అనుబంధాలు-ఆవేశాలు – 6

– ప్రమీల సూర్యదేవర

భ్రమర బోనులోకి వచ్చేటప్పుడు గదిలో కొంత అలజడి కలిగింది. అందరి కళ్ళు ఆతృతతో ఆమె వైపు చూశాయి.

భ్రమర చేత ప్రమాణం చేయించి, “హత్య జరిగిన రోజు మీరు కాక ఇంకెవరైనా వున్నరా?” అని అడిగాడు న్యాయవాది.

సమాధానం లేదు.

“మీకు ఎవరి మీదనైన అనుమానం వున్నదా?”

మౌనమె సమాధానం.

“ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తువున్నంత వరకు చెప్పగలరా?”

“లే” దన్నట్లు తల ఊపింది.

“కత్తిమీద మీ వేలిముద్రలున్నాయి. దానికి సంజాయిషీ ఏమైన ఇస్తారా?

తలెత్తలేదు.

“ఈ హత్య మీరే చేశారా?”

అవునని తల ఊపింది.

“కారణం?” అడిగాడు న్యాయవాది.

స్పందన లేదు.

భ్రమర మతిస్థిమితం లేనందు వల్ల ఆమె చేసిన దేమిటొ ఆమెకే గ్రహింపు లేదు. మానసికశాస్తృవైద్యులచే పరీక్ష చేయించాలని సురేష్ తీసుకు వచ్చిన న్యాయవాది భ్రమర తరపున వాదించాడు.

భ్రమర స్వభావం, భ్రమరను తెలిసిన వారిద్వారా విన్న తరువాత ఈ హత్య ఆమె ఉద్దేశ్యపూర్వకంగ చేసినది కాదని, ఏవో బలమైన కారణాల వల్ల మతి భ్రమించి చేసింది. వైద్యశాస్త్రం చదువుకున్న అమ్మాయి, అందునా తను కొలది కాలంలోనే తన వృత్తిలొ స్ధిరపడబోతున్నానని తెలిసి ఇలాంటి దౌర్జన్యానికి తెలివి ఉండి పాల్పడదు. అని న్యాయవాది వాదించిన తరువాత న్యాయసంఘం కూడ సమ్మతించింది. పిమ్మట భ్రమర మానసికవైద్య చికిత్స కొరకు అనుమతించారు.

ఇరువురు రక్షకభటులు భ్రమరను వ్యాన్ దగ్గరకు తీసుకు వెళ్తుండగ, సురేష్ పరుగున వెళ్ళి , “నువ్వు ఈహత్య చేయలేదక్క. ఎందుకు అంగీకరించావు? దయచేసి ఏం జరిగిందో న్యాయవాదులకు చెప్పవా?” జాలిగ ఏడుస్తూ అడిగాడు. భ్రమర తమ్ముడి వైపు కన్నెత్తి చూడలేదు. మౌనంగ రక్షకభటులను అనుసరించింది.

ఆరు నెలలు మానసిక శిక్షణా కేంద్రంలో గడిపి సంవత్సరంన్నర క్రితం కారాగారానికి వచ్చింది.

పేరు పొందిన మానసికశాస్త్ర వైద్యులే ఆ అమ్మాయి చేత నోరు విప్పించలేక పోయరు. నేనేం చేయగలనని నిరుత్సాహంతొ నీరుకారి పోయాను.

కొంత సేపటికి నన్నునేనే సమాధాన పరుచుకుని, నిరుత్సాహ పడకూడదు. చేయవలసిన ప్రయత్నం చేయాలని నిర్జారణ చేసుకుని, భ్రమర మానసిక శిక్షణాకేంద్రంలొ ఉన్నప్పుడు అక్కడి ఆమె ప్రవర్తన ఎలావుందో చదివాను.

అక్కడి వైద్యులతోను, వైద్య సిబ్బందితోను సహకరించి వారు చెప్పినట్లు విని మందులు వేసుకునేది. వారెవరైనా మాట్లాడినప్పుడు మాట్లాడటం తప్ప తనకై తను ఎప్పుడు నోరు విప్పేది కాదు. తోటపని ఉత్సాహంగా చేసేది. ప్రతిరోజు వార్తాపత్రిక తప్పనిసరిగా చదివేది. అచటి వైద్యులనడిగి వైద్యశాస్త్రానికి సంబందించిన పుస్తకాలు చదివేది.

భ్రమరను చూడటానికి తమ్ముడు, సురేష్–అక్క, కోమలి–కాక శంకర్ అనే ఒక యువకుడు వెళ్ళేవారు. ఇంతకు మించి బంధువులెవరు లేరేమో. ఒకవేళ ఉన్నా హంతకురాలని వెలివేసి ఉంటారు.

కారాగారంలో కూడా ఆమె ప్రవర్తనలో మార్పేమీ లేదు. ఇక్కడ తనకు వీలైనంత వరకు గ్రంధాలయంలో కాలం గడుపుతుంది.

ఈ అమ్మాయి గురించి చదివే కొలదీ ఈమెతో మాట్లాడాలని, జీవితం ఎందుకిలా నాశనం చేసుకుందో కనుక్కోవాలనే కుతూహలం పెరగ సాగింది. భ్రమర స్థానంలొ నన్ను నేను ఊహించుకున్నాను. అమ్మను హత్య చేయటం అనే ఆలోచనె దారుణంగ అనిపించింది. ఒకవేళ మా అమ్మ నన్ను బాగా చూడటం లేదు, (మా అమ్మ అలాంటిదికాదు. మాతృదేవత) బాగా హింసిస్తుంది. నా ప్రగతికి అడ్డు వస్తుందనే అనుకుందాం. చదువుకున్నదాన్ని కదా. ఆమె నుండి దూరంగా వెళ్ళి బ్రతుకవచ్చు కదా ఇన్ని రోజులు భరించాను, ఇంకకొద్ది కాలం ఓర్చుకోలేనా! అని అనుకుంటానా? కొంచెం నిదానంగా ఆలోచించి నట్లయితె అలాగే చేస్తాను. కాని ఇక్కడ భ్రమర పరిస్థితి ఏమిటో? న్యాయవాది వాదించినట్లు నిజంగానే మతి చలించిందేమొ! ఇరుగు, పొరుగుల సాక్ష్యాలు విన్న తరువాత ఈ అమ్మాయికి మతి
భ్రమణం ఉన్నదనిపించదు.

ఈ శంకర్ అనే యువకుడెవరు? అతని విషయంలొ తల్లీ కూతుళ్ళకు అభిప్రాయ భేదాలున్నాయా? తల్లి జీవించి ఉంటె శంకర్ తనకు దక్కడని భయ పడిందా? హత్యచేసి అంత సులభంగ తప్పించుకో లేమని గ్రహించ లేక పోయిందా? తల్లి చనిపోయింది. ఆమెను తిరిగి తీసుకురాలేం. తన నిండు జీవితం వ్యర్దమై పోయింది. ఎన్ని కోణాల్లో నుండి ఆలోచించినా భ్రమర ఈ హత్య చేసిందనటానికి నా అంతరాత్మ ఒప్పుకోవటం లేదు. కత్తి మీద ఆమె చేతివ్రేళు ఉన్నాయి. ఆ సమయంలొ ఇంట్లో వేరెవరూ లేరు. హత్య జరిగిన తరువాత ఆమె ప్రవర్తన అధికారులకు అనుమానాస్పదంగ ఉన్నది. న్యాయస్థానంలో తనే హత్యచేశానని ఒప్పుకున్నది. ఇది చాల క్లిష్టమైన ఫిర్యాదు. భ్రమర బాల్యజీవితం ఎలాగడిచిందో! ఆమె ద్వారానే తెలుసుకోవాలనిపిస్తుంది. చెల్లాచెదురుగ వస్తున్న ఆలోచనల్తో, బరువెక్కిన గుండెతొ ఈ ఫైల్ మూసివేసి రెండవ ఫైల్ తెరిచాను.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.