
మాతృత్వపుసంతకం
-కె.రూప
౧
పాలబుగ్గల పసిడి నవ్వులు..
కేరింతల బాల్యపు చిగురింతలు
ఆ చిట్టి చెక్కిలి నవ్వులలో
అమ్మ పాల బువ్వలు దాచుకున్నాయి
చిగురు లేత ప్రాయపు మునివేళ్ళ స్పర్శకు
నెమలి కన్నులే చిన్నబోయినవి
చిట్టి పాదాలే నాట్యమాడిన వేళ
ఎన్నో… మధుర స్వరాలను వింటూ!
చిన్నారి చూపులు కూడా
నిలబడని చిత్రంలో
అమ్మ
బిడ్డ ప్రేమలో
తేనెలద్దుకుంటుంది.
౨
పసిబిడ్డకందించే పాలబువ్వకు
తానెన్ని వెతలు పడుతుందో!
తాను తినే
నాలుగు మెతుకులకు
చేరిన రక్తాన్ని
ప్రేమలో రంగరించి
పాలుగా చేసి
బిడ్డ ఆకలి తీర్చే
అమ్మ కళ్ళకు
చెమరింతలెంత మోయలేని తీపి బరువో.!!
౩
అయినా
అమ్మతనమెప్పుడూ
ఆ బోసినవ్వులలోని
చిరునవ్వుల సంకెళ్లకు
జీవితకాల సంతకమై
మురిసి పోతుంది
తనని తాను మరచి
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

చాలా ఆర్ద్రతగా చాలా సున్నితంగా ఉంది..అభినందనలు