
ఈ తరం నడక – 20
స్ఫూర్తి
-రూపరుక్మిణి

స్ఫూర్తి ఎక్కడో దొరకదు. మనకు మన చుట్టూ ఉన్న జీవితాలే అద్ధంలా అర్థవంతమైన ఆలోచనను కలిగిస్తాయి. అనడానికి ఉదాహరణగా ఉంటాయి షేక్.సలీమా కథలు.
సాధారణంగా స్త్రీ అణిచివేతల్లోనే ఉంటుంది. పురుషాధిక్య ప్రపంచం నుండి వేరుపడలేక అమ్మగా, ఆడపిల్లగా అణగారిన పక్షం చేరిపోతుంది.
సర్వసాధారణమైన స్త్రీ జీవితంలో కొన్ని వెలుగులు కావాలి, ఆ వెలుగు విద్యతోటే వస్తుందని బలంగా నమ్మి, తన చుట్టూ ఉన్న జీవితాల్లో నుండి తన కథలను ఎంచుకోవడం సలీమా కలం ప్రత్యేకత.
విద్యను అందుకోవడానికి ఆమెలు చేసే పోరాటం ఎంత బలంగా ఉంటుందో స్వయంగా అనుభవించి రాసినట్టు ఉంటుంది.
మొదటి కథ నుండి చివరి కథ వరకు ‘ఆమె’ పాత్ర ఏదైనా కానీ అన్నీ కథల్లో విజయం సాధిస్తుంది. ఎన్నుకున్న మార్గం ఎప్పుడు ఫలవంతంగానే ముగుస్తుంది. అలా అని తన కథల్లో ఎక్కడ సుఖానికి తావు ఉండదు. చిన్న చిన్న సంతోషాలతో ఈ పథగమనం పరిణతిని అందుకుంటూ.., ఆడపిల్లల చైతన్యమే సమాజ ఉన్నతికి దోహదం చేస్తుందని తన కథల్లో స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేసింది సలీమా.
ఒక తరం చదువుకో లేకపోయినా.. తమ సంతానం చదువుకుంటే చూసి ఆనందించాలన్న తపనపడే తల్లి గురించి రెండవ కథ ఉంటుంది. అందంగా ఉన్నానని, కట్టుకున్నవాడు అపురూపంగా చూసుకుంటాడని, కలలుగన్న ఆడపిల్ల ఆ కలలన్నీ కల్లలైన చోట ముక్కలైన గుండెను చేత పట్టుకుని ఒడిలో చంటి బిడ్డకు చదువు ప్రాణంగా పోసి పెంచుతుంది జాన్బీ
మరో కథలో బుర్ఖా వేసుకోవడంలో ఉండే ధన్య జీవితాన్ని చెప్తున్నట్టే అనిపించినా.. ఆ బుర్ఖా వెనుక కష్టాన్ని, ఆ బుర్ఖా వదిలేయాలంటే కావాల్సిన మనో ధైర్యాన్ని అందుకోవడానికి ఆడపిల్లలు చేయవలసిన ఆలోచనని, అందుకున్న చేయూతని సమీనా మాటల్లో చాలా బాగా చెప్పారు.
సలీమా తన కథల్లో ఎప్పుడూ సమాజం గురించే మాట్లాడుతుంది.. అణిచివేయబడిన వర్గానికి గొంతుగా వినిపిస్తుంది. సలీమా కలం జర్నలిజం నుండి వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా తన కథలన్నీ మనకి తాజా వార్తల్లా కన్నీటి చెమ్మను మిగిల్చి వెళ్తాయి.
అంతేకాదు సలీమా కథల్లో ఆశావాదం బాగా ఉంటుంది. ప్రతి మాటలో కదిలే కదలికలో తన కలం పలికే ప్రతి వాక్యంలో చైతన్యాన్ని జోడించడానికి చేసిన ప్రయత్నం అడుగడుగునా కనిపిస్తుంది.
అందుకే తన కథ ఎక్కడైనా విజయం సాధించుకొని తిరిగి వస్తుంది.. ఈ పుస్తకం కూడా శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ద్వారా అచ్చైనది… ఎందరో పోటీదారుల మధ్య నిలబడి గెలిచిన పథగమనం ఈ పుస్తకం.
అమ్మకి బిడ్డే ప్రాణం. అటువంటి ఆడబిడ్డ మీద చేయి వేసిన వాడిని, చేరిచిన వాడిని గురించి ఏమీ మాట్లాడకుండా ఆ సమయంలో ఆ ఆడపిల్ల జీవితం ఏ పక్కగా ప్రయాణిస్తుందో. ఆ ఆడపిల్ల కుటుంబానికే బలైపోయింది అన్న విషయాన్ని దాచిపెట్టడానికి అమ్మాయిని ఎలా కుటుంబ వాకిట బంధిస్తారో… అలా బంధించిన అమ్మాయి అందుకునే గౌరవ, అగౌరవాలను గురించి, కుటుంబ చిత్రాల గురించి చాలా చక్కగా మాట్లాడుతుంది తన కథలో, అలా బలైపోయిన ఆడపిల్ల తన జీవితాన్ని నిలబెట్టుకొని ఇంకో బిడ్డకు తల్లి అయిన క్రమంలో ఆ చంటి బిడ్డ కూడా హత్యాచారానికి గురైనప్పుడు.. ఆ తల్లి వేదనను తన కథలో బాగా వివరించారు.
సలీమా కథల్లో ఎక్కడ పురుష ద్వేషం కనిపించదు. సమాజాన్ని సరి సమానంగా చూసే లోతైన చూపు ఉంటుంది. అలాగే తన చుట్టూ ఉన్న ముస్లిం మైనారిటీ వ్యవస్థలోని లొసుగుల్ని ఎత్తి చూపిస్తుంది. అలా అని ఎక్కడా మతము, కులము ప్రసక్తి తీసుకురాదు. చెప్పాలనుకున్న విషయంలో ఒక స్పష్టత ఉంటుంది. మూల కారణాల గురించి ఎక్కడా చర్చకు పోదు. కానీ కథ మొదలు పెట్టిన దగ్గర నుండి ముగింపు కొచ్చే వరకు మనుషుల్లో ఎదగాలన్న కోరికను, ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని అందుకునే కృషిని, చీకటింట దీపమై మెరిసే చిరునవ్వును చాలా హృద్యంగా చెప్పడానికి ప్రయత్నించారు.
తిత్లి కథలో హసీనా పాత్ర ద్వారా నానాటికి కనుమరుగైపోతున్న అరణ్యాల గురించి మాట్లాడుతుంది. అడవిని దైవంగా పూజించే జీవన విధానంలో ఉండే వ్యవస్థలోని వడిదుడుకుల గురించి మాట్లాడుతుంది. ఆ ప్రాంతాలలో విద్య అవసరం గురించి మాట్లాడుతుంది.
మేలిమలుపు కథలో పెంచి పెద్ద చేసిన తల్లికి మారు వివాహం చేయాలని కూతురు చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆమె గతాన్ని తవ్వి అంటించుకున్న ఎన్నో మసిగుడ్డల మరకల్ని చెరిపి వేస్తున్నట్టు ఉంటుంది.
మరో దగ్గర జీనా హై తో లడ్నాసికో అంటుంది, మొదటి కథ మాత్రం అందరికీ తెలిసిన జీవిత చరిత్ర రాసినట్టుగా అనిపిస్తుంది.
ప్రశ్న వేయడం సమాధానం చెప్పడం ఇవి రెండు ఒకే దగ్గర ఉండే వ్యక్తీకరణతో సమాజాన్ని చూసిన తీరుని ప్రతిబింబిస్తూ స్త్రీ పక్షాన నిలబడి మాట్లాడే కలం సలీమా సొంతం. అణిచివేయబడిన దారుల్లో నుండి ఓ చైతన్యాన్ని అందుకొని ఆ దారిలో నడుస్తూ ఎంతోమంది ఆడవాళ్లు ఎదుర్కొంటున్న అణిచివేతలను కళ్ళ ముందు కనిపిస్తున్న జీవితాల్లో నుండి పొందిన స్ఫూర్తిని మనకు కథలుగా అందించారా అనిపిస్తుంది.
పుస్తకం పేరు : పథగమనం
రచయిత: షేక్ సలీమా
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
