హిమజ్వాల – వడ్డెర చండీదాస్ నవలా సమీక్ష

-పద్మావతి నీలంరాజు

          చెరుకూరి సుబ్రమణ్యేశ్వర రావు గారి కలం పేరు “వడ్డెర చండీదాస్”. బడుగు
జనుల మీదున్న సోదరభావనే ఆయన తన పేరు మార్చుకునేందుకు ప్రేరణ అని చెప్పారు. ఆయన ప్రధమ నవల ‘హిమజ్వాల’, రెండవ నవల ‘అనుక్షణికం’, అత్యంత ఆదరణను పొందాయి. ఆయన అంటారు,” సాహిత్యము, జీవితము – ఈ రెండు హారతి కర్పూరం లాంటివి. అయితే అవి ఎప్పటికీ అరిపోని గుభాళించే భావజ్వాలల,” అని.

          “అలాగే ప్రేమ ఒక అగ్నిశిఖలాగ ఎగసినప్పుడు జీవితాన్నే ఒక సుడిగుండంలాగా
మార్చేస్తుందని,” అనే ఆయన చింతన హిమజ్వాల నవలలో స్పష్టంగా పాఠకులకు కనిపిస్తుంది.

          మానవ మస్తిష్కంలో అనేక అగ్ని శిఖరాలు, అనంతమైన అంతుబట్టని లోయలు దాగి ఉన్నాయనడానికి మన సాహిత్యమే గొప్ప నిదర్శనం. అలాంటి కుదురు లేని మనసు దాని ఆలోచనలను ముళ్ళపూడి వెంకటరమణ గారు “శాఖా చక్రమణం” అని అంటారు . అంటే కొమ్మల మీద గెంతే కోతి లాగా అలుపు లేకుండా, విరామం లేకుండా, మనస్సు నిద్రిస్తున్న కూడా గతి-గమ్యం లేని ఆలోచనల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితిని మన లాంటి పాత్రల రూపంలో మన ముందే నిలబెట్టగల దిట్ట వడ్డెర చండీదాస్. బుచ్చిబాబు గారి పంధాలో చండీ దాస్ గారు కూడా చైతన్య స్రవంతి అంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ నెస్ (Stream of Consciousness)శైలిలో రెండు అత్యుత్తమమైన నవలలను మన తెలుగు వారికి అందించారు.

          హిమజ్వాల ఆయన తొలి నవల. హిమంలో జ్వాలను రగిలించి తెలుగు పాఠకుల మస్తిష్కాలలో చల్లగా వేడిని రగిలించిన కథాస్రవంతి హిమజ్వాల. ఈ నవల ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురించబడింది. సమాజానికి విరుద్ధమైన స్వభావాలు చిత్రీకరణతో సమాజం వేసిన కంచెను తొక్కుకుంటూ, దాటుకుంటూ వెళ్లిన ఘనత, విమర్శ మన వడ్డెర చండీదాసు గారికే దక్కుతాయి. ఈ నవలా రచన 1960లో మొదలు పెట్టిన, ఏడు సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత తిరిగి రాయబడింది. “చైతన్య స్రవంతి” శైలిలో (genre) 

          లబ్ద ప్రతిష్టులైన జేమ్స్ జాయిస్, వైట్ హెడ్, సాత్రే, జంగ్ ల ఫిలాసఫీ ని అనుసంధిస్తూ జీవన గమనాన్ని అందులో దాగివున్న అంతర్మధనాలను, భవిష్యత్తు వర్తమానాలలో జరిగే వ్యక్తిత్వ పరిణామాలు, జీవన విధానాలను చాకచక్యంగా వెలువ రించాలన్న ప్రయత్నమే ఈ అస్తిత్వవాద మనో వైజ్ఞానిక నవల హిమజ్వాల.

          ఈ నవలలో రెండు విరుద్ధ స్వభావాలను ప్రతిబింబించే విధంగా ప్రధాన పాత్రలు, స్వేచ్ఛ వాద జ్వాలల్లో జలించే గీతాదేవి, తాత్వికత భావనల్లో హిమంలా ఉండే కృష్ణ చైతన్యలు సృష్టించబడ్డారు. ఆయన మలిచిన పాలరాతి బొమ్మ (పాత్ర) గీతాదేవి. సృష్టి మూలమైన సహజ ప్రేమని గీత వ్యక్తీకరించిన, సమాజం కట్టుబాట్లకులోనై ఉన్న కృష్ణ చైతన్య ఆమె ప్రేమను అంగీకరించడానికి సంకోచిస్తాడు. అలా ఎందుకు జరిగిందో
తెలుసుకోవాలంటే కథా ఇతివృత్తం కొంత తెలుసుకోక తప్పదు.

          కృష్ణ చైతన్య గీతాదేవిల పరిచయంతో కథ ప్రారంభమవుతుంది. గీతాదేవి విధ్యాధికురాలు, సౌందర్యవతి. ఆదర్శ భావాలు, సంగీతం పట్ల ఆసక్తి ఉన్న ఆమెలో భావుకత కూడా ఎక్కువే. గీతాదేవికి తన చనిపొయిన తండ్రి ఆదర్శం. ఆయన గొప్ప భావుకుడు. ఆయన భావుకతను పునికిపుచ్చుకుంది గీత. ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న గీత సామాజిక కట్టుబాట్లు అంత ప్రాముఖ్యత ఇవ్వవలసినవి కావని, వ్యక్తి వికాసం, స్వేచ్చ (లిబర్టీ) ముఖ్యమని బలంగా నమ్ముతుంది. అందుకే ఆమె జీవితంలో చాలా విచిత్రమైన
సంఘటనలను, పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో కూడా చెక్కుచెదరని వ్యక్తిత్వం,ఆత్మస్థైర్యంతో నిలిచే గీతాదేవి ముందు కృష్ణ చైతన్య కొంచెం బలహీన పడతాడని చెప్పకనే చెప్తాడు రచయిత. అంత ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆధునిక స్వేచ్చా భావాలు ఉన్న గీతాదేవికి ఆశ్రయం ఇస్తాడు. వారి ఆలోచనలు,అభిప్రాయాలు కలవడంతో వారి మధ్య స్నేహబంధం బలంగా ముడిపడుతుంది. ఫిలాసఫీ ప్రొఫెసర్
కృష్ణచైతన్య, గీతాదేవికి ఒకరిపై ఒకరికి సహజ మోహం. సహజమయిన భావుకతతో గీత అతనికి తన ప్రేమతో పాటు ఆమెకు అతని పట్ల కలిగిన వాంఛను తెలియజేస్తుంది. అప్పటి నుండే కథ మొదలవుతుంది.

          కృష్ణ చైతన్య కున్న సహజ స్వభావం సంకోచం, భయం. పైపెచ్చు సామాజిక నైతికత. కానీ ఆమెలో తన చనిపోయిన తల్లిని చూసుకునే కృష్ణ చైతన్య, ఆమె బహిర్గతంగా వెలిబుచ్చిన కోర్కెను తప్పుగా అర్ధంచేసుకున్నాడేమో, ఆమెని తిరస్క రిస్తాడు. స్త్రీగా తాను ముందుకు వచ్చి మనసు విప్పి అతనికి చెప్పిన కోర్కెని అతని నిరాకరించాడు అన్న ఆవేదనతో, అది తన ప్రేమకే తిరస్కారంగా, అగౌరవంగా భావించి కృష్ణ చైతన్యకు తెలియకుండా అతని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది గీతాదేవి. అతను గీతాదేవికి అన్యాయం చేశానేమోనన్న ఆందోళనతో దేశదిమ్మరవుతాడు అక్కడి నుండి ఈ సమాజంలో ఒంటరి ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొంటూ తానేమీ ప్రత్యేకం గా కాదు, కానీ అలాంటి స్థితిలో మనస్తైర్యం కోల్పోకుండా ముందుకు నడుస్తుంది గీతా దేవి. అందుకు ఉదాహరణే ఆమె స్నేహితురాలి సహచర్యం. ఆ స్నేహితురాలి దగ్గర ఉంటూ M.A చదివి, ఉద్యోగ అన్వేషణలో పడుతుంది. 

          అలాటి సమయంలో స్నేహితురాలి భర్త శారీరకంగా తనని వాంచించడం, ఆమె స్నేహితురాలు దానికి అభ్యంతరం చెప్పకపోవడం గీతాదేవికి నచ్చలేదు. ఆధునిక ఉదార భావాలు ఉన్నంత మాత్రాన, ఎవరితో ఒకరితో తన అవసరాన్ని తీర్చుకోవాలి అనుకునే ఆలోచనే ఆమెకి జుగుప్చ కలిగిస్తుంది. అందుకే స్నేహితురాలిని కూడా వదిలి ఒక పత్రికలో సహాయక సంపాదకురాలుగా చేరుతుంది. అక్కడి పరిస్థితులు కూడా ఆమెను బాధ పెట్టడంతో కొంత కాలానికి దాన్ని కూడా వదిలేసి లెక్చరర్ గా వాల్తేరులో చేరుతుంది. అక్కడే ఆమె జీవితం అనుకొని మలుపు తిరుగుతుంది.

          అక్కడే ఆమెకు శివరాం పరిచయమవుతాడు. అతను చెప్పే ప్రేమ పూరితమైన మాటలు గీతా దేవి మనసు మీద కొంచెం కొంచెం ప్రభావం చూపెడతాయి. దాని ఫలితమే శివరాం పట్ల ఆమెలో కలిగిన నమ్మకం. ఆ నమ్మకంతోనే శివరాం ఒత్తిడికి లొంగి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి జరిగిన తర్వాత శివరాం అందరి లాంటి వాడేనని తనలో కలిగే రసస్పందనలు అర్థం చేసుకోగలిగే భావుకత అతనిలో లేదని అర్ధం చేసుకుం టుంది. ఆమె వివాహం ఒక భావుకతతో నిండిన వ్యక్తికి , ఏ మాత్రం రస స్పందన లేని పశువుకి మధ్యన ఏర్పడిన బంధం లాంటిది. అతని దృష్టిలో భార్య అయిన, మరే స్త్రీ అయినా తన వాంఛను తెలియజేస్తే ఆమె తిరుగుబోతు, చెడిపోయిన సరుకు అన్న బలమైన అభిప్రాయాల్లో ఉంటాడు. పైగా తల్లి ప్రభావంలో పూర్తిగా సాంప్రదాయ బద్ధంగా ఉండే జీవితాన్ని, భార్యతో సహజీవనం కోరుకుంటాడు. భర్త శివరాంతో ఉన్నప్పుడు అందమైన అరకు లోయలో మనసు మయూరమే అవుతుంది గీతకు. కానీ ఏ రకమైన రస
స్పందన లేని పురుషుడుగా శివరాం, భార్యలోని ప్రేమని భావుకతని అర్ధం చేసుకోకుండా ఆమెని మాటలతో బాధపెడతాడు. అతని ప్రవర్తనతో సహనం చచ్చిపోయి గీతలోని వ్యక్తిత్వం తిరగబడుతుంది. దానికి ఆమె పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. శివరాం లోని మగాడు పాశవికంగా ఆమెను శారీరకంగా హింసించయినా తనతో తీసుకు పోవాలనుకుంటాడు. అలా చెల్లకపోవడంతో తాళి తెంపి ఇచ్చేయమంటాడు. అలాగే ఆమెను ఆ అడవిలోనే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు.

          మరోసారి స్త్రీ స్వేచ్ఛను లైంగిక పరంగా కూడా కోరుకున్న గీత ఒంటరిదైపోయింది. అలా అరకు అడవిలో చిక్కుబడిన ఆమెని రక్షించి, పార్థసారథి (కృష్ణ చైతన్య తండ్రి) చేరి దిస్తాడు. అతనొక ఆదర్శవాదిగా అనిపిస్తాడు. పార్థసారధికి తన చనిపోయిన భార్య పట్ల ఉన్న ప్రేమ గౌరవాలు గీత నెంతో ఆకర్షిస్తాయి. అతని పట్ల ఆకర్షితురాలయిన గీత అతనికి చేరువకావాలనుకుంటుంది. వయసు వ్యత్యాసం ఉన్న అతనితో కలిసి
జీవించడానికి మనస్ఫూర్తిగా పార్ధసారధి తోటి కలిసి అతని ఇంటికి వెళుతుంది. గీతలోని కొన్ని చీకటి కోణాలు తెలిసినప్పటికి, పార్థసారథి ఆమె పట్ల జాలితో ఆమెకు భార్య స్థానం కల్పిస్తాడు. దురదృష్టవశాత్తు పార్థసారథి చనిపోతాడు కానీ ఆయన భార్య స్థానంలో ఆయన ఇంట్లోనే ఉంటుంది గీత. 

          కృష్ణ చైతన్య గీతను పోగొట్టుకున్నాడన్న భావనతో పిచ్చివాడై తన తండ్రిని, ఆస్తి సర్వస్వాన్ని వదిలేసి ఊర్లు పట్టుకు తిరుగుతూ, ఒక పెళ్లి అయిన స్త్రీ వలలో చిక్కుకు పోతాడు. ఆమె పేరు మాధురి, చిదంబరం భార్య.

          చిదంబరం ఒక రోగి. మాధురి కృష్ణ చైతన్యకు ఆకర్షితురాలయి, అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంటుంది. ఒకానొక బలహీనమయిన క్షణంలో ఆమెది నిజమయిన ప్రేమనుకొని ఆమెకి లొంగి పోతాడు కృష్ణ చైతన్య. 

          కానీ చిదంబరం కోల్లుకోవడంతో కృష్ణ చేతన్యతో తనకేమి సంబంధం లేనట్టు ప్రవర్తిస్తుంది. ఆమె ప్రవర్తనకు హతాశుడై, తానెంతో పెద్ద తప్పు చేశాడన్న భావనతో కృష్ణ చైతన్య జీవితం పైనే విరక్తి చెంది కొంతకాలం అందరికి దూరంగా ఆశ్రమ జీవితం గడుపుతాడు. అలా ఒంటరయిన కృష్ణ చైతన్య తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడ గీతా దేవిని చూసి హతాసుడై , జరిగింది తెలుసుకొని, అక్కడే ఉండిపొమ్మని అభ్యర్ధిస్తాడు. ఆమెతో సహజీవనం చేయడానికి సిద్ధపడతాడు.

          కానీ రచయిత సామాజిక కట్టుబాట్లు ఎంత తీవ్ర తరంగా ఉంటాయో కోసమేరుపుగా కథ అంతంలో శివరాం ద్వారా తెలియజేస్తాడు. గీత జాడ తెలుసుకున్న శివరాం గీతను వెతుక్కుంటూ కృష్ణ చైతన్య ఇంటికి వస్తాడు.

          కానీ ఆమె తిరస్కారం అతని అహంని రెచ్చగొడుతుంది. ఆ కసిలో ఆమె గొంతు నులిమి చంపేసి, అదే ఆవేశంలో తాను కూడా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాడు.
ఇలా సంబంధం లేని పోకడలను వివిధ విభిన్న మానవ నైజాలను ముత్యాలుగా ఏరి కూర్చి ఒక అద్భుతమైన చైతన్య స్రవంతి ప్రక్రియతో “హిమజ్వాల” అనే ఒక నవల ముత్యాల హారాన్ని పాఠకులకు అందించాడు వడ్డెర చండీదాస్. ప్రతి సంఘటన ప్రతి అధ్యాయం ఈ నవలలో ఆయా సంఘటనల పేర్లతో, ఒక్క మాటలో చెప్పాలంటే, పాఠకులకు జరగబోయే కథ ఇతివృత్తాంతాన్ని సింబాలిక్ గా అందించిన దిట్ట.

          ఉదాహరణకు అధ్యాయాల పేర్లు; వెలుగు మరక, మూగబోయిన వీణ, ఉప్పొంగి పోనాది గోదారి, అనుభూతి సిగ్గేరుగదట, ప్రేమ వెర్రి బాగులదట, మరీచిక అన్వేషణ, సశేష జీవితం.

          ఆయనలో చలం వాదం కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుందని పరిశీలకుల అభిప్రాయం. కొన్ని కథా ఇతివృత్తాలు తీసుకోవడానికి కూడా భయపడే కాలంలో నిర్భయంగా పాఠకులలో స్త్రీ స్వేచ్ఛ గురించి తలెత్తే అనేక ప్రశ్నలకు సమాధానం ఈ నవల. ఇప్పటికీ అన్యాయానికి, అవమానికి , అత్యాచారానికి గురైన స్త్రీల పట్ల సామాజిక
దృష్టి ఇంకా మారలేదు. ఉన్మాద స్థితిలో స్త్రీ ఇంకా వెంటాడబడుతూనే ఉన్నది. అందుకే వడ్డెర చండీదాస్ నవల “హిమజ్వాల” సమకాలీన రచయితల, విమర్శకుల విమర్శలు ఎదుర్కొన్న, అన్ని కాలాలకు సరిపడేంత ప్రశ్నలు వాటికి దొరకని సమాధానాలను ఒక సవాలుగా పాఠకులకు విసురుతూనే ఉంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.