అనుబంధాలు-ఆవేశాలు – 5

– ప్రమీల సూర్యదేవర

న్యాయస్థానంలో సురేష్ బోనులో నిల్చుని, భ్రమర హత్య చేయదని, వ్యాధితో బాధపడ్తున్న తమ తల్లిని ఎంతో ఓర్పుగా, ప్రేమగా చూసుకునేదని, తన అక్కకు సాయం చేయవలసిందిగ న్యాయవాదులను అతి దీనంగా వేడుకున్నాడు. తమ్నుడు మట్లాడే సమయంలో కూడ భ్రమర మానసిక స్థితిలో మార్పులేదు.

ఇంటి ప్రక్క వారిని సాక్షులుగ న్యాయస్థానానికి రప్పించారు. యజమానిచేత ప్రమాణం చేయించి న్యాయవాది ప్రశ్నించాడు.

“ఆ సమయంలో మీరెక్కడ నుండి వస్తున్నారు?”

“ఈగ సినిమా రెండవ ఆట చూసి వస్తున్నాం.”

“మీరేం చూసారో చెప్పండి.”

ముందుగా నేను చూడలేదు. నా శ్రీమతి చూసింది ఈ అమ్మాయిని. అర్దరాత్రి, ఒంటరిగా ఆ చెట్టు క్రింద పిచ్చిపట్టిన దానిలా తిరగటం చూసి ఆమెకు నోట మాట రాలేదు. ఆరుబయట చీకటిగ ఉన్నది. లైటు వేద్దామని తలుపు తీశానో లేదో, మా టామీ అరుస్తూ వాళ్ళ ఇంట్లోకి దూసుకు వెళ్ళింది. నేను, నా శ్రీమతి టామీ వెంట లోపలికి వెళ్ళాం. వంటగదిలో భ్రమర తల్లి కళేబరం రక్తంతో తడిచి అస్త వ్యస్తంగ పడి ఉన్నది. దగ్గర్లో కత్తిపడి ఉన్నది. అది నేను తీయబోతుంటే మా ఆవిడ వద్దని వారించింది. నేను మా ఇంటికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేశాను. భ్రమరను మాట్లాడించాలని ఇద్దరం ప్రయత్నించాం గాని పిచ్చిచూపులు చూస్తుందే కాని ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. భ్రమర చాలా మంచిపిల్ల. మా పిల్లలకు చదువులొ సాయం చేస్తుంది. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందర్ని పలుకరిస్తుంది. మా ఇంటికి ఎన్నో పర్యాయాలు వచ్చి నా శ్రీమతికి ఇంటి పనుల్లో సాయం చేసేది. మాకే కాదండి. మా వీధిలో అందరికి ఎంతో కొంత తనకు చేతనైన సాయం చేస్తుండేది. అలాంటిది భ్రమరను ఆస్థిలో చూసి ఆశ్చర్య పోయాం. మా టామీకి కూడా ఆ అమ్మాయంటే చాలా ఇష్టం. భ్రమరను విడిపించటం కోసం నేను ఏ సహాయంచేయటానికైనా సిద్దమే.

ప్రక్కిటాంవిడను సాక్ష్యానికి పిలిచారు.

“ముద్దాయి మీకెన్ని రోజులుగా తెలుసు?”

“ఎనిమిది సంవత్సరాలుగా తెలుసు.”

“మీకెలా పరిచయం?”

మేము ఇప్పుడు ఉంటున్న ఇంట్లోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలయింది. ఆ రోజు నాకు బాగా గుర్తు. మేము ఇక్కడకు వచ్చినరోజు– భ్రమర, ఆమెఅక్క, కోమలి, వేడి వేడి ఉప్మా చేసుకుని తీసుకొచ్చారు. సామాను సర్దటంలొ తీరిక లేక ఆ రోజంతా ఏమీ తినలేదు. వాళ్ళు తీసుకు వచ్చిన ఉప్మా నిముషంలొ పూర్తి చేసేశాం. అప్పటికి మా పాపకు మూడు సంవత్సరాల వయసు. అక్కచెల్లెళ్ళిద్దరు మేము సామాన్లు సద్దుకోవటం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పాపను ఆడించారు.

“ముద్దాయి తల్లితో మీ పరిచయం గురించి చెప్పండి.”

భ్రమరను పేరుపెట్టి పిలువ కుండా ముద్దాయి అని సంబోధిస్తున్నందుకు నొచ్చుకుంటూ అన్నది. ఆమె ఎక్కువగా బయటకు రారు. వారి నాన్నగారు చనిపోయిన తరువాత తమ తల్లి బయటకు రావటం చాలా అరుదని కోమలి చెప్పింది. నేను ఎప్పుడైనావారి ఇంటికి వెళ్ళినా చాలా తక్కువగా మట్లాడేది. కొంచెంసేపు కూర్చుని వచ్చేసేదాన్ని. ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఆమెను ఐదారు సార్లు చూసి ఉంటానేమొ. పిల్లలు ముగ్గురు మాత్రం బంగారాలు. అందర్తో సఖ్యంగ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళు ఎంతొ అన్యోన్యంగ ఉంటారు కాని వాళ్ళుకూడ బయటకు ఎక్కువగ వచ్చేవారు కాదు. చదువులమ్మ ఆ ముగ్గుర్ని కటాక్షించిందనే చెప్పుకోవాలి. పసిపిల్లవాడు సురేష్ కూడ బాధ్యత వహించటంలొ అక్కలిద్దర్ని మించి పోయాడు. భ్రమర ఈ హత్య చేసిందంటే నేనే కాదు. మా వీధిలో వారెవ్వరూ నమ్మలేరు.

ప్రక్కింటివారి అమ్మాయిని ప్రశ్నించారు. ఆ అమ్మాయి వయసు పదకొండు సంవత్సరాలు. “భయపడకుండ నువ్వు చూసింది న్యాయస్థానంలొ చెప్పమ్మ.”

“మేం ఏమీ చూడలేదండి. అమ్మ, నాన్నగార్లు మాకు భోజనం పెట్టిన తరువాత సినిమాకు వెళ్ళారు. వచ్చే వారం నుండి నాకు, తమ్ముడికి పరిక్షలున్నాయని చదువుకుని పదిగంటలకల్లా పడుకున్నాం. టామి అరుస్తుంటే ఎందుకోనని తమ్ముడు దానిని తీసుకు వచ్చి తన ప్రక్కలొ పడుకోబెట్టుకున్నాడు. ఆ తరువాత అది పెద్దగా అరవటం మానివేసిందికాని సన్నగా మూలుగుతూనే ఉన్నదని తమ్ముడు చెప్పాడు. అమ్మ, నాన్నగార్లు తలుపు తీయగానే బయటకు పరుగెత్తిందట.

భ్రమరక్క చాలా మంచిది. దయచేసి ఆమెను అలా బంధించకండి.” బోనులోనే పెద్దగా ఏడ్చేసింది. అప్పుడు మాత్రం భ్రమర తల ఎత్తిందికాని చూపులో మార్పులేదు.

వారి అబ్బాయి కూడా అలాగే చెప్పటంతొ న్యాయవాది పోలీస్ అధికారిని సాక్ష్యానికి పిలిచాడు.

“భ్రమర తల్లి మేము వెళ్ళేటప్పటికే మరణించింది. ముద్దాయిని ఎంత ప్రశ్నించినా సమాధానం రాలేదు.”

“ఇంట్లోకి వేరే ఎవరైనా ప్రవేసించారేమోనని మీకేమైనా అనుమానం కలిగిందా? ఇల్లంతా పూర్తిగా సోదా చేశారా?”

“వెనుక తలుపు తాళం పెట్టే ఉన్నది. కిటికీలన్ని మూసివేసి ఉన్నాయి. ప్రతిగది గాలించాం. ఆగంతకులెవరు వచ్చిన జాడ కనుపించలేదు” అనిచెప్పి ప్లాస్టిక్ కవర్లో పెట్టిన కత్తిని ప్రవేశ పెట్టాడు. “మృతదేహం దగ్గర ఈకత్తి రక్తపు మడుగులొ పడి ఉన్నది. కత్తిమీది వేలిముద్రలు కూడ ముద్దాయివేనని తేలింది.”

మృతకళేబరాన్ని పరీక్షించిన వైద్యుడిని పిలిచారు.

ఆ రాత్రి దాదాపు పది పదకొండు గంటల సమయంలో ఆమె ప్రాణం పోయి ఉంటుంది. మృతురాలి శరీరంపై ఇరవైమూడు కత్తిపోట్లు ఉన్నాయి. పదిహేను పోట్లు పొత్తికడుపు మీద, ఆరు కత్తిపోట్లు గుండె మీద, రెండు పోట్లు మెడ మీద ఉన్నాయని చెప్పాడు. కత్తిపోట్లు గురించి చెప్పగానే న్యాయస్థానంలో వారంతా గుండెలమీద చేతులు వేసుకున్నారు. గదిలొ నిశ్శబ్దం చోటు చేసుకున్నది.

న్యాయమూర్తి కళ్ళజోడు తీసి, రుమాల్తో ముఖం తుడుచుకుని న్యాయవాది వైపు చూశాడు. న్యాయవాది ముఖం పాలి పోయింది. ముద్దాయిని బోనులోకి తీసుకు రావలసిందిగ రక్షకభటులను ఆదేశించాడు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.