
ప్రమద
పి.వి.సింధు
-నీరజ వింజామరం
ప్రపంచ బ్యాడ్మింటన్ లో మెరిసిన తెలుగు తార – పి .వి. సింధు
తల్లిదండ్రులిద్దరు జాతీయ స్థాయి వాలిబాల్ క్రీడాకారులు అనగానే సహజంగానే వారి పిల్లలు కూడా వాలిబాల్ నే ఎంచుకుంటారని ఎవ్వరైనా అనుకుంటారు. కానీ ఆమె బ్యాడ్మింటన్ ను ఎంచుకుంది. కేవలం ఎంచుకోవడమే కాదు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగాచరిత్రలో పేరు నమోదు చేసుకుంది. ఆమె మరెవరో కాదు మన తెలుగు తేజం పి. వి. సింధు .
పి .వి. సింధు పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు.
సింధు 1995 జూలై 5న హైదరాబాదులో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది.
ఆమె తల్లిదండ్రులు పి.వి. రమణ మరియు పి. విజయ – ఇద్దరూ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆమె తల్లి విజయవాడకు చెందినవారు, కాగా ఆమె తండ్రి కుటుంబం ఏలూరుకు చెందినది.
ఆమె తండ్రి, రమణ, 1986 సియోల్ ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత వాలీబాల్ జట్టులో సభ్యుడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గాను 2000 సంవత్సరంలోఅర్జున అవార్డును అందుకున్నారు. సింధుకు ఆమె తల్లి దండ్రుల నుండి క్రీడా నైపుణ్యాలు వారసత్వంగా వచ్చాయి.
వాలీబాల్ నేపథ్యం ఉన్నప్పటికీ, సింధు బ్యాడ్మింటన్‌ను ఎంచుకుంది.
2001లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పుల్లెల గోపిచంద్ ఆమెకు స్ఫూర్తిగా నిలిచాడు.
ఆమె తన ఎనిమిదవ ఏటనుండే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.
ప్రారంభంలో, సికింద్రాబాద్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ బ్యాడ్మింటన్ కోర్టులలో మెహబూబ్ అలీ మార్గదర్శకత్వంలో, ఆమె బ్యాడ్మింటన్ లోని ప్రాథమిక అంశాలను నేర్చుకుంది. మెహబూబ్ అలీ చిన్న వయస్సు నుండే సింధులో ఒక స్టార్ అథ్లెట్‌కు ఉండాల్సిన లక్షణాలను పెంపొందించారు .
తరువాత ఆమె మాజీ చీఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎం. అరిఫ్ వద్ద శిక్షణను కొనసాగించింది. ఈ శిక్షణలు ఆమెకు పటిష్టమైన పునాదిని అందించాయి.
ఆ తరువాత ఆమె తనకు ఆదర్శం అయిన గోపిచంద్ స్థాపించిన గోపిచంద్ అకాడమీలో చేరింది.
ఆమె ఇంటికి, గోపిచంద్ అకాడమీకి ఉన్న దూరం 56 కి.మీ.. ఆమె ప్రతీ రోజు అంత దూరం ప్రయాణించి శిక్షణ కోసం వెళ్ళేది. ఏ ఒక్క రోజు ఆమె శిక్షణ మానలేదు . ఇది బ్యాడ్మింటన్ పట్ల ఆమెకున్ననిబద్ధతకు నిదర్శనం. గోపిచంద్ ఆమెకున్న పట్టుదలను చూసి ఆశ్చర్యపోయేవారు. ప్రయాణం చేసి వచ్చిన అలసట ఆమె ఆట లో ఎక్కడా కనిపించేది కాదు. ఎన్నో సందర్భాలలో గోపిచంద్ఆమె క్రమశిక్షణను ప్రశంసించారు. “సింధు ఆటలో అత్యంత అద్భుతమైన లక్షణం ఆమెవైఖరి మరియు ఎన్నటికీ ఓడిపోని స్ఫూర్తి” అని గోపీచంద్ పేర్కొన్నారు.
గోపీచంద్ అకాడమీలో చేరిన తర్వాత, సింధు జూనియర్ స్థాయిలో అనేక టైటిళ్లు గెలుచుకుంది. వాటిలో ముఖ్యమైనవి,
అంబుజా సిమెంట్ ఆలిండియా ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో అండర్-10 సింగిల్స్ టైటిల్, అండర్-13 సింగిల్స్ మరియు డబుల్స్ టైటిల్స్ మరియు 51వ నేషనల్ స్టేట్ గేమ్స్‌లో అండర్-14 టీమ్ గోల్డ్ మెడల్.
2009లో 14 సంవత్సరాల పిన్న వయస్సులో, సింధు అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టింది మరియు కొలంబోలో జరిగిన సబ్-జూనియర్ ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంను గెలుచుకుంది.
ఆమె 2011 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని మరియు 2012లో అదే టోర్నమెంట్‌లో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. 2012లో ఆమె సాధించిన ఈ విజయం ఆమెను భారతదేశపు మొట్టమొదటి ఆసియా జూనియర్ ఛాంపియన్‌గా నిలిపింది.
గోపీచంద్ మార్గదర్శకత్వంలో, సింధు తన మొదటి సీనియర్ టైటిల్ (2011 మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్)గెలుచుకుంది. 2016లో రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకాన్నిగెలవడంలో కూడా గోపీచంద్ కీలక పాత్ర పోషించారు.
మెహబూబ్ అలీ,ఎస్.ఎం. అరిఫ్, గోపిచంద్ మాత్రమే కాక సింధు ఇతర కోచ్ ల వద్ద కూడా శిక్షణ పొందింది.
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జి హ్యున్ 2019లో గోపీచంద్ బృందంలో చేరారు. ఆమె సింధుకు 2019 BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్‌ను సాధించడం లో మార్గనిర్దేశం చేశారు, ఇది సింధు కెరీర్‌లో ఒక ముఖ్యమైన విజయం.
దక్షిణ కొరియాకే చెందిన పార్క్ టే-సాంగ్ 2019 చివరలో కిమ్ వెళ్లిపోయిన తర్వాత సింధు కోచింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మార్గదర్శకత్వంలో సింధు టోక్యో 2020ఒలింపిక్స్‌లోకాంస్య పతకం గెలుచుకుని, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా నిలిచారు. 2022లో మూడు BWF వరల్డ్ టూర్ టైటిళ్లను మరియు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్‌ను కూడా గెలుచుకున్నారు.
సింధు చిన్నప్పటి నుండి బ్యాడ్మింటన్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఆమె చదువును వదలకుండా కొనసాగించింది.
ఆమె చదువంతా హైదరాబాద్ లోనే జరిగింది. ప్రతిరోజూ పలుచోట్ల ప్రాక్టీస్‌కి వెళ్లే అవసరం ఉన్నప్పటికీ, ఆమె చదువును నిర్లక్ష్యం చేయలేదు.
ఆమె క్రీడా ప్రావీణ్యానికి గుర్తుగా పలు విశ్వవిద్యాలయాలు ఆమెకు గౌరవ డాక్టరేట్లను అందించాయి.
ఇన్ని విజయాలు సాధించడం ఆమెకు నల్లేరు మీద నడకేమి కాదు. ఆమె ఎన్నో సమస్యలను, సవాళ్ళను ఎదుర్కొన్నారు. 2015లోస్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా 6 నెలల పాటు ఆటకు దూరమైంది. 2022 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఎడమ కాలి గాయం కారణంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ మరియు వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి దూర మైంది. 2023 అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో మోకాలి గాయం తలెత్తింది.2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు వరుస పరాజయాలు, ర్యాంకింగ్ 13కి పడిపోవడం, టాప్-5 ఆటగాళ్లపై నెగిటివ్ రికార్డు – ఇవన్నీ ఆమెను కలవరపెట్టాయి.
అయినప్పటికీ, సింధు ఓర్పు, స్టామినా పెంచుకోవడం వంటి పరిష్కారాలపై దృష్టి సారించి పోరాటం చేస్తోంది. .
కోర్ట్‌పై సింధు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా తన భావాలను అంతగా చూపించదు. అయితే, కోర్ట్ వెలుపల స్నేహపూర్వకంగా ఉంటుంది . స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌తో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఇద్దరం మంచి స్నేహితులమని సింధు చెబుతారు.
సింధు ఆట బలమైన స్మాష్‌లు, దూకుడైన శైలికి ప్రసిద్ధి చెందింది. ఆమె ఎత్తు, శక్తి, స్టామినా అన్నీ కలిసి ఆటలో ఆమెకు ఆధిపత్యాన్ని ఇస్తాయి . సుదీర్ఘమ్యాచ్‌లలో స్థిరంగా ఉండటానికి శ్రమిస్తూ, టెక్నిక్‌ను మెరుగుపరచుకునే పనిలో ఉంది సింధు .
సింధుకు దక్కిన అవార్డులకు,రివార్డులకులెక్కే లేదు. అందులో అతి ముఖ్యమైనవి 2013 లో క్రీడా రంగంలో విశేష ప్రతిభకుగాను భారత ప్రభుత్వం అందించిన అర్జున అవార్డు, 2015 లో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమయిన పద్మశ్రీ, 2016 లో భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవమైన మేజర్ ధ్యాన్‌చంద్ఖేల్ రత్న, 2020 లో భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం, పద్మభూషణ్.
వ్యాపారవేత్త, వెంకట దత్త సాయితో సింధు వివాహం2024 డిసెంబర్ లో ఉదయ్‌పూర్‌లో జరిగింది.
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు అత్యంత గౌరవం తీసుకొచ్చింది సింధు. లక్షలాది యువతులకు స్ఫూర్తిగా నిలిచింది. 2016 ఒలింపిక్స్ లో సింధు రజతం సాధించాక బ్యాడ్మింటన్ పట్ల ఆదరణ పెరిగిందనేది వాస్తవం. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్న సింధు కల నెరవేరాలని మనసారా కోరుకుందాం.
ఆమె నైపుణ్యం, పట్టుదల వలన మాత్రమే ప్రపంచ స్థాయిలో విజయం సాధించగలిగింది.
*****

నీరజ వింజామరం సెయింట్ పీటర్స్ ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాను. పాటలు వినడం పుస్తకాలు చదవడం నా హాబీలు . పిల్లలంటే చాలా ఇష్టం . వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటాను .