గజల్ సౌందర్యం- 7

-డా||పి.విజయలక్ష్మిపండిట్

విశ్వపుత్రిక గజల్

నా మనోరథ సారధివి నీవేలే ఓమార్మిక!
నా యదలయ వారధివి నీవేలే ఓమార్మిక!

కామక్రోధమధ మాఛ్చర్యాల పుట్ట మనసు
అదుపు చేసే వీరుడివి నీవేలే ఓమార్మిక!

పాపపుణ్యం సుఖం దుఃఖం నీటిమూటలు
మా కర్మల నిర్ణయ కర్తవి నీవేలే ఓమార్మిక!

బుద్బుదప్రాయ జీవితాన న్యాయాన్యాయాల
గెలుపు ఓటముల నిర్ణేతవి నీవేలే ఓమార్మిక!

చావుపుట్టుక లేని ఆరని వెలుగుల విశ్వమా
ఈ అనంత కాలాతీతుడవి నీవేలే ఓమార్మిక!

భువిపై విధిచేతి కీలుబొమ్మలం ఇదిసత్యం
ఇహలోక నాటక సృష్టికర్తవి నీవేలే ఓమార్నిక!

విశ్వపుత్రిక నీ విశ్వవిభూతుల మర్మ మెరిగెను
నాలోజ్ఞానదీపం వెలిగించితివి నీవేలే ఓమార్మిక!

***

విరహిణి విరహ తలపు మాట్లాడితే గజలియత్!
విరహిణి సున్నిత ముదిత పోట్లాడితే గజలియత్!

చెలియ వలపు పొందని చెలికాడి మనో మధన
భావవ్యక్రీకరణ వల్లరిని అక్షరీకరిస్తే గజలియత్ !

కలల సీమలో విహరించి కవ్వించే ఆ మనోహరి
చేతికందని కఠిన క్షణాలను కదిపితే గజలియత్!

యదమెదిలిన మనోహరుడు వలపుతలుపు తట్టి
మదిలో తీయటి అనుభూతి రగిలిస్తే గజలియత్ !

ప్రేమికుల వియోగాల నిరీక్షణ సున్నిత సుకుమార
భావ వల్లరి పరిమళాలు వెదజల్లితే గజలియత్ !

మానవత్వం మరిచిన మనుషుల మనోభావాల
అయోమయ జగత్తును పలకరిస్తే గజలియత్ !

విశ్వపుత్రికా గాయపడిన మనసు పలికేది గజల్
మార్మిక గజల్ అనుభూతి వ్యక్తీకరిస్తే గజలియత్!

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.