యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-7

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) ఐరోపా చేరిన వేళ!

ఎట్టకేలకు సుదీర్ఘకల నించి మేల్కొన్నట్లు లండన్ హీత్రో ఎయిర్ పోర్టులో ఉదయం ఏడుగంటలకు దిగేం. జీవితంలో మొదటిసారి యూరపు ఖండంలో అడుగుపెట్టేం.

          ఇలా యూరపు ప్రయాణం చెయ్యాలన్న కలని నెరవేర్చుకోవడం కోసం పాతికేళ్ల కిందట ఇండియాలో గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్న తొలి రోజుల్లో “మార్గదర్శి తోడుంటే ఆనందం మా వెంటే” అనుకుంటూ చిట్టీ వెయ్యడమూ, అయిదేళ్లు గడిచి తీరా చిట్టీ చేతికి వచ్చే సమయానికి ఆ సొమ్ము అడ్వాన్సుగా ఇచ్చి ఇల్లు కొనుక్కోవడంతో ప్రయాణం వాయిదాపడ్డం జ్ఞాపకం వచ్చింది. అప్పటి నించి ఈ కలని నెరవేర్చుకునే దిశగా ప్రయాణం చేస్తూ పడ్డ కలత తీరిన నిశ్చింత, నెరవేరిన ఆశల గొప్ప పులకింత మనస్సు నిండా!

          ఇక ఇమ్మిగ్రేషను లైనులో అమెరికా, యూరపు వంటి పాసుపోర్టు ఉన్నవారికో లైను, వేరేదేశాల వాళ్ళకో లైను ఉంది. అవతల లైనులో రెండు వందల మంది ఉంటే మన ఇండియను పాసుపోర్టు లైనులో మాతో బాటూ మహా అయితే ఐదారుగురు ఉన్నారు. ఇన్నాళ్లకి ఇండియను పాసుపోర్టు వల్ల ఒక లాభం కలిగిందని సంతోషించాం.

          మీరు ఇంగ్లాండుకు ఎందుకొచ్చారు? ఎన్నాళ్ళుంటారు? లాంటి రెండు, మూడు మామూలు ప్రశ్నలతో మా ఇమ్మిగ్రేషను చెకింగు అయిదు నిమిషాల్లో పూర్తయిపోయింది.

          ఇక బాగేజీ కూడా త్వరగానే వచ్చేసింది. అయితే అక్కణ్ణించి ఊబర్ టాక్సీ ఎక్కడానికి మరో అర గంట పట్టింది.

          హీత్రో ఎయిర్ పోర్టులో టెర్మినల్ రెండుకి దగ్గర్లోనే ఉన్న పార్కింగ్ బిల్డింగులో నాలుగవ అంతస్తులో ఊబర్ వెయిటింగు ఏరియా ఉంది.

          ఎయిర్ పోర్టు నించి బయటికి అడుగుపెడుతూనే చల్లని గాలి చుట్టుముట్టింది. దాంతో  వెయిటింగు ఏరియాలో అరగంట నిలబడడమూ కష్టమైంది.

          అక్కణ్ణించి ట్రాఫిక్ ఉండడంతో హోటల్ కి మరో గంట పట్టింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు, ముఖ్యంగా మరో దేశానికి, ఖండానికి వెళ్ళినపుడు ఎయిర్ పోర్టు బయటికి రాగానే చుట్టుముట్టే గాలి స్పర్శని బట్టి, మొదటిసారి చుట్టూ చూడగానే కనిపించే చెట్లని, పచ్చదనాన్ని బట్టి అక్కడ ఎలా ఉందో పోల్చుకుంటాను.   

          అలా లండనులో అడుగుపెట్టగానే చలి, చుట్టూ వాతావరణం, ఒకే  విధమైన పెంకుల పైకప్పులతో మూణ్ణాలుగు అంతస్తుల అపార్టుమెంట్లు, ఇటుక గోడల వంటి నిర్మాణాలు దాదాపుగా అమెరికాలోని బోస్టన్ ని తలపుకి  తెచ్చేయి. బహుశా: ఇక్కడ లాంటి నిర్మాణాలే బోస్టన్ లో నిర్మించి ఉంటారు. యూరపు నించి మరో దేశానికి వెళ్లి ఆక్రమించినంత మేరా వారి నిర్మాణాల్ని, పేర్లని, సంస్కృతిని, మతాన్ని, భాషని  విస్తరింపజేసిన సాక్ష్యంగా ప్రపంచంలో ఎక్కడ చూసినా అవే ఆనవాళ్లు కనిపిస్తాయి.

          అయితే ఇక్కడ ఉన్నలాంటి మొదలు నించి మోడువారిన పెద్ద వృక్షాల్ని ఎక్కడా చూళ్ళేదు. కిందటేడాది  శిశిరం తర్వాత ఇంకా చిగురించినట్లు లేవు.  అలాగే ఎప్పుడూ వర్షాల వల్లనేమో మైళ్ళమేర విస్తరించిన పచ్చని గడ్డి  మైదానాల తాలూకు  లేతాకు పచ్చదనం కంటికి అత్యంత ఆహ్లాదాన్ని కలగజేస్తూంది. ఆ పచ్చదనమూ ఎక్కడా చూడలేదు. ఆనందం అర్ణవమైన అద్భుతానుభూతి! 

          అమెరికాలోలాగానే ఇక్కడ  కూడా ఉదయపు సూర్య కాంతి వెలుతురు ఏటవాలుగా పడుతూ ఎంతో  దేదీప్యమానంగా ఉంది. మాములుగా మబ్బు పట్టి ఉంటుందట అక్కడ. మేమున్న నాలుగురోజుల్లో రెండ్రోజులు ఆకాశం చక్కగా ప్రకాశవంతంగా ఉంది.  అయిన ప్పటికీ హఠాత్తుగా పడే వానల్లో తడవక తప్పలేదు.

          ఎయిర్ పోర్టు నించి వచ్చే M4 మోటార్ వే రోడ్డు స్పీడ్ యాభై మైళ్ళు మాత్రమే ఉండడం, ఇక అది దాటగానే సిటీలో దారిపొడవునా ఎక్కడ చూసినా ఒన్ వే లు ఉండడం, సన్నని సందుల గుండా ప్రయాణంతో పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న మా హోటలుకి చేరడానికి గంట పట్టింది. ఆ చిన్న సందుల్లాంటి రోడ్లలో అటూ ఇటూ కారు పార్కింగులు. ఒక్క కారు మాత్రమే పోగలిగిన సన్నని సందులవి. ఒన్ వే లు లేకపోతే ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది అనిపించింది. తొమ్మిది గంటల వేళ వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలోని మా హోటల్ “పార్క్ ప్లాజా విక్టోరియా” కి చేరాం. రిసెప్షనులో ఇండియన్ అమ్మాయి మా తెలుగు మాటలు చూసి తాను కూడా తెలుగమ్మాయినని పరిచయం చేసుకుంది. లండనులో హాస్పిటాలిటీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఇండియన్లు పెద్ద మొత్తంలో కనిపించారు.

          ఇక హోటలు చెకిన్ టైం మధ్యాహ్నం కాబట్టి సామాన్లు అక్కడ లాబీలో అప్పగించి బయటికి వెళ్లి రావాలని ప్లాన్ చేసుకున్నాం. లాబీలో ఉన్న అతిచిన్న బాత్రూము మాత్రం తయారయ్యేందుకు అనువుగా లేదు. ఒకరు తలుపు తీసుకుని వస్తే మరొకరు బయటకు వెళ్లిపోవాల్సిందే. ఆస్ట్రేలియాలోలాగానే యూరపులో ఎక్కడా టాయిలెట్ సీటు కవర్లు లేవు. ఆ లగ్జరీ కేవలం అమెరికాలోనే ఉంటుందేమో! ఏదో విధంగా కష్టపడి తయారయ్యి లాబీలో సామాన్లు అప్పగిద్దామనుకునేలోగా రూము సిద్ధమయ్యిందన్నారు. అలా పొద్దున్న పదిగంటలకే మా అదృష్టం కొద్దీ రూములో ప్రవేశించాం.

          ఆస్ట్రేలియా ప్రయాణంలో హోటళ్ళని మాకు నచ్చినట్లు మార్చి కొన్ని కష్టాలు పడడం వల్ల ఈసారి ట్రిప్ మాస్టర్స్ వాళ్ళు ఇచ్చిన మొదటి ఛాయిస్ నే తీసుకున్నాం. అమెరికాలో హిల్టన్ గ్రూప్ హోటళ్లలా ఈ హోటల్ చాలా బావుంది. అయితే రూములో మా ముగ్గురికీ మూడు సెపరేట్ బెడ్లు చూసి మాకు నవ్వొచ్చినా సిరికి చాలా సంతోషం వేసింది. ఎవరు ఏ మంచం తీసుకోవాలో చకచకా చెప్పేసింది.

          ఇక స్నానాలు చెయ్యగానే అలసట వచ్చేసింది. అవునుమరి, లెక్కప్రకారం అమెరికాలో మాకు అర్థరాత్రి అది. కానీ అప్పుడు పడుకున్నామంటే ఇక లేవలేం, పగలంతా ఏవీ చూడలేం. కాబట్టి బలవంతాన బయటికి బయలుదేరేం. మాకే ఇలా ఉంటే పాపం మాతో ఉన్న చిన్నపిల్ల పరిస్థితి ఏవిటో! మామూలుగా మా సిరి నాలుగడుగులు వేస్తే ఇక నడవనని బాగా పేచీ పెడుతుంది. అయినా ఈ ప్రయాణంలో పెద్దగా పేచీలు పెట్ట కుండా బానే తిరిగింది మాతో. ఈ మొత్తం ప్రయాణంలో నడక బాగా ఉంటుందని ఇంటి నించి తన కోసం ఫోల్డబుల్ కార్టు వంటి వీల్ ఛైర్ పట్టుకెళ్లాం. ఇక అందులో ఐపాడు చేతబట్టుకుని “మీ ఇష్టం” అన్నట్టు కూర్చునేది. అప్పుడప్పుడూ మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చినపుడూ, కార్టు వెళ్ళని చోటా నడవాల్సి వస్తే బుద్ధిగా నడిచేది.

          ఇక ఆ రోజు మా సొంత ప్రోగ్రాములతో ఫుల్ పాక్ అయ్యి ఉంది. మేం ఒంటిగంటకు లండన్ ఐ జెయింట్ వీల్ టూరు, మూడుగంటలకు ఆఫ్టర్ నూన్ టీ థేమ్స్ రివర్ క్రూజ్ విడిగా బుక్ చేసుకున్నాం. సాయంత్రం డిన్నర్ సమయంలో యూకే తెలుగు సాహితీ మిత్రుల్ని కలవాల్సి ఉంది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.