ప్రమద

సుధా చంద్రన్

-నీరజ వింజామరం 

నటరాజ పాదాల నాట్య మయూరి…

రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఒక  17 ఏళ్ల అమ్మాయి, ‘జైపూర్ ఫూట్’ అనే కృత్రిమ పాదంతో మళ్లీ నృత్యం చేయగలనని ప్రపంచానికి నిరూపించింది. ఈ సాహసమే ఆమెను దేశానికి స్ఫూర్తి చిహ్నంగా నిలబెట్టింది. ఆమె కథ కేవలం వ్యక్తిగత విజయం కాదు, పట్టుదల ఉంటే వైకల్యం అనేది ఒక అడ్డంకి కాదని నిరూపించిన గొప్ప సామాజిక సందేశం. ఆమె మరెవరో కాదు, నాట్య మయూరి సుధా చంద్రన్.

          సుధా చంద్రన్ – ఈ పేరు వినగానే మన కళ్ల ముందు కదలాడేది కేవలం ఒక  నటి రూపం మాత్రమే  కాదు, ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఒక స్ఫూర్తిదాయకమైన, పోరాట పటిమ గల మహిళ రూపం .

          సుధా చంద్రన్ గారు సెప్టెంబర్ 21, 1964న ముంబైలో ఓ తమిళ  కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఆమె తండ్రి కె.డి. చంద్రన్ కళాభిమాని మరియు మాజీ నటుడు. ఆమె తల్లి శ్రీమతి తంగం అద్భుతమైన గాయని. తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెలో చిన్నప్పటి నుంచే సంగీతం మరియు నృత్యం పట్ల ప్రేమను పెంచారు.

          సుధా చంద్రన్ గారు మూడేళ్ల చిన్న వయస్సులోనే నృత్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. ఆమెలోని ఆసక్తిని గమనించిన తండ్రి, ఆమెను ముంబైలోని ప్రసిద్ధ నృత్య పాఠశాల ‘కళా సదన్’ లో చేర్చడానికి ప్రయత్నించారు. వయస్సు తక్కువగా ఉందని మొదట ప్రిన్సిపాల్ నిరాకరించినప్పటికీ, సుధా నాట్యం చూసి ముగ్ధులై వెంటనే ఆమెను పాఠశాలలో చేర్చుకున్నారు. అక్కడ గురువుల పర్యవేక్షణలో ఆమె ప్రతిభ మరింత మెరుగుపడింది.

          ఆమె తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆమె తల్లి, ఆమె చదువు విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉండేవారు. సుధ జీవితంలో క్రమశిక్షణ లోపించకుండా ఉండాలని ఆమె తల్లి తన  ఉద్యోగాన్ని కూడా మానేసి, సుధా చంద్రన్ పెంపకంపై దృష్టి సారించారు. ఆమె చదువు, హోంవర్క్, డ్యాన్స్ క్లాసులు, సరైన సమయానికి నిద్ర… ఇలా అన్నిటి పైనా ఆమె తల్లి శ్రద్ధ వహించేవారు. సుధ చదువులో కూడా చురుకైన విద్యార్థి.

          ఆమె పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేశారు. ఆమె పదవ తరగతి పరీక్షల్లో 80% మార్కులు సాధించి, తరగతిలో మొదటి స్థానంలో నిలిచారు. ముంబైలోని ప్రసిద్ధ మిథిబాయి కాలేజీ నుండి బి.ఎ. డిగ్రీని పొందారు.

          ఆ తర్వాత ఆమె ఎకనామిక్స్ లో ఎం.ఎ. కూడా పూర్తి చేశారు.

          కేవలం 17 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, సుధా చంద్రన్ గారు 75 స్టేజ్ షోలు ఇచ్చి, అద్భుతమైన, నృత్యానికి మారు పేరుగా నిలిచారు. ఆమె నాట్యరంగంలో అత్యంత ప్రసిద్ధమైన ‘నృత్య మయూరి’ మరియు ‘నవజ్యోతి’ వంటి ముఖ్యమైన పురస్కారాలను కూడా అందుకున్నారు.

          నృత్యకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సమయంలో కూడా ఆమె తన చదువును కొనసాగించారు.

          1981 మే నెలలో, ఆమెకు దాదాపు 16-17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి  తమిళనాడులోని, ఒక ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు.

          బస్సు త్రిచి సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

          ఈ ప్రమాదంలో ఆమెకుడి కాలుకు తీవ్ర గాయంఅయ్యింది. సీటు కింద  ఇరుక్కు పోవడం వల్ల కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను అక్కడికక్కడే ఉన్న ఒక స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయాలను సరిగ్గా గమనించకుండా, సాధారణ ప్లాస్టర్ వేశారు. సరైన చికిత్స అందకపోవడం వల్ల, ఆ గాయం గ్యాంగ్రీన్గా మారింది.

          రెండు వారాల తర్వాత ఆమెను మెరుగైన చికిత్స కోసం మద్రాసులోని (నేటి చెన్నై) విజయా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, గ్యాంగ్రీన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండాలంటే కాలును తొలగించడమే ఏకైక మార్గమని తేల్చారు.

          దీంతో, సుధా చంద్రన్ గారి కుడి కాలును మోకాలికి కొద్దిగా కింద నుండి తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటనే ఆమె జీవితంలో అతిపెద్ద, విషాదకరమైన మలుపు.

          కాలు తీసేసిన తరువాతసుధా చంద్రన్ గారు నర్తకిగా తన భవిష్యత్తు ముగిసి పోయిందని భావించి, తీవ్ర నిరాశకు, భావోద్వేగానికి లోనయ్యారు. నర్తకి అయిన తనకు కాలు లేదనే బాధ ఆమెను కృంగదీసింది. నృత్యమే ప్రపంచంగా బతికిన ఆమెకు, కాలు కోల్పోవడం వల్ల తన కలలు పూర్తిగా చెదిరిపోయాయని కలత పడ్డారు. కానీ, ఆమె తల్లిదండ్రుల అండతో, తన ఆత్మవిశ్వాసంతో ఆ కష్టాన్ని అధిగమించారు. ఇక నృత్యం చేయలేనని అర్థం చేసుకున్నాక, ఆమె తన దృష్టిని పూర్తిగా చదువుపైకి మళ్లించారు. అప్పటికే ఆమె B.A. పూర్తి చేశారు మరియు M.A. (ఎకనామిక్స్) కొనసాగిస్తున్నారు.

          ఈ కష్టకాలంలో ఆమె తల్లిదండ్రులు ఎంతో బలంగా నిలబడ్డారు. వారు ఆమె పై  ఏమాత్రం జాలి చూపకుండా, ఆమెతో చాలా సాధారణంగా మాట్లాడేవారు. ఆమె తండ్రి ఆమెలో ధైర్యాన్ని నింపి, ఆమె ఒక సాధారణ జీవితం గడపాలని ఆశించారు.

          సుధ తన వైకల్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. వైకల్యం కారణంగా సానుభూతినీ కోరుకోలేదు. వీల్‌చైర్‌ను ఉపయోగించడానికి నిరాకరించి, ఊతకర్రల సహాయంతో నడవడానికి ప్రయత్నించారు.

          అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు , ఒక పత్రికలో  ‘జైపూర్ ఫుట్’ అనే కృత్రిమ కాలు గురించి చదివారు. ఆ కథనంలో, కృత్రిమ అవయవాల నిపుణుడైన డా. ప్రమోద్ కరణ్ సేథీ గురించి ప్రస్తావించబడింది. ఆయన ఈ ‘జైపూర్ ఫూట్’ ను అభివృద్ధి చేసి, దానికి రామన్ మెగసెసె అవార్డు కూడా అందుకున్నారు.

          ఇది ఆమెలో నృత్యం చేయాలనే ఆశను, విశ్వాసాన్నిచిగురింపజేసింది.

          జైపూర్ ఫూట్ గురించి తెలుసుకున్న తర్వాత, ఆమె వెంటనే డా. సేథీకి లేఖ రాశారు. అదే సమయంలో, ఆమె కుటుంబ సభ్యులు ముంబైలోని ఒపేరా హౌస్ వద్ద ఉన్న ఒక సంస్థను సందర్శించినప్పుడు, అక్కడ ప్రదర్శనలో ఉంచిన కృత్రిమ కాలును (Jaipur Foot) కూడా చూశారు.

          డా. సేథీని కలిసినప్పుడు సుధా చంద్రన్ తన జీవితంలో అతి ముఖ్యమైన ప్రశ్నను డాక్టర్ సేథీ ముందు ఉంచారు: “నేను ఈ కృత్రిమ కాలుతో మళ్లీ నాట్యం చేయగలనా?”

          డాక్టర్ సేథీ ఏమాత్రం సందేహించకుండా, “తప్పకుండా చేయగలరు (Why not?)” అని బదులిచ్చారు. ఈ రెండు పదాలు సుధా చంద్రన్ గారికి దైవవాక్కులా వినిపించాయి మరియు ఆమెలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

          డాక్టర్ సేథీ, సుధా చంద్రన్ గారి అవసరాన్ని అర్థం చేసుకున్నారు. సాధారణంగా నడవడానికి ఉపయోగించే జైపూర్ ఫూట్, నాట్యంలోని వేగవంతమైన కదలికలకు, అకస్మాత్తుగా శరీరం బరువు మార్చడానికి సరిపోదు.

          సమావేశం తర్వాత, డాక్టర్ సేథీ సుధా చంద్రన్ డ్యాన్స్ కదలికలను పరిశీలించి, ఆమె గురువు సలహాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నాట్యం చేయడానికి వీలుగా ఉండేలా జైపూర్ ఫూట్‌ను ప్రత్యేకంగా మార్పులు చేసి రూపొందించారు. ఆ  విధంగా నృత్యానికి అనుగుణంగా ప్రత్యేకంగా తయారు చేయబడిన జైపూర్ ఫూట్‌ను అమర్చుకున్నారు. కృత్రిమ పాదంతో మళ్లీ సాధన ప్రారంభించారు. ఆ కృత్రిమ కాలుతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎంతోబాధ, నొప్పికలిగినా, పట్టుదల వీడకుండా 20 నెలల తర్వాత తిరిగి వేదికపై ప్రదర్శన ఇవ్వగలిగారు.

  • జనవరి 28న, ఆమె ముంబైలోని సౌత్ ఇండియా వెల్ఫేర్ సొసైటీలో తొలి పబ్లిక్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు.

          ఒక కాలు లేకపోయినా, ఆమె చేసిన నాట్యం చూసి ప్రేక్షకులు, మీడియా దిగ్భ్రాంతి చెందారు. ఆ ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్లభించింది.

          ఈ ప్రదర్శన గురించి అన్ని ప్రధాన దినపత్రికలు ప్రచురించాయి. కాలు కోల్పోయినా , పట్టుదలతో నిలబడ్డ సుధా చంద్రన్ గారి అద్భుత కథ, ధైర్యం గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

          అప్పటికే ప్రముఖ మీడియా మొఘల్, ఉషాకిరణ్మూవీస్ అధినేత రామోజీరావుగారి దృష్టికి ఈ కథనం చేరింది.

          ఈ స్ఫూర్తిదాయకమైన అంశం చాలా మందికి చేరువ కావాలని, దీనిని సినిమాగా తీయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారిని సంప్రదించి, సుధా చంద్రన్ కథపై సినిమా చేయాలని కోరారు. వారు సుధా చంద్రన్ గారిని సంప్రదించి, ఆమె జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘మయూరి’ (1985) చిత్రంలో ఆమే ప్రధాన పాత్రపోషించాలని అభ్యర్థించారు.

          ఈ విధంగా, తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో తన పాత్రను పోషించిన తొలి భారతీయ నటిగా సుధా చంద్రన్ గారు చరిత్ర సృష్టించారు.

          ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, ఆమెకు జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా దక్కింది.

          ‘మయూరి’ చిత్రం సుధా చంద్రన్ గారి సినీ ప్రస్థానానికి నాంది మాత్రమే. ఆ చిత్రం తరువాత, ఆమె కేవలం తెలుగులోనే కాక, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి వివిధ భాషల్లో అనేక సినిమాలు మరియు టెలివిజన్ ధారావాహికల్లో (సీరియల్స్‌లో) నటించి, సుస్థిరమైన నటిగా నిరూపించుకున్నారు. ‘మయూరి’ చిత్రం విజయం తర్వాత, దానిని హిందీలోకి  ‘నాచే మయూరి’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో కూడా సుధా చంద్రన్ గారే ప్రధాన పాత్ర పోషించారు. సుధా చంద్రన్ గారు సినిమాల కంటే టెలివిజన్ రంగంలోనే ఎక్కువగా ప్రజాదరణ పొందారు. ముఖ్యంగా ఆమె పోషించిన ప్రతి నాయక పాత్రలు అపారమైన కీర్తిని తెచ్చిపెట్టాయి.

          ‘తుమ్హారీ దిశ’ సీరియల్‌లో ప్రతి నాయక పాత్రకుగాను ఆమె ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు (ITA) గెలుచుకున్నారు.

          ఆమె కృషికి గుర్తింపుగా బరేలీలోని ఇన్వెర్టిస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ ను అందుకున్నారు. అంతేకాక, ఆమె జీవిత చరిత్ర భారతదేశంలోని కొన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చబడింది.

          సుధా చంద్రన్ గారి వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె పట్టుదల, తన ఇష్టానుసారం జీవించాలనే తత్వం కనిపిస్తాయి.

          ఆమె రవి డాంగ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రేమించారు. సుధ తమిళ కుటుంబా నికి, రవి పంజాబీ కుటుంబానికి చెందినవారు కావడంతో వారి కుటుంబాలు ఈ పెళ్లిని మొదట్లో అంగీకరించలేదు. దాంతో, ఈ జంట 1994లో ఇరువురి కుటుంబాలకు తెలియ కుండా ముంబైలోని ఒక గుడిలో వివాహం చేసుకున్నారు.

          సుదీర్ఘ వైవాహిక జీవితం గడిపినా, సుధా చంద్రన్ మరియు రవి డాంగ్ దంపతులు పిల్లలు లేకుండానే ఉండాలని వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారు. దత్తత తీసుకోవాలనే ఆలోచనను కూడా తమ సిద్ధాంతాలకు సరిపోదని తిరస్కరించారు. వారిద్దరూ కలిసి ఉంటూ, ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ తమ జీవితాన్ని తమదైన శైలిలో కొనసాగిస్తు న్నారు.

          శారీరక వైకల్యం విజయానికి ఏమాత్రం అడ్డు కాదని, దృఢ సంకల్పం ఉంటే ప్రతి కష్టాన్ని దాటవచ్చని సుధా చంద్రన్ తన జీవితం ద్వారా నిరూపించారు. నృత్యం, నటన ద్వారా ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచి, భారతదేశ స్ఫూర్తి చిహ్నంగా గౌరవాన్ని అందు కుంటున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.