నిష్కల – 35
– శాంతి ప్రబోధ
జరిగిన కథ:పెద్ద కొడుకును చూడాలని తాపత్రయ పడుతుంటుంది సుగుణమ్మ. తన కూతురు దగ్గరకు వెళ్ళాలని ఆలోచనలో ఉంటుంది శోభ. సహచరుడు అంకిత్ , ప్రియా బాంధవి సారా, సారా తల్లి వాంగ్ లతో అమెరికా నుండి మాతృదేశం బయలుదేరింది నిష్కల.
***
ఉప్పొంగే కెరటంలా ఉంది సారా .. ఏదో పుస్తకం చదువుతున్నది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరి అలవాట్లలో చాలా సారూప్యత అనుకుని నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది నిష్కల. అకస్మాత్తుగా ఆమె కళ్ళముందు గీత మెదిలింది. గీత ఇప్పుడు ఎలా ఉందో.. ఈ మధ్య కాంటాక్ట్ లో లేదు. కోవిడ్ తర్వాత ఇండియా వెళ్ళింది. అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేదు. ఆమెను తలుచుకుంటే మనసు బాధగా మూలిగింది. గీత ఒక్కటే కాదు అనేక మంది గీతలు కనిపిస్తున్నారు. గుజరాత్, పంజాబ్ , తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ. వారి నుంచి వచ్చే ఫిర్యాదులు ఎక్కువ. మోసం చేసిన వారి పాస్ పోర్టులు సీజ్ చేయమని ఫిర్యాదులు .. అమెరికాలో చదువు, ఉద్యోగం, పెళ్ళి ఎలా వెళ్ళినవాళ్ళయినా అతని గురించి సరిగ్గా తెలుసుకోకుండా తొందర పడుతున్నారు. గుడ్డిగా నమ్మి వాళ్ళతో విదేశాలకు వెళ్ళి మోసపోతున్నారు. పక్కా సాక్ష్యాలు కొన్నయినా ఇవ్వగలిగితే వారికి న్యాయం జరుగు తుంది. గీత లాగే చాలా మంది అమ్మాయిల వద్ద సాక్ష్యాలు ఉండవు. కొందరైతే పెళ్ళి కాగానే ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు , నగలు అత్తమామలకు అప్పగించి వస్తున్నారు. భర్త పేరున రిజిస్టర్ చేస్తున్నారు . సమస్యవచ్చాక మోసపోయామని బాధపడుతున్నారు. అదే వారి సమస్యకు మూల కారణం. ఆ తరువాత తీరిగ్గా చింతించినా లాభం ఏముంటుంది? ఆధునికత అంతా తెచ్చుకునే డిగ్రీల్లోనూ, వేసుకునే బట్టల్లోనూ, మాట్లాడే భాషలో నూ తప్ప నిజంగా ఆధునికం అయ్యామా? మౌలికంగా మన ఆలోచనలు మారాయా ? లేదనే అనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే. ఆడపిల్లల్ని కూడా చదివిస్తున్నారు. అది అవసరం. కానీ పెద్ద ఎత్తున కట్నాలు కానుకలు అవసరమా? డబ్బు చుట్టూ తిరిగే తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా పెంచు తున్నామనుకుంటూ తాహతుకు మించి కట్నం ఇచ్చి, అంగరంగ వైభవంగా పెళ్ళిచేసి పంపిస్తున్నారు. అది గొప్పగా, స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. పిల్లల జీవితాన్ని ఒక ప్రదర్శనగా మార్చేస్తున్న తల్లిదండ్రులు ఆ పిల్లలకు వ్యక్తిగా నిలబడే వ్యక్తిత్వాన్నివ్వడం లేదు. తెలుగునాట పిల్లలను పెంచే విధానం మారాలి. పిల్లలకు సమాజం పట్ల, పరిస్థితు ల పట్ల అవగాహన పెంచకుండా, నిరంతరం అప్రమత్తంగా ఉండే మెలుకువ ఇవ్వకుండా అన్నీ తామే అయి చేస్తామంటారు. అవసరమైనప్పుడు కొండంత అండగా ఉండాల్సిన పెద్దలు కొన్నిసార్లు కుటుంబం, పరువు, ప్రతిష్ట పేరుతో, మరి కొన్నిసార్లు అతిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ఆమె నడక ఆమె నడవకుండా తామే నడుస్తామనే పెద్దలతో భలే చిక్కు… తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం లేకుండా పెంచే పెద్దలతోనే చిక్కు. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా వ్యక్తులుగా ఎదగనీయడం లేదు. ఏది, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కొనే స్థైర్యం ఇస్తే ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి సహకారం ఎవరి నుంచి తీసుకోవాలో, పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో పరిస్థితులే నేర్పుతాయి. లోపలి కత్తుల కుత్తుకలను గుర్తిస్తాయి. అమ్మాయి పెళ్ళి చేశాక అల్లుడు ఎంత మంచివాడైనా ఆమె ఆస్తులు అతని పేరు రాయడం ఎందుకు? అమ్మాయి పేరునే ఉంచుకోవచ్చు కదా .. కొత్త మోజులో అతని పేరున బదలాయించడం ఆ తర్వాత లబోదిబో అనడం. అమ్మాయిలు కూడా తమ నగానట్రా అంతా అత్తింట వదలడమో, భర్తకు అప్పజెప్పడమో చేస్తుంటారు. ఇదంతా అమ్మాయిల వైపు నుండి జరుగుతున్న తప్పులే . ఇద్దరి కుటుంబాల ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు, చదువు, ఉద్యోగం, జాతకం వంటి వివరాలు చూసి పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. కానీ, ఆ అమ్మాయి గురించి/ అబ్బాయి గురించి వారి జీవితం గురించి వారి సహజీవనం లేదా ప్రేమ గురించి పరిశీలించడం లేదు . అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, యూకే లోనో మరో దేశంలోనో ఉండే అబ్బాయిల కేమో ఇండియాలో పద్దతిగా సంప్రదాయంగా పెరిగి చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి. అందం ఐశ్వరం కావాలని చూసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. అక్కడికి వెళ్ళాక కూడా చదువుకున్న అమ్మాయికి కూడా అక్కడి చట్టాలు తెలియవు. ఇండియాలో పెళ్ళి చేసుకొని అమెరికాలో విడాకులు అంటున్నారు. లేదా గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిని ఇండియాలో దింపి పోతున్నారు. రక రకాలుగా అమ్మాయిలు నష్టపోతున్న సంఘటనలు లెక్కకు మించి నమోదు అవుతున్నాయి. జీవితాన్ని పరిశీలిస్తుంటే ఎన్ని పాఠాలు నేర్పుతుంది. ఏ పుస్తకంలో నేర్పని పాఠాలు.. విత్తుకు తెలుసు ఎక్కడ మొలకెత్తాలో పక్షులకు తెలుసు ఎదగని బిడ్డలకు ఆహారాన్నెలా ఇవ్వాలో .. ప్రకృతికి తెలిసిన నియమావళి మనిషికి ఎందుకు లేదు? తన ఇష్టమొచ్చినట్టు మనిషి ఎందుకింత స్వార్ధంగా ప్రవర్తిస్తున్నాడు. మనిషిలో మనిషితనం మాయమవు తూన్నది .. తల్లిదండ్రులు బిడ్డల వ్యక్తిత్వాన్ని, స్వేచ్చని .. అర్థం చేసుకోవడం అవసరం. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకునే విధంగా పిల్లల్ని తయారు చేయడం నేటి అవసరం. అది ఆడైనా, మగైనా. భర్త కరణ్ బారి నుండి తప్పించుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చిన కరుణ ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎన్నారై పెళ్లిళ్ళ పట్ల చైతన్యం తెస్తున్నది. వందలాది మంది మోసపోయిన అమ్మాయిల , అబ్బాయిల ఫిర్యాదులు అందుకుంటున్నది. తనకు తోచిన సహాయం అందిస్తున్నది. ఈ విజిట్ లో వీలయినప్పుడల్లా సారాను తీసుకుని కరుణతో ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీలకు వెళ్ళాలి. కలల రాకుమారుడు కోసం కలలు కనే వాళ్ళకి వాస్తవంలో ఏమి చేయాలో, మెలకువగా ఉండడం ఎంత అవసరమో చెప్పాలి. అమెరికా వెళ్ళబోయే వాళ్ళు, అమెరికా వరుళ్ళను ఎంపిక చేసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలి. అదే విధంగా విమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులను కూడా కలవాలి. పుండుకు మందు వేయడం మాత్రమే కాదు పుండు రాకుండా ఉండాలంటే ఏమేమి చేయొచ్చో చర్చించాలి. అంకిత్ ని, సారా వాళ్ళని, అమ్మని ఎవ్వరినీ నిరాశపరచుకుండా వాళ్ళ సమయం వాళ్ళకు కేటాయిస్తూ సమన్వయం చేసుకుంటూ తన కోసం కొంత సమయం పెట్టుకుని కార్యక్రమం ప్లాన్ చేసుకోవాలని ఆలోచన చేసింది నిష్కల. *** మనిషిని ఎటు వంటి స్వార్థం లేకుండా ప్రేమిస్తే, స్వచ్ఛంగా ప్రేమిస్తే, ఆ ప్రేమను పంచుకుంటే తన చుట్టూ ప్రపంచం చల్లగా ఉండాలని కోరుకునే నిష్కల తన సహచరి కావడం తనకి గర్వకారణం అనుకుంటాడు అంకిత్. కులాలుగా, మతాలుగా, పార్టీలుగా, ధనిక-పేద, చిన్న- పెద్ద ఇలా రకరకాలుగా చీలిపోయి గొడవలు పడి ఒకరినొకరు ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, దుమ్మెత్తి పోసుకుంటూ సంక్లిష్టంగా మార్చుకుంటున్న మనుషులతో నిత్యం సంభాషించే నిష్కల ఒక ప్రేమమయి. ఈ ప్రపంచంలో పైసలు పెట్టి ఏదైనా కొనొచ్చేమోకానీ ప్రేమను కొనలేం. అలా కొంటే లేదా డబ్బులతో కొంటే అది ప్రేమ ఎలా అవుతుంది? కాదు కదా! మన యువతరానికి, నవతరానికి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పలేదు. దయ, జాలికి చోటివ్వకుండా ప్రశాంతంగా బతకనివ్వకుండా ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు, అహంకారాలు .. అంతా తన చెప్పుచేతల్లో ఉండాలని ఆధిపత్యం .. ఎలా కుదురుతుంది? నిషి ప్రేమలో, స్నేహంలో నిజాయితీ, స్వచ్ఛత ఉంటుంది. అదే ఆమె ఎదుటివారి నుంచి కోరుకుంటుంది. నేనే మొదట ఆమెను సరిగా అర్థం చేసుకోలేక పోయాను అనడం కంటే నాలో నాకు తెలియకుండా ఇంకిపోయిన మగ అహంకారం నన్ను లొంగదీసు కుందని అర్ధమయ్యాక ఇక ఆలస్యం చేయకుండా ఆమె చెంత చేరిపోయా. ఆమె నా నుండి ప్రేమ, స్నేహ సహకారాలు, మానవతా విలువలు కోరుకోవడంలో, పరస్పర అవసరాలు తీర్చుకోవడంలో తప్పేం ఉంది. అది ఒక కుటుంబం నిలబడ డానికి అవసరం కూడా.. కూడు గూడు గుడ్డలాగే మనిషి మనసుకు మనుగడకు, మనశ్శాంతికి ప్రేమించే మనిషి మనసు అండదండలు అవసరం. మరకల్లేని మెరిక నిష్కల. ఇంత చిన్న వయసులో అంత స్పష్టంగా, పరిపక్వంగా ఆలోచించే ఆమె నా సహచరి. అంకిత్ మనసు గర్వంగా ఉప్పొంగింది. ఆమె నవ్వుల చూపులు తన చుట్టూ మిణుగురులై ఎగురుతూనే ఉన్నట్టు ఉంటుంది. *** సారా చాలా ఎక్సైట్ అవుతున్నది. తానిప్పుడు భారత భూ భాగంలో ఉంది. ఢిల్లీలో దిగి హైదరాబాద్ వెళ్ళే విమానం ఎక్కినప్పటి నుండి ఆమె చాలా ఉద్వేగానికి గురవు తున్నది. తన తండ్రి తిరుగాడిన నేల పై తాను తిరుగబోతున్నది. ఆయన బిడ్డగా తిరగబోతున్నది. ఆ ఇంటి బిడ్డగా తిరగబోతున్నది. నాకిక్కడ ఎందరో రక్తసంబంధీ కులున్నారు. వారితో బంధం ఇప్పటి వరకు లేదు. ఇక ఆ బంధం మొదలవుతుంది. పటిష్ట పరచుకోవాలి. నాలాగే కాదు కాదు, ఆమె లాగే ఉన్న నన్ను చూసి నానమ్మ ఏమంటుంది? మా వెనుక నాన్న కూడా వచ్చాడని వెతుక్కుంటుందేమో? నాన్న వైపున్న తన కుటుంబాన్ని కలవబోతున్న ఉద్విగ్నక్షణాల్లో ఉన్న సారా గడపబోయే ప్రతి క్షణాన్ని అనుభూతులుగా మిగుల్చుకోవాలని తహతహలాడుతున్నది. చెడు వెనుక మంచి కూడా మన కోసం ఉంటుందని నమ్ముతుంది సారా.. అందుకే ఆమె కుంగిపోదు. తన కోసం వేచిఉన్న మంచిని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తుంది. జీవితం అంత సింపుల్ కాదని తెలుసు. ఈ జీవితం తన ముందుకు తెచ్చిన దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. స్వతంత్రంగా జీవించడం నేర్పింది ఆమె తల్లి వాంగ్ . ఢక్కా మొక్కీలు తింటూ జీవితం నుంచి చాలా నేర్చుకున్న సారా కొన్ని గంటల్లో తనవాళ్ళను చేరుకోబోతున్నది. *** వాంగ్ పరిస్థితి డోలాయమానంగా ఉన్నది. ఓ వైపు ఎన్నో ఏళ్ళుగా అత్తింటికి వెళ్ళాలన్న కోరిక నెరవేరే క్షణాలు దగ్గరవుతున్నాయని సంతోషం. మరో వైపు తన కొడుకును ప్రేమించి పెళ్ళి చేసుకొని తనకు దూరం చేశానని ఆ తల్లి ఎలా స్పందిస్తుం దోనని.. తన కొడుకుని పొట్టనపెట్టుకున్న క్రిమినల్ గా చూస్తారేమోనని సందేహం, భయం జమిలిగా. ప్రేమించిన వాడిని కోల్పోయినా నార్మల్ అయింది, కాలం గాయాన్ని మాన్పుతుంది అంటారు ఈ లోగా ఇలా నవ్వడానికి ఎంత నరకయాతన అనుభవించాలో నాకు అనుభవమే. మరి కొన్ని గంటల్లో ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్దమై ఇక్కడిదాకా వచ్చింది. తన జీవితం సారవంతం చేసుకునే మెరుపుకలల్లో ఈ రోజు ఒకటి వస్తుందని అస్సలు ఊహించలేదు. నిష్కల వల్ల అది సాధ్యమవుతున్నది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా మరి కొద్ది క్షణాల్లో హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నట్లు ఫ్లైట్ అనౌన్సమెంట్.. అందరూ సన్నద్దమవుతుండగా ఫ్లైట్ లో ఒక్కసారిగా కుదుపులు . .. ఏమైందోనని ప్రయాణికుల హాహాకారాలు .. * * * * *
(మళ్ళీ కలుద్దాం )
Please follow and like us:
నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..