
దేవి చౌధురాణి
(రెండవ భాగం)
మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ
తెనుగు సేత – విద్యార్థి
జరుగుతున్న పరిణామాలకి వ్రజేశ్వర్ నిర్ఘాంతపోయాడు. కొంచెం తేరుకున్న తరువాత. “సాగర్, నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావు?” అని అడిగాడు.
“సాగరపతి, మీరు ఇక్కడకు ఎలా వచ్చారు?” అని ప్రతి ప్రశ్న వేసింది సాగర్.
“నేను బందీని, నువ్వు కూడా బందీవా? నన్ను డాకూలు ఇక్కడికి పట్టుకువచ్చారు. నిన్ను కూడా అలాగే పట్టుకు వచ్చారా?”
“నేనేమీ బందీని కాదు. నన్ను ఎవరూ పట్టుకు రాలేదు. నేను పూర్తిగా నా ఇష్ట ప్రకారమే దేవి రాణి సహాయంతో వచ్చాను. మీతో నా కాళ్లు మర్దన చేయించుకోవటానికి దేవి రాణి రాజ్యానికి చేరుకున్నాను.”
ఇంతలో నిశి అక్కడకు వచ్చింది. నిశి వేసుకున్న చమ్కీ వస్త్రభూషణాలను చూసి వ్రజేశ్వర్ ఆవిడే దేవీ రాణి అనుకుని గభాలున లేచి నిలబడ్డాడు.
నిశి వ్రజేశ్వరుడితో “బందిపోటు దోపిడీతోనే స్త్రీలకి ఇంత గౌరవం పెరిగిందా? కూర్చోండి. ఇప్పుడర్ధమయ్యిందా మీ నావను ఎందుకు ఆపామో? సాగర్ ప్రతిజ్ఞ నెరవేర టానికే. ఇప్పుడు వెళ్తానంటే వెళ్లండి, మీ సామానంతా తిరిగి మీ నావకే చేర్పించాము. కానీ సాగర్ సంగతి ఏం చేసారు? ఇప్పుడు తిరిగి ఈ అమ్మాయి వాళ్ల కన్నారింటికి ఎలా వెళ్తుంది? మీరే వెళ్లి సాగర్ని వాళ్ల కన్నారింటిలో దిగబెట్టండి.”
వ్రజేశ్వర్‌కి ఏమీ అర్థం కాలేదు. మరి ఈ బందిపోటు వ్యవహారం అంతా అబద్దమా? వీళ్లు నిజంగా బందిపోట్లు కాదా? “మీరందరూ కలసి నన్ను ఓ మూర్ఖుడిని చేసారు. నా నావ మీద దేవి చౌధురాణి ముఠా దాడి చేసారనుకున్నాను” అని అన్నాడు.
“ఈ నావ దేవి చౌధురాణిదే. దేవి రాణి ధనికులని దోపిడి చెయ్యదని అనుకుంటు న్నావా ..?” అని ప్రశ్నించింది నిశి.
“దేవీ చౌధురాణి ఇలా దోపిడీలు చేస్తుందా. మరి మీరు దేవి చౌధురాణి కాదా?”
“అబ్బే, లేదండి. కానీ, మీరు ఆవిడ దర్శనం చేసుకోవాలనుకుంటే, చేయించు తాను. ముందు నేను చెప్పేది వినండి. మేము చేసేది బందిపోటు దోపిడీలే. కానీ, మిమ్మలని దోచుకునే అభిప్రాయం మాత్రం లేదు. కేవలం సాగర్ ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసమే ఇదంతా. ఇప్పుడు చెప్పండి సాగర్ ఇంటికి ఎలా వెళ్తుందో?” అన్నది నిశి
“ఎలా వచ్చిందో, అలా వెళ్తుంది.”
“సాగర్ దేవి రాణితో కలసి వచ్చింది.”
“నేను కూడా అక్కడి నుంచే వస్తున్నా. అక్కడ రాణిగారిని నేనెక్కడా చూడలేదు.”
“మీరు అలిగి వెనుతిరిగేటప్పటికి రాణి అక్కడకి చేరుకుంది.”
“అలాగైతే ఇంత త్వరగా ఇక్కడకు ఎలా చేరుకుంది?”
“మా నాగతరి చూసారా? ఒకేసారి అరవై మంది తెడ్డు వేస్తారు.”
“అలా ఐతే, ఆ పడవ మీదే చేర్చండి.”
“ఇందులో కష్టం తెలీదా మీకు? సాగర్ ఎవరికీ చెప్పకుండా వచ్చింది. అలాగే తిరిగి వెళ్లితే ఎన్నో ప్రశ్నలు వుంటాయి. మీతో వెళ్లితే ఎవ్వరూ ఏమీ అడగరు.”
“సరే, అలాగే. పడవని సిద్ధం చేయించండి.”
“ఇప్పుడే చేయిస్తాను” అంటూ నిశి వెళ్లింది.
ఈ ఏకాంత సమయంలో వ్రజేశ్వర్ అడిగాడు “సాగర్, నువ్వు ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేశావు?”
సాగర్ ముఖం క్రిందకి దించి, చీర కొంగును ముఖానికి కప్పుకుని ఎక్కి ఎక్కి ఏడవటం మొదలుపెట్టింది. “వెనుక గదిలో దేవి రాణి వింటుందేమో” అన్నది చివరకి.
సాగర్ దుఃఖం కొంత తగ్గిన తరువాత వ్రజేశ్వర్ అడిగాడు, “సాగర్, మరి నేను బయలుదేరుతుంటే నువ్వు నన్ను ఎందుకు వెనుకకు రమ్మని పిలువలేదు? నువ్వు పిలిచి వుంటే ఈ కథ అంతా అప్పటికప్పుడే సమాప్తమయ్యేది కదా?”
సాగర్ కష్టంగా ఏడుపు దిగమింగుకొని “ఖర్మ కాలి పిలవలేదు. అయినా నేను పిలిస్తేనే రావాలా? ఏం, నేను పిలవకపోతే మీరే ఎందుకు వెనుకకు తిరిగి రాకూడదు?”
“నువ్వేగా నన్ను అరచి తరిమివేసింది. నువ్వు పిలవకుండా ఎలా వస్తాను?”
చివరకి వ్రజేశ్వర్ అన్నాడు “సాగర్, నువ్వు ఈ డాకూలతో ఎందుకు వచ్చావు?”
“దేవీ రాణితో నాకు బంధుత్వం వుంది, అక్క అవుతుంది. నాకు ముందు నుంచే ఆవిడతో పరిచయం వుంది. మీరు మా కన్నారింటికి వచ్చిన తరువాత తను వచ్చింది. నేను ఏడవటం చూసి, ‘ఏడుస్తావెందుకు? నీ శ్యామసుందరడిని ఇప్పుడే పట్టుకుని తెప్పించుతాను చూడు. నాతో రా అని అంటే నేను తన వెంట వచ్చాను. నేను దాసి దానితో మీతో వెళ్తున్నాని చెప్పి వచ్చాను” అన్నది సాగర్.
“సరే, కానీ, మరి ఇంతవరకు మీ దేవి రాణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అన్నడు వ్రజేశ్వర్.
సాగర్ దేవీ రాణిని పిలిచింది. కానీ నిశి వచ్చింది. నిశిని చూసి వ్రజేశ్వర్ “పడవ తయరయ్యిందా?” అని అడిగాడు.
“పడవ తయారుగానే వుంది. మీ పడవే, దానిలోనే వెళ్లండి. కానీ, తరచి చూస్తే, మీరు రాణిగారికి ఒకరకంగా బావగారు అవుతారు కదా! మరి మా ఆతిధ్యం కూడా స్వీకరించండి. మేము బందిపోటులమే, కానీ బావగారికి మర్యాదలు చెయ్యటం రాని వాళ్లం కాదు” అన్నది నిశి.
“సరే, ఆజ్ఞాపించండి” అన్నాడు వ్రజేశ్వర్.
“ముందు సరిగ్గా కూర్చోండి.”
అప్పటిదాకా తివాచీ మీద కూర్చున్నడు వ్రజేశ్వర్. “నేను హాయిగానే కూర్చున్నా ను” అన్నాడు.
నిశి సాగర్‌తో అన్నది “నువ్వే మీ ఆయనని లేపి ఈ తూలిక మీద కూర్చోపెట్టి సర్దుకో” అన్నది. వ్రజేశ్వర్ వైపు తిరిగి అన్నది “నేనేమీ ఈ సామానుని ముట్టుకోను. వెండి బంగారమైతే తప్ప.”
“అలా అయితే నేనేమన్నా కంచు ఇత్తడి సరుకునా?” అంటూ ఛలోక్తి విసిరాడు వ్రజేశ్వర్.
“పురుషులు స్త్రీలకి వంట సామాగ్రిలాంటి వాళ్లు. ఏవి లేకపోయినా ఇల్లు గడవదు, అందుకని కావాల్సిందే. కాని, వాటిని కడగాలి, తోమాలి, ఎండబెట్టాలి, చివరికి అరపైక్కె కించి సర్దాలి. ఈ పనులతోనే సరిపోతుంది. ఇదిగో అమ్మాయి సాగర్, ఇంక నీ చెంబూ తప్పేళ్లలని నువ్వే సరి చేసుకో” అంటూ అన్నది నిశి.
“ఒకసారేమో కంచు ఇత్తడిని. ఇప్పుడేమో చెంబూ తప్పేళాని. కనీసం బిందె కలశం కాకపోయాను!”
“నేను వైష్ణవిని, ఇవేమీ నాకు పట్టవు. ఇల్లూ ఇల్లాలు సాగరివి, అన్నీ తనకే తెలుసు” అన్నది నిశి.
“వాస్తవానికి పురుషుడు కలశమే, హృదయం మాత్రం ఖాళీగా వుంటుంది. గృహిణి రోజూ నింపుతూ వుంటుంది” అన్నది సాగర్.
“సరిగ్గా చెప్పావు. అప్పుడే భర్తలు భార్యలని కౌగలించుకుని సంసార సాగరంలో మునిగి తేలతారు. సరే, నీ కలశాన్ని, నువ్వే సంభాళించుకో” అన్నది నిశి.
“సర్లే, ఈ కలశం స్వయంగా తనని తాను సంభాళించుకుంటుంది” అంటూ వ్రజేశ్వర్ లేచి తనే వెళ్లి తూలిక మీద ఆసీనుడయ్యాడు. అప్పుడు ఇద్దరు యవ్వనవ తులు సుందర వేషభూషణాలతో సహా వచ్చి బంగారు చామరులతో వీచటం మొదలు పెట్టారు. నిశి సాగర్‌తో “మీ పతి దేవుడికి హుక్కాలో పుగాకు సర్ది పెట్టు” అన్నది.
సాగర్ వెంటనే వెళ్లి హుక్కాలో సుగంధాలు రంగరించిన పుగాకు నింపుకు వచ్చింది.
“ఈ హుక్కా గొట్టం వేరే ఎవరన్నా వాడి వుంటారు. నాకు క్రొత్తది ఇవ్వండి” అన్నాడు వ్రజేశ్వర్.
“ఇది క్రొత్తదే, ఎవరు వాడింది కాదు, ఇక్కడ మేమెవరం పొగత్రాగం” అన్నది నిశి.
“మరి ఇది ఎక్కడ నుంచి వచ్చింది?”
“దేవి రాణి దగ్గర అన్నీ వుంటాయి.”
“మరి నేను వచ్చేటప్పటికే ఈ హుక్కా ఎదురుగా కనిపించింది, ఎవరికోసం వున్నది?”
“అలంకారానికి. ఇప్పుడు మీ కోసం.”
వ్రజేశ్వర్ కళ్లు చిట్లించి పరిశీలనగా చూసాడు. హుక్కా క్రొత్తదే. కాసేపు తాపీగా దమ్ము లాగాడు. ఇంతలో నిశి సాగర్ని “బొమ్మలాగా నిలబడి చూస్తావేం? ఏం చేస్తున్నావ్విక్కడ, ఏదో ఒకటి మంత్రం వేసి వశ పరుచుకో. వెళ్లు, వెళ్లి కనీసం తాంబూలం కట్టి తీసుకురా. కుదిరితే రెండు తాంబూలాలు తీసుకురా. నీ చేత్తోనే చెయ్యాలి” అన్నది నిశి.
“అయ్యో, మంత్రమెయ్యటమే వచ్చివుంటే అసలింతదాకా వచ్చి వుండేదా!” అని వాపోయి, “తాంబూలాలు చేసే వుంచాను” అంటూ వెళ్లి నిండుగా తాంబూలాలతో అలంకిరించిన ఒక పళ్లెం తెచ్చింది సాగర్.
“ఇప్పుడు పతి దేవుడికి ఏదైనా అన్నపానాలు ఏర్పాటు చేస్తావా లేదా?” అన్నది నిశి.
“అయ్యబాబోయ్, ఇంత అర్థరాత్రి వేళ నేను తినలేను” అంటూ నిరసన ప్రకటించాడు వ్రజేశ్వర్. కానీ తప్పలేదు. ప్రక్కనే వున్న గదిలో అప్పటికే ఒకరికి పీట వేసి వుంది. దానికెదురుగా ఒక బంగారపు పళ్లెం, చుట్టూ గిన్నెలలో వంటకాలు, ఆ ప్రక్కన ఇంకొక బంగారు పాత్రలో శీతల సుగంధ పానం ఏర్పరచబడి వున్నాయి.
“లేచి ఇటు వచ్చి తినండి” అన్నది నిశి.
వ్రజేశ్వర్ వచ్చి పీట మీద కూర్చుని “అర్థరాత్రి బందిపోటులొచ్చి నన్ను ఎత్తుకు పోయారు. అది సహించాను కానీ, అర్థరాత్రి పూట ఈ బలవంతపు భోజనం ఎలా సహించటం” అంటూ వాపోయాడు. ఆడవాళ్లిద్దరూ ఏమాత్రం దయచూపలేదు, వడ్డిస్తూనే వున్నారు. వ్రజేశ్వర్‌కి తినటం తప్పింది కాదు.
“హమ్మయ్యా, బ్రాహ్మడు ఎంగిలి పడ్డాడు కదా, ఇప్పుడు దక్షిణ ఇవ్వాలి” అన్నది సాగర్.
“దక్షిణ రాణిగారు స్వయంగా ఇస్తారు” అంటూ వ్రజేశ్వర్ని రాణివాసానికి తీసుకుపోయింది నిశి.
*****
(సశేషం)

విద్యార్థి నా కలం పేరు. నేను పుట్టింది, పెరిగింది, విద్యాబుద్ధులు నేర్చుకున్నది విజయవాడలో. రైతు కుటుంబం. గత 30 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరుగా వృత్తి. ప్రవృత్తి ఫలసాయం. మూఢ నమ్మకాలు, స్త్రీ విజయం, నిజ జీవిత పోరటం సాగించే నాయికానాయుకలు మొదలైన సమకాలీన సామాజిక అంశాల గురించి అప్పుడప్పుడూ కథలు వ్రాస్తుంటాను.