
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 26
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ ప్లోర్ చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవన విధానానికి అలవాటు పడుతూ సాగుతున్న జంట ప్రయాణం.
***
మనిషికి వచ్చే కోపతాపాలు క్షణికం. ఆ క్షణికావేశంలో కలిగే ఆలోచనలు, మాటలు, చేతలకు ఒక్కోసారి అర్థంపర్థం ఉండవు. వాటిని అదుపులో పెట్టుకుని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, కాస్త సంయమనం పాటించి, సహనం అలవరచుకుంటే, మనిషికి, మనిషికి మధ్య గొడవలు, జీవితంలో జరిగే అనర్థాలు చాలావరకు సమసిపోతాయేమో!
ఫోన్ మ్రోగటంతో, ప్రొద్దున్నే ఎవరై ఉంటారా? అనుకుంటూ ‘హలో!’ అంది విశాల.
అవతలినుంచి, “హాయ్, నేను మాధురిని, గుర్తు పట్టారా? ఆ రోజు మనం పార్క్ లో కలుసుకున్నాము. మా పాప పడుకుని ఉంది. తీరిక దొరికింది, ఒకసారి మీకు హలో చెపుదామనిపించింది.” అని ఆత్మీయ పలుకులు వినిపించాయి.
ఒక్కసారిగా, విశాలకి మనసులో అంతవరకు గూడు కట్టుకుని ఉన్న ఆవేదన మాయమై, మామూలు మనిషిగా అవుతూ, గొంతు సవరించుకుని, ముగ్ధ స్వరంతో,
“హలో! మాధురీ, ఎలా ఉన్నారు? మీరు గుర్తుంచుకుని, ఇలా ఫోన్ చేయడం బాగుంది. ఏమిటి, విశేషాలు?” అంది.
“వచ్చే వారం ఉగాది వస్తోంది కదా! ఏమి చేస్తున్నారు? మీరు ఏమీ అనుకోనంటే, ఒక విషయం చెపుతాను. నా దగ్గిర తెలుగు సంఘం ఉగాది సంబరాలు టికెట్స్ రెండు ఉన్నాయి. మాకు అర్జెంట్ గా ఇండియా వెళ్ళే పని పడింది. మీకు ఇద్దామనుకుంటున్నాను. నేను సాయంత్రం పార్క్ దగ్గరికి వస్తున్నాను, అక్కడ ఇస్తాను.” అంది మాధురి.
“అవునా! ఇక్కడ ఉగాది వేడుకలు జరుగుతాయా? నాకు తెలియదు. మావారికి చెపుతాను. ఇవాళ పార్క్ లో కలుద్దాము.” అంది విశాల.
ఇంతలో కేర్ మని పాప ఏడుపు వినిపించటంతో, “అమ్మో! నా బంగారు తల్లి లేచింది, ఇవాళ నాలుగింటికి కలుద్దాం” అంటూ ఫోన్ పెట్టేసింది మాధురి.
‘అరె, ఇలా అత్తగారు నిన్న ఫోన్ మెసేజ్ పెట్టారు ఉగాది పండుగ చేసుకోమని. నా ప్రశ్నలకు సమాధానంగా, ఈ దేశంలో ఎవరు లేరే, ఎలాగా? అనుకున్న నాకు, ఆ లలితా అమ్మవారే మాధురి రూపంలో దారి చూపెడుతున్నారు కదా!’ అని భావించింది విశాల.
ఇంకో అరగంటలో డ్రైవింగ్ లెసన్ కి వెళ్ళాలి కదా అనుకుంటూ, స్టౌ మీద అల్లం తురుము, త్రీ రోజెస్ టీ కాచుకుని, తనకిష్టమైన తెల్లటి పింగాణీ గోల్డెన్ బోర్డర్ కప్ లో వంపుకుంది., బయట బాల్కనీ దగ్గర కుర్చీలో కూర్చుని, సూర్యుని లేలేత కిరణాలను చూస్తూ, వేడి టీని ఆస్వాదించింది. అప్పటికి విశాలలో పూర్తిగా తనలో తెల్లవారు ఝామున కలిగిన అలజడి, ఆవేదన తొలగి, దూదిపింజలా మనసు తేలిక పడింది.
‘నిజంగా ఈ రోజు విష్ణుతో అలా మాట్లాడకుండా ఉండవలసింది నేను. ఇంకా నయం, ఆయన మాటలని పొడిగించకుండా, నిద్రలోకి జారుకున్నారు కాబట్టి సరిపోయింది. ఆయన కష్టపడే సమయంలో, నేను సపోర్ట్ ఇవ్వాలి. ఈ ఉద్యోగంలో కొంత కాలం కొనసాగితే తప్పులేదు ఇక్కడ లోకల్ గా అనుభవం గడించడానికి. నాకు కూడా కొంత సమయం దొరుకుతోంది కదా నేను కోర్స్ చేయడానికి?’ అని యోచనలో పడింది విశాల.
ఇంతలో ఇంటి ముందు, మసూద్ డ్రైవింగ్ కార్ రావడంతో, తన డ్రైవర్ లెర్నింగ్ లాగ్ బుక్ తీసుకుని, విష్ణు నిద్రకి భంగం కలగకుండా తలుపు వేసి, బయటకు నడచింది.
మసూద్ కి హలో చెప్పి, లాగ్ బుక్ అతని చేతికిచ్చింది. కారు ఒడోమీటర్ రీడింగ్ అతను నోట్ చేసాడు. విశాల డ్రైవింగ్ సీటులో కూర్చుని, మిర్రర్, సీట్ అడ్జస్ట్ చేసుకుంది. మసూద్ ఎటువైపు వెళ్ళాలో చెపుతూ, ఇపుడు మనం స్కూల్ జోన్ లోకి వెడుతున్నాము. స్పీడ్ 40 kmph లో ఉండాలి అని చెప్పాడు.
నిశ్శబ్దంగా ఉన్న రెసిడెన్షియల్ ప్రదేశానికి తీసుకువచ్చి, “ఈ రోజు సులభంగా పేరలల్పార్కింగ్ ఎలా పెట్టాలో చెబుతాను. ఫాలో మై ఇన్ స్ట్రక్షన్” అన్నాడు.
అక్కడ ఆ కారు ఉంది కదా, సరిగ్గా ఆ కారు వెనకాల పార్క్ చేయాలి. ముందుగా లెఫ్ట్ ఇండికేషన్ ఇవ్వు. తరువాత ఈ కారు అద్దం, పేరలల్ గా ఉన్న కారు ఫ్రంట్ డోర్ దగ్గిరకు తీసుకువచ్చి, రివర్స్ గేర్ మార్చాలి. స్టీరింగ్ వీల్ పూర్తిగా ఎడమవైపుకి తిప్పాలి. తరువాత లెఫ్ట్, రైట్ షోల్డర్ వైపు బ్లైండ్ స్పాట్ చెక్ చేయాలి. తరువాత స్టీరింగ్ వీల్ కుడివైపుకు తిప్పుతూ కెర్బ్ సైడ్ పార్కింగ్ దిశగా చూసుకుంటూ, స్టీరింగ్ వీల్ స్ట్రైట్ గా తిప్పాలి. మసూద్ చెప్పిన స్టెప్స్ అనుసరిస్తూ, విశాల పెర్ ఫెక్ట్ గా రివర్స్ పేరలల్ పార్కింగ్ చేసింది.
ఇన్నాళ్ళు అతి కష్టమనుకున్న రివర్స్ పేరలల్ పార్కింగ్ అంత ఖచ్చితంగా బాగా చేసినందుకు విశాలకు ఆనందం కలిగింది. మసూద్ కూడా ఆమెను ప్రశంసిస్తూ, “దటీజ్ ఏబ్ సల్యూట్ లీ పెర్ ఫెక్ట్. యువర్ మనూవర్ స్కిల్స్ ఆర్ రియల్లీ గుడ్.” అన్నాడు చిరునవ్వుతో.
ఎపుడూ రోడ్డు మీద ఏ వాహనం నడపని విశాలకు ఈ రోజు కారు డ్రైవ్ చేయడంలో ఉన్న బెరుకు పోయి, తనమీద తనకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది.
డ్రైవింగ్ లెసన్ పూర్తి చేసుకుని, ఇంటికి చేరుకుంది. మధ్యాహ్నానికి వెరైటీగా పొడవు వంకాయను రెండు ముక్కలుగా తరిగి, అందులో శెనగపిండి, కారం, ధనియాలపొడి నూనెతో కలిపి లోపల కూరింది. వాటికి పైన నూనె రాసి, మైక్రోవేవ్ లో రెండు నిమిషాలు వేడి చేసింది. తరువాత పాన్ లో కొద్దిగా నూనెలో వంకాయలు వేసి, ఉప్పు వేసి మూతపెట్టి, మగ్గించింది. పది నిమిషాలలో ఘుమఘుమలాడుతూ, వంకాయ కూర, ఇంకా టొమాటో చారు, అన్నం సిద్ధం చేసింది. ఇంతలో విష్ణుసాయి, స్నానం చేసి, ఫ్రెష్ అయి వచ్చాడు.
ఒక ఐదు నిమిషాలు ఇద్దరి మధ్య మౌనమేలింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ,
“ఐ యామ్ రియల్లీ సారీ విశాలా! నిన్న ఫాక్టరీలో నీ గురించే ఆలోచించాను. ఇద్దరం చల్లని సాయంత్రాలు కలిసి గడపలేకపోతున్నాము. ఇదిగో నా ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్. మేడం, ఇకనుంచి లేట్ ఐతే నీకు ఫోన్ చేసి చెపుతాను. ఈసారికి ఈ దాసుడి తప్పుని క్షమించండి దేవిగారు.” అన్నాడు ప్రాధేయపూర్వకంగా విష్ణు.
“సారీ చెప్పడానికి, మీరేమి పెద్ద తప్పు చేయలేదు. నేనే ఎక్కువగా ఊహించుకున్నాను. క్రొత్త జీవితం. నాకు ఇక్కడ మీరు తప్ప ఎవరున్నారు? మీతో ఎన్నో చెప్పుకోవలసిన విషయాలు ఎన్నో బకాయి ఉన్నాయి. మీరు ఈ రోజు అన్నీ వినాల్సిందే. అపుడు రెంటికీ చెల్లు” అంది విశాల, అర్థనిమీలిత నేత్రాలతో క్రీగంట చూస్తూ.
“ఎట్ యువర్ సర్వీస్ విశాలా, నా చెవులు నీ పలుకులకోసమే వేచి ఉన్నాయి.” అన్నాడు విష్ణు కొంటెగా.
అవకాశం ఇచ్చిందే తడవుగా, విశాల అన్నీ పూస గుచ్చినట్లు చెప్పింది. కాలేజ్ లో తన ప్రెజెంటేషన్, తను అడిగిన వారికి సందేహ నివృత్తి చేయడం, తనను కాలేజీలో ట్యూటర్ మెచ్చుకోవడం, డ్రైవింగ్ లెసన్ లో పేరలల్ రివర్స్ పార్కింగ్ నేర్చుకున్న తీరు, ఉగాది సంబరాలకు టికెట్స్ ఇస్తానని తన ఫ్రెండ్ ఫోన్ చేసిన విషయం, ఇలా అన్ని విషయాలు ఊ కొడుతూ ఓపికగా విన్నాడు విష్ణు.
నిజంగా అన్ని విషయాలు వినే భర్త ఉంటే కావలసిందేముంది ఏ భార్యకైనా..? విశాల మదిలో విష్ణు ఇక్కడే బోలెడు మార్కులు కొట్టేసి, ఆమె మదిలో ప్రేమైక మూర్తిగా స్థానం సంపాదించుకున్నాడు.
“ఉగాది సంబరాలకు తప్పకుండా వెడదాము. మనకి కూడా ఇక్కడ తెలుగు కమ్యూనిటీతో ఎక్స్ పోజర్ ఉంటుంది. టికెట్స్ తీసుకో.
ఇవన్నీ సరే! విశాలా, ఇక నా వల్ల కాదు, ముక్కుపుటాలు అదురుతున్నాయి, ఆకలి కరకర మంటోంది. లంచ్ చేసేద్దామా?” అన్నాడు విష్ణు.
“అవును, ఈ రోజు మొట్టమొదటిసారి, ఊహారచన చేసి, వంకాయలో నా ప్రేమనంతా కూరి, గుత్తులుగా చేసాను. ఆస్వాదించి, ఎలా ఉందో చెప్పండి మహాశయా!” అంది విశాల కళ్ళు తిప్పుతూ.
“ఓహ్! గుత్తివంకాయ గుండ్రటి వంకాయలతో అమ్మ చేస్తే తిన్నాను. ఈ రోజు పొడుగు వంకాయలలో కారం కూరిన కూర మొదటి సారి తినడం. తినే కొద్దీ ఆకలి పుట్టి, ఇంకా తినాలనిపిస్తోంది. సో ఫస్ట్ ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ ఫుల్. వెల్ డన్. వంటింట్లో నువ్వు చేసే ప్రయోగాలకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది విశాలా!” అన్నాడు విష్ణు.
విష్ణు వర్క్ కి వెళ్ళగానే, విశాల ఇంటి దగ్గర పార్క్ కి మాధురిని కలుసుకోవడానికి వెళ్ళింది.
అక్కడ పార్క్ లో సిమెంట్ బెంచ్ ల మీద పదిమంది దాకా సీనియర్ సిటిజన్స్ గ్రూప్ చాలామటుకు పంజాబీస్, గుజరాతీస్ కలిసి మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఛలోక్తులు విసురుకుంటూ, సందడి చేస్తున్నారు. విశాల అక్కడ వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి బల్లమీద కూర్చుని, మాధురికోసం నిరీక్షించసాగింది.
మాధురి బేబీని ట్రోలీలో వేసుకుని ఐదు నిమిషాలకి అక్కడకి వచ్చింది. విశాలకి టికెట్స్ ఉన్న ఎన్ వలప్ ఇచ్చింది. “మా చెల్లెలి పెళ్ళి కుదిరింది. అందుకని మూడు వారాలకి ఇండియా వెడుతున్నాను. నా దగ్గిర వేపపువ్వు నాకు తెలిసిన ఆంటీ ఇచ్చారు. మీరు ఫ్రిజ్ లో పెట్టుకుని వేపపువ్వు పచ్చడి చేసుకోండి. మీకు ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ ఇండియా నుంచి వచ్చాక కలుస్తాను. “ అంది మాధురి.
మాధురి తో“టికెట్ కి డబ్బు ఇచ్చేస్తాను.” అంది విశాల.
“భలేదానివే. ఏమీ వద్దు. మీరు ఉగాది సంబరాలకు వెడితే, మన తెలుగువాళ్ళు చాలామంది కలుస్తారు. నాకు సునంద ఆంటీ బాగా తెలుసు. ఆవిడ కూడా వస్తారు. ఆవిడకు నీ గురించి చెప్పాను. కౌంటర్ దగ్గిర ఉంటారు. నా పేరు చెప్పు. నాకు తెలియకుండానే, నేను నిన్ను నువ్వు అనేస్తున్నాను. ఏమీ అనుకోకు. నాకు నిన్ను చూడగానే, చాల దగ్గిర బంధువులాగా అనిపిస్తుంది.” అంది మాధురి, విశాల చేతులు పట్టుకుని.
“నాకు కూడా మాధురీ!, మీ పరిచయం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇండియానుంచి వచ్చాక, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి.” అంది. కాసేపు మాధురి పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడింది విశాల.
వెడుతూఇద్దరూ ఒకరిని ఒకరు కౌగలించుకుని ఎవరి ఇళ్ళకు వారు వెనుదిరిగారు.
ఉగాది రోజున ఉదయమే విష్ణు, విశాల తలస్నానం చేసారు. మాధురి ఇచ్చిన వేప పువ్వు, చింతపండు, అరటిపండు ఇలా ఇంట్లో ఉన్న షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసి, దేవుడికి ప్రణమిల్లింది విశాల. విష్ణుకి ఉగాది పచ్చడి చేతిలో పెట్టింది.
వావ్! ఆస్ట్రేలియాలో ఉగాది పచ్చడి అని ఆశ్చర్యంగా విష్ణు నోటిలో వేసుకున్నాడు.
హోమ్ బుష్ ప్రదేశంలో ఉన్న వినాయకుని మందిరానికి విశాల, విష్ణు కలిసి వెళ్ళారు. తమిళ పూజారులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ పూజలు చేసి, హారతి ఇచ్చారు. అందరికీ తీర్థం, ప్రసాదం, శఠగోపం పెట్టారు.
శఠగోపం గుడిలోదేవుని పాదములకు ప్రతీకగా భక్తుల శిరస్సుపై ఉంచి దీవిస్తారు. తీర్థం తులసిఆకు సువాసనతో అమృతంలా ఉంది.
ప్రసాదంగా పులిహోర అందరికీ ప్లాస్టిక్ ప్లేట్ లో ఇస్తున్నారు. దర్శనం బాగా జరిగింది, ప్రసాదం కూడా బాగుంది అనుకున్నారు విశాల, విష్ణు.
విష్ణు అక్కడినుంచి కారులో ఒక పెద్ద ప్రాంగణంలోకి తీసుకెళ్ళి, పార్క్ చేసాడు.
“ఎక్కడికి వచ్చాము?” అంది విశాల.
“పైన హెడింగ్ చూడు” అన్నాడు విష్ణు.
ఫ్లెమింగ్టన్ మార్కెట్స్ అని ఉంది. చాలా పొడవుగా ఉంది.
వీకెండ్ లో కూరగాయలు, పండ్లు చౌకగా కొనుక్కోవడానికి అతి పెద్ద సిడ్నీ మార్కెట్ గ్రౌండ్. కూరగాయలు, పండ్లు బాక్స్ లలో కూడా అమ్ముతారు.
అక్కడ తాజా కూరగాయలు, పండ్లు, అంతమంది జనం చూడగానే విశాల ముఖం విప్పారింది. పైగా భారతీయ కాయగూరలు అరటికాయ, అరటి పువ్వు, ఆనపకాయ, మామిడికాయ, గోంగూర, పొట్లకాయ, తోటకూర ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇద్దరూ ట్రాలీలో తెలుగింటి కాయగూరలు, పళ్ళు నింపుకుని కారు లోకి చేర్చారు. కారు పార్కింగ్ దగ్గర ఒక అబ్బాయి విశాల వైపే చూస్తూ నవ్వుతున్నాడు.
విశాల అనుకోకుండా తలతిప్పి చూసేసరికి ఆ అబ్బాయ్ తనవైపే రావడం గమనించింది.
“హాయ్ విశాలా! మీరు నన్ను గుర్తుపట్టారా? నేను శ్రవణ్, హార్టీకల్చర్ లో మీ క్లాస్ మేట్ ని. మనం ఆచార్య ఎం.జి.రంగా యూనివర్సిటీలో ఒకే బ్యాచ్.
విశాల ఆశ్చర్యంగా అతనివైపు చూస్తూ, “ఓ అవును, నేను గుర్తు పట్టాను. మీరు ఇక్కడే ఉంటారా? అంది.
“అవును, బి.యస్సీ అవగానే, ఎమ్.ఎస్సీచేసి, ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ మా అంకుల్ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ ఏ.ఎన్.జెడ్ బ్యాంక్ లో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. పెళ్ళి కాగానే ఇక్కడకు వచ్చాను. పెర్మెనెంట్ రెసిడెన్సీ వీసా ఈ మధ్యనే వచ్చింది అని తన వివరాలు చెప్పాడు.
అపుడే అక్కడికి విష్ణు రావడంతో, శ్రవణ్ ని పరిచయం చేసింది. ముగ్గురూ అక్కడ కేఫ్ లో కాఫీ త్రాగారు. శ్రవణ్ తన కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇచ్చి బై చెప్పి వెనుదిరిగాడు.
విశాల, శ్రవణ్ కనిపించి యూనివర్శిటీ పేరు చెప్పగానే, కారులో వెడుతూ, మౌనంగా కాలేజ్ రోజులు, తను చదివిన సబ్జెక్ట్స్, ఫ్రెండ్స్ ని తలుచుకుంటూ ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఎవరు, ఏమి అవుతారు భవిష్యత్తులో ఎక్కడ సెటిలవుతారు, ఎవరిని పెళ్ళి చేసుకుంటారు తెలియని పజిల్. సబ్జెక్ట్స్, రికార్డ్ వర్క్, ప్రాక్టికల్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ తో ఎడతెరగని బిజీ షెడ్యూల్. యూనివర్సిటీ నుంచి బయటపడిన తరువాత మళ్ళీ అనుకోకుండా ఈ దేశంలో మార్కెట్లో శ్రవణ్ ని కలవడంతో అచ్చెరువొందింది విశాల.
“విశాలా! ఏమిటీ, మళ్ళీ మౌనంగా ఉన్నావు, ఏమైంది?” అని విష్ణు గొంతు వినబడగానే, మళ్ళీ గతంనుంచి, ప్రస్తుతంలోకి వచ్చింది విశాల.
* * * * *
(ఇంకా ఉంది)

నేను సిడ్నీ ఆస్ట్రేలియా లో ఉంటాను. మా తల్లిదండ్రులు శ్రీమతి శ్రీదేవి పెయ్యేటి మరియు శ్రీ రంగారావు పెయ్యేటి గార్లు ఇరువురు రచయితలు. ప్రవృత్తి పరంగా 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో తెలుగు రేడియో కార్యక్రమాలు, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తున్నాను. వృత్తి రీత్యా ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్థానికంగా తెలుగు వాణి రేడియో కన్వీనర్ గా సేవలు అందించాను. వందకు పైగా రేడియో కార్యక్రమాలు 15 రేడియో నాటికలు దర్శకత్వం చేపట్టి ప్రసారం చేశాను. ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చిన్నారులకు పాఠశాలలో religious education లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ద్వారా హిందూ మత బోధన తరగతులు తీసుకున్నాను. జాగృతి కథల పోటీలో నా కథలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు ఇరవై వరకు కథలు రాసాను, కథలు, కవితలు కొత్తవి రాస్తున్నాను. నా కథలు పలు పత్రికలలో, కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు, లలితగీతాలు, పాటలు పాడతాను. పలు వేదికలకు సమన్వయకర్తగా వ్యవహరించాను. సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలు గా నాలుగు సంవత్సరాలు సేవలు అందించాను. స్థానికంగా తెలుగువాణి మరియు జనరంజని రేడియో కార్యక్రమాలు, ఇంకా అంతర్జాలంలో తెలుగువన్ రేడియోలో వారం వారం కార్యక్రమాలు చేయటం నాకు అత్యంత ప్రీతికరం. “సకల కళాదర్శిని” వేదిక స్థాపించి, “స్త్రీ హృదయం” శ్రీ పెయ్యేటి రంగారావు గారి కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ తొలి కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించాను. మున్ముందు కళా, సాహిత్యం, సాహిత్య కార్యక్రమాలు “సకల కళాదర్శిని” ద్వారా అందచేయాలని భావిస్తున్నాను. వాహిని మాసపత్రిక “సాహితీ సదస్సు” అంతర్జాల మాధ్యమం జూమ్ ద్వారా విజయవంతంగా నాలుగు గంటలకు పైగా మూడు సదస్సులు నిర్వహించాను. దాదాపు ఐదు గంటలకు పైగా విజయవంతంగా విభిన్నమైన తెలుగు అంశాలతో కొనసాగింది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక వారోత్సవాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. భారతదేశంలో సాహిత్యంలో పలు అంశాలపై పత్ర సమర్పణ అందచేశాను.
