గజల్ సౌందర్యం- 6

-డా||పి.విజయలక్ష్మిపండిట్

          తెలుగు గజల్ రచనలో భావాలు, భాష, చమత్కారం వంటి అంశాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇది తెలుగు గజల్‌కు ఒక ఆధునిక రూపాన్ని ఇస్తోంది.
 
          ప్రస్తుతం చాలామంది కవులు తమ గజళ్లను వారు స్వయంగా లేదా గాయకులతో పాడించి, వాటిని YouTube , ఇతర సామాజిక మాధ్యమాల్లో వీడియోలుగా పెడుతున్నారు. ఇది విస్తృతంగా తెలుగు గజళ్లను దృశ్య, శ్రవణ రూపంలో అందించే ఒక కొత్త మార్పు.
తెలుగు గజళ్లను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తుంది.
మేము స్థాపించిన “ విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్ “సంస్థ ఆశయం ; తెలుగు గజళ్ళను ఎక్కువ కవులు నేర్చుకుని రాసి వారి గజల్ గానం వీడియోల ద్వారా you tube మరి ఇతర సామాజిక మాధ్యమాలలో Face book , WhatsApp ద్వారా గజల్ ప్రేమికులకు చేరువ చేసి తెలుగు గజళ్ళను విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది.
 
ఈ వ్యాసం లో ఈ క్రింది ఏడు మంది గజల్ కవులను పరిచయం చేస్తున్నాను. వీరి గజళ్ళ ను చదివి , గానం విని వీరి గజళ్ళ సౌందర్యాన్ని ఆస్వాదించండి.
 
శ్రీ బూర దేవానందం, శ్రీ నోరి రఘరామమూర్తి, శ్రీమతి సుమన ప్రణవ్ , శ్రీమతి బోర భారతి , డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీమతి లక్ష్మీరాజశేఖరుని,మణికర్ణిక ( వడ్ల నరసింహ చారి)
 
బూర దేవానందం గారు , హైదరాబాద్. వీరు గజల్ కవి. వీరు చాల గజళ్లు రాసి
పత్రికలలో , WhatsApp groups లో పోస్ట్ చేశారు. వారి గజల్ ను ఆస్వాదించండి..,
 
మాటలనే ముత్యాలుగా రాల్చేవారు కొందరు
మాటలనే తూటాలుగా పేల్చేవారు కొందరు
 
మాటలతో ముగ్ధులను చేసేవారు ఉన్నారు
మాటలతో మనసులను విర్చేవారు కొందరు
 
మాటలతో గాయాలను చేసేవారు ఉన్నారు
మాటలతో గేయాలను కూర్చేవారు కొందరు
 
మాటలతో బ్రతుకులను దిద్దేవారు ఉన్నారు
మాటలతో జీవితాలను కూల్చేవారు కొందరు
 
మాటలతో దేవా! కోటలను కట్టేవారు ఉన్నారు
మాటలతో కోట్లజనులను కదల్చేవారు కొందరు
 
బూర దేవానందం గారి 2 వ గజల్.:
 
కన్నవారి ఉన్నతికోసం..తపించేవాడు
నాన్నంటే
కలనైనా బిడ్డలకోసం..యోచించేవాడు
నాన్నంటే
 
బడబాలనం తనలోవున్నా..చల్లనిసంద్రంలా వుంటాడు
బాధలెన్నొ తనలోవున్నా..దాచేసేవాడు
నాన్నంటే
 
తనపిల్లల సౌఖ్యం కోసం..కొండనైనా పిండిచేస్తాడు
పిల్లల సంతోషమే స్వర్గమనీ..తలచేవాడు నాన్నంటే
 
నీ భవితకై నిరంతర తపన..నిను శిఖరానికి చేర్చేనిచ్చెన
నీ కోసం తన ఆయువునైనా..ఇచ్చేవాడు
నాన్నంటే
 
ఇంటికోసం సర్వస్వము..ధారపోసే త్యాగధనుడు
కొవ్వొత్తిలా ఓ దేవా!..కరిగేవాడు నాన్నంటే
 
దేవానందం గారి గజల్ గానం వ్యాసం చివర Link లో విని ఆశ్వాదించండి
 
***
 
నోరి రఘరామ మూర్తి , హైదరాబాద్ గజల్ కవి గాయకుడు కూడా. నోరి దంపతులు మంచి గాయకులు . రఘరామ మూర్తి గారు 2024 లో “ హరివిల్లు “ అన్న గజళ్ళ సంపుటిని ప్రచురించారు. వీరి గజల్ ను ఆశ్వాదించండి.
 
అమ్మంటే (తిశ్రగతి)
 
తేనియలను ఒలికించే మాటకదా అమ్మంటే
మమతలు పండించు మధురవాడ కదా అమ్మంటే
 
అక్షరాలు దిద్దించెను నీతి కథలు బోధించెను
సంస్కారము చూపు అడుగుజాడ కదా అమ్మంటే
 
అలసిన మనసుకు తనువుకు అమ్మ ఒడే
శాంతికి గుడి
కమ్మనైన కలల జోల పాటకదా అమ్మంటే
 
ఆటంకములెదురైనా భవిత కొరకు పాటుపడును
తన పిల్లల అభివృద్ధికి బాటకదా అమ్మంటే
 
మణికన్నా విలువైనది మాతృమూర్తి హృదయసీమ
వాత్సల్యం కురియు సిరులు వాన కదా అమ్మంటే
 
అమ్మ ప్రేమ కడదాకా అందరికీ దొరకదు రఘు
మరపురాని జ్ఞాపకాల నావ కదా అమ్మంటే!
 
నోరి రఘురామమూర్తి రెండవ గజల్:
 
రావద్దని అంటున్నా ఇంటి ముందు ఉన్నానే
మూసి ఉన్న తలుపులలో నీ రూపం చూసానే
 
శూన్యంలో నీ మాటలు నను నడిపిస్తున్నాయే
కన్నులున్న అంధుడినై అడుగులు వేస్తున్నానే
 
కలుసుకునే చెట్టు కింద నిరాశతో కూర్చున్నా
నీ తలపుల తోటలోన ఊసులాడుకున్నానే
 
మరులుగొన్న పక్షిజంట యుగళ గీతి విన్నానే
బరువెక్కిన చరణాలను నేను పాడుకున్నానే
 
చిన్న చిన్న తప్పులకే పెద్ద శిక్ష వేస్తావే
నిను కలవని రోజు నాకు ఉరిశిక్ష నుకున్నానే
 
పరుచుకొన్న మౌనంలో మనసు కథను అల్లుకొంది
నీ ఛాయా చిత్రముతో మాటలాడుతున్నానే
 
నీ వలపులు విషాదమై అంతం కారాదు రఘూ
నీవు తిరిగిరావాలని పూజలు చేస్తున్నానే
 
వ్యాసం చివర నోరి రఘురామమూర్తి గజల్ గానం వీడియో link లో విని ఆస్వాదించండి.
 
***
 
శ్రీమతి సుమన ప్రణవ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో Group -1 officer గా ఉన్నారు. వీరు కవయిత్రి గజల్ రచయిత్రి , మంచి సాహితీ విశ్లేషకులు కూడా. వీరు 2023 లో “గజల్ గుల్మొహర్” అన్న శీర్షిక తో గజల్ సంపుటిని  వెలువరిం చారు. వీరి గజల్ ను ఆస్వాదించండి..,
 
ఎదకోతను తడుముతూ తలపొకటి జారినది
కన్నీటిని కసురుతూ స్వప్నమొకటి రాలినది
 
ఏ చిగురుల మధురిమలను నింపినదో ఎలకోయిల
శిశిరాలను నెట్టుతూ గీతమొకటి పాడినది
 
ఏ వానల దుఃఖములో తడిచినదో నెమలి రెక్క
గ్రీష్మాలను తరుముతూ నాట్యమొకటి ఆడినది
 
ఏ సంధ్యల తలుపులను తెరచినదో చందమామ
కలువ కనులు విచ్చుతూ వేకువొకటి వాలినది
 
ఏ తపస్సుల ఉషోదయం వెలిగినదో ఆత్మ లోన
సుమన రంగులొంపుతూ హరివిల్లుగ మారినది
 
సుమనప్రణవ్ గారి 2 వ గజల్
 
మనసు తలుపుల తెరలు తీయను తలపు ఒక్కటి చాలు నేస్తం!
కనుల దాగిన కలలు మెరవను కిరణమొక్కటి చాలు నేస్తం!
 
చెమ్మ ఆరిన చెలిమి తీరం మమత కరువై సొలి పోయెను!
అలయు గుండెను తాకి ఎగిసే మాట ఒక్కటి
చాలు నేస్తం!
 
నిన్న అడుగుల నీడ కరిగెను నేటి జాడల ఆశ మిగిలెను…
శిశిర కొమ్మలు చిగురులేయను చినుకు ఒక్కటి చాలు నేస్తం!
 
చాలు చాలును జననమొక్కటి చాలు చాలును ఉదయమొక్కటి
మరణ వేదన మరచి గెలువను బంధమొక్కటి చాలు నేస్తం!
 
రాత్రి వాకిట పూల వనమా! మది లోతున మౌన నదమా!
సుమన కనులకు…లాలి పాడే రాగమొక్కటి చాలు నేస్తం!
 
సుమన ప్రణవ్ గారి గజల్ గానాన్ని వ్యాసం చివర ఆడియో link లో వినండి.
 
***
 
బోర భారతి గారు విశాఖపట్టణం వాసులు. తెలుగు ఉపాధ్యాయురాలు . “సేవ సాహిత్య కళా సేవా సంస్థ “లో వీరిది ముఖ్య పాత్ర . వీరు 2024 లో “ భారతీదేవి గజళ్ళు – భావోద్వేగ సవళ్ళు” అన్న గజళ్ళ సంపుటిని ప్రచురించారు.
 
బోర భారతి గారి గజల్
 
ప్రేమెంతో దాగియున్న చెప్ప బుద్ధి కాదేమిటో!
ఉప్పొంగే గుండెఘోష ఆపబుద్ధి కాదేమిటో!
 
నీమాటల మంత్రాలే విందయ్యెను వీనులకే
మత్తుజల్లు మల్లియలను మెచ్చబుద్ధి కాదేమిటో
 
ఆశలతో ఈడ్చుతున్న ఆలయమే ఈదేహం
అంతరాత్మ దేవతనే చూడబుద్ధి కాదేమిటో
 
పెంచుకున్న విశ్వాసం పెనవేసిన బంధాలే
మదిన మారు మ్రోగుతీరు పలక బుద్ధి కాదేమిటో
 
అహంకారపు గోడలే చీల్చలేను ఓ భారతీ
సత్యాన్నే ప్రకటిస్తూ బ్రతకబుద్ధి కాదేమిటో
 
బోర భారతీదేవి 2 వ గజల్ః
 
బహర్ 2121 2121 2121 222
 
మాట తోట పూల కోసి మత్తు పూత పూసిందే
నిప్పురవ్వ రాజు కుంటె మంచు పూత పూసిందే
 
సప్త వర్ణ సోయగాలు స్వప్న మందు తేలియాడ
సంధ్యవేళ వేడి శ్వాస వెన్న పూత పూసిందే
 
స్వర్గలోక దారి చూపు స్నేహ గీత రాగమేదొ
పాల పొంగు సంద్ర మందు తేనె పూత పూసిందే
 
జ్ఞాపకాల ఝరిలోన ఒంటరైన నన్నుచూసి
నువ్వు పూల దీప కాంతి ప్రేమ పూత పూసిందే
 
మౌన వీణ ముద్రలోన యుద్ధ భేరి మోగుతోంది
సోకు పూలు మూట గట్టి స్వర్ణ పూత పూసిందే
 
***
 
లక్ష్మీ రాజశేఖరుని గారు ‘సత్య స్వరాళి ‘అనే కలం పేరుతో గజల్స్ రాస్తున్నారు. వీరు చాల గజళ్ళ ను “విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్ “ WhatsApp గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటారు.
 
లక్ష్మీ రాజశేఖరుని (సత్య స్వరాళి) గజల్ :
 
తనువు మనసు తమకంగా నిలిచినపుడు పిలిచిచూడు
కలల బరువు ఓపలేక అలసినపుడు
పిలిచిచూడు
 
పరవశాలు పదునెక్కిన ఒక రాతిరి నీవు లేవు
వాడి వేడి నిట్టూర్పులు విడిచినపుడు
పిలిచి చూడు
 
శ్రీ గంధం ఆర్పలేని జ్వాలలేంటి తనువెల్లా
అగరు సెగల ధుపాల్లో నలిగినపుడు
పిలిచిచూడు
 
నరనరాన రాజుకున్న ఆవేశం బరువెంతో
క్షణక్షణము దగ్ధమౌతు కరిగినపుడు
పిలిచిచూడు
 
అందరాని చంద్రునికై ఆశెందుకు ఓ సత్యా!!!
నింగి విడిచి తారలన్ని రాలినపుడు పిలిచిచూడు..
 
లక్ష్మీ రాజశేఖరుని 2 వ గజల్
 
పగిలిన గుండెకు తెలియదు కన్నీరై కరగాలని
మరిచానేమో బహుశా నాకూ ఓ మనసుందని…
 
రక్తం కనిపించని గాయపు కథ వినేదెవరు?
ఎందుకంత తపన నాకు కలల బరువు దింపాలని…
 
యెల కోయిల పాడుతోంది నిన్నటి నా జాలిపాట
శ్రుతి మించిన అనురాగపు కథ ఏదో కదపాలని…
 
వసంతాలు వెలివేసిన చైత్రంలా నేనున్నా!
ఆశెందుకు ఎడారిలో వలపు జాడ వెతకాలని…
 
నవ్వుతున్న విధి ఇప్పుడు విస్తుపోయి చూస్తున్నది
చెప్పు తనక చివరి శ్వాస విడిచీ నే గెలిచానని…
 
***
 
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి విశ్రాంత సహాయాచార్యులు,హైదరాబాద్
 
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి గజల్ :
 
ఒంటరిగా వచ్చామని తెలిసి నడుచుకో నరుడా
నీ వెంటే ఎవరు రారు నిజం తెలుసుకో నరుడా!!
 
నీ శ్రమయే నీకు రక్ష పరులనెపుడు ఆశించకు
పట్టుదలే నీకుంటే గెలుపు నిలుపుకో నరుడా!!
 
స్వార్థమేది అంటకుండ మమకారం పంచుకుంటు
ఉపకారం చేయ జనము గుర్తు పట్టునో నరుడా!!
 
అవసరమని చెంతచేరి మాట తీపి కలిపేస్తూ
అప్పునడిగి తీసుకొనుచు కొంపముంచునో నరుడా!!
 
మంచితనం తోడుగాను నమ్మినట్టి వారికెపుడు
తోడు నీడగుండి సీత ప్రేమ పంచునో నరుడా!!
 
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి 2 వ గజల్ 
 
అంతులేని నాన్న ప్రేమ తలపులోన నిలిచినదీ
నాన్న మాట ఎల్లవేళ మనసులోన నిలిచినదీ!!
 
శాంతమూర్తి సహనశీలి కన్నతల్లి జానకమ్మ
చూపినట్టి అనురాగం గుండెలోన నిలిచినదీ!!
 
పిల్లలననే ఉన్నతులుగ కష్టపడుచు పెంచినట్టి 
కన్నవారి త్యాగమేమొ పుడమిలోన నిలిచినదీ!!
 
ఏమి కోరి  కురియుచుండు జలమునంత మేఘమాల
స్వార్థమేమి లేని ప్రేమ  బ్రతుకులోన నిలిచినదీ!!
 
రెప్పవలెను ఎడబాయక  జాగ్రత్తగా కాచినట్టి 
ఓ సీతా! వారి శ్రమా కనులలోన నిలిచినదీ!!
 
వీరి గజల్ గానం వీడియోను వ్యాసం చివర link లో విని ఆస్వాదించండి.
 
***
 
మణికర్ణిక(వడ్ల నరసింహా చారి) గజల్ కవి, హైదరాబాద్ . వీరి గజల్ ను చదివి ఆస్వాదించండి.
 
ప్రేమ నన్ను ఆవహించి తేలిపోతి ఓ సఖుడా!
పంజరాన నేనున్నను నవ్విపోతి ఓ సఖుడా!!
 
అనురాగపు జలధిలోన చిక్కుకొనెను నా మనసే!
నీ తలపుల నావలోన సాగిపోతి ఓ సఖుడా!!
 
నీపేరును నెమరు వేయ తుళ్ళిపడెను నా మనసే!
మోమేమో పద్మమవ్వ విరిసి పోతి ఓ సఖుడా!!
 
హృదయానికి రెక్కలొచ్చి ఎగురసాగె నింగిలోన!
ఇంద్రధనువు ఊయలలో ఊగిపోతి ఓ సఖుడా!!
 
మంచుతెరల మాటునుండి నీ పిలుపే వినబడ్డది!
చారి గజలె కబురనుకొని మురిసిపోతి ఓ సఖుడా!!
 
మణికర్ణిక(వడ్ల నరసింహా చారి) 2 వ గజల్
 
జీవితపు సారమ్ము విలువైన చరితరా!
రాబోవు తరములకు కథలైన చరితరా!!
 
అర్థమే నింపుకొని భావాలు శోభిల్లు!
పాటకే ఊపిరిగ పదమైన చరితరా!!
 
దాశ్యాపు శృంఖలం బాధించె నొకనాడు!
మన గెలుపు గుర్తుగా వెలిగెనీ చరితరా!!
 
మనపూర్వ వీరులా అవశేష చిహ్నాలు!
జిజ్ఞాస పెంచునూ స్వాతంత్ర్య చరితరా!!
 
ఇతిహాస మన్నదీ చదువుమా ఓ చారి!
గతమునే వివరించు ఘనమైన చరితరా!!
 
(ఆనంద్ తలారి పాడిన దేవానందం గజల్ )
 
( లక్ష్మీ రాజశేఖరుని గజల్ గానం)
 
( సుమన ప్రణవ్ గజల్ గానం audio)
*****
(సశేషం)
 
 
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.