
అనుబంధాలు-ఆవేశాలు – 7
– ప్రమీల సూర్యదేవర
ఇక్కడ కూడా ముందుగా సంఖ్యలే ఉన్నాయి. 586. రెండవ పేజీలో ఫోటో. నిండుగా ఒతైన జుట్టుతో పెట్టిన కొప్పుముడి, నుదుట దిద్దిన కుంకుమబొట్టు ఉదయిస్తున్న సూర్యబింబంలా వెలిగి పోతుంది. చెవి తమ్మెకు మించిన దంతపు దిద్దులు, ముక్కుబుళాకి, మెడలో రంగు రంగుల పూసల దండలు, మోచేతి వరకు వేసుకున్న వెడల్పైన దంతపు గాజులు—–వయసు 40—45 సంవత్సరాల మధ్య ఉంటుంది. మనిషి బలిష్ఠంగ, ఆరోగ్యంగ కనుపిస్తుంది. కాటుకతో నిగనిగ లాడుతున్న ఆకళ్ళల్లో ఎక్కడా ద్వేషంకాని, పగకాని కనుపించ లేదు. ఎర్రని సాదానేత చీర గోచీపెట్టి కట్టింది. జాకెట్ లేని వక్షస్థలాన్ని పూసల గొలుసులు కప్పి వేశాయి. ఎదుటి వారి హృదయాలను దోచుకునే చిరునవ్వు. నిండుగా, నిర్మలంగా కనుపిస్తున్న ఈయువతి ఇక్కడికెలా వచ్చి పడిందో? చిత్ర విచిత్రంగా ఒక్కక్షణంలొ మానవుల జీవితాలు ఎలా తారుమారౌతాయోకదా!!
పేరు, అంజమ్మ వయస్సు 48 సంవత్సరాలు. భర్త, , నలుగురు పిల్లల్తో అడవికి ఆవలి వైపున గూడెంలో నివాసం. నూకాలు వయస్సు 47 సంవత్సరాలు. ముగ్గురు పిల్లల తల్లి.
పెరట్లొ గిన్నెలు తోముకుంటున్న స్నేహితురాలిని దుడ్డు కర్రతో గట్టిగ తల మీద బాదటం వల్ల ఆమె అక్కడి కక్కడే మరణించింది. నూకాలుకు బుద్దిచెప్పాలనుకున్నది, కాని ఆమె చనిపోటంతో నివ్వెర పోయింది!! పుట్టి బుద్దెరిగనప్పట్నుండి కలిసి మెలిసి ఆడుకున్నారు. కలిసి ఇద్దరూ కట్టెల కొరకు అడవికి వెళ్ళేవారు. సంబరాల్లో జరిగే నృత్యంలొ వీరిద్దరిదే పై చేయి. ఒకరి నడుము ఒకరు పట్టుకుని వయ్యారంగా, మద్దెల దరువుకు అనుగుణంగా అడుగులు వేస్తూ అలిసి పోయేవరకు నాట్యం చేసేవారు. ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేమన్నట్లుండేవారు. అలాటిది తను నూకాలును చంపటమా? అంజమ్మ కాళ్ళ క్రింద భూమి గిరగిర తిరిగి పోయి, నిలబడ లేనట్లు కుప్ప కూలి పోయింది.
పెరట్లోనే కొద్దిదూరంలో ఉన్న చెట్టుపై కొమ్మలు పట్టుకుని ఊగుతూ, గెంతుతూ ఆడుకుంటున్న పిల్లలు నూకాలు పెట్టిన కేక విని పరుగు పరుగున వచ్చారు. ఆ వచ్చిన వారిలో అంజమ్మ కొడుకు,సత్తేలు, తల్లి చేతిలొ దుడ్డుకఱ్ఱా, క్రిందపడి ఉన్న నూకాలునీ భయంతొ కళ్ళు పెద్దవి చేసుకుని చూడ సాగాడు. నూకాలు కూతురు, రాజీ, తల్లి ప్రక్కనే కూర్చుని అమ్మి, అమ్మి అని ఏడవ సాగింది. పశువులకు మేత వేస్తున్న దానేలు ఏమైందంటూ పరుగెత్తుకొచ్చి, రక్తం మడుగులో పడి ఉన్న భార్య ముక్కు దగ్గర వ్రేలుపెట్టి చూసి విద్యుద్ఘాతం తగిలినట్లు వెనక్కు అడుగు వేశాడు.
తల్లి, దుడ్డుకర్ర తీసుకుని కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నూకాలు ఇంటి వైపు వెళ్ళటం దూరాన గొర్రెల పాకలో గొర్రెలకు నీళ్ళు పెడ్తున్న అంజమ్మ కూతుళ్ళిద్దరు చూసారు. వారు పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడి దృశ్యం చూసి భయ భ్రాంతులై ఒకరినొకరు కౌగలించుకుని ఏడుస్తున్నారు.
అంజమ్మ దుడ్డుకర్ర అక్కడే పడేసి, అడవిలోకి పరుగు పెట్టింది. క్షణంల్లో పల్లె అంతా నూకాలు కళేబరాన్ని చుట్టు ముట్టారు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చాడో నూకాలు కొడుకు, గంగులు , తల్లి కళేబరాన్ని చూసి, వచ్చినంత వేగంగా అడవికి అడ్డంబడి పరుగెత్తుకెళ్ళి పోయాడు. దూరంగా మొక్కజొన్న చేలల్లో పనులు చేసుకుంటున్న అంజమ్మ భర్త ఓబులుకి, కబురు పంపారు. ఓబులు వస్తూనే దానేల్ని కౌగలించుకుని వల వల ఏడ్చాడు. పల్లెదొర నలుగురు మనుష్యులను అంజమ్మ కోసం అడవికి పంపించాడు. పల్లెవాసులకు అడవి ప్రాంతం క్రొత్త ఏమీ కాదు. ఏ చెట్టు ఎక్కడున్నదో, ఏ చెట్టుక్రింద పుట్ట ఉన్నదో, జంతువుల అడుగుల గుర్తుపట్టి ఏ జంతువో స్పష్టంగా చెప్పగలరు. ఏ సమయంలో జింకలు ఎటువెళ్తాయో అన్నీ క్షుణ్ణంగ తెలుసు. కానివాళ్ళు అంజమ్మ జాడ కనుక్కోలేక పోయారు.
ఈ గూడెం వాసులకు ఇంత వరకు హత్య అనేదే తెలియదు. అందరు భయ భ్రాంతులతో, అయోమయంగా, ఏం జరుగబోతుందోననే ఆందోళనతో ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. గూడెంలోని వారంతా ఎంతో ఆదరించే వ్యక్తి–అందరికి అండగా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావలసి వచ్చినా మరో ఆలోచన లేకుండ నడుం బిగించి సహాయంచేసే వ్యక్తి—అందరి అభిమానం చూరగొన్న వ్యక్తి చేసిన హత్య– చిన్నబోయిన ముఖంతో దిగులుగా కూర్చుని చూస్తున్న పల్లెదొర వైపు అందరు జాలిగా చూశారు. అంజమ్మ, నూకాలు, కుటుంబాల మధ్య జరుగుతున్న మానసిక ఘర్షణ అందరికి తెలుసు. ఆ ఘర్షణ ఇంత దారుణానికి కారణమౌతుందని అనుకోలేదు. పల్లెలో జరిగే చిన్న చిన్న గొడవలకు తీర్పు చెప్పగలిగిన పల్లెదొర ఈ సమస్యను ఎలా ఎదుర్కుంటాడోనని ఎదురు చూస్తున్నారు.
అడవిలోకి వెళ్ళిన యువకులు తిరిగి వచ్చేలోపే మోటారు వాహనం శబ్జం వినిపించింది. అందరి దృష్టి నూకాలు—పల్లెదొరలమీది నుండి, రోడ్డు వైపుకి మళ్ళింది. పిల్లలు ఉత్సాహంగా మోటారు దగ్గరకు పరుగులు పెట్టారు. గంగులు రక్షకభటులతో కలిసి వాహనంలో కనుపించాడు. ఈడకు రక్షకభటులు రావటమా? అందరు ఆశ్చర్యంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగారు.
వాహనం ఆగగానే గంగులు ఒక్క ఉదుటున క్రిందకు దూకి రక్షకభటులకు తన తల్లి కళేబరం చూపించాడు. కోపంగ ఓబులు వైపు చేయి పెట్టి చూపించి, “ఈయన ఇంటావిడే మాఅమ్మిని దుడ్డుకర్రతో మోది చంపేసింది,” అని చెప్పాడు.
రక్షకభటుల్లో ఒకతను చేతులకు తొడుగులు తొడుక్కుని కర్రను చేతిలోకి తీసుకుని పరీక్షగ చూశాడు. తరువాత ఆ కర్రని తనవెంట తీసుకు వచ్చిన ప్లాస్టిక్ కవర్లో పెట్టి పదిలంగ వాహనంలొ ఉంచి తిరిగి మృతదేహం దగ్గరకు వచ్చాడు. మిగిలిన ఇద్దరు రక్షకభటులు రక్తం మడుగులో బోర్లా పడి ఉన్న నూకాలు శవం చుట్టూ తిరిగి ఏదో వ్రాసుకున్నారు.
“ఈ హత్య ఎన్నిగంటలకు జరిగింది?” ఒకతను గంగుల్ని అడిగాడు.
“సూరీడు తూరుపు దిక్కునుండగనె జరిగింది.” తడుము కోకుండ చెప్పాడు.
“హత్య జరగటం నువ్వు చూశావా?”
“ఇల్లె. నేను సూడల. మా సెల్లెలు సూసింది. ఇగ్గో ఈ కుంక ఆయమ్మ బిడ్డె. ఆడు కూడ సూసిండు ” అని అంజమ్మ కొడుకు, ఐదు సంవత్సరముల సత్తేలుని ముందుకు లాగాడు. వాడు గజగజ వణుకుతూ, తల దించుకుని నిల్చున్నాడు.
బెదిరి పోతున్న పిల్లవాడి ముందు మోకరిల్లి , “ఏం బాబు ఏం జరిగిందో నువ్వు చూశావా?” అనునయంగ అడిగాడు.
సత్తేలు పరుగున వెళ్ళి తండ్రిని పట్టుకుని పెద్దగ ఏడ్చాడు. ఓబులు కొడుకుని ఎత్తుకుని వీపు నిమిరాడు.
“నేను సూశాను.” నూకాలు కూతురు, రాజీ, అప్పటి వరకు ఏడ్చి బొంగురు పోయిన గొంతుతో పెద్దగ అరిచింది.
“ఏం చూశావు?” అధికారి అడిగాడు.
“అంజమ్మ అమ్మి కోపంగొచ్చి పెద్ద దుడ్డుకర్రతో మా అమ్మి తలపై మోదింది. మా అమ్మి అరస్త పడిపోనాది,” అని ఒక చిన్నకర్రముక్క తీసుకుని ఎలా కొట్టిందో చూపించింది.
“మీరెక్కడ్నుంచి చూశారు?”
“అల్ల అదిగొ, ఆ సెట్టుకాడ ఇద్దరం ఆడుకుంతన్నం.”
“మీలో ముందుగా ఎవరు చూశారు?”
“ఇద్దరం సూసి లగెత్తుకొచ్చినం.”
“ఏం బాబు, ఈ అమ్మాయి చెప్పింది నిజమేనా?” తండ్రిమెడ చుట్టూ చేతులు వేసి ఎక్కిఎక్కి ఏడుస్తున్న సత్తేలుని అడిగాడు.
తలెత్తకుండానే వాడు “ఔ” నని తలూపాడు.
అడవిలోకి వెళ్ళిన నలుగురు తిరిగి వచ్చారు అంజమ్మ కనపడలేదంటూ. చీకటి పడిన తరువాత అడవిలో వెదకటం కష్టమౌతుందని, చీకటి పడేలోగానే అంజమ్మ జాడ తెలుసుకోవాలని అధికారి తనతో పాటు పది మందిని వెంట పెట్టుకు వెళ్లాడు. వారిలో అంజమ్మ భర్త ఓబులు కూడా ఉన్నాడు. వెళ్ళే ముందు నూకాలు మృతదేహాన్ని ఎవరు తాకవద్దని అధికారి హెచ్చరించాడు.
అడవి, అడవి మధ్యలోనున్న కొండ–అందాలు వర్ణించాలంటే మాటలు సరిపోవు. చూసి తీరవలసిందే. పచ్చని చెట్లు, తీగలు, రంగురంగుల పూలు సువాసనలు వెదజల్లుతూ మన నాసికా రంద్రాలకు ఆహ్లాదం కలిగిస్తుంటాయి. ఎన్నో రకాల పక్షులు వాటి కిలకిలారావాలు వినిపిస్తూ చెవులకు ఆనందం కలిగిస్తాయి. విప్పారిన కళ్ళతో గెంతుతూ వెళ్ళే జింకపిల్లలు, ఏదో ఒక చిన్న జంతువుని నోట కరుచుకుని, ఎవరు చూడటం లేదులె అనుకుని దొంగల్లా చెట్లమాటు నుండి పరుగులు పెట్టే నక్కలు, మూతి విరుచుకుంటూ గంతులు వేసే కుందేళ్ళు —ఇవేకాక జల జల పారే జల ప్రవాహాలతో ఉండే ఆప్రాంతం సౌందర్యాధకులు కాని వారిని కూడా అక్కడ్నుంచి కదల నివ్వదు.
ఓబులు తనతో వచ్చిన వారిని కొండకు వెనుక వైపునున్న సెలఏటి వైపు తీసుకు వెళ్ళాడు. అంజమ్మ ఆ సెలఏటిలో ఈ ప్రపంచంతొ తనకేమీ సంబంధం లేదన్నట్లు ఆవేశంగా ఈతకొడ్తూ కనుపించింది. ఓబులు దగ్గరగా వెళ్ళే వరకు వచ్చిన వారిని గమనించ లేదు. భర్తను చూస్తునే త్వరత్వరగ ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చి ఏడుస్తూ అతని భుజంపై వ్రాలి పోయింది. భార్యను పొదివి పట్టుకుని గూడెం వైపు బయలు దేరాడు. వెంట వచ్చిన వారంతా మౌనంగ అనుసరించారు. అడవిలోకి వెళ్ళిన అధికారులు తిరిగి వచ్చేవరకు దానేలు, తన ఇంటి ముందు కన్నీరు కారుస్తూ నిల్చున్నాడు.
అధికారులు వస్తూనే అంజమ్మ చేతులకు బేడీలు వేసి, నూకాలు కళేబరాన్ని వాహనంలోకి ఎక్కించటానికి ప్రయత్నిస్తుండగ పల్లెదొర, “మాబిడ్డని మేమే దహనం చేసుకుంటం. మీరెవరు ఆమెని తోడ్కపోవటానికి?” అని అడ్డు పడ్డాడు.
“ప్రభుత్వానికి కొన్ని నిబంధనలుంటాయి. జరిగినది హత్య కావటం వల్ల వైద్యులు శవాన్ని కోసి పరిక్ష చేయాలి.”
“ఇంక మీరు పరిచ్చ చేసేదేముంది దొర? దుడ్డుకర్రతొ బాదింది అంజమ్మ. ఆమే బాదిందని పిల్లలు సెప్తున్నరు. నూకాలు పాణం గాల్లో కలిసి పోయింది. మా ఊర్లబిడ్డని మేమంపం. అది మా ఆచారం కాదు. పెబుత్వానికి మీరు నచ్చచెప్పుకోండి” అని పల్లెలో మిగిలిన వారు కూడ శవాన్ని కదలనీయ లేదు.
అధికారులు వారితో కొంచెం సేపు వాదించి, చేసేది లేక సంధ్య చీకట్లు కమ్ముకు రావటంతో అంజమ్మను తీసుకుని వెళ్ళి పోయారు.
అంజమ్మ వాహనం వెనుకె, ఓబులు, పిల్లలు, గూడెంలో కొందరు పెద్దలు అడవి వరకు వచ్చి ఆగిపోయారు.
పల్లెదొర ఏవో మూలికల రసం నూకాలు కళేబరం మీద పూసి, ఆ రాత్రికి జంతువులు రాకుండ చూస్తుండమని నలుగురు యువకులని కాపలా ఉంచాడు.
ఆ తరువాత న్యాయస్థానానికి ఎవరూ రాకపోవటంతో విచారణ జరుప కుండానే అంజమ్మకు 20 సంవత్సరాలు కారాగార శిక్ష విధించారు.
*****
(ఇంకా ఉంది)

1974, సెప్టంబర్ నుండి ఒహాయో రాష్ట్రంలో సిన్సనాటిలో నివసించి, 2004, జనవరి నెలలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోకి చేరుకున్నాము. నా మొట్ట మొదటి కథ ‘భయం’ 2007 డిసెంబర్ మరియు 2008 జనవరి ‘తెలుగునాడి’ మాసపత్రికలో ప్రచురించబడింది. రెండవ కథ ‘కదిలే బొమ్మలు’ 2010 ఏప్రియల్ నెలలో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురించబడింది. 2003 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొదటి నవల ‘అనుబంధాలు-ఆవేశాలు’ చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల ‘ అనురాగ సంగమం ‘ 2024 ఫిబ్రవరిలో ప్రచురించటం జరిగింది. హస్తినాపురం (ఆస్టిన్) సాహిత్య సభలో పాల్గొని నా స్వీయ రచనలు కొన్ని చదువుతుంటాను.
