అనుబంధాలు-ఆవేశాలు – 2

– ప్రమీల సూర్యదేవర

ప్రహరీగోడ లోపల మరొక ఎత్తయినగోడ—దాదాపు ప్రహరీగోడతో సమానమైన ఎత్తు ఉన్నది కాని ముళ్ళ తీగ లేదు. ఈ రెండు గోడలకు మధ్య ఉన్న ఆవరణలో ఒకవైపు చిన్న పూదోట ఉన్నది. అందులో బంతి మొక్కలు ఎక్కువగా కనుపించాయి. అక్కడక్కడ గులాబీలు, మందారాలు, నందివర్దనం, ఇవేకాక కొన్ని క్రోటన్ మొక్కలునాయి. ఆ తోటకు ఎదురుగా ఉన్న ఖాళీ స్తలంలో రెండు కర్రలు పాతి ఒక నెట్‌ కట్టారు. ఆ ఆటస్థలం ఏ ఆటకు సంబంధించినదో అర్దం కాలేదు.

పూదోట, ఆటస్థలం ఉన్నాయేకాని నిర్మానుష్యంగా, అతి నిశ్శబ్దంగా ఉన్న ఆవరణలో నన్ను ఒంటరితనం ఒక్కసారిగ చుట్టి వేసింది. ఎందకో గుండె, వూపిరితిత్తులు బిగుసుకు పోయినట్లయి ఊపిరి పీల్చుకోవటం కష్టమై పోయింది. ఆరుబయట ఆవరణలో ఉన్నా, ఆ ప్రదేశంలో గాలి స్థంభించి పోయినట్లయింది. చిక్కని చీకట్లు కమ్ముకున్న కారడవిలో కూడా ఇలాంటి అనుభూతి కలుగ లేదు. పూదోట ఎదురుగా రంగురంగుల పూలతో కనుపిస్తున్నా, కారడవిలో ఒంటరిగా వున్నానేమో ననిపించింది. ఒక్కొక్క పూలమొక్క ఒక్కొక్క మహావృక్షమై వాటికొమ్మలు, రెమ్మలు, తీగలు నన్ను చుట్టివేస్తున్నట్లు అనిపించింది. తలమీద చేతులు అలాగే వున్నాయికాని శరీరం మాత్రం కట్టెలా బిగుసుకు పోయి కదలనని మొరాయించింది.

పూలతోట నుండి కుడివైపుకు తిరగమన్న ఆదేశం విని అతి కష్టంమీద కాలు కదిపాను. సన్నని కాలిబాట, బాటకు ఒకవైపున ఎత్తయిన గోడ, రెండవ వైపు ముళ్ళతీగ. బలిపీఠం దగ్గరకు నడిచే బలిపశువులా భయంతో బిక్కుబక్కుమంటూ షుమారు ఇరవై మీటర్ల పొడవున ఉన్నబాట నడిచిన తరువాత ఇనప తలుపు ఒకటి దానంతట అదే ఒక వరండాలోకి తెరుచుకున్నది. వరండాలోకి అడుగు పెట్టగానే మెటల్ డిటెక్టర్ వున్నది. డిటెక్టర్  నుండి బయటకు రాగానే సన్నగా, పొడవుగా, రివటలా, గాలివీస్తే చాలు పడిపోయేలా ఉన్న యువతి నన్ను ఆపాదమస్తకం తనిఖీ చేసింది.

వరండాలో ఒక వరుసలో నాలుగు గదులున్నాయి. మొదటి గది తలుపుకు మేకులు కొట్టి ఉన్న చెక్కబోర్డుపై నల్లటి సిరాతో ‘సెక్యూరిటిగార్డ్’ అని వ్రాసిన అక్షరాలక్రింద జలజ ఆన్న పేరు తెల్లటి అక్షరాల్తో వున్నది.

“మీరిక చేతులు క్రిందకు దించవచ్చు,” అని గదిలోనుండి వినిపించిన వైపు చూశాను.

కంఠస్వరాన్నిబట్టి ఇప్పటి వరకు నన్ను ఆదేశించిన గొంతుక అదే అనిపించింది. లోపలికి తొంగి చూశాను. గదిలో బల్ల వెనుక చామన ఛాయలో, ఐదు అడుగల ఎత్తుకన్నా మించని, బక్కచిక్కిన యువతి కంఠం ఇంత కర్కశంగ వున్నదా? అని ఆశ్చర్యం వేసింది. గోడమీద ఉన్న ఆరు టెలివిజన్ల తెరలవైపు చూస్తున్నదల్లా నావైపు చూసింది. ఆమె తీక్షణమైన చూపులను తట్టుకోలేక తల ప్రక్కకు తిప్పు కున్నాను.

“నావెనుక రండి.” మర్యాదగ పలికింది. ఇంతలోనె అంత మార్పుకి కారణం ఏమబ్బా! అనుకుంటూ ఆమె వెనుకే వెళ్ళాను.

తెల్లని బోర్డ్ పై బంగారు రంగు అక్షరాలతో వార్డెన్  అని వ్రాసి ఉన్న తలుపు వైపు చూపించి లోపలకు వెళ్ళమని చెప్పి చకచక నడిచి వెళ్ళిపోయింది.

గది తలుపులు మూసి ఉండటంతో నెమ్మదిగ తట్టాను.

“దయచేసి ఒక్క నిమిషం వేచివుండం”డని ఎంతో మృదువుగ వినిపించింది. రెండు స్వరాలకు ఎంత వ్యత్యాసం అనుకున్నాను. అన్నట్టుగానె మరోనిమిషంలో తలుపు తెరిచి నన్ను లోపలకు రమ్మని, షుమారు 55 సంవత్సరముల వయసు ఉన్న స్త్రీ ఆహ్వానించింది. అక్కడక్కడ తెల్లని జుట్టు కనుపిస్తూ హుందాగా ఉన్న యువతి నాతో కరచాలనం చేసింది. “అతి గోప్యంగ ఉంచవలసిన ఫైల్  చూస్తుండటం వల్ల మీకు వెంటనే అనుమతి ఇవ్వలేక పోయాను. క్షమించండి,” అన్నదామె.

ముదురు నీలిరంగు అంచు ఉన్న లేత నీలిరంగు చీరకు అక్కడక్కడ ముదురు నీలిరంగు దారంతో కుట్టిన పూలు, అదేరంగు జాకెట్, తెల్లగ ఉన్న ఆమె శరీరానికి మరింత వన్నె తెచ్చింది. ఆమె మెడలో సన్నని బంగారు గొలుసు, చెవులకు చిన్న ముత్యాల దిద్దులు, ఎడమ చేతికి గడియారం తప్ప వేరే ఆభరణాలు ఏవీ లేవు. ఆమె వత్తైన జుట్టు దువ్వి ముడిచుట్టారు. నుదుటిపై కనుపించీ కనుపించని చిన్నబొట్టు.– మనిషిని చూడగానె గౌరవం ఉట్టిపడుతుంది.

నా చేతికివున్న ముత్యాలగాజు, మూడుపేటల ముత్యాల గొలుసుకు వజ్రాల లాకెట్, చెవులకు ముత్యాల జూకాలు, మణికట్టు కప్పివేసిన నలుచదరపు గడియారం చూసుకుని సిగ్గువేసింది. ఇవన్నీ తీసి కారులోనైనా పెట్టవలసిందని మనసులో నిందించుకున్నాను. ఇలాటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ నగలన్నీ ఎందుకని నాన్నగారైన వారించలేదేమని ఎదురుగలేని నాన్నగారిపైన సగం నెపం నెట్టి వేశాను.

“జలజ పరుషత్వానికి మీరు మరోలా అనుకోకండి.” నాకు కుర్చీ చూపుతూ సంజాయిషీ ఇచ్చినట్లన్నది.

పూర్వం విష్ణుమూర్తిని దర్సించుకోవటానికి వేంచేస్తున్న సనక, సనందాదులను జయ, విజయులనే విష్ణుమూర్తి ద్వారపాలకులు అడ్డగించారట. అందుకు  సనక, సనందాదులు ఆగ్రహించి  జయ, విజయులను భూలోకంలో మూడు పర్యాయములు రాక్షసజన్మ ఎత్తమని శపించారు. విష్ణుమూర్తి సనక, సనందాదులకు ఎదురేగి సకల మర్యాదలతో వారిని పూజించి, తన ద్వారపాలకులు వారిని కించ పరచినందుకు క్షమించమని అడిగాడట. ఈమెలో కూడ అంత సంస్కారం ఉట్టి పడుతుంది.

“ఆమె, తన కర్తవ్యం ఆమె నిర్వహించింది అంతే కదా,” అన్నాను కుర్చీలో కుర్చుంటూ.

చూడండి, మీరు తలపెట్టిన కార్యం చాలా ప్రమాదకరమైనది. మీకు రక్షణ కలిగించటానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను, కాదు-కలిగిస్తాను. కాని ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరమూ ఊహించలేము. బల్లపైవున్న బెల్ నొక్కుతూ అన్నదామె. ఈ అలోచన మీకు ఎలా కలిగింది? అడిగింది.

మా అమ్మకూడ ఇదే ప్రశ్న అడిగింది. వార్డెన్ కుతూహలంతో కారణం తెలుసుకోవాలని అనుకున్నది. కాని మా అమ్మ, నేను ఒంటరిగ ఈ సాహసం చేయాలనుకున్నప్పుడు నా మొండి వైఖరికి కోపం తెచ్చుకున్నది. నా మీద కోపం నాన్నగారి మీదకు మళ్ళించి, ఆడపిల్లలకు ఇంత స్వేచ్చ ఇవ్వకూడదని, ఇస్తే ఇలాగే ఆలోచిస్తారని విరుచుకు పడ్డది. ఆయన ఏమీ మాట్లాడకపోవటంతో నిస్సహాయంగ నాదగ్గరకు వచ్చి, “నాకు భయమేస్తుంది తల్లీ. ఎందుకు ఈపని తలపెట్టావు?” అని ఏడుస్తూ అడిగింది.

నాన్నగారి మౌనానికి కారణం లేకపోలేదు. నాలుగు రోజుల క్రితం నా నిర్ణయం ఆయనకు తెలిపినప్పుడు ఖిన్నులై నాతో వాదించారు. నేను నా లాయర్ వృత్తిలో ఎంతో మంది నేరస్థుల్ని చూశాను. వారిలో కొందరు చాలా రౌద్రంగా ఉంటారు. ఎలాంటి హింస చేయటానికైనా వెనుకాడరు. వారి కళ్ళల్లో ఏదో కసి లాంటిది ఉంటుంది. ఆ క్షణంలో వారేం చేస్తారో వారికే తెలియదు. వారి మనసు ఏ క్షణంలో ఎలా మారుతుందో ఎవ్వరం ఊహించలేం. ఆక్షణంలో ఆపుకోలేని ఆవేశంతో చేసిన పని వల్ల కలిగే ఫలితం గురించి ఆలోచించరు. న్యాయస్థానంలోనే తీర్పువిన్న నేరస్తులెందరో తిరుగబడిన సంఘటనలెన్నో! భౌతికంగ ఎంతో దుర్బలంగ కనుపించేవారికి కూడ శిక్షణ పొందిన నలుగురు అధికారులను సైతం ఎదుర్కొనే శక్తి  ఎలావస్తుందో చెప్పలేము. అలాంటిది నీవు హంతకుల పరిధిలోకి వెళ్ళి వారితో ముఖాముఖీ మాట్లాడాలనుకోవటం అంత స్రేయస్కరం కాదు. హంతకులను నిర్బంధిచే కారాగారాల్లో భద్రత చాలా కట్టుదిట్టంగ వుంటుంది. అక్కడ పనిచేసే సిభ్బంది కూడా చాలా వరకు ఒకప్పటి నేరస్తులే. వారు విడుదలైన తరువాత అనువైన వారికి అక్కడే క్రింది తరగతి ఉద్యోగాలిస్తారు. ఆ ఉద్యోగస్ధులు బయట నుండి వెళ్ళే వారితో అంతగా సహకరించరు. అని నా ప్రయత్నం మానుకోమని అన్నారు.

నాన్నగారి మాటలు వింటుంటే భయం వేసింది. కాని నా భయం బయటకు కనుపించనీయ లేదు.  “మీరు న్యాయవాదులు కాబట్టి సాక్ష్యాధారాలను సేకరించి ఆ ఆధారాల ద్వారా దోషులకు తగిన శిక్ష విధిస్తారు. నేను చదువుకున్న మనస్తత్వశాస్త్రం ఆ నేరం వెనుకనున్న పరిస్థితులు, వాటి ప్రభావం ఎంత ఉన్నదో తెలుసుకోవాలనుకుంటుంది. మీరే నాకు ఎన్నో పర్యాయాలు, సాక్ష్యాధారాల వల్ల, ఫిర్యాదు చేసిన వారి స్థితిగతుల వల్ల కొన్ని శిక్షలు అన్యాయంగా విధింపబడతాయని చెప్పారు.

పట్నంలో పేరుమోసిన వ్యాపారస్తుని కొడుకు ఒక ఆమాయకమైన యువతిని ప్రేమించానని మోసం చేశాడు. ఆ అమ్మాయి మోసం తెలుసుకుని ఫిర్యాదు చేసిన కారణంగ ఆ యువతిపై అక్రమమైన ప్రచారం జరిపి, నవ్వులాపాలు చేశారు. ఆ అవమానం భరించలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నదని, ఆ కేసు పూర్తి వివరాలు ఆ రాత్రికి రాత్రి మాయమై పోయాయని నాన్నగారు బాధ పడ్డారు.

ఆ విషయం ఆయనకు గుర్తుచేసి, దోషుల్ని కలుసుకుని మాట్లాడి నిజమేమిటో రాబట్టగలిగి వారి శిక్షలను తగ్గించ గలగటమో లేక శిక్షను రూపు మాపటమో చేయగలనేమోనని అనిపిస్తుంది. ఇదే నేను చేయగలిగితె నాచదువుకి సార్దకత వుంటుందనే తృప్తినాకు మిగులుతుంది, ఆ ప్రయత్నం విఫలమైనట్లయితె కనీసం నా ప్రయత్నం నేను చేశాననె తృప్తి మిగులుతుంది” అని మొండిగ వాదించాను.

నాన్నగారు మౌనంగా గదిలో నుండి వెళ్ళి పోయారు. నా వాదనలో సత్యం గ్రహించినా నేనీచర్యకు పూనుకోవటం ఒక తండ్రిగా నూటికి నూరు పాళ్ళు అంగీకరించలేక అలా వెళ్ళిపోయారనుకున్నాను.

మంత్రిగారమ్మాయి, సునీత, నాతో కలిసి చదువుకోవటం వల్ల ఆమె ద్వారా మంత్రిగారికి సిఫార్స్ చేయించుకుని అనుమతి పత్రం సులువుగ సంపాదించుకో గలిగాను. ఈ అవకాశం జారవిడుచుకో దలుచుకోలేదు. రెండు రోజులు ఆమ్మను బ్రతిమాలుకుని, జాగ్రత్తగ ఉంటానని వాగ్దానం చేసి, వెంట గోవిందుని తీసుకువెళ్తానని నచ్చచెప్పేటప్పటికి నా ఒంట్లో సగంశక్తి ఆవిరై పోయింది.

“నేను తలపెట్టిన పని చాలా ప్రమాదకరమైనదని తెలుసు. దీని వల్ల ఎవరికైన ఉపకారం జరుగుతుందేమోననే ఆశ నన్నీ పనికి పురిగొల్పింది. ఒకవేళ ఎవరికీ ఉపయోగపడక పోయినా నా ప్రయత్నం నేను చేశాననే తృప్తి మిగులుతుంది.” లేత నీలిరంగులో ఉన్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాను.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.