
యాత్రాగీతం
అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-14
-డా||కె.గీత
ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*
***
సరిగ్గా ఏడాది కిందట 2023లో మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి. మొదటి పన్నెండు భాగాలు రాసి దాదాపుగా ఏడాది కావొస్తోంది. మళ్ళీ మొదలుపెట్టడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పటివరకు చదవని వారు వీటన్నిటినీ నెచ్చెలిలో (https://www.neccheli.com/ధారావాహికలు/ట్రావెలాగ్స్/యాత్రాగీతం/) ధారావాహికలుగా త్వరలో చదవవొచ్చు.
ఇంగ్లాండ్ -లండన్ (రోజు-2) లండన్ నగర విహారం – బరో మార్కెట్టు-గాంధీ నివాసం- థియేటరు డిస్ట్రిక్టు
టవర్ ఆఫ్ లండన్ నించి బయటికి వచ్చే ముందు ప్రధాన బిల్డింగు బయట “గార్డు పోస్టు”లో గార్డు డ్యూటీ మారే చిన్న డబ్బాలోకెక్కి చప్పున ఫోటో తీసుకున్నాను. ఆ తరువాత చూసాను అందులోకి ఎవ్వరూ వెళ్ళొద్దన్న బోర్డు. అంతే పరుగున అక్కణ్ణించి బయలుదేరేం. ఇలాంటి చిన్న చిన్న సరదాలు తరువాత తల్చుకుంటే భలే సంతోషంగా ఉంటాయి.
టవర్ నించి తిరిగి వచ్చే దారి థేమ్స్ నది ఒడ్డుకి కలుస్తుంది. అక్కడంతా కూడా పలకలు వేసిన రహదారే. సిరి కార్టు పలకల మీద కదలకపోవడంతో ముందు కాస్త పేచీ పెట్టినా, అక్కణ్ణించి మా వ్యాను ఎదురు చూస్తున్న స్థలం వరకు బానే నడిచింది. ఒక పక్క పరవళ్లు తొక్కుతున్న థేమ్స్ నది, ఎదురుగా నది మీద అద్భుతంగా టవర్ బ్రిడ్జి. కాస్సేపు ఉండాలనిపించినా ఓ పక్క చినుకులు పడుతూ ఉండడంతో అక్కణ్ణించి కదలక తప్పింది కాదు.
ఇక వ్యానెక్కి దార్లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న “షేక్స్ పియరు గ్లోబు థియేటర్” ని చూడాలని గూగుల్ లో చూసి వెళ్లాం. తీరా వెళ్తే, ఆ భవంతి ముఖ ద్వారానికి, గూగుల్ లో చూసిన దానికి పోలిక లేదు. అదేదో సూపర్ మార్కెట్టు ఎంట్రెన్సులా గాజు అద్దాలతో అధునాతనంగా ఉంది ముఖ ద్వారం.
కాస్సేపు తిరిగి చూద్దామంటే ఆ చుట్టుపక్కల పార్కింగు లేదు. ఇక అందరం దిగకుండా నేనొక్కదాన్నే, వ్యాను దిగి థేమ్స్ నదీ తీరం వైపుగా నడిచేను. అప్పుడు కనిపించింది గూగుల్ లో చూపించిన ముఖ ద్వారం. దీనిని మొదటగా 1599లో నిర్మించారట. కానీ 1613 లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో థియేటర్ మొత్తం కాలి బూడిదయ్యింది. తిరిగి 1614లో పునర్నిర్మించినా 1644లో మళ్ళీ కూల్చివేసారట. ఈ షేక్స్ పియరు కాలంనాటి థియేటర్ ని1599 నాటి నిర్మాణపు పద్ధతిలోనే పునరుద్ధరించి 1997లో పునః ప్రారంభించారు. అప్పట్లో మూడువేలమంది పట్టే ఈ థియేటర్ లో ఇప్పుడు 1400 మంది మాత్రమే చూసే వీలుంది. అయితే లోపల ఎలా ఉందో చూసేందుకు సమయం లేనందున బయటి నించే చూసి ఆనందించి, త్వరగా వచ్చేసాను.
మా తర్వాతి స్టాపు ప్రసిద్ధి గాంచిన బరో మార్కెట్టు (Borough Market). అప్పటికే దాదాపుగా అయిదు కావస్తుండడంతో మార్కెట్టు మూసివెయ్యడానికి సిద్ధంగా ఉంది. స్థానిక పళ్ల వెరైటీల్ని చూద్దామని వెళ్లిన మాకు కొన్ని స్టోర్లు మాత్రమే తెరచి కనిపించాయి. అందులో ఒకటి ఆసియా స్టోరు. అందులో పైనాపిల్, డ్యూరియన్, చెరిమోయా వంటి అమెరికాలో కనిపించే పళ్ళే అక్కడా కనిపించాయి. పైగా ఖరీదు ఎక్కువ.
ఇక ఆ చుట్టుపక్కలవన్నీ మాంస విక్రయ దుకాణాలు. నీళ్లు కిందన ఒంపినట్టు చిత్తడి చిత్తడి గా ఉందక్కడ. ఆ పక్కనే గుడ్లు మొ.నవి అమ్మే దుకాణాలు.
ఏమీ కొనడానికి లేకపోయేసరికి కనీసం స్థానికంగా ప్రసిద్ధి గాంచిన లావెండర్ కట్ట ఒకటి కొందామనుకున్నాను. అదీ అమెరికాలో కంటే బాగా ప్రియమే అయ్యేసరికి విరమించుకున్నాను.
మార్కెట్టు రోడ్దు మధ్యలో చెత్త కుప్పలో భాగంగా కూర్చున్న హోం లెస్ మనిషి దర్శనమిచ్చాడు. అతనికి తోడుగా బొచ్చుకుక్క పిల్ల ఒకటి. ఎముకలు కొరికే చలిదేశాల్లో రోడ్ల పైన బతకడం ఎంతో దుర్భరమైన విషయం. అతన్ని చూడగానే నిరుపేద బతుకుల గురించి చార్లెస్ డికెన్స్ రాసిన “wretched, abject, frightful, hideous, miserable” అన్న మాటలు గుర్తుకొచ్చి భారంగా కదిలాను అక్కణ్ణించి.
అక్కణ్ణించి పొద్దుట్నించీ ఎదురుచూస్తున్న గాంధీ నిలయానికి తీసుకువెళ్లాడు మా వ్యాను డ్రైవరు.
గాంధీ నిలయం అంటే ఏదో స్మారక కట్టడం కాదు. గాంధీ విద్యార్థిగా ఇంగ్లాండు దేశానికి మొదటగా అడుగుపెట్టినప్పుడు ఓ గదిలో అద్దెకున్న ఇల్లన్నమాట.
అది బయటి నించి చూడడానికి మామూలు అపార్ట్మెంటు కాంప్లెక్సులా ఉంది. తెల్లని సున్నం వేసున్న ఆ ముణ్ణాలుగు అంతస్తుల భవంతిలో ఒక్కో అపార్ట్మెంటులో గదులు నిలువుగా ఉంటాయన్నమాట. అమెరికాలోని టౌన్ హౌసుల మాదిరిగా, మరికాస్త చిన్నవిగా ఉన్నాయివి.
ఇలాంటి ఇళ్లలోని పైన గదులు ఇల్లుగలవాళ్లు లేదా అద్దెకిచ్చిన వాళ్ల కోసం అయితే, కింది అంతస్తు గదులు పనివాళ్ల కోసం కేటాయించబడేవట.
ఆ ఇంట్లో గాంధీ ఒకప్పుడు నివాసం ఉన్నాడనడానికి సాక్ష్యంగా బయట గోడ మీద నీలం రంగు వృత్తాకారం మధ్యన గాంధీ పేరు, ఏ సంవత్సరం నించి ఏ సంవత్సరం వరకు నివసించినదీ, ఎప్పుడు ఉన్నదీ వివరాలు రాసి ఉన్నాయి. “Mahatma Gandhi lived here as a law student” అని రాసి ఉంది.
ఇలా ఒకప్పటి ప్రముఖుల నివాసాల బయట నీలం రంగుతో రాయడం లండనులో రివాజు.
సందర్శకులు దారిన పోతూ వివరం తెలుసుకోవడానికి చక్కని ఏర్పాటు ఇది.
గాంధీ నివాసం చూడాలని ఎంతో ఉవ్విళ్లూరినా, ఆ బోర్డు తప్ప, తీరా అక్కడ చూసేదేం లేక, ఫోటోలు తీసుకుని అయిదు నిమిషాల్లో వెనుతిరిగాం. నాకు మాత్రం అక్కడ సన్నగా జల్లు పడుతూ, మబ్బు మబ్బుగా ఉన్న లండను నగరంలోకి బిక్కు బిక్కుమని అడుగు పెట్టిన కుర్రాడు కనిపిస్తూనే ఉన్నాడు. అక్కడ ఆయన నడయాడిన అడుగుజాడలు ప్రపంచమంతా వ్యాపించాయి కదా! ఒకప్పుడు ఆ దేశానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తికి, ఇప్పుడు అదే దేశంలో అసెంబ్లీకెదురుగా విగ్రహం ప్రతిష్టించారు. “జీవితం సార్థకం కావడం అంటే అదీ” అని అనిపించింది.
ఆ ఇంటి నంబరు ఇరవై. అన్నీ బానే ఉన్నాయి గానీ, ఇంటి ముందు ఇప్పుడున్న వాళ్లు చెత్త కుండీలు పెట్టడం మాత్రం బాలేదు. బహుశా: వాళ్లకి గాంధీ ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉన్న విలువ తెలియకపోయి ఉండొచ్చు. నాకు ఒక పట్టాన అక్కణ్ణించి రావాలనిపించలేదు. “ఇంకో ఫోటో, మరొక వీడియో” అంటూ సాగదీస్తున్న నన్ను నవ్వుతూనే త్వరపెట్టేడు సత్య.
మొత్తానికి ఆ ప్రదేశంతో అవేళ్టి మా వ్యానులో సిటీ టూరు ముగిసింది.
చివరగా మమ్మల్ని మా హోటలు దగ్గిర కాకుండా “థియేటరు డిస్ట్రిక్టు”లో మేం బుక్ చేసుకున్న “లయన్ కింగ్ షో” థియేటరు దగ్గిర దించమని అడిగాం మా వ్యాను డ్రైవరుని. నిజానికి తరువాత ఆలోచిస్తే, మొత్తం యూరపు ప్రయాణంలో ఆ రోజు చేసిన ఆ టూరుకి మా అంతట మేం వెళ్లి ఉంటే బావుండేది అని అనిపించింది. అలా సిటీ టూరు అంటూ ఆ వ్యాను తీసుకుని ఒక్కరోజులో ఆరువందల డాలర్లు వృథాగా పోసాం.
ఇక నాటక ప్రదర్శనలకు ప్రసిద్ధిగాంచిన లండనులో తప్పనిసరిగా ఒక్క నాటకమైనా చూడాలనుకుని మేం బుక్ చేసుకున్నదే ఆనాటి షో. ఆ థియేటర్ పేరు “లీసియమ్ థియేటర్”. పిల్లలకి ప్రత్యేకమైన “లయన్ కింగ్” నాటకం అద్భుతంగా నడిచింది. చూడ్డానికి సినిమా థియేటర్ లా ఉండడమే కాకుండా, తెర మీద సినిమా చూస్తున్న భ్రాంతి కలిగింది. సిరి పొద్దుట్నించి అలిసిపోయినా, షోని బాగా ఆసక్తిగా చూసింది. మధ్యలో పాప్ కార్న్ కి, కూల్ డ్రింకులకి పెద్ద పెద్ద లైన్లు ఉన్నా, పిల్లల కోసం ప్రత్యేక కౌంటరు ఉండడం విశేషం.
లండనులో నాటకం చూసి రావాలన్న మా కోరిక అలా తీరింది. షో అయ్యేటప్పటికి తొమ్మిదయ్యింది. అయితే బయటికొచ్చేసరికి అడుగు బయట పెట్టలేనంత కుండపోతగా వర్షం కురవసాగింది. అయితే అదృష్టం కొద్దీ మా దగ్గిర గొడుగులు ఉండడంతో కొంచెం సేపు బయట చూరు దగ్గిర నిలబడ్డాం.
ఒక పక్క బాగా ఆకలి వేస్తూంది. వర్షం ఎంతకీ తగ్గేటట్టు కనబడకపోయేసరికి, మొత్తానికి రోడ్డుకటువైపుగా ఒక రెస్టారెంటు కనిపిస్తే అతికష్టమ్మీద రోడ్డు దాటి వెళ్లేం. అదొక పీజా రెస్టారెంటు. ఇక లోపల విపరీతమైన జనంతో రద్దీగా ఉంది.
సమయం దాటిపోతుండడంతో ఏదొకటి తినాల్సిందే. ఆ వానలో ఎక్కడికీ వెతుక్కుంటూ వెళ్లే ఓపిక లేదసలే. ఇక అక్కడే ఆగిపోయాం. తీరా లోపలికి వెళ్లేక మా టేబుల్ వంతు కోసం అరగంట, మా ఆర్డర్ కోసం మరొక గంట వేచి చూడాల్సి వచ్చింది.
అయినా పెద్దగా పేచీ పెట్టలేదు మా సిరి. మాటాడకుండా బుద్ధిగా కూచుంది పాపం. మొత్తానికి భోజనం కానిచ్చి హోటలుకు ఊబర్ తీసుకుని వచ్చి పడేసరికి అర్ఠరాత్రి అయ్యింది. మరో పక్క జెట్ లాగ్ ఒకటి. ఎలా పడి నిద్రపోయామో తెలియలేదు.
అసలే మర్నాడు పొద్దున్నే బయలుదేరి మేం ఇంగ్లాండ్ లోని ఇతర ప్రాంతాల టూరుకి వెళ్లాల్సి ఉంది.
*****
https://www.facebook.com/geetamadhavikala/posts/
(సశేషం)

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
