్నెల వాకిట తడిసిన ప్రాయం మరులు .గొలిపితే ఎంత ఇష్టమో

తారాతీరం చేరుకున్నాక హద్దులు ఎరుగని వసంతమేగా
ఆశల శ్వాసల పందిరికిందే వలపు పండితే ఎంత ఇష్టమో

వసంత ఇంజపురి రెండవ గజల్

రాధికనై మాధవుడిని వెదికినట్లు కలగన్నా
కలలోనే నా కన్నుల దాగినట్లు కలగన్నా

మాయలుచేసే దొంగని మన్నించుట తప్పుకదా
మమతలతో మదితాళం వేసినట్లు కలగన్నా

ఎక్కడనీవుంటావో అక్కడ తానంటాడే
వెంటొచ్చే నీడలాగ వచ్చినట్లు కలగన్నా

చేతికి చిక్కని వాడే చిరునవ్వును చెదరనీడు
చిన్నిగుండెలోని బాధ తీర్చినట్లు కలగన్నా

అంతా మిథ్యేనంటూ మిన్నై నిలిచాడు కదా
ఇహ లోకపు మోహాలను వీడినట్లు కలగన్నా

నిన్నువిడిచి నిమిషమైన ఉండలేదు ఈ దేహము
నా జీవన జ్యోతిలాగ వెలిగినట్లు కలగన్నా

దీనులపాలిటి దేవుడు కరుణించెను ఓ వసంత
నా ప్రాణము తనలోనే చేరినట్లు కలగన్నా

గజల్ కవయిత్రి విజయలక్ష్మి కందిబండ గజళ్లు.., వీరు గజళ్ళను రాసి సాంఘిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు.

ప్రేమతడే తగలనిదే బంధం నిలబడుతుందా!
శ్వాసచినుకు అందనిదే ప్రాణం నిలబడుతుందా

ఆటుపోట్లు ఎన్నున్నా లక్ష్యం చేరాలిచెలీ..
అలలరొదే పడదంటే హృదయం నిలబడుతుందా!

పిడుగుకు వెరవని మేఘమె మెరుపును సృష్టించ గలదు..
పురిటి నొప్పి పడనంటే భువనం నిలబడుతుందా!

వంచన ముంచేస్తుంటే మంచినిపెంచేదెట్లా‌..
గాలి విసిరి కొడుతుంటే వర్షం నిలబడుతుందా!

అక్షరమే ఆయుధమనుటకు సాక్ష్యాలెన్నెన్నో..
కలమే ఉరిమిందంటే ఖడ్గం నిలబడుతుందా!

జ్ఞానగంధమే కాదా నీ సౌభాగ్యం విజయా..
ధర్మమే గెలిచిందా ఈధనం నిలబడుతుందా!

గజల్ కవయిత్రి విజయలక్ష్మి కందిబండ రెండవ గజల్
కమ్ముకున్న స్వార్థంతో దీపం మసి బారుతోంది!
జాతికసలు ఉనికిపట్టు కుటుంబమే, నలుగుతోంది!

అంగడిలో ఘుమఘుమలకు వంటిల్లే వలసబోయె..
పనేలేని అట్లకాడ పోట్లాటలొ నెగ్గుతోంది!

నల్లధనం రక్షకులకె భగవానుని దర్శనమా..
పాపాత్ముల మకిలంతా తీర్థంలో చేరుతోంది!

పెట్టెలోని పుల్ల ఐసు ఏసీలో దూరినదే..
జేబుచిరిగి చిల్లిపడ్డ బడుగుగొంతు ఎండుతోంది!

సత్యాసత్యాలన్నీ తరాజులో తూకానికి..
బయటకురాలేనినిజం మౌనంలో మగ్గుతోంది!

లోకాలకు పతాకగా నిలచినదే వేదవిద్య ..
వెలుగుబాల చెప్పలేక చీకటిలో మరుగుతోంది!

కాంతినంత కాజేసిన అమావాస్య వయసెంతని..
ఉషోదయం తథ్యమంటు విజయగీతి పాడుతోంది.

వ్యాసం చివర పెట్టిన ఐదు మంది గజల్ కవుల / కవయిత్రుల గజల్ గానం వీడియోలు విని ఆస్వాదించండి.

*****
(సశేషం)
 
 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.