ఈ తరం నడక – 18

మిణుగురులు (చల్లపల్లి స్వరూపారాణి)

-రూపరుక్మిణి 

చీకటిని చీల్చిన దివ్వెలు

చీకటి మాటున వెలుగు ఎప్పుడూ ఉంటుంది. అనుమానమే లేదనడానికి నిదర్శనాలు నాకు చాలా ఎదురవుతూనే వున్నాయి. అటువంటి మరో నిదర్శనమే ఈసారి నే పరిచయం చేయబోతున్న పుస్తకం.

          కొన్ని పుస్తకాలు మనం ఎంచుకుంటాం. మరికొన్ని పుస్తకాలు మాత్రం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన కోసమే మనల్ని చేరుతాయి. అటువంటి అరుదైన పుస్తకం అందుకోవడానికి నేను చాలా దూరమే ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ నా సాహిత్య ప్రయాణంలో నేను నిర్ణయించుకున్న దారిలోనే ఈ పుస్తకం నన్ను చేరిందనుకుం టున్నా.

          ఈ తరం నడకలో స్త్రీల రచనల్లో స్ఫూర్తిదాయకమైనవి ఏమున్నాయో వెతుకుతూ ఈ కాలమ్ రాస్తున్నాను. అందుకు సరిగ్గా సరిపోయే అనాలో..,  నా ఆలోచనలకు సరిగ్గా తూగే పుస్తకం అనాలో గాని ఈ పుస్తకంలోని ప్రతి పేజీ ఓ స్ఫూర్తివంతమైన నిజ జీవిత గాధలు.

          మొదట చెప్పినట్లు చీకటిమాటున వెలుగు, ఆ వెలుగు అందుకోవాలంటే మానవుడు కొంత కష్టపడాలి. సాధన చేయాలి. అందునా స్త్రీలు మరింత కష్టపడాలి. వెలుగుని చూడడం అంటే ఆమె ప్రాణం కత్తి అంచున నిలబెట్టడమే.

          ఇక్కడ స్త్రీమూర్తులందరూ ప్రత్యేకమైన యోధులు, మామూలు స్త్రీల లా ఈ స్త్రీల గురించి ప్రస్తావించలేము. ఈ స్త్రీల చరిత్రలు నిర్మించబడ్డ పేజీలు చాలా తక్కువ. పెద్దగా ప్రచారంలోనికి రాని నిజ జీవిత గాథలే.

          ఇలా ఎందుకు? అంటూ కారణాలు వెతుక్కుంటే వీరు సవర్ణలు కాకపోవడమే బలమైన కారణంగా కనిపిస్తుందిక్కడ. మరి వీరంతా ధీరవనితలు కాదా!?

          అంటే…

          “బలమైన వెన్నుముక ఉన్న ధీరవనితలు, ప్రజల నాలుకలపై ధైర్యమై నిలిచిన వారు, తమ సంపూర్ణ జీవితాన్ని ఫణంగా పెట్టిన వాళ్ళు, మరి వీళ్ళ చరిత్ర ఎందుకు ప్రాచుర్యం పొందలేదు అంటే ఒక్కటే సమాధానం కనిపిస్తుంది. వీరంతా బహుజనులు అసామాన్యమైన ప్రతిభ కలిగిన ధీరవనితలు. వీరి చరిత్రను నేర్పుగా కూర్పు చేసి మన ముందుకు తీసుకువచ్చిన రచయిత్రి చల్లపల్లి స్వరూపారాణి గారిని మెచ్చుకోకుండా, కృతజ్ఞతలు తెలుపకుండా ఉండలేను.

          “మిణుగురులు” చీకటిని చీల్చుకొని, అస్తిత్వ పోరాటాన్ని చేసి, ప్రజల జీవితాల్ని గెలిచిన వీరనారీమణులు, శ్రామిక శక్తికి, రాజకీయ చదరంగానికి, విద్యామేధకు, బానిస సంకెళ్ల విముక్తికై, అస్తిత్వ పోరాటాలలో విజేతలుగా నిలిచిన వెలుగు దివ్వెలు.

          ఇక్కడ 26 మంది మహిళా మణులు జీవిత చరిత్రకు సంబంధించిన వాస్తవ కథనాలను చరిత్ర పేజీలుగా మహిళా మణులు జీవిత చరిత్రకు సంబంధించిన వాస్తవ కథనాలను అందించే క్రమంలో ఎన్నో చరిత్ర పేజీలను తిరగేసి రచించిన వ్యాసాలు ఇవి.

          ప్రతీ పేజీలో కణం కణం ఉద్వేగ పడే జీవన చిత్రాన్ని చూస్తాము.

          అణిచివేయబడిన అణగారిన బ్రతుకుల నుండి జీవం పోసుకొని, తమ చుట్టూ ఉన్నవారి సమూహానికో, తెగకోసమో, గ్రామం కోసమో, దేశం కోసము జరిగిన అన్యాయా లపై గళమెత్తి, విముక్తికై పోరాడి గెలిచిన ధీరోదాత్తలు వీరంతా…

          ఓ కాలేజీ ఆవరణలో ఒక బస్ట్ సైజ్ స్త్రీ విగ్రహాన్ని చూసి ఆ విగ్రహం చరిత్ర ఆ కుటుంబ సభ్యులను అడిగి మాత్రమే కాక చరిత్ర పేజీల్లో ఆధారాల కోసం వెతికి మరి రాసిన వ్యాసం పుల్లగూర దీనమ్మ, అటు తరువాత, ఒక్కొక్కటిగా మొదలైన వ్యాసాల పరంపరలో ఆనాటికాలం (1780) దిక్కార వాచకం నంగేళీ నుండి మొదలై, దశాబ్ద కాలానికి ఒకరి చొప్పున ఎంచుకుని నేటి కాలపు కొండ దొరసాని సీతక్క వరకు ఇరవైఆరు మంది ధీరవనితల చరిత్రను మన ముందు నిజాయితీగా ప్రస్తుతించారు రచయిత.

          ఇందులోని ప్రతి ఒక్కరి చరిత్ర సామాజిక పరంపరలతో ముడిపడి ఉన్నదే, చైతన్యంతో సమాజంలో మార్పు కోసం పోరాడి గెలిచిన వారే, ఆత్మగౌరవ ప్రతికలే, మౌళిక సాహిత్యంలో పాత్రలే. ఇలా ఈ పుస్తకంలో చదువుతున్నప్పుడు ఝల్కారి భాయ్ గురించి చదివినప్పుడు చరిత్రకారుడు ఎన్ని విషయాలు రాసినా…  ప్రచారంలో మాత్రం ఉన్నత వర్గాలే వస్తారు అనడానికి నిదర్శనం కనిపిస్తుంది.

          ఇతర స్త్రీల కంటే దళిత స్త్రీలు ఎక్కువ హింసను అనుభవిస్తారనే వాస్తవానికి ప్రతిబింబంగా పితృస్వామ్యానికి వైద్యం చేసిన జ్యోతి లింగమ్మ దర్శనం ఇస్తుంది.

          అవిటితనం చైతన్యానికి ప్రగతికి అడ్డు కాదని నిరూపించిన పుల్లగూర దీనమ్మ ఎదురవుతుంది.

          అంబేద్కర్ గురించి చెప్పుకొని పొంగిపోయే ప్రజా రమాబాయి త్యాగం లేనిదే అంబేద్కర్ లేరన్న సత్యాన్ని కూడా అంగీకరించాలి ఆమె చరిత్ర తెలుసుకున్నాక.

          జ్యోతి రావు పూలే కాలంలో చైతన్యం పొందిన సావిత్రి భాయి, పూలే వారసురాలు సావిత్రిబాయిరోడే, షేక్ ఫాతిమా వీరు ముగ్గురు ఒకే కాలానికి చెందిన వారైనా వారి ప్రయాణంలో అంతర్గతమైన చైతన్యంలో మార్పుని స్పష్టం చేస్తూ చరిత్రను తెలియ జేయడానికి చాలా కృషి చేశారని అనిపిస్తుంది వ్యాసం చదువుతున్నంతసేపు .

          చట్టాలను బద్దలు కొట్టిన ‘దాక్షాయిని వేలాయుధన్‘ కొచ్చిన్ రాజు పులయలు తన భూభాగంలో ఎక్కడ సభలు సమావేశాలు జరపరాదని చెప్పిన సందర్భంలో ఒక సాధారణ మహిళగా వేలాయుధన్ సముద్రం పై పడవలో ‘సరస్సు సమావేశం’ ఏర్పాటు చేసి కుల దురాహంకారుల పాలిట మహంకాళి అయిందననే చెప్పాలి. ఈ దేశంలోని మొట్టమొదటి దళిత పట్టబద్రురాలుగా, మొదటి దళిత మహిళ పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్న ఈమె చరిత్ర వీరోచితం, స్ఫూర్తిదాయకం.

          చిందు ఎల్లమ్మ పురాణాలని పుక్కిటపట్టి విమర్శనే అస్త్రంగా చేసుకొని బహుజనుల గళాన్ని ఆమె గాత్రంలో వినిపించిన ఘనతను చూడొచ్చు.

          క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1871 రద్దు కోసం, యానాదుల బానిస సంకెళ్లను తెంచ డానికి, కృషిచేసిన చల్లమ్మ పరిచయం యానాదుల బానిసత్వం నుండి విముక్తికై  కృషిచేసిన చల్లమ్మ పరిచయం ఎన్నో భావోద్వేగాల మాటున సాగుతుంది.

          అంబేద్కర్ వాదిగా 1960 దర్శకంలోని అసెంబ్లీలో గళం విప్పి సభని గర్జించిన ధీరురాలు ఈశ్వరి భాయి తెగువ ముందు నేటి రాజకీయ మహిళలు చిన్నబోతారు.

          పితృస్వామ్యం అణిచివేతల మీద మూఢనమ్మకాల మీద జీవితకాలం పోరాటం చేసిన కామ్రేడ్ కమల జీవితం ఉద్యమాలలో ధైర్యసాహసాలకు ప్రతీకగా కనపడుతుంది.

          వెక్కిరించిన బ్రతుకులు జోగిని వ్యవస్థలపై పోరాడిన మహాలక్ష్మమ్మ,, హేతు వాదాన్ని ఇంటిపేరుగా మోసిన లక్ష్మి, ఆదివాసి స్త్రీ సాధికార చిహ్నం జండాలమ్మ, మురికివాడ ముంగిట మెరిసిన వెన్నెల రజనీ తిలక్, నల్ల మనుషుల కోసం పలవరించిన తెల్లటి హృదయం గేయల్ ఒంవెట్… ఇలా ప్రతి ఒక్కరూ ఒక్కో చరిత్ర నిర్మాణానికి సాక్షిగా.. ఈ వనితల తేజో ధీర గాధల్లోని పితృస్వామ్య వ్యవస్థలలో దోపిడిని, బహుజన స్త్రీల పోరాటపటిమని, మరిచిపోయిన చరిత్రను మన కళ్ళ ముందు పుస్తక రూపంలో ఉంచారు చల్లపల్లి స్వరూపారాణి గారు. 

          మంచి పుస్తకాన్ని అందించిన స్వరూపారాణి గారికి అభినందనలు.

          ఈ పుస్తకాన్ని నా దాకా చేర్చిన మిత్రులకి కృతజ్ఞతలు.

పుస్తకం పేరు “మిణుగురులు”

రచయిత- చల్లపల్లి స్వరూపారాణి

పర్ స్పెక్టివ్స్ పబ్లికేషన్స్.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.