‘అంతరంగం’ భారతి శ్రీవారి పుస్తక సమీక్ష

-డా.మారంరాజు వేంకట మానస

          మహిళా సాధికారతకు అక్షరాలా నిర్వచనం భారతి శ్రీవారి గారి ” అంతరంగం “. ఒక స్త్రీ సహజంగానే తన ఇల్లు బాగుండాలని కోరుకుంటుంది. ఇక చిన్నతనం నుండి తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, వివాహానంతరం భర్త ప్రోత్సాహం తోడైతే ఇల్లు మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న సమాజమంతా బాగుండాలని కోరుకుంటుంది. తాను ఏం చేస్తే సమాజమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆలోచించి తన వంతుగా ఇబ్బందు లలో ఉన్నవారికి తోడ్పడుటకు ఒక అడుగు ముందుకు వేస్తుంది. సరిగ్గా ఇటువంటి ఆశావాహ దృక్పథంతో ఒక అడుగు కాదు కదా వెయ్యడుగులు ముందుకు వేస్తూ లెక్క లేనంత మందికి వర్ణ వర్గ వ్యత్యాసాలు లేకుండా తన చేయూతను అందిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతున్న వీరవనిత భారతి శ్రీవారి గారు. మేటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కాసింత కట్టుబాట్ల మధ్య పెరిగినా, సంప్రదాయాలకు ఆధునిక శోభలనద్దిన నేర్పరి భారతి గారు. భక్తి అనేది మనసులో ఉండాలి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే అసలైన భక్తికి నిర్వచనం అని భారతి గారి ప్రగాఢ విశ్వాసం. తాను నమ్ముకున్న శ్రీరాముని పైన భారం వేసి ధైర్యే సాహసే లక్ష్మిగా శతదాసహస్రదా మానవాళి శ్రేయస్సే ధ్యేయంగా , సంఘహితమే ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవిస్తున్న రచయిత భారతి శ్రీవారి గారు సర్వదా అభినందనీయురాలు. ఎవరైనా ఏ కొంచం ఆపదలో ఉన్నా తక్షణమే నిస్సంకోచంగా తన చేయుతనందించే సేవాతత్పరురాలు. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అనే స్వార్ధపు బుద్ధి వున్న ఈ రోజుల్లో తోటి మనిషి ఎటువంటి ఆపదలో వున్నా లోలోన కుమిలిపోయి వారి కష్టాన్ని తీర్చేదాకా ప్రశాంతంగా ఉండలేని స్వభావం గల భారతి గారి లాంటి మహిళా మణులు ఈ కాలంలో చాలా అరుదు. ఈ పుస్తకంలో రచయిత భారతి శ్రీవారిగారి స్వగతం, కొన్ని ముఖ్యమైన సంఘటనలు, క్లిష్ట పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని జయించటం పాఠకులకు స్పూర్తిదాయకం. ఇక భారతి గారి దైవభక్తి అసామాన్యమైనది. కేవలం రాతి విగ్రహాలలోనే దైవాన్ని చూడటం గాక ప్రతీ మనిషిలో దైవాన్ని చూడగలుగుతున్నారు కాబట్టే రచయిత అందరూ బాగుండాలని తపనపడుతున్నారు. ఇటువంటి సుగుణం విశాల దృక్కోణం (broadthinking) ఉన్నవారికే ఉంటుందనటానికి రచయిత భారతి శ్రీవారి గారు నిలువెత్తు నిదర్శనం.

          ఇప్పుడు భారతి శ్రీవారి గారి ” అంతరంగం ” లోకి తొంగి చూద్దాం! భారతి గారి తల్లిదండ్రులకు నాల్గవ సంతానం, పైగా చిన్న కూతురు. అక్క అన్నదమ్ముల మధ్య గారాబంగా పెరిగిన సంస్కృతాంధ్ర భాషల ఉద్దండ పండితులు శ్రీ డా. అమరేశం రాజేశ్వర శర్మ గారి గారాలపట్టి. సాధారణంగా పిల్లలను గారాబం చేస్తే మొండిగా తయారవుతారు. కానీ రచయిత విషయంలో అల్లారుముద్దుగా పెరిగినా ఆశయాలను అందుకోవాలనే పట్టుదలతో పెరిగినారు. బహుశా ఈ పట్టుదల వారి నాన్నగారి నుండి అబ్బిందేమో! అయితే చిన్నతనం నుండే తెలిసో తెలియకో శ్రీరాముణ్ణి దగ్గర చేసు కున్నది. రాముడు తన తోడుగా వుంటే దేనికీ భయపడవలసిన అవసరం లేదంటారు రచయిత. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ” శరణాగతి ” అనే మార్గాన్ని చిన్నవయసు లోనే అవలంబించుకోవడం పాఠకులను ఆశ్చర్యపరుస్తున్నది. ” నీవు చేయగలిగినది చేయి, ధర్మ రక్షణ కోసం పాటుపడు, ఫలితం నాకు వదిలేయ్” అని గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట. సరిగ్గా ఇదే పాటిస్తూ ఈనాడూ వారు చేసే ఏ పనైనా ధర్మంగా బాధ్యతగా చేస్తూ, పర్యవసానాలు శ్రీరామునికి అప్పగించేస్తారు భారతి గారు. ఇది వారికే తెలియని వారిపై వున్న శ్రీరాముని కృపయే.

అద్వైతం అబ్బిన భారతి!!

తిరిగి ఇచ్చుటలోనూ సంతోషమే:

          ఆ రోజుల్లోనే కారు, బైకులు నడిపించిన భారతి గారికి ఎవరైనా ఏదైనా ఇస్తే అది తిరిగి వారికి ఇచ్చుటతో సంతృప్తిని చెందుతారు. వారి నాన్నగారు ఆంధ్ర, నాగార్జునా, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు వారి చిన్నతనంలో చూపించటం, తరువాత IISER, NIPER, IIT లను నాన్నగారికి చూపించటం; రచయిత చిన్నతనంలో గవర్నర్ శారదా ముఖర్జీ గారిని వారి నాన్నగారి ద్వారా కలవటం, తరువాత గవర్నర్ నరసింహన్ గారిని కలవటానికి వారి నాన్నగారిని తీసుకెళ్లడం – ఈ రెండు సంఘటనలతో ” Life has come a full circle” అంటూ సంతృప్తి వ్యక్తం చేసినారు రచయిత. ఊరందరికీ ఉపకారం చేయుటయే కాదు వారి దానధర్మాలతో సమీనా వంటి ఇతరులను సైతం ప్రభావిత పరిచినారు.

ఆదర్శ దంపతులు శ్రీమతి భారతి  – శ్రీ చంద్రశేఖర్ గార్లు:

పుణ్యం కొద్దీ పురుషుడు అన్నట్లు రచయిత తాను నమ్మిన శ్రీరాముని వంటి భర్త డా. శ్రీవారి చంద్రశేఖర్ గారితో జీవితాన్ని పంచుకోవడం; దానం కొద్దీ పిల్లలు అన్నట్లు భార్గవ లాంటి సత్సంతానం కలగడం భారతి గారి జన్మజన్మల పుణ్యఫలం. ఇది అతిశయోక్తి కాదు. స్వతహాగా మహిళలు ఏవైనా లక్ష్యాలు సాధించాలని సంకల్పిస్తే అవి నెరవేరడానికి భర్త, పిల్లల పరిపూర్ణ సహకారాలు ఉండాలి. ఈ విషయంలో భారతి గారికి తన భర్త , అబ్బాయి యొక్క ఉపబలం మెండైనది. ” శేఖర్ ప్రోత్సాహం వల్లే ఈ రోజు నేను wildlife sanctuary లో రిసార్ట్స్ నడిపే స్థాయికి ఎదిగాను. నేను ఏదైనా చేస్తాను అంటే నిన్నసలు ఆపేది ఎవరు, నిన్ను కాదనేవారు ఎవరు అంటాడు” అని సగర్వంగా చెప్పుకొచ్చినారు రచయిత. ఒక పర్యాయం ఒక వ్యక్తిని నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకున్న బాధలో డా. చంద్రశేఖర్ గారి ఓదార్పు భారతి గారికి కొండంత నిట్టూర్పునిచ్చింది. నిజంగానే ఇదే మరో ఇంట్లో అయితే నానా గొడవలు జరిగేవి. చంద్రశేఖర్ గారి Ph.D. పూర్తైన తరువాత నెల రోజుల చంటి బిడ్డతో అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది భారతి గారికి. అక్కడున్న మూడున్నర ఏళ్లలో ఐదు సార్లు ఇండియాకు వచ్చి వెళ్ళడం జరిగింది. పసికందుతో ప్రయాణమంటే అంత సులభం కాదు. ఖర్చు విషయం పక్కకు పెట్టినా , చాలా శారీరక మానసిక శ్రమతో కూడుకున్న విషయం. ఇవన్నీ తట్టుకుంటూ పరదేశంలో జీవితాన్ని నెట్టుకొచ్చిన భారతి గారు ఇక ఇండియా వెళ్ళిపోదామని అభిప్రాయపడ్డ తరుణంలో, తన మాటను గౌరవించి, ఏ.వి. రామారావు గారి సూచన మేరకు మళ్ళీ ఐ ఐ సి టి కి డా. చంద్రశేఖర్ గారు తిరిగిరావడం గమనార్హం. డబ్బు కన్నా భార్య మాటకు విలువ నిచ్చే స్వభావం డా. చంద్రశేఖర్ గారిదని తెలుస్తుంది. ఇది భారతి చంద్రశేఖర్ గార్ల అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. భారతరత్న సి. ఎన్. ఆర్. రావు గారు చంద్రశేఖర్ గారిని కెమిస్ట్రీ సచిన్ టెండూల్కర్ అని పొగిడినప్పుడు, చంద్రశేఖర్ గారు ఐ ఐ సి టి డైరెక్టర్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీగా నియమితులైనప్పుడు , అనేక సందర్భాలలో అవార్డులు రివార్డులు అందుకుంటున్నప్పుడు భారతి గారి ఆనందోత్సాహాలు అంతాఇంతా కావు. వీరికి ఆడపిల్లలు లేకపోయినా అప్పట్లో సుజాతను పీ జీ చదివించి, ఇప్పుడు భాగ్యలక్ష్మిని మెడిసిన్ చదివిస్తూ వారి ఎదుగుదలను చూసి మురిసిపోతున్నారు. రచయిత భారతి గారిది bring it on అనే స్వభావం అని చెప్పవచ్చు. ఒకప్పుడు తాను విపరీతమైన దగ్గు అనారోగ్యంతో బాధపడుతుండగా వారి మామగారు చూడలేక ” నీ బదులు నన్ను తీసుకెళ్ళమని రాముడికి చెప్పమ్మా” అని ఏడ్చేసిన సందర్భంలోనూ చమత్కారంగా ” ఇందులో ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్ ఉండవు ” అని తేలికగా నవ్వేసినారు. ఇట్లా ఒకానొక సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన భారతి గారు ఇప్పుడు wildlife జర్నీలు చేస్తున్నారంటే ఆశ్చర్యమే!

          భారతి గారి wildlife జర్నీలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చిన్నప్పుడు ఇంటి దగ్గర పిల్లలతో సరదాగా గడిపిన భారతి గారు ఇప్పుడు పులులతో గడుపుతున్నారు. వీరి అబ్బాయి భార్గవ అభిరుచిని తన అభిరుచిగా మార్చుకుని అడవుల్లో సంచరించడం నేర్చుకున్న dynamic mother భారతి గారు. 1995లో బండిపూర్ అడవుల్లో ఏనుగులను చూసింది మొదలుకుని కబిని, ర్యాంతంబోర్, తడోబా, జిమ్ కార్బెట్, పెంచ్ లలో సంచరించి , అక్కడ తారసపడిన పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు, గౌర్ లతో ఎన్నెన్నో అబ్బురపరిచే అనుభవాలను మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో భార్గవ wildlife photographer gaa మంచి గుర్తింపు పొంది, అవార్డులు కూడా తెచ్చుకునే ఎత్తుకు ఎదిగినాడు. భార్గవ యొక్క ఈ విజయానికి కారణం అతనికున్న ఆసక్తిని భారతి గారు గమనించి చిన్నప్పటి నుండి వెన్నంటి వుండి సరియైన దిశానిర్దేశం చేయడమే.

          పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీర్వాదం, దత్తపీఠం విద్యాధికారి శ్రీ కుప్పా కృష్ణమూర్తి గారి ఆదరాభిమానాలు భారతి గారి కుటుంబానికి మెండుగా ఉన్నాయి. కామారెడ్డి ఆశ్రమంలో రామ మందిర నిర్మాణం చేపట్టి రాముని పేరుమీద మరికొంత మందికి జీవనోపాధిని కల్పించినారు. భారతి గారు వారి నాన్నగారి సూచన మేరకు ఇటీవల ” శ్రీవారి చంద్రశేఖర్ ట్రస్ట్” ను స్థాపించి తద్వారా సమాజసేవ చేస్తున్నారు. ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు పరిచయమైన ఆటో డ్రైవర్ సన్నీ యాదవ్ కు తన కష్టం చెప్పుకోగానే ఒక కొత్త ఆటోను కొనిచ్చి అతని జీవితంలో దేవతలాగా వెలుగులు నింపి నారు. ఇంకా మరెన్నో సామాజిక సేవ కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చేస్తూనేవున్నారు.

          ” అంతరంగం ” లో Part B భారతి శ్రీవారి గారి కవితా సంపుటి. వ్యక్తిగతంగా నాకు ఐ ఐ సి టి డైరెక్టర్ భార్య సుపరిచితురాలైన భారతి గారు, ఐ ఐ సి టి లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో మాతోపాటు ఉత్సాహంగా పాల్గొనేవారు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ, చిన్నపిల్లలతో హుషారుగా ఆడుకుంటూ కనిపించే మా భారతి మేడం అంతర్గత మానసం లో ఇంత లోతైన భావజాలం దాగివున్నదా అనిపించింది. మన సమాజంలో జరిగే ప్రతీ బాధాకరమైన ఘటనకు స్పందిస్తూ వ్రాసిన కవితలు రచయితకున్న సామాజిక స్పృహ తెలియజేయడమే గాక పాఠకులను ఆలోచింపజేస్తాయి. మానవులు యాంత్రిక జీవితాలకు అలవడి మానవతా విలువలను కోల్పోయి సహజంగా జీవించడమే మరిచిపోతున్నారన్న ఆవేదన ” చిరునామా” , ” ఆరాటం”, ” జీవన పయనం ” కవితలలో వ్యక్తపరిచినారు. ” నే కోరుతున్నా “, ” బ్రతుకంటే”, ” అంతా నావాళ్లే”, ” మరువకు నేస్తం “, ” ఎందాకా నీ పయనం”, ” ఆగం చేసి పోకుర బిడ్డా!” కవితలలో మానవతా విలువలు ప్రస్ఫుటంగా తెలియజేసినారు. ” జయ హో భారత్”, ” భారతమాత బిడ్డలం”, ” బాపూ!”, ” పోయేదే మున్నది ” , ” వద్దు”, ” ఒకటే”, ” ఒకటిగా”, “హత్రాస్ సంఘటన”, “సంకల్పం మంచిదైతే” కవితలలో మాతృభూమి పట్ల బాధ్యత, దేశం సుభిక్షంగా ఉండాలంటే మనందరం కలిసి ముందుకు సాగాలన్న రచయిత తీవ్రమైన ఆకాంక్షలు తెలుపుతున్నాయి. ” భరోసా కరువై”, “ఆడపిల్లవే”, ” బాధ్యత అందరిది”, “కదలిరా! కదలిరా!”, ” కూడగట్టుకో నీ శక్తి”, ” పోరాటం”, “ఆడపిల్లలంటే”, “చివరకు” కవితలలో స్త్రీవాద కోణం కనిపిస్తుంది. రచయిత కవితలలో నాకు నచ్చినది “పెట్టుకుని చూడు” – ఇందులో భారతి గారి నిరాడంబర శైలిని తెలుపుతుంది, పైగా పాఠకులకు ప్రేరణార్థకంగా ఉంది. సంగీత త్రిమూర్తులలో ప్రథము డైన త్యాగరాజస్వామి రామునిపై అపారమైన భక్తితో ” అన్ని నీవనుచు అంతరంగమున, తిన్నగా వెదకి తెలుసుకొంటినయ్యా| నిన్నే గాని మది వేరెన్నజాల నొరులా, నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుతా|| మరుగేలరా? ఓ రాఘవా….!” అని అన్నట్టు భారతి గారు కూడా ” ఓ రామా! అంతరంగమున నిన్నే నమ్మితి, నా జీవము నీదేనంటిని, ఓ రామా! కారణము మాపై వీడకు శ్రీరఘురామా..” అంటూ భక్తిశ్రద్ధలతో కవితనల్లినారు.

          ఒక పక్క గృహిణిగా కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకుంటూ, మరోపక్క సమాజ సేవాదీక్షలో నిమగ్నమైవున్న భారతి శ్రీవారి గారు ఈ ” అంతరంగం” పుస్తకం ద్వారా సాహిత్యసేవకు కూడా నాంది పలికినారు, ఇది బహుదా ప్రశంసనీయం. ” అంతరంగం” is an inspirational and feel good book. రచయిత లాగా మనందరం సమాజం పట్ల బాధ్యత వహిస్తే తప్పకుండా మంచి మార్పును తీసుకురాగలం. భారతి గారి ” అంతరం గానికి” అంకురార్పణ చేసిన సరోజా దిగుమర్తి గారికి, పుస్తక రూపకల్పనలో అన్నీ తానైయున్న కవిత బేతి గారికి, నిర్మొహమాటంగా నిక్కచ్చిగా తన జీవిత విశేషాలను తెలిపి కవయిత్రిగానూ తన ప్రతిభాపాటవాలను చాటుకున్న భారతి శ్రీవారి గారికి మనః ప్రీతి పూర్వక అభినందనచందనములు. భారతి గారు శ్రీరాముని దీవెనలతో మరెన్నో సంఘ సంస్కరణ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని, వారి కుటుంబమంతా ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆశిస్తూ…

సర్వేజనాసుఖినోభవంతు | సమస్త సన్మంగళాని భవంతు ||

శ్రీరామ కృపాకటాక్ష సిద్ధిరస్తు||

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.