యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-9

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఇంగ్లాండ్ -లండన్ (రోజు-1) “లండన్ ఐ” విహారం

వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జి:

వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జికి ఒక వైపున ఉన్న బౌదికా  విగ్రహాన్ని ఆనుకుని చుట్టూ కోలాహలంగా నడిచే మనుషుల మధ్య టోపీలు, చొక్కాలు, కీ చెయిన్లు వంటివి అమ్మే దుకాణాలు, బెలూన్లు అమ్మే వాళ్లు, అప్పటికప్పుడు చిన్న రుమాలు పరుచుకుని మూడు గ్లాసులతో “కాయ్ రాజా కాయ” న్నట్టు జూదపు మోళీ చేసేవాళ్ళు. ఏ మాత్రం జాగ్రత్తగా ఉండకపోయినా పర్సులు, ఫోన్లు లాంటివి గల్లంతవుతాయి. బ్రిడ్జి పొడవునా ఇదే తంతు. ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు, మోళీ వాళ్ళు దాదాపుగా అంతా ఇండియా, మిడిల్ ఈస్ట్ ల నించి వచ్చినవాళ్లే.

కాకపోతే బ్రిడ్జి మీద వెళ్లే రద్దీ వాహనాలతో బాటూ నడిచేందుకు అనువుగా నిర్మించిన బాటల వల్ల నడవడానికి అనువుగా ఉంటుంది. దార్లో చూడముచ్చటగా సాంప్రదాయిక దుస్తులేసుకుని బాగ్ పైపర్ వాయిస్తున్న బ్రిటీషు వ్యక్తికి మా సిరి పరుగున వెళ్లి డబ్బులు ఇచ్చి వచ్చింది.

నడక:

అటు తీరం చూడ్డానికి దగ్గరగానే  కనిపిస్తున్నా నడిస్తే దాదాపు పావు మైలు ఉంటుందేమో. చక్కగా వెలుతురు ప్రసరిస్తూ ఎండ కాస్తున్నట్లు ఉన్నా చెవులకి కాప్, ఒంటి మీద జాకెట్లు లేకుండా నడవలేనంత చలిగా ఉంది. సిరికి కార్టు ఉండడం, మాకు నడక బాగా అలవాటు కాబట్టి సునాయాసంగా నడవడం మొదలెట్టాం. అలా యూరపు ప్రయాణంలో మా సుదీర్ఘమైన నడక ప్రారంభమైంది. యూరపులో చాలా చోట్లు నడిచి తిరగాల్సినవే అయి ఉంటాయి. కాబట్టి మంచి కంఫర్టబుల్ గా ఉండే వాకింగ్ షూస్ వేసుకోవడం తప్పనిసరి. అయితే మామూలుగా రోజూ మూణ్ణాలుగు మైళ్ళు అవలీలగా నడిచే మేం కూడా మా ప్రయాణం చివరికి వచ్చేసరికి నడవలేక బాధపడ్డాం. ఇక నాకైతే వర్షంలో పాదాలు తడవకుండా ఉండడం కోసం కొనుక్కున్న కొత్త బూట్లు వేసుకోవడం వల్ల రెండో రోజుకే కాళ్ళు కొరికేసేయి. కాళ్ల చిటికెన వేళ్ళకి బ్యాండ్ ఎయిడ్లు వేసుకుని నడవాల్సి వచ్చింది. ప్రయాణం చివరికి వచ్చేసరికి అడుగుతీసి అడుగు వెయ్యలేక కష్టపడ్డాను. కాబట్టి నీతి ఏవిటంటే ప్రయాణానికి కొత్త బూట్లు వేసుకోకూడదు.

లండన్:

ఇక సత్య ఇలా ప్రతి ట్రిప్పులో అడ్వెంచర్స్ తప్పకుండా ఉండాలి అంటాడు. వరు మాతో వచ్చి ఉంటే ఇక వీళ్ళిద్దరినీ పట్టుకోలేం. సిరికి, నాకు అడ్వెంచర్స్ అంటేనే భయం. నేను మొదట భయపడినా కాస్తో కూస్తో ఆస్వాదిస్తాను. సిరి అయితే కళ్ళుమూసుకుని కూర్చుంటుంది. మరీ భయమేస్తే ఏడుపు లంకించుకుంటుంది. అలాంటి ఒక అడ్వెంచర్ రైడ్ “లండన్ ఐ”.

మేం మెల్లగా అక్కడక్కడా ఆగుకుంటూ బ్రిడ్జి దాటి “లండన్ ఐ” ఉన్న తీరానికి చేరేసరికి పన్నెండు కావచ్చింది. ఆకలి బాగా వేయసాగింది. చుట్టూ చూస్తే బయట్నుంచి ఏవీ ఉన్నట్టు కనబడలేదు. తీరానికి మెట్లు దిగగానే మొదటగా కనిపించిన బేకరీ వైపుకి వెళ్లాం. అక్కడ బేకరీ ఐటమ్స్ తో బాటూ చల్లని పదార్థాలు మాత్రం ఏవో ఉన్నాయి. ఎందుకైనా మంచిదని నాలుగడుగులు వేసాం. “లండన్ ఐ” కి ఎదురుగా మాంఛి ఫిష్ & చిప్స్ రెస్టారెంటు ఉంది. ఎంతో రద్దీగా ఉన్నా వెళ్లినవాళ్లకి వెళ్లినట్లు సీటు చూపించి ఫుడ్ ఆర్డర్ చెయ్యగానే క్షణంలో తెచ్చి ఇవ్వసాగేరు.

మేము మా కోసం ఫిష్ అండ్ చిప్స్ , సిరి కోసం చికెన్ టెండర్స్ ఆర్డర్ చేసాం. ఉప్పూ కారాలు లేకుండా ఏదో చప్పిడి తిండి అయినా ఆకలితో ఉన్నందువల్ల ఆవురావురుమంటూ తిన్నాం. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బయటికి వచ్చి “లండన్ ఐ” ఎక్కడం కోసం లైన్ లో నిలబడ్డాం. “లండన్ ఐ”  అంటే చిన్నదీ, చితకదీ కాదు. ఇంతవరకు ఇంత పెద్ద జెయింట్ వీల్ ని నేను ఎక్కడా చూడలేదు.  దానికున్న తొట్టెలు ఒక్కొక్కటి ఓ పెద్ద గది సైజులో ఉంటాయి. అందులో  ఒక్కొక్క దాంట్లో దాదాపుగా 20, 30 మంది సునాయాసంగా పడతారు. అలాంటివి 32 తొట్టెలు ఉన్నాయి. ఇక అంత పెద్ద తొట్టెల్ని మోసుకుంటూ అతిపెద్ద ఇరుసు మీద ఆకాశంలోకి ఎదిగిన ఒక బృహత్ విష్ణు చక్రంలా మన కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే సంభ్రమాశ్చర్యానందాలతో పాటూ, ఎక్కడ మీద పడుతుందో అనే గగుర్పాటు కూడా కలుగుతుంది.

దాదాపుగా మనిషికి 50 డాలర్లు టికెట్ ఉండే ఈ రైడ్ ని ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు టిక్కెట్లు దొరకడం కష్టం. మేమైతే ఈ ప్రయాణంలో అన్నింటికీ ఫాస్ట్ లైన్ టికెట్లు తీసుకున్నాం. అది మరింత ఖరీదు ఎక్కువ అయినా చిన్నపిల్లతో లైన్లలో నిలబడలేక అదే సులభమని అనుకున్నాం.

నాకు మామూలుగా జెయింట్ వీల్ అంటే భయం. అయితే ఈ జెయింట్ వీల్ కుండే తొట్టెలకి చుట్టూ అద్దాలు బిగించి ఉండడం వల్ల ఒప్పుకున్నాను.  కానీ దగ్గరికి వెళ్లిన తర్వాత అది తిరిగే స్పీడు చూస్తే ఎవరైనా హాయిగా ఎక్కవచ్చు అనిపించింది. చాలా నింపాదిగా ఒక గది తర్వాత మరొక గది మెల్లగా కిందికి వస్తూ వెళుతూ ఉంది. చూడ్డానికి భలే అందంగా ఉంది.

135 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ “లండన్ ఐ”  ప్రపంచంలోకెల్లా పెద్దదైన అబ్జర్వేషన్ వీలట. మార్క్స్ బార్ ఫీల్డ్ అని ఆర్కిటెక్ట్  2000 సంవత్సరంలో దీనికి రూపకల్పన చేశాడు. అదే సంవత్సరంలో నిర్మాణమూ పూర్తయ్యింది. ఈ “లండన్ ఐ” కి ఇప్పటివరకు దాదాపుగా  85 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయట. 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ “లండన్ ఐ” అప్పటినుంచి లండన్ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉంది.

సిరికి వీల్ చైర్ ఉండడం వల్ల నిజానికి మాకు ఫాస్ట్ లైను టిక్కెట్లు ఎక్కడా పెద్దగా ఉపయోగపడలేదు. వీల్ ఛైర్  చూడగానే మమ్మల్ని ఫాస్ట్ లైను లోకి పంపేసేవారు. ఇక్కడ అలా త్వరగా ఎక్కగలిగాం.  అయితే తీరా తొట్టె దగ్గర వరకు వెళ్ళాక, సిరి లోపలికి వెళ్లనని పేచీ పెట్టింది. వీల్ చైర్ తో పాటు లోపలికి దొర్లించుకుని వెళ్లగలిగేటంత పెద్ద గది లాంటి తొట్టె కాబట్టి చివరికి వీల్ ఛైర్ కి  సీటు బెల్ట్ పెట్టి లోపలికి తీసుకుని వెళ్ళేం. గది మధ్య కూర్చోవడానికి చక్కగా పెద్ద పెద్ద  బెంచీలు కూడా ఉన్నాయి. సిరి ఓ బెంచీ మీద కళ్ళు గట్టిగా మూసుకుని కూచుంది పాపం.

చుట్టూ అద్దాల దగ్గిర  అందరూ నిలబడి  చూడగలిగేలా చక్కగా సౌకర్యవంతంగా ఉంది. అయితే అది ఎంత మెల్లగా తిరగసాగిందంటే బయటికి చూస్తే తప్ప అది తిరుగుతుందన్న విషయం కూడా మనకి తెలియదు. కింద ఒక్కొక్క తొట్టె నింపుకుంటూ మళ్ళీ మన తొట్టె కిందికి వచ్చేసరికి దిగిపోవాలి. అతి మెల్లగా నడవడం వల్ల ఈ రైడ్ కి అరగంట పడుతుంది. కానీ అసలు ఎక్కినట్టే లేదు.

అక్కణ్ణించి కింద అద్భుతంగా కనిపించే థేమ్స్ నదిని, నదీ లలామ నడుముకి మార్చుకోవడానికి బోల్డు వడ్డాణాలన్నట్లు వరసగా కంటికింపైన వారధులు, కనుచూపుమేర కనిపించే అందమైన లండను నగరం చూడడానికైనా తప్పకుండా ఈ  లండన్ ఐ ఎక్కి తీరాల్సిందే. ఇట్టే అయిపోయినట్టు అనిపించినా ఈ “లండన్ ఐ” రైడ్ నాకు భలే నచ్చింది.

అక్కణ్ణించి మరో గంటన్నర లో థేమ్స్ నది మీద పడవలో టీ తాగుతూ విహారం చేసే “ఆఫ్టర్ నూన్ టీ క్రూజ్” ని అందుకోవాల్సి ఉండడంతో అటు నడిచాం. అయితే విషయం ఏవిటంటే ఈ క్రూజ్ మేమున్న  తీరం నించి కాకుండా అక్కణ్ణించి మరో రెండు మైళ్ళకవతల ఉన్న టవర్ బ్రిడ్జి తీరంనించి బయలుదేరుతుంది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.