
దేవి చౌధురాణి
(మూడవ భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి దగ్గరకు జరిగారు. తుపాకి మోత వచ్చిన వైపుకి చూస్తే సిపాయీలతో నిండిన ఐదు నాగతరులు ముందుకు దూసుకువస్తున్నాయి. అనేకమంది పడవవాళ్లు వేగంగా వేస్తున్న తెడ్ల వరవడికి నీళ్లు అల్లకల్లోలమై వెన్నెలలో కరగిన వెండిదారాలులాగా ఉన్నాయి.
ప్రఫుల్ల వెంటనే “ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యటానికి వీలు లేదు, వెంటనే మీ పడవ మీద బయల్దేరండి” అన్నది.
వ్రజేశ్వర్ కదలలేదు. “ఎందుకు? అవి ఎవరి పడవలు? ఆ తుపాకి మోత ఏమిటి?” ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నాడు.
“సమాధానాలు చెప్పే వ్యవధి లేదు.”
“అయితే వెళ్లను.”
“అవి కంపెనీ వాళ్ల పడవలు, సిపాయి దళాలు. భూమార్గంగా వచ్చిన సిపాయి దళాలు వారి రాకను సూచిస్తూ తుపాకీని పేల్చారు. అది వినగానే నౌకా దళాలు దాడికి బయల్దేరాయి.”
వ్రజేశ్వర్ ఆశ్చర్యపోతూ “ఇంతమంది సిపాయిలా! ఒక్క ఆడదాన్ని పట్టుకోవటానికి!!!”
ప్రఫుల్ల ఏమీ మాట్లాడలేదు.
“నీ మీద దాడి జరుగబోతోందని నీకు తెలుసా?”
“తెలుసు, నాకు చాలా మంది చారులు వున్నారు.”
“ఇప్పుడే తెలిసిందా, ముందే తెలుసా?”
“ముందే తెలుసు.”
“ముందే తెలిస్తే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు?”
“నిజం చెప్పమంటారా? మిమ్మల్ని చూడాలని.”
“మరి నీ సైన్యం ఎక్కడ? నీ నాగతరి మీది మల్లులు ఎక్కడ?”
“వాళ్లందరినీ పంపించి వేసాను. నా కోసం వాళ్లెవరూ మరణించటం నాకిష్టంలేదు.”
“అయితే పట్టుబడటానికే సిద్దమయ్యావా?”
“ఎందుకు పట్టుబడకూడదు? నాకు ఇంక ఈ జీవితం మీద విరక్తి కలిగింది. నా ఐశ్వర్యమంతా దానధర్మాలు చేసాను. మిమ్మల్ని చూసాను, నాకు ఇంకేం కావాలి?”
“ప్రఫుల్లా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు బ్రతకాలి, నా అర్థాంగిగా నువ్వు నాకు కావాలి. అందుకైనా నువ్వు బ్రతకాలి. నువ్వు లేక నేను బ్రతకను.”
ప్రఫుల్ల మంద్ర స్వరంలో, “మీరు నిజంగానే ఈ మాట అంటున్నారా?”
వ్రజేశ్వర్ దృఢంగా, “నువ్వు శపథం చేసినట్లే నేను కూడా శపథం చేసి చెబుతున్నాను. ప్రఫుల్లా, నువ్వు నా అర్థాంగివి, నువ్వు బ్రతకాలి.”
“మరి మీ తండ్రిగారు?”
“ఆయనకు నేను నచ్చ చెబుతాను.”
ప్రఫుల్ల ఒక్కసారిగా ఆనందోత్సాహాలతో “ఈ విషయం నిన్ననే తెలిస్తే ఎంత బాగుండేదో కదా!” అని బిగ్గరగా వాపోయింది.
“నిన్ననే తెలిస్తే ఏమయ్యేది?”
“నన్ను బంధించే శక్తీ, ధైర్యం ఏ మనిషికీ వుండేది కాదు.”
“మరి ఈవేళ?”
“వేరు మార్గం లేదు. ఇంక ఆలస్యం చెయ్యకుండా మీ పడవలో నా సహచారిణిలు ఇద్దరినీ తీసుకుని బయలుదేరండి.”
వ్రజేశ్వర్ తన పడవ వైపుకి వెళ్లి, “కంపెనీ సిపాయిలు దాడి చేస్తున్నారు. మీరిక్కడ వుంటే మిమ్మల్ని కూడా పట్టుకుపోతారు, తొందరగా వెళ్లండి. పోండి” అని వాళ్లని పంపించివేసాడు. పడవవాళ్లు వ్రజేశ్వర్‌కి పడవ కట్టటినందుకు డబ్బు కూడా వసూలు చేసుకోవటం మరచి పోయి వెంటనే తాళ్లు వదులు చేసుకుని “బ్రతుకు జీవుడా అనుకుంటూ వేగంగా తెడ్లు వేసుకుంటూ వెళ్లిపోయారు.
తిరిగి వచ్చిన వ్రజేశ్వర్‌ని చూసి ప్రఫుల్ల “ఇదేమిటి, మీరు వెళ్లలేదా” అన్నది.
వ్రజేశ్వర్ విసురుగా “త్యాగం చెయ్యటం నీకే చేతనవుతుంది అని అనుకుంటున్నావా? నేను కూడా నీకోసం వంద త్యాగాలకైనా సిద్ధంగానే వున్నా. అయినా నేను నీకు భర్తను. భార్య ఆపదలో వున్నప్పుడు రక్షించే బాధ్యత భర్తకు వుంది. నేను నిన్ను వదిలి వెళ్తాననుకున్నావా?” అన్నాడు.
“సరే, ఏదన్నా ఉపాయముందేమో చూస్తాను” అంటూ తల ఎత్తి ఆకాశాన్ని పరిశీలించసాగింది ప్రఫుల్ల. ఆకాశంలో మేఘాలు ముసురుతుండడం చూసి ప్రఫుల్ల ముఖం వికసించింది. అంతలోనే ప్రఫుల్ల ముఖం మేఘాలు కప్పినట్టుగా నిరాశతో నిండి “నేను జీవించితే ఇప్పుడు ఇంకొకరికి అమంగళం అవుతుందేమో” అన్నది.
“అది ఎలా?”
“ఈ విషయం మీతో చెప్పాలని నేను అనుకోలేదు. కానీ, ఇప్పుడు చెప్పక తప్పదు. మావగారు భూమార్గంగా వస్తున్న ఇంగ్లీషు సిపాయి దళాలతో వున్నారు. నేను బ్రతికితే, ఇంగ్లీషు వాళ్లు ఆయన్ని బ్రతకనివ్వరు” అన్నది.
వ్రజేశ్వర్ డగ్గున లేచి తల కొట్టుకుంటూ “అంటే మా నాన్నగారేనా ఇంగ్లీషు వాళ్లకు నువ్వు ఇక్కడ వున్నావన్న ఆచూకి అందించింది?”
ప్రఫుల్ల ఏమీ మాట్లాడలేదు. కానీ, వ్రజేశ్వర్‌కు అంతా అర్థమవ్వటానికి ఎక్కువ సమయం పట్టలేదు. దేవి గూఢ మంత్రణలు ఎవరికీ అంతుబట్టవు, ఎప్పుడు ఎక్కడ వుంటుందో ఎవరికీ తెలువదు. కానీ, తన తండ్రి తన దగ్గర నుండి దేవి ఎక్కడ వుంటుందో తెలుసుకుని ఇంగ్లీషు వాళ్లతో పట్టించటానికి పన్నాగం పన్నాడు. అందుకనే అప్పు తీర్చటానికి ఏ ప్రయత్నం చెయ్యలేదు. ఇదంతా అర్థమవ్వగానే వ్రజేశ్వర్‌కి తన తండ్రి మీద కోపం, ద్వేషం పెరిగాయి.
విషయమంతా బోధపడినా వ్రజేశ్వర్ “నేను చచ్చిపోయినా ఫర్వాలేదు, బ్రతికితే మళ్లీ ఆయనను చూడదలుచుకోను. కానీ, ఆయనను రక్షించే మార్గమేమన్నా వున్నదా?” అన్నాడు.
“ఆ విషయంగా మీరు ఆలోచన పెట్టుకోవద్దు. నాకు ప్రాణ హాని కలిగినా సరే ఆయన ప్రాణానికి ఏమీ హాని జరుగకుండా చూస్తాను. ఆయనను రక్షిస్తే మిమ్మల్ని రక్షించినట్లే కదా. మావగారికి అమంగళం జరగకుండా చూస్తానని నేను శపథం చేసి చెపుతున్నాను. మీరు ఈ విషయం ప్రస్తావించకపోయినా నేను చెయ్యదలుచుకున్నది అదే.”
అదే సమయంలో నది వడ్డున వున్న చెట్ల గుబురులలో నుండి శంఖా నాదం వినబడింది. మళ్లీ ఇద్దరూ ఉలిక్కిపడి దగ్గరకు జరిగారు.
*****
(సశేషం)

విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.
