
అవేకళ్ళు
-అశోక్ గుంటుక
తెలతెలవారుతూనే వాకిట నే ముగ్గవుతున్న వేళ
డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ
తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల
మేలిమి వెతుకుతున్న వేళ :
అంతటా అవేకళ్ళు –
వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు……
పరుగు జీవితమైన వేళ
అందీ అందని సిటీబస్సు లేదంటే మెట్రోరైలు
చాలీ చాలని సమయం ఒక్కోసారీ
వద్దనుకుంటూనే ఓ ఆటో లేదా ఓ క్యాబు –
నిలుచున్నా కూర్చున్నా :
అంతటా అవేకళ్ళు –
వెకిలి చూపులు వెకిలి మాటలు….
ఆలస్యం హాజరైన వేళ ;
చేసే పనిలో సాయం కోరిన వేళ :
అలసిన కనులు అరనిమిషం రెప్పలు మూసిన వేళ :
అంతటా అవేకళ్ళు –
వేన వేల ఆకలి చూపుల నెగళ్ళు…
ఆ చూపుల మంటల్లో కాలి కాలి
అనునిత్యం అగ్నిపునీత నేను….
*****

అశోక్గుంటుక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జన్మించారు. బిఏ, బిఎడ్ పూర్తి చేశారు. 1989లో ‘పల్లకి’ వార పత్రికలో మొదటిసారిగా వీరి రాసిన కవిత అచ్చయింది. 1989 నుండి 1994 వరకు పలు దిన, వార పత్రికల్లో సామాజిక లేఖా రచయితగా ప్రజా సమస్యలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా 2016 నుంచి కవిత్వం తిరిగి రాయడం ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటి వరకు 200లకు పైగా కవితలు, పది వరకు గేయాలు రాశారు.
