
జీవితాగ్నిలో పుటం పెట్టిన స్వర్ణం
-ఎన్ వేణుగోపాల్
ఆమె స్వర్ణ. నామవాచకం కాదు, సర్వనామం.
మనందరికీ, ముఖ్యంగా మధ్యతరగతికి తెలిసిన వ్యక్తి. ఇల్లు ఊడ్చే, తుడిచే మనిషి. అంట్లు తోమే మనిషి. బట్టలుతికే మనిషి. బట్టలు ఇస్త్రీ చేసి పెట్టే మనిషి. వంట చేసి పెట్టే మనిషి. చిన్న పిల్లలనూ, వృద్ధులనూ చూసుకునే మనిషి. బజారు నుంచి కూరగాయలూ సరుకులూ తెచ్చే మనిషి. ఎవరు లేకపోతే మధ్యతరగతి గృహాలు, ముఖ్యంగా భార్యాభర్తలు ఉద్యోగస్తులైన కుటుంబ జీవితాలు నడవడం అసాధ్యమో అటువంటి ఇరుసుగా పని చేసే మనిషి. లేదా సామాజిక జీవితంలో చూస్తే బట్టల దుకాణంలో, ఫాన్సీ దుకాణంలో, మాల్ లో, ఆస్పత్రిలో, హోటల్ లో, వందలాది ప్రైవేట్ సంస్థల్లో, చిన్న పరిశ్రమల్లో ఎక్కడ పడితే అక్కడ రిసెప్షనిస్ట్, సేల్స్ గర్ల్, అసిస్టెంట్, వెయిటర్ లాంటి అనేక పేర్లతో కనిపించే, మన పనులు చేసిపెట్టే మనిషి.
(ఇలా మనిషి మనిషి అని రాస్తుంటే, మా కాళోజీ చమత్కారాల్లో ఒకటి గుర్తుకొస్తున్నది. ఆయన మామూలు అలవాటు కొద్దీ ఒకసారి సరిగ్గా సమయానికి ఒక సభా ప్రాంగణంలోకి వెళ్లాడట. అక్కడ నిలబడి చూస్తున్న ఒకరిద్దరు నిర్వాహకులతో హాలులో కుర్చీలు వేయలేదేమంటే ‘మనిషి కోసం చూస్తున్నాం’ అన్నారట. ‘ఓహో, మీరు మనుషులు కాదన్నమాట!’ అని కాళోజీ వ్యాఖ్యానం! మనిషి అంటే పని చేసే మనిషి, శ్రమజీవి మాత్రమే అని ఆయన ముక్తాయింపు.)
రోజుకు గంటో రెండు గంటలో లేదా మరిన్ని ఎక్కువ గంటలో, అరుదైన సందర్భాలలో పూర్తిగా ఇంట్లోనో ఉండే ఆ మనిషి గురించి ఆ ఇంటివాళ్లకు ఎంత తెలుసు? తన కార్యాలయంలో, ఆస్పత్రిలో, దుకాణంలో, సంస్థలో, పరిశ్రమలో కొన్ని గంటల పాటు నిలబడి తన వ్యాపారాభివృద్ధికి కీలకంగా ఉండే ఆ మనిషి గురించి ఆ యజమానులకు ఎంత తెలుసు? ఎక్కువలో ఎక్కువ స్వర్ణ అనే ఆమె పేరు తెలుసునేమో. ఆమె సమయానికి రాలేదనీ, పని ఎగ్గొడుతున్నదనీ, పని సరిగ్గా చెయ్యడం లేదనీ, చేతివాటం ప్రదర్శిస్తున్నదనీ, ఎక్కువ డబ్బులు అడుగుతున్నదనీ, ముస్తాబు లేకుండా ఏబ్రాసిలా ఉందనీ, ఎక్కువ ముస్తాబు చేసుకుని షోకిల్లాగా ఉందనీ సణుగుళ్లూ, వెటకారపు వ్యాఖ్యానాలూ మినహా అసలు ఆ స్వర్ణ తమతో సమానమైన మనిషి అని ఎందరికి తెలుసు? ఆ స్వర్ణ కలలేమిటో, ఆశలేమిటో, సమస్యలేమిటో, అసలు ఆమె జీవితమేమిటో ఎంతమందికి తెలుసు? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఆమెను తోటి మనిషిగా గుర్తిస్తున్నారు? అక్కా, అమ్మా, మేడమ్ అని పిలిపించుకున్నా స్వర్ణను తమ చెల్లెలిగా, వయసులో తమకన్న చిన్నది అయి కూడా తమ ఇంటినీ, వ్యాపారాన్నీ నడుపుతున్న చుక్కానిగా, కనీసం తమ సహాయకురాలిగా ఎంతమంది చూస్తున్నారు?
ఒకవేళ తెలిసినా మన ఇంట్లో పని చేసే, మనం వెళ్లే దుకాణంలో చిరునవ్వు నవ్వే ఒకానొక స్వర్ణ అనే నామవాచకం గురించి మాత్రమే మనకు తెలుస్తుంది. బహుశా ఆ స్వర్ణను మనం మన ఇంట్లో మనిషిగానే చూస్తున్నామేమో కూడా. కాని లోకంలో అనేకానేక స్వర్ణలు ఉన్నారు. ఆ స్వర్ణకూ, స్వర్ణ చేస్తున్న పని యజమానులకీ మధ్య ఒక దృశ్యాదృశ్య అధికార సంబంధం ఉన్నది. ఆ అధికార సంబంధంలో స్వర్ణ, ఒక కొత్త కుల అంతరంలాగా నిరంతర నిమ్న స్థానంలో ఉంది.
అటువంటి స్వర్ణ అనే సర్వనామం గురించి తెలియాలంటే సాహిత్యం తప్ప మరొక మార్గం లేదు. సాధారణీకరించిన, సైద్ధాంతీకరించిన పుస్తకాలూ పరిశోధనా పత్రాలూ ఇంగ్లిష్ లో కొన్ని ఉన్నాయేమో గాని తెలుగులోనైతే చాలా అరుదు. స్వర్ణల జీవితానుభవాల మీద తెలుగులో వచ్చిన కాల్పనిక సాహిత్యమూ తక్కువే. ప్రేమచంద్ మనుమడు సుబోధ్ రాయ్ ఇంట్లో సహాయకురాలిగా ఉండిన బేబీ హల్దార్ రాసిన ఆత్మకథకు శాంత సుందరి గారి తెలుగు అనువాదం ‘చీకటి వెలుగులు’ 2009లో వచ్చినప్పుడు దాని ప్రేరణతోనైనా తెలుగులో ఇటువంటి విస్మరణకు గురైన విశాలమైన ఆవరణలోకి తెలుగు కాల్పనిక సాహిత్యకారులు ప్రవేశిస్తారని ఆశ కలిగింది. అంతకు ముందే తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘పనిపిల్ల’ రాశారు గాని దాని నేపథ్యమూ, కథనమూ వేరు. ఇటీవల ప్రగతి యాధాటి నవల ‘పోటో’’ ఇతివృత్తం కూడా ఇంటి పనుమనుషుల జీవితాలే గాని, అక్కడ కేంద్రీకరణ వేరు.
ఈ రంగం ఎంత విశాలమైనదీ సంక్లిష్టమైనదీ అంటే ఇంటి పని మనుషులు, ఆయాలు, వంట మనుషులు, గృహ సహాయకులు, గృహ కార్మికులు అని పేరు ఏదైనా, ఈ పని మొత్తానికి మొత్తం అసంఘటిత కార్మిక రంగంలో మాత్రమే ఉన్నది. కనుక లెక్కలు లేవు. భారత ప్రభుత్వపు అధికారిక లెక్క యాబై లక్షల నుంచి ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ రెండు కోట్ల నుంచి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల అనధికారిక లెక్కలు ఐదు కోట్లు, తొమ్మిది కోట్లు అని కూడా అంచనాలున్నాయి. వారి కోసమే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇ-శ్రమ్ పోర్టల్ లో దాదాపు మూడు కోట్ల పేర్లు నమోదయ్యాయి. దేశంలో మధ్య తరగతి మూడో వంతు ఉన్నదనే అంచనాల ప్రకారం మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలు పది, పన్నెండు కోట్లు ఉంటే, అందులో మూడో వంతు ఇళ్లు పనిమనుషులు లేకుండానే నడుస్తున్నాయనుకున్నా, ఎనిమిది కోట్ల పని మనుషుల లెక్క తేలుతుంది. అంతకు అంత మందీ చిన్నా పెద్దా ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక “ఉద్యోగాల్లో” ఉండి ఉంటారు. వారిలో అత్యధికులు స్త్రీలు. కౌమారంలో ప్రవేశించిన దగ్గరి నుంచీ పెళ్లయ్యే దాకా ఈ పనుల్లో ఉండేవారు. ఒంటరి మహిళలు, లేదా భర్త తాగుబోతు అయి ఇంటిని పట్టించుకోకపోతే ఇంటిని నడుపుతున్న మనుషులు. ఇంటా బైటా విపరీతమైన హింసనూ పీడననూ అనుభవిస్తున్న మనుషులు. ఆరోగ్యకరమైన కుటుంబ జీవితం ఉన్నవాళ్లు తక్కువమంది. ఎటువంటి చట్టపరమైన రక్షణ లేని, యజమానుల ఇష్టారాజ్యపు, దయాదాక్షిణ్యాల, దుర్మార్గాల, దోపిడీ పీడనల, అణచివేతల, లైంగిక వేధింపుల ఆవరణంలో పని చేస్తున్నవారు. పైకి చూడడానికి ఈ పని మనుషుల జీవితాలన్నీ ఒకటేనేమో అనిపిస్తాయి గాని, ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటే అన్ని కథలు ఉన్నాయనుకోవాలి.
ఆ కోట్లాది కథలలో గణనీయమైన సంఖ్య పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల మధ్య ఉన్న స్వర్ణలది. వార్తలకూ, పరిశోధనకూ, కాల్పనిక సాహిత్యానికీ అంతగా ఎక్కని ఇటువంటి అనాదృత రంగంలోకి, అనాదృత ప్రపంచంలోకి ఇన్నేళ్ల తర్వాత తెలుగు కథ ప్రవేశిస్తున్నది. ఈ అద్భుతమైన, సంపన్నమైన, సువిశాలమైన ఇతివృత్తం తీసుకుని, అందులో తొలి యవ్వనంలో ఉన్న స్వర్ణల గురించి పి సత్యవతి గారు 2008 నుంచి 2025 దాకా పది కథలు రాశారు. వాటన్నిటితో పాటు, కాస్త భిన్నమైన ఇతివృత్తపు మరొక కథను కూడా కలిపి రేఖాయాత్ర (ఆర్టిస్టు అన్వర్) ‘ఇట్లు మీ స్వర్ణ’ అని ఒక ఆర్ద్రమైన జీవిత శకలాల గుచ్ఛం పాఠకులకు అందిస్తున్నారు.
ఇటీవలి కాలంలో తమ ఇంటి సహాయకురాలు స్వర్ణ మీద సానుభూతి చూపుతున్నామనీ, మర్యాదగా చూస్తున్నామనీ ఎగువ మధ్యతరగతి కొంచెం గొప్పలు కూడా పోతున్నది. అది సాహిత్యంలో కూడా ఎక్కడో ఒకచోట కనబడుతున్నది. కాని ఆ ఆభిజాత్యాన్నీ, కుహనా ఔదార్యాన్నీ దాటి సత్యవతి గారు స్వర్ణ అంతరంగంలోకి ప్రవేశించారు. కొన్ని కథల్లో ఉత్తమ పురుష స్వరం లోనూ, మరికొన్నిటిలో ప్రథమ పురుష స్వరం లోనూ ఈ పది కథలూ ఒక్కొక్కటీ ఒక స్వర్ణ చెంపల మీద ఆరిన కన్నీటి బిందువు. ఈ పది కథలూ పది చేతుల, బహుశా ఇరవై చేతుల, బహు కోణాల, బహు ఆలోచనల, బహు స్వప్నాల, బహు స్వప్నభంగాల, బహు కార్యమగ్నతల స్వర్ణను, స్వర్ణలను మనకు చూపెడతాయి. ఒక స్వర్ణ కంట తడి పెట్టిస్తే, మరొక స్వర్ణ చిరునవ్వు వెలిగిస్తే, ఇంకొక స్వర్ణ కోపం రగిలిస్తే, అందరు స్వర్ణలూ కలిసి చదువరి మనసు మీద మలినాన్ని తుడిచేసి, ఒక ఉన్నతీకరించిన అవగాహనలోకి ప్రవేశపెడతారు.
నెలకు పది వేలకు చీరల దుకాణంలో పని చేస్తూ, మంచి ఫేషియల్ చేయించుకోవాలనే కనీస కోర్కె తీరని ఒక స్వర్ణ. చీపురు కొనుక్కురమ్మని మేడం గారు ఇచ్చిన వంద రూపాయలు తల్లి అవసరానికి తీసుకుని తిరిగి ఇవ్వలేకపోతే, మేడంగారి దొంగచూపుల భర్త ఉదారంగా చేతిలో పెట్టిన వంద రూపాయలతో చీపురు కొనవచ్చునని, దానితో ఎప్పటికైనా పని బడుద్దనీ అనుకునే ఒక స్వర్ణ. అటువంటి అమాయకులను బోల్తా కొట్టించి పబ్బం గడుపుకునే మగవాడి బారి నుంచి అదృష్టవశాత్తూ బయటపడిన ఇంకొక స్వర్ణ. పరీక్ష తప్పి, ఇంగ్లిష్ ట్యూషన్ లో చేరడానికి డబ్బుల వెతుకులాటలో పిల్లలను చూసుకునే పనికి కుదిరి, తీరి కూచున్న వృద్ధుడి విసుగెత్తించే హితబోధలు వినవలసివచ్చిన ఇంకొక స్వర్ణ. స్త్రీల సంక్షేమ కార్యక్రమం అమ్మ ఒడి చివరికి ఎట్లా అమ్మల మీద దౌర్జన్యానికి కారణ మవుతున్నదో చూసి, నిజమైన అమ్మ ఒడి ఏదో తెలుసుకున్న ఇంటర్మీడియట్ స్వర్ణ. అపెండిసైటిస్ కడుపునొప్పితో చావుబతుకుల స్థితిలో కూడా సహాయం అందించని శ్రీరామా ఎన్ క్లేవ్ అపార్ట్ మెంట్ వాసుల నిర్లక్ష్యానికి బలి అయిపోబోయిన వాచ్ మన్ పదిహేనేళ్ల కూతురు స్వర్ణ. ఎనబై ఐదేళ్ల పండు ముసలమ్మకు అన్ని పనులూ చేస్తూ, ఆ వృద్ధురాలి రంగు చీరల మోజును అర్థం చేసుకున్న స్వర్ణ. అక్కా అని పిలిపించుకుంటూ, బంగారం అని కూడా అనుకుంటూ, ఎగిరిపోకుండా ఎక్కువ జీతం అనే పేపర్ వెయిట్ పెట్టిన యజమాని అక్క అహంకారానికీ, చెల్లెలి ఆత్మగౌరవానికీ పోటీ పెనుగాలిలో ఎగిరి పోయిన పేపర్ వెయిట్ మరొక స్వర్ణ. బస్ డ్రైవర్ తండ్రి, కుట్టు పనితో సంపాదించే తల్లి గారాబంలో బాగా చదువుకుని ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి, ఆ వయసు పిల్లలందరిలాగే సెల్ ఫోన్ మోజులో, దాని ద్వారా ఇతర మోజుల్లో పడిపోయిన స్వర్ణ. బడి మానేసి, పార్లర్ లో పనికి కుదిరి, అక్కడి నుంచి హైదరాబాదులో ఇంటి పనీ, పిల్లల పోషణా చేసే పని లోకి మారి, తిరిగి వచ్చి, తండ్రి చనిపోగా, అమ్మమ్మ ఇంటికి వెళ్లి, బలవంతాన పెళ్లి చేసుకుని, మూడు నెలలకే వాడి సంగతి తెలిసిపోయి, మళ్లీ తల్లి దగ్గరికి చేరిన స్వర్ణ… ఎందరో స్వర్ణల కథలు. చివరి కథ స్వర్ణది కాదు, దయది. కాని పేరులో ఏముంది? అదీ పేదవారి పట్ల, అభాగ్యుల పట్ల, అనాథల పట్ల సాగే వివక్ష విషాద కథనమే. అన్నిటికన్నీ వ్యథార్థ జీవిత యథార్థ కథనాలే.
ఈ పుస్తకాన్ని సత్యవతి గారు “ఫాతిమా, సంధ్య, శివలీల, షకీలా, శాంతి, లక్ష్మి…లకు” ఇచ్చారు. బహుశా వాళ్లందరూ స్వర్ణ అనే సర్వనామానికి నామవాచకాలో, కథలకు వనరులో కావచ్చు. ఒక్కొక్క స్వర్ణా మనం తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఒక జీవిత శకలం. జీవన సమరపు అగ్నిలో పుటం పెట్టిన స్వర్ణపు తునుక.
*****

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. రచనలు: ‘సమాచార సామ్రాజ్యవాదం’, ‘కల్లోల కాలంలో మేధావులు – బాలగోపాల్ ఉదాహరణ’, ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’, ‘కథా సందర్భం’, ‘కడలి తరగ’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛినమవుతున్న వ్యక్తిత్వం, ‘పోస్ట్మాడర్నిజం’, ‘నవలా సమయం’, ‘రాబందు నీడ’, ‘కళ్లముందటి చరిత్ర’, ‘పరిచయాలు’, ‘తెలంగాణ – సమైక్యాంధ్ర భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు’, ‘శ్రీశ్రీ అన్వేషణ’, ‘లేచి నిలిచిన తెలంగాణ’, ‘ప్రతి అక్షరం ప్రజాద్రోహం – శ్రీకృష్ణ కమిటీ నివేదిక’, ‘రాబందు వాలిన నేల’, ‘ఊరి దారి- గ్రామ అధ్యయన పరిచయం’, ‘విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ్ర మహారభస’, ‘కవిత్వంతో ములాఖాత్’, 20కి పైగా అనువాదాలు. సంపాదకత్వం: ‘Fifty Years of Andhrapradesh 1956-2006’, ‘Telangana, The State of Affairs’, ’24గంటలు’, ‘హైదరాబాద్ స్వాతంత్య్ర సంరంభం’, ‘జన హృదయం జనార్దన్’, ‘సమగ్ర తెలంగాణ’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
