రాగసౌరభాలు-23

(సురటి రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

ప్రియ మిత్రులారా! నమస్తే. గత రెండు సంవత్సరాలుగా ఏకాధాటిగా సాగుతున్న రాగ సౌరభాలు వ్యాస పరంపరని ఆదరిస్తున్న అందరికి అనేక ధన్యవాదములు.  మంగళకరమైన సురటి రాగ వైభవంతో ఈ వ్యాసావళికి మంగళం పలుకుతున్నాను. రాగాలు అనంతాలు. లక్షల సంఖ్యలో ఉన్న రాగాలలో కొన్నింటిని నా శక్తి మేరకు పరిచయాన్ని అందించాను. ఈ నెలతో ఈ పరిచయాలకు స్వస్తి.

సురటి రాగం పురాతనమైనదే. కొన్ని సంప్రదాయ కీర్తనలు, మంగళ హారతులు ఈ సురటి రాగంలో కూర్చబడ్డాయి. “ఆది నాట అంత్య సురటి” అనే నానుడిని అనుసరించి శ్రీ త్యాగరాజ స్వామి తన నౌకా చరిత్రను “పతికి హారతీరే” అనే సురటి రాగ కీర్తనతోనే  ముగించారు.

సురటి అంటే తెలుగులో విసనకర్ర. ఈ రాగమును కూర్చి పాడుకున్న సందర్భంలో విసనకర్రతో వీచిన చల్లని గాలి వలె తోచి సురటి అనే నామకరణం చేసి ఉండవచ్చునని ఒక ఊహ.

ఈ సురటి రాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగ జన్యము. ఆరోహణ అవరోహణలు క్రింది విధంగా ఉన్నాయి.

స రి మ ప ని ద ని స

స ని ద ప మ గ ప మ రి స

ఇందులోని స్వరాలు షడ్జమ్, చతుశృతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైశికి నిషాదములు. ఆరోహణలో గాంధారము వర్జము. ఇది ఉభయ వక్ర షాడవ సంపూర్ణ రాగము. ముత్తుస్వామి దీక్షితుల వారి సాంప్రదాయంలో సురటి యొక్క జనక రాగం పేరు హరి కేదారగౌళ. సుబ్బరాయ దీక్షితుల వారు సురటి రాగాన్ని భాషాంగ రాగంగా వ్యవహరించారు. కొన్ని ప్రయోగాలలో సాధారణ గాంధారంలా తక్కువ స్థాయిలో గాంధారం వినిపించటం కారణం. “మ గ ప మ రీ ” ప్రయోగం ప్రాణం వంటిది. దీర్ఘ నిషాదం ఈ రాగం ప్రత్యేకత.

ఇది మంగళప్రద రాగం కనుక కచ్చేరి చివరలో పాడటం సర్వ సాధారణం. భక్తి ప్రధాన రాగం అయినా అనేక శృంగార జావళీలు, పదాలు రచింపబడ్డాయి.

త్యాగరాజాస్వామి తన “గీతార్థము సంగీతానందము”అనే సురటి రాగ కీర్తనలో ఆంజనేయ స్వామిని సంగీత ఆనందము సంపూర్ణముగా తెలిసిన పండితునిగా పేర్కొన్నారు. అలానే భగవద్గీత అర్థము కూడా పూర్తిగా తెలిసివ వానిగా కీర్తించారు ఎందుకంటె   భగవద్గీత ఉపదేశ సమయంలో అర్జునుని పతాకముపై హనుమంతుడు ఉండటం వలన ప్రథమ సాక్షి అతనే అని భావన.

ముత్తుస్వామీ దీక్షితులవారు తమ నవగ్రహ కీర్తనలలో “అంగారక గ్రహమాశ్రయామ్యహం” అనే కీర్తనని సురటి రాగంలో అద్భుతంగా రచించారు.

పట్నం సుబ్రమణ్య అయ్యర్ రచించిన “మరియాద తెలియకనే” అనే సురటి రాగ శృంగార రస జావళి ఎన్నదగినది.

ఈ రాగంలో లలిత గీతాలు, సినిమా పాటలు కనఁబడవు. కొన్ని మంగళ హారతులను భక్తి లలిత గీతాలుగా పరిగణలోనికి తీసుకొనవచ్చును.

ఇప్పుడు కొన్ని రచనలను పరికిద్దాము.

శాస్త్రీయ సంగీతం
1 కీర్తన గీతార్థము ఆది శ్రీ త్యాగయ్య గారు
2 కీర్తన రామచంద్ర నీదయ ఆది శ్రీ త్యాగయ్య గారు
3 కీర్తన పతికి హారతీరే ఆది శ్రీ త్యాగయ్య గారు
4 కీర్తన పరాన్ముఖమేలరా ఆది శ్రీ త్యాగయ్య గారు
5 కీర్తన భజనపరుల కేల రూపక శ్రీ త్యాగయ్య గారు
6 కీర్తన శ్రీ వేంకటేశ గేరీశమ్ ఆది శ్రీ దీక్షితులు గారు
7 కీర్తన అంగారకం రూపక శ్రీ దీక్షితులు గారు
8 కీర్తన బాల కుచాంబికా రూపక శ్రీ దీక్షితులు గారు
9 కీర్తన హరిద్రా కుంకుమ చాపు శ్రీముత్తయ్య భాగవతార్
10 జావళి మరియాద తెలియక రూపక శ్రీపట్నం సుబ్రమణ్య అయ్యర్

 

 

భక్తి / లలిత సంగీతం
1 కీర్తన పవమాన సుతుడు ఆది శ్రీ త్యాగయ్య గారు
2 కీర్తన మా శ్యామసుందర చాపు తెలికిచర్ల కందాడైసీతమ్మగారు

ఇవండీ సురటి రాగ విశేషాలు.  ఈ రాగమే ఈ పరంపరకి మంగళం.

ఈ అవకాశం నాకు కల్పించిన శ్రీమతి గీతామాధవి కళా గారికి అనేక ధన్యవాదములు. ఈ రాగ సౌరభాలు రాయటానికి ప్రోత్సాహమిచ్చిన మా అన్నయ్య N C మూర్తి, చెల్లెళ్ళు శ్రీదేవి, శశికళలకు బిగ్ థాంక్యూ. అనేక లలిత గీత ముత్యాలను ఏరటానికి సహకరించిన శ్రీ బాలాజీ కరి గారికి ఎన్నో కృతజ్ఞతలు. చదివి ప్రోత్సహించిన అందరికి, ముఖ్యంగా విలువైన విమర్శలు చేసిన Dr.  I A P S మూర్తి గారికి అనేక ధన్యవాదములు.

*****

(స్వస్తి)

Please follow and like us:

3 thoughts on “రాగసౌరభాలు- 23 (సురటి రాగం)”

  1. Thank you so much Murthy garu. I could not continue due to my health issues. Thank you for your responses right from the beginning.

  2. శ్రీమతి వాణి గారికి నమస్కారములు.

    త్యాగరాజు ఎంత మనవాడైనప్పటికీ, తెలుగునాట శాస్త్రీయ సంగీతానికి ఉన్న ఆదరణ పరిమితం. తగినంత ప్రచారం లేకపోవడం, కుటుంబాలలో శాస్త్రీయ సంగీతం పిల్లలకు పెద్దగా వినిపించకపోవడం కొన్ని కారణాలైతే, ప్రస్తుతం ప్రాచుర్యంలో గల ప్రసార మధ్యమాలు (ఆకాశవాణి, దూరదర్శన్ మినహా) శాస్త్రీయ సంగీతానికి అతి కొద్ది సమయాన్ని కూడా కేటాయించకపోవడం విచారకరం.

    ఈ నేపథ్యంలో ‘రాగ సౌరభాలు శీర్షిక ద్వారా, మంచి సంగీతాన్నీ దాని విశేషాలనూ పదిమందికీ పంచాలనుకోవడం చక్కని పూనిక. నెచ్చెలి అంతర్జాల మాసపత్రిక దీనిని ఆమోదించి ప్రచురించడం ముదావహం.

    ఒక్కొక్క రాగం గురించి మీరు చేసిన పరిశోధనా, తత్సంబంధిత శబ్ద-దృశ్య ముద్రికలూ, మీ రచనాశైలీ, అభినందనీయం. సంగీతం నేర్చుకోని మావంటి ఔత్సాహికులకిది ఆనందదాయకం.

    ఈ 22 రాగ పరిచయ సంచికలకూ లభించిన స్పందన స్వల్పం. ఎంతో శ్రమకోర్చి కూర్చిన ఈ మణిహారానికి ఇంత తక్కువ ప్రోత్సాహం ఉన్నందున నిరుత్సాహం కలుగుతుందన్నది వాస్తవం.

    ఈ శీర్షిక ముగింపు నిర్ణయం అసమంజసం. ఏమైనా, ఈ సంగీత సౌరభాలు గుబాళిస్తూనే ఉండాలనీ, అందుకుగాను మీరీ శీర్షికను కొనసాగించవలసినదనీ మా విన్నపం.

    భవదీయుడు

    మూర్తి

  3. ‘సురటి’ అంటే అర్థం తెలిసి ఆ రాగం వినడం ఇంకా ఆనంద దాయకం. సాధారణంగా మంగళానికి మధ్యమావతిని ఎంచుకుంటారని తెలుసును, కానీ మీరు చెప్పినది కొత్త విషయం. (త్యాగరాజు గారు ఆదికీ అంత్యానికీ సౌరాష్ట్ర రాగాన్ని వాడటం ఒక విశేషం).

    ఐతే, మీరు ‘పవమాన సుతుడు బట్టు…’ అన్న పాటను సురటి రాగంలో ఉన్నట్టుగా వ్రాశారు. ఇది కచేరీ చివరన సౌరాష్ట్ర రాగంలోనే పాడతారు కదా! దయచేసి వివరించండి.

    సురటి రాగం లో ఒక వియ్యాలవారి విందు పాట ఉన్నది. ఆసక్తి గలవారు, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ఈ చక్కని పాటను ఈ లంకెలో విని ఆనందించండి.

    https://www.youtube.com/watch?v=avuYLF11zLY

Leave a Reply

Your email address will not be published.