
దేవి చౌధురాణి
(రెండవ భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
వ్రజేశ్వర్ తన నావను చేరుకుని గంభీరంగా కూర్చుండిపోయాడు. సాగర్‌తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడ దేవి నావ గాలి వెల్లువలా, వేగంగా వెళ్లటం గమనించాడు. అప్పుడు సాగర్‌తో “దేవి నావ ఎక్కడికి వెళ్తున్నది?”
“దేవి ఈ విషయం ఎవరితోను చెప్పదు” అన్నది సాగర్.
“అసలు ఈ దేవి ఎవరు?”
“దేవి దేవినే.”
“దేవి నీకేమవుతుంది?”
“అక్క”
“ఏ రకంగా?”
“బంధువులం.”
వ్రజేశ్వర్ మౌనంగా వుండిపోయాడు. కాసేపటికి, నావికులతో “ఆ నావను వెంబడించగలరా?” అని అడిగాడు.
“అసంభవం, ఆ నావ ఆకాశం నుండి రాలిపడే ఉల్క వేగంతో వెళ్తున్నది” అన్నారు నావికులు.
వ్రజేశ్వర్ మళ్లీ మౌనంగా వుండిపోయాడు. సాగర్ నిద్రపోయింది.
వ్రజేశ్వర్ తెల్లవారు ఝామున తన నావకు లంగరు ఎత్తమని అజ్ఞాపించాడు. సాగర్ సూర్యోదయం తరువాత వచ్చి వ్రజేశ్వర్ ప్రక్కన కూర్చున్నది. “దేవి దోపిడీలు చేస్తుందా?” అని అడిగాడు.
“మీకేమని అనిపిస్తున్నది?”
“దోపీడీలు చెయ్యటానికి సరిపడా సామగ్రి అంతా అక్కడ వుంది. కానీ ఎందుకో నమ్మకం కుదరటం లేదు.”
“నమ్మకం ఎందుకు కుదరటం లేదు?”
“దోపిడీలు చెయ్యకుండా అసలు ఇంత సొమ్ము ఎలా కూడపెట్టిందో!”
“ఒక దేవత ప్రత్యక్షమై ఇచ్చిందని కొందరంటారు. దేవికి లంకె బిందెలు దొరికాయని ఇంకొందరంటారు. పరుసవేదితో బంగారం తయారు చేస్తుందని మరికొందరంటారు.”
“దేవి ఏమంటుంది?”
“నా అన్నది ఏమీ లేదు, అంతా పరాయి ధనమే అంటుంది.”
“పరాయి ధనమైతే, ఇంత అర్భాటంగా వుండగలదా? ఆ ధనానికి అసలైన యజమాని ఏమీ అనడా?”
“దేవి ఏమాత్రం అర్బాటంగా వుండదు. క్రింద పడుకుంటుంది, ముతక చీరలు కట్టుకుంటుంది. నిన్న రాత్రి మీరు చూసిన ఆర్భాటమంతా మీ కోసమే.” ఇంతలోనే సాగర్ వ్రజేశ్వర్ వ్రేలికున్న ఉంగరాన్ని గమనించి, “ఇదేమిటి, మీ చేతికి క్రొత్తదేదో చేరింది!” అన్నది.
“నిన్న రాత్రి అన్నపానాలు అయ్యినవి కదా. తరువాత దక్షిణగా దేవి ఉంగరాన్ని ఇచ్చింది.”
“చూడవచ్చా?”
వ్రజేశ్వర్ ఉంగరాన్ని తీసి ఇచ్చాడు. సాగర్ ఉంగరాన్ని పైకి క్రిందికి తిప్పి తిప్పి చూసి, “దీని మీద ఏదో పేరు రాసి ఉన్నట్లుంది, నాకు ఫార్శీ చదవటం రాదు” అన్నది.
“ఎక్కడ?”
“లోపల.”
వ్రజేశ్వర్ ఉంగరాన్ని తీసుకుని పరీక్షగా చూసి చదివాడు. “అరె, ఇదేమిటి? ఇది నా పేరు. ఇది నా ఉంగరమే. సాగర్, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, దేవి ఎవరు?”
“మీరు గుర్తు పట్టకపోతే నన్నేం చెయ్యమంటారు? నేను ఒక్క క్షణంలోనే గుర్తు పట్టాను. ఇంకెవరవుతారు? ప్రఫుల్లనే దేవి.”
వ్రజేశ్వర్‌కి నోట మాట రాలేదు. అతని ముఖం అపూర్వమైన ఆనందంతో వికసించింది. కళ్లు మెరిసి ఆనందాశ్రువులతో నిండాయి. నిఠారుగా నిలబడ్డాడు. ఇంతలోనే వ్రజేశ్వర్ హృదయం నిర్వేదనతో నిండిపోయింది. కూలబడ్డాడు. సాగర్ వ్రజేశ్వవర్ తలని తన వళ్లోకి చేర్చుకుని కొంత ఆందోళనతో చూడసాగింది. అప్పుడు వ్రజేశ్వర్ “ప్రఫుల్ల డాకూనా?” అని అడిగాడు.
***
సాగర్ వ్రజేశ్వరులు వెళ్లిన తరువాత దేవి ఏమయ్యింది? ఆ జరీబుటాల వస్త్రధారణతో కూడిన వైభోగం, ఆ వజ్రవైడూర్యాలతో కూడిన ఆభరణాలూ, ఆ అలంకరణలూ ఏమయ్యాయి? దేవి వాటినన్నిటిని త్యజించి ఒక సాధారణ నూలు చీర కట్టుకుంది. చేతికి మాత్రం ఒక ఉక్కు గాజు వేసుకుంది. దర్భలతో అల్లిన చాప పరుచుకుని పడుకున్నది. పాఠకుడా, నిద్రపోయిందా లేదా అన్న విషయం మాత్రం నాకు తెలువదు.
తెల్లవారేటప్పటికి నావ గమ్యం చేరుకున్నది. నదీ తరంగాలు ఉదయపు కాంతిలో మిలమిలడుతున్నాయి. దేవి నావ దిగి తీరం వెంట కొంత దూరం నడిచింది. గంగానదిలోకి ప్రవేశించి తలమునకలు వేసి నిర్మలమై నదీ తీరాన నిలబడింది. దేవి ఆకృతిలో ఎంత మార్పు? నిన్న రాత్రి తన ఆహార్యంతో అణువణువునా ఒక రాణిని తలపించింది. అది ఒక వేషధారణ మాత్రమే. గంగా జలములో తడిచిన చీరతో, పవిత్రతతో, ఉదయపు కాంతిలో దేవి సాక్షాత్తు ఆ భగవతీ దేవి రూపంతో సాక్షాత్కరించింది.
తడి బట్టలు ఆర్చుకుని దేవి తనతో దివను తీసుకుని నది ఒడ్డున వున్న గాఢారణ్యంలోకి ప్రవేశించింది. పాఠకుడా, గాఢారణ్యము అని ప్రస్తావిస్తే, డాకూలు దొంగలూ అడవులలో వుంటారని కాదు, ఆ కాలంలో దట్టమైన అడవులు విస్తారంగా వుండేవి అని. ముస్లిం రాజుల పతనం, ఇంకా ఇంగ్లీషు వాళ్ల పాలన మొదలవ్వని కాలం కాబట్టి అరాచకం ఎక్కువైన డాకూలూ దొంగలు కూడా ఎక్కువయ్యారు. ఇంగ్లీషు గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ ఏమన్నాడంటే, నేను చేసిన యుద్ధాలన్నిటిలోకి కష్టమయ్యింది బెంగాలులో డాకూలని ఎదుర్కోవటంమని . ప్రతి భూస్వామి, పలుకుబడిదారు ఒక ముఠాను తయారు చేసుకునేవారు. ఆ ముఠా యజమాని ఆజ్ఞాపించగానే ఏ దొమ్మీకైనా దోపిడీకైనా ముఠా తయారయ్యేది. పేద ప్రజలుకు మాత్రం ముఠాలు కట్టటం, దోపిడీలు చెయ్యటం చేతయ్యేది కాదు.
కొంత దూరం ఆడవి దారిలో నడిచిన తరువాత దేవి దివతో “నువ్వు ఇక్కడే వుండు, నేను ఇంకా ముందుకు వెళ్లాలి. నువ్వేమీ భయపడనవసరం లేదు, క్రూర జంతువులు ఇక్కడ వుండవు. ఒకవేళ అవసరమైతే కేక వెయ్యి. ఇక్కడ కావలి వాళ్లు నీకు కనపడకపోవచ్చు కానీ, పిలిస్తే వెంటనే పలుకుతారు” అన్నది.
దేవి ముందుకు నడిచింది. అడవి కీకారణ్యమయ్యింది. కొంత ముందుకు వెళ్లిన తరువాత ఒక పాడుబడిన గుడి ఆనవాళ్లు కనబడ్డాయి. అక్కడ ఎప్పుడో కట్టిన రాతి తోరణంతో కూడిన ద్వారమొకటి లతలు తీగలు అల్లుకుని క్రమ్ముకుని వుంది. తెలిసి వెతికితే కానీ కనబడదు. ఆ ద్వారంలోనుంచి ప్రవేశించి మెట్లు దిగి ఒక సొరంగం నుండి కొంత దూరం నడిచింది. చీకటిని తొలుస్తూ మిణుకుతున్న ఒక చిరుదీపం కనబడింది. ఆ దీప కాంతిలో కనబడిన గుర్తులను బట్టి అది ఒక శివాలయమని పోల్చుకోవచ్చు. అక్కడ ఒక బ్రాహ్మణుడు శివార్చనలో నిమగ్నమై వున్నాడు. దేవి శివలింగానికి సాష్టంగపడి ఆ బ్రాహ్మణుడి పూజ పూర్తయ్యేంతవరకు కొంచెం వెనుకగా, మౌనంగా కూర్చున్నది.
బ్రాహ్మడు పూజ ముగిసిన తరువాత ప్రక్కకు తిరిగి, “మాతా నిన్న దోపిడీ జరిగిందా?” అని అడిగాడు.
“మీరేమనుకుంటున్నారు?” అన్నది దేవి.
“ఏమనుకోవాలో నాకు తెలవటంలేదు” అన్నాడు ఆ బ్రాహ్మణుడు. అతను ఎవరో కాదు, భవానీ పాఠక్.
“తెలవటంలేదా? అసలేమంటున్నారు? నేనెవరినో తెలవటం లేదా? పది సంవత్సరాలనుండి మీ దళంలో వుంటున్నాను. చేసిన దోపిడీలన్నీ నా పేరు మీదే జరిగినాయి. కానీ, నిజానికి అవి వేటికి ప్రణాళిక వేసింది నేను కానని, నిజానికి దోపిడీ చేసింది నేను కాదని మీకు తెలువదా? ఇంకా తెలవటంలేదని అంటారా?”
భవానీ పాఠక్ దేవి వంక చూస్తూ “ఇంత కోపమెందుకు? మనమేమీ పాపపు పని చెయ్యటంలేదు కదా? పాపపు పనే అయితే చెయ్యటానికి పూనుకునేవాళ్లమే కాదు. క్రితం రాత్రికి కూడా పాపపు పని ఏమీ జరిగలేదని నాకు తెలుసు. ఈ పది సంవత్సరాలనుండీ …”
“నా ఆలోచనాభిప్రాయాలను మార్చుకుంటున్నాను. ఇతరుల ధనాన్ని దోపిడీ చెయ్యటం తప్పు కాదా? ఇప్పటిదాకా మీ మాటలు విన్నాను. ఇక వినను.”
“ఇదేమిటి? ఇంతకాలం అర్థమయ్యేటట్టు చెప్పాను. మళ్లీ మొదటినుండీ చెప్పాలా? దోపిడీ సొమ్ములలో ఒక సత్తు కానీ అయినా మనము అనుభవిస్తే అది పాపము. మనం మంచివాళ్లను దోచుకోవటం లేదు. మనం దోపీడీలు చేసేది ప్రజా పీడకులను, మోసగాళ్లని, కౄరులని మాత్రమే. ఈ అరాచక కాలంలో శాంతి భద్రతలు నిర్వహించే బాధ్యత మన మీద వున్నది. పేదలు, దుర్బలులు, సామాన్యులు శాంతియుత జీవనం గడపటానికి మనం తోడ్పడుతున్నాము. ఈ విషయము నీకు తెలుసు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మన కార్యక్రమం. ఇది అంతా నీ పేరు మీద జరుగుతున్నది, ఈ కార్యక్రమానికి రాణివి నీవు.”
“ఎవరిని రాజు చేస్తారో, ఎవరిని రాణి చేస్తారో మీ ఇష్టం. నాకు మాత్రం ఈ విధమైన జీవనంతో విసుగు వచ్చింది. ఇంక విరామం కావాలి, శలవిప్పంచిండి.”
“నేటి అరాచకత్వాన్ని చక్కదిద్దటానికి నిన్ను మించిన యోగ్యురాలు లేరు. నీకు ఐశ్వర్యముంది, ప్రజాభిమానముంది.”
“నా ఐశ్వర్యాన్నంతా మీకు ధారపోస్తాను. మీకిష్టమైనట్లు ఖర్చు చేయండి. నాకు కాశీకి వెళ్లాలని వుంది.”
“నీ ఐశ్వర్యమే ప్రధానం అనుకుంటున్నావా? నువ్వు రూపవతివి, గుణవతివి, వివేకము, సామర్ధ్యము కలబోసిన రాణివి. నిన్ను ప్రజలు సాక్షాత్తు భగవతీ దేవి రూపమని తలుస్తారు. నువ్వు ఒక సన్యాసినివి, కానీ ప్రజలు నిన్ను మంగళకారిణిగా తలుస్తారు. నీ పేరున పాలన జరుగుతున్నది.”
“నన్ను ఒక డాకూ, దొంగ, బందిపోటు రాణి అని కూడా అంటారు. ఈ కళంకం నేను చనిపోయినా చెరిగిపోదు, వెంటాడుతూనే వుంటుంది కదా!”
“కళంకమా? వరేంద్ర భూమీలో నీకు కళంకం అంటగట్టేవారెవరూ లేరు. ధర్మకార్యం నిర్వర్తించేటప్పుడు ఖ్యాతి, అపఖ్యాతి అని లెక్కపెట్టటం వుండదు. కళంకం అనే భయంతో జరిగే క్రియలు నిష్కామ కర్మలవ్వుతాయా? నువ్వు కేవలం నీ లాభనష్టాల ఆలోచనలో వుంటే, పరుల బాగోగుల ఆలోచనలకు తావు వుంటుందా? ఆత్మ విసర్జన జరిగినట్లా, కాదా?”
“నేను మీతో వాదనలో గెలవగలదానిని కాదు. మీరు మహామహోపాధ్యాయులు. నాది స్త్రీ బుద్ధి, నాకు మనసులో తోచింది చెపుతున్నాను. ఈ రాణీ పదవి నుండి విముక్తి కోరుతున్నాను. ఈ పని నాకు నచ్చటంలేదు.”
“ఈ పని నచ్చనిదానివయితే నిన్న రాత్రి రంగరాజును ఇంకొక నావ పై దాడికి ఎందుకు పంపించావు? ఈ విషయం నా దగ్గర దాచవలసిన అవసరం లేదు.”
“దాచవలసిందేమీ లేదు. నిన్న రాత్రి రంగరాజు దోపిడీకి వెళ్లలేదు, అది అంతా ఒక నాటకంలోని భాగం.”
“ఈ విషయం నాకు వివరాలు నాకు తెలువవు. అందుకనే అడుగుతున్నాను.”
“ఆ పని అంతా ఒక మనిషి పట్టుకోవటానికి.”
“ఎవరా మనిషి?”
దేవి ఆ పేరు పలకటానికి కుదరదు అని చెప్పబోయింది. కానీ ఆ మాటలు గొంతు దాటలేదు. భవాని పాఠక్ దగ్గర ఏ విషయమూ దాగదు అని తనకు తెలుసు. చివరికి గొంతు పెగుల్చుకుని “ఆయన పేరు వ్రజేశ్వర్ రాయ్” అన్నది.
“అతనెవరో నాకు బాగా తెలుసు. కానీ, నీకు అతనితో ఏమి పని?”
“ఆయన తండ్రిగారు జాగీరుదారుకి పన్ను బాకీలు కట్టాలి. అవి కట్టకపోతే ఖైదులో వేస్తారట. ఒక బ్రాహ్మణుడిని కాపాడుదామని ఆయనకు కొంత ఱొక్కం రుణమిచ్చాను.”
“నువ్వు చేసిన పని అంత యుక్తంగా లేదు. అతని తండ్రి హరివల్లభ రాయ్ వట్టి మూర్ఖుడు, పాషాణ హృదయుడు. అతను ఖైదుకెళ్లటమే మంచి పని.”
దేవి కొంత చలించింది. “అలా ఎందుకంటున్నారు?”
“అతనికి ఒక కోడలు వుండేదని విన్నాను, సౌందర్యవతి, గుణవతి, సౌజన్యవతి.. తల్లి విధవ, నిరుపేదరాలు. తల్లి కంటే వేరే దిక్కులేని యువతి. హరివల్లభ రాయ్ దయా దాక్షిణ్యాలు లేకుండా ఆ కోడలుని తరిమి, ఆ పేదరాలైన తల్లికి జారత్వం అంటగట్టి దుర్భాషలాడాడట. కూతురి దౌర్భాగ్యం భరించలేక తల్లి చనిపోయిందట.”
“మరి ఆ కోడలు సంగతి?”
“పాపం అనాధ యువతి, ఆకలితో మరణించిందని విన్నాను.”
“ఆ విషయాలన్నీ నాకు అనవసరం. పరోపకారమే నా వ్రతం. దుఃఖస్తులను దుఃఖ విముక్తులను చెయ్యటానికి నా ప్రయత్నం నేను చేస్తాను.”
“సరే, ఇప్పటికి ఏ హానీ జరగలేదు. నా యోచన ఇక ముందు జరగవలసినదాని గురించి. ఈ సమయంలో ప్రజలు దారిద్య్రగ్రస్తులై వున్నారు. జాగీరుదారు పన్ను బాకీల వసూళ్ల పేరుతో వారి సర్వస్వం కాజేసాడు. వారికి తినటానికి కూడా ఏమీ లేదు, కొంచెం కడుపున పడితే శక్తి కూడగట్టుకుని కర్రసాము చేసి అయినా ప్రతిఘటించి అధికారాన్ని స్వాధీనం చేసుకోగలరు. నువ్వు వెంటనే దర్బారు పెట్టి ఆ అభాగ్యులను ఉద్ధరించు.
“ప్రజలకు సూచన చేయండి, వచ్చే సోమవారం దర్బారు పెడతాను.”
“ఇక్కడ కాదు. నువ్వు ఈ పరిసరాలలో వున్నావనే విషయం ఇంగ్లీషు వాళ్లకు తెలిసింది. ఐదు వందల సిపాయిలతో నిన్ను పట్టుకోవటానికి గాలిస్తున్నారు. సోమవారం వైకుంఠపురం అడవులలో దర్బారు వుంటుందని ఇప్పటికే సూచన పరచటం జరిగింది. ఆ దట్టమైన అడవులలోకి రావటానికి ఇంగ్లీషు వాళ్లు సాహసించరు. సాహసించినా మరణం తధ్యం. నీ ఇచ్చానుసారం రూపాయలు కూడగట్టుకుని వెళ్లు” అన్నాడు భవాని పాఠక్.
“నేను బయలుదేరుతున్నాను. కానీ, ఈ పని ఎంతవరకు సమర్ధవంతంగా నిర్వహించగలనో నాకు తెలవదు. ఈ సారికి వెళ్తాను కానీ నా మనసు స్తిమితంగా లేదు.”
దేవి లేచి బయలుదేరింది. నావ వద్దకు చేరుకుని రంగరాజును తన మందిరానికి పిలిచి “రేపు సోమవారం వైకుంఠపురం అడవులలో దర్బారు పెడుతున్నాను. వెంటనే బయలుదేరండి. మన పద దళానికి కూడా తెలియచెయ్యండి. ముందు దేవిఘర్‌లో ఒక మజిలీ చేద్దాము, అక్కడ నుండి కొంత ధనం కూడగట్టుకోవాలి” అంటూ ఆజ్ఞ జారీ చేసింది.
నావకు వున్న నాలుగు తెరచాపలు వెంటనే రెపరెపలాడుతూ పైకి లేచాయి. నావకు నాగతరి కట్టబడింది. ఆ నాగతరి నడిపే అరవై మంది మల్లులూ నావకు ఒక ప్రక్కన వరసగా నిలబడి దేవీ రాణికి జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు. నదీ తీరాన్ని పరిశీలిస్తే సామాన్య ప్రజలతో కూడిన ఒక పెద్ద పద దళం కదులుతున్న అలికిడి గమనించవచ్చు. వారి చేతిలో దుడ్డు కఱ్ఱలు తప్ప ఏమీ లేవు. కానీ నావలో అందరికీ సరిపడే ఆయుధాలు వున్నవి, ఢాలుకత్తులూ, బల్లాలు, తుపాకీలు.
గాలితో నిండుకున్న తెరచాపలతో నావ వేగంగా కదిలింది.
నావ పైనుండి దేవి అంతా గమనిస్తూ వున్నది. అంతా సక్రమంగానే వున్నదని నిర్ణయించుకుని తన శాఖాహార భోజనం తయారు చేసుకోవటానికి వంట గదికి వెళ్లింది. మరి దేవి ఏ విధమైన సన్యాసినియో అనే విషయాన్ని పాఠకులే నిర్ణయించాలి.
*****
(సశేషం)

విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.
